
బూడిద తరలింపు పేరిట యథేచ్చగా దందా
నేషనల్ హైవే నిర్మాణాల పేరిట అక్రమాలు
ఇటుక బట్టీలకు అక్రమంగా అమ్మకం
అధికార, ప్రతిపక్ష నేతల మాటల యుద్ధం
రచ్చకెక్కిన బూడిద పంచాయితీ
సాక్షి, పెద్దపల్లి: భారతావనికి ఎన్టీపీసీ విద్యుత్ వెలుగులు పంచుతుంటే, విద్యుదుత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిద (యాష్) రాజకీయ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. బూడిదతో ఎన్నిరకాలుగా దందా చేయవచ్చో, అన్నిరకాలుగా అక్రమమార్గాల్లో అమ్ము కుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే రామగుండం కేంద్రంగా యాష్ పాండ్‌లో జరుగుతున్న అక్రమాలపై ఇంటలిజెన్స్ రిపోర్టు సీఎంవో కార్యాలయానికి చేరుకున్నా.. ఈ దందాకు అడ్డుకట్ట పడలేదు.
దీంతో బూడిద సరఫరా పేరుతో జరుగుతున్న అక్రమాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం.. చివరకు గోదావరిఖని పోచమ్మ ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేసేస్థాయికి చేరుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది.
నేషనల్ హైవేకి తరలింపు పేరుతో..
ఉత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిద.. చెరువులో నిర్ణీత స్థాయికి మించితే కాలుష్య సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఎనీ్టపీసీ అవసరమైన వారికి ఎప్పటికప్పుడు అందులో బూడిదను ఉచితంగా సరఫరా చేస్తోంది. కానీ జాతీయ అవసరాల దృష్ట్యా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా.. కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు.. రామగుండంలోని కుందనపల్లిలోని బూడిద చెరువు నుంచి తరలించాల్సి ఉంటుంది.
అందుకు లోడింగ్, రవాణా ఖర్చులు సైతం ఎన్టీపీసీయే భరిస్తుంది. రవాణా చార్జీలుగా టన్నుకు రూ.1,250 చొప్పున చెల్లిస్తుంది. అంటే ఒక లారీకి రూ.50 వేల వరకు బూడిద రవాణాకు చెల్లిస్తుంది. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు కొత్త దందాకు తెర తీశారు. నేషనల్ హైవే పేరిట తరలించే లారీల్లో సగం లారీలను నేషనల్ హైవేల నిర్మాణానికి చేరుస్తూ, మిగిలిన సగం లారీల బూడిదను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
పాండ్ నుంచి లోడింగ్ అయి బయటకు వచ్చాక వాటికి నంబర్ ప్లేట్లు మార్చి జీపీఎస్‌ను మరో లారీలో పెట్టడం తదితర జిమ్మిక్కులతో నేషనల్ హైవేకు తరలించాల్సిన బూడిదను.. కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. దీంతో పక్కదారి పట్టించిన ఒక్కొక్క లారీకి ఎన్టీపీసీ నుంచి రవాణా చార్జీల పేరిట రూ.50 వేలు, ఇటుక బట్టీలకు లారీ బూడిదను రూ.50 వేలకు అమ్మి తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. బూడిదతో పాటు నిర్వహణ ఖర్చుల పేరిట అక్రమార్కులు డబుల్ ధమాకా పొందుతున్నారు.
లోడింగ్ పేరుతో..
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తిలో భాగంగా వెలువడే నీటితో కలిసిన బూడిదను.. బూడిద చెరువులో నింపుతారు. ఆ బూడిదను డీసిల్టేషన్ ప్రక్రియలో భాగంగా అధికారులు టన్నుకు రూ.130 చొప్పున 38 ఏజెన్సీలు 15 లక్షల మెట్రిక్ టన్నుల బూడిద తరలించేలా టెండర్లు ఖరారు చేశారు. కాగా, ఎన్టీపీసీ ఈ టెండర్లను రద్దు చేసి రూ.1కే టన్ను ఇచ్చేందుకు టెండర్లు పిలిచింది. దీంతో 114 మంది ఈ టెండర్లను దక్కించుకున్నారు.
టెండర్లు దక్కించుకున్న వారిలో ఐదుగురు.. రాజకీయ బలంతో లోడింగ్ పేరుతో దందాకు తెర తీశారు. లారీల సామర్థ్యాన్ని బట్టి రూ.4,600 నుంచి రూ.9,600 వరకు అక్రమంగా వసూలు చేస్తూ ఇటుకబట్టీలకు సరఫరా చేస్తున్నారు. రోజుకు వెయ్యి వాహనాల్లో బూడిద తరలిస్తూ రూ.లక్షల్లో జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పరస్పర ఆరోపణలతో..
బూడిద చెరువులోకి వచ్చి చేరే బూడిదను జాతీయ రహదారుల నిర్మాణం, ఇటుకల తయారీతో పాటు ఇతరత్రా నిర్మాణాలకు ఉచితంగా ఎన్టీపీసీ అందిస్తుంది. కానీ, ఈ బూడిద తరలింపు వ్యవహారంలో రాజకీయ నేతల జోక్యంతో అక్రమాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోజుకు వెయ్యి లారీల చొప్పున సరఫరా అవుతుండటంతో.. అంతే మొత్తంలో బూడిద దందాలో డబ్బులు చేతులు మారుతున్నాయి. దీంతో కొన్నిరోజులుగా జిల్లాలో బూడిద పంచాయితీపై నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చివరకు ఎన్టీపీసీ కాంట్రాక్టు కారి్మక సంఘం అధ్యక్షుడు కౌశిక్‌హరి తడిబట్టలతో గోదావరిఖని పోచమ్మ గుడిలో ప్రమాణం చేయడం రాజకీయంగా దుమారం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment