
పిల్లల సోషల్ మీడియా అకౌంట్లపై తల్లిదండ్రుల అభిప్రాయం
డీపీడీపీ రూల్స్ అమలు చేయాలన్న 88 శాతం మంది
పిల్లలు చూసే కంటెంట్‌ను గుర్తించాలన్న 58 శాతం మంది
తప్పుడు వయస్సుతో అకౌంటు తెరిచేవారిపై దృష్టి పెట్టాలని సూచన
లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో వెల్లడి
పొద్దున గుడ్‌మార్నింగ్ మొదలు రాత్రి గుడ్‌నైట్ చెప్పే వరకు ఈ రోజుల్లో యువత ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లలోనే గడుపుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరిలో ‘సోషల్’వాడకం పెరిగింది. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్.. ఇలా ఎన్నో రకాల సోషల్ మీడియా యాప్‌లతోపాటు ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగింది.
సోషల్ మీడియా అకౌంట్ లేకపోతే నామోషీ అనే స్థాయికి స్కూల్ పిల్లలు సైతం వచ్చేశారు. ఇది చాలా నష్టం చేస్తోందని, పిల్లల సోషల్ మీడియా వాడకంపై కచ్చితంగా నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
వయసు తప్పుగా చూపి..
వాస్తవానికి సోషల్ మీడియా యాప్‌లలో ఖాతా తెరవాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఖాతా తెరవాలంటే వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. కానీ, వయస్సును తప్పుగా చూపిస్తూ 18 ఏళ్లలోపు వారు సొంతంగా సోషల్ మీడియా ఖాతాలు తెరవటం షరా మామూలైంది. దీంతో అవగాహన లేని వయస్సులో పిల్లలు సైబర్ విష ప్రపంచంలో కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఏదో ఒక అనర్థం జరిగేవరకు తల్లిదండ్రులకు తెలియటం లేదు.
ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్– 2025ను తీసుకువచి్చంది. ఇందులో పలు కీలక అంశాలను చేర్చారు. 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతా తెరవాలన్నా, ఓటీటీ యాప్‌లు, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో చేరాలన్నా తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి చేశారు. ఈ నూతన నిబంధనలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను లోకల్ సర్కిల్స్ సంస్థ సేకరించింది.
దేశవ్యాప్తంగా 349 జిల్లాల్లోని 44 వేలమంది పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను సర్వే చేసి ఈ సంస్థ నివేదికను రూపొందించింది. కాగా, ఏ వయస్సు చిన్నారులు తమ వయస్సును ఎంతశాతం ఎక్కువగా చూపి సోషల్ మీడియా ఖాతాలు తెరుస్తున్నారన్న అంశంపై బ్రిటన్ సంస్థ ఆఫ్‌కామ్ ఓ నివేదిక విడుదల చేసింది. వయస్సు తప్పుగా నమోదు చేస్తున్న వారిలో 8 నుంచి 17 ఏళ్లలోపు చిన్నారులు 77 శాతం సొంత ప్రొఫైల్స్‌తో సోషల్ మీడియా ఖాతాలు వాడుతున్నట్టు ఆ సంస్థ తెలిపింది.

Comments
Please login to add a commentAdd a comment