ash pond
-
బూడిదపై చల్లారని రగడ
ఎర్రగుంట్ల/కొండాపురం: వైఎస్సార్ జిల్లాలోని డాక్టర్ ఎంవీఆర్‌ఆర్ ఆర్టీపీపీ నుంచి వెలువడుతున్న బూడిద (ఫ్లైయాష్) కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య రాజుకున్న రగడ చల్లారలేదు. ఆర్టీపీపీలో బుధవారం పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. కలమల్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ యామిని తెలిపారు. మరోవైపు.. తాడిపత్రి నుంచి బూడిద కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన ఆరు లారీలు వచ్చాయి. పోలీసులు వీటిని ఆర్టీపీపీ 600 మెగావాట్ల యూనిట్ వద్దే నిలిపేశారు. డ్రైవర్లను దించి లోడింగ్‌కు అనుమతిలేదని వారికి పోలీసులు తెలిపారు.సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఉత్కంఠ..మరోవైపు.. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండాపురం మండలంలోని తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్‌రెడ్డి మండలంలోని కె.సుగుమంచిపల్లె చెక్‌పోస్టు వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆర్టీపీపీకి వస్తారేమోనని సాయంత్రం వరకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఆయన రాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.బకాయిలిచ్చి 50 శాతం వాటా కల్పించాలి.. ఆర్టీపీపీలో ఉన్న యాష్ పాండ్ నుంచి వస్తున్న బూడిద సరఫరాకు సంబంధించి తమకు రావాల్సిన బకాయిలను చెల్లించి, సరఫరాలో 50 శాతం వాటా కల్పించాలని ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. యాష్‌పాండ్‌లోని బూడిదను తాడిపత్రిలోని ఎల్ ఆండ్ టీ ఫ్యాక్టరీకి నేరుగా సరఫరా చేసేవాళ్లమన్నారు. అప్పుడు ఫ్యాక్టరీ వారు సకాలంలో బిల్లులు ఇచ్చేవారన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆ ఫ్యాక్టరీతో ఒప్పందం చేసుకోవడంతో ఆయనకు బూడిదను సరఫరా చేశామన్నారు. అయితే, ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదన్నారు. సుమారు రూ.80 లక్షలు బకాయిలు ఉన్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని.. అలాగే సరఫరాలో 50 శాతం వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తమ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డికి తెలియజేశామన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి లారీలకు లోడింగ్ చేయబోమని ఆయన తెగేసి చెప్పారు. -
బూడిద గుంతలో బొక్కిందెవరు!
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం)లో బూడిద గుంత (యాష్ పాండ్) నిర్మాణంలో చోటుచేసుకున్న కుంభకోణంపై ఏపీ జెన్కో దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణం వెనుక కీలక పాత్రధారుల వివరాలను జెన్కో సేకరిస్తోంది. టెండర్లు పిలవకుండానే రూ.56.50 కోట్ల విలువైన కాంట్రాక్ట్ కట్టబెట్టిన వైనంపై విచారణ జరపాలని లోకాయుక్తకు రాష్ట్ర హైకోర్టు సూచించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి సంస్థ (ఏపీపీడీసీఎల్), ఏపీ జెన్కో సంబంధిత ఫైళ్లన్నీ పరిశీలిస్తోంది. లోకాయుక్తకు వాస్తవ సమాచారాన్ని నివేదించేందుకు సన్నాహాలు చేస్తోంది. చినబాబు, టీడీపీ నేతల కోసమే కాంట్రాక్ట్? కృష్ణపట్నంలో అవసరం లేకపోయినా 2015లో అప్పటి ప్రభుత్వం 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. టెండర్ నిబంధనల్లో కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ సూచించిన నిబంధనల్ని పాటించకుండా.. నచ్చిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టేలా టెండర్ డాక్యుమెంట్ రూపొందించింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎక్కువ ధరలకు కాంట్రాక్ట్ కట్టబెట్టడాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపై అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అసెంబ్లీలో టీడీపీ సర్కార్‌ను నిలదీసింది. అయినప్పటికీ 2017లో అదే కాంట్రాక్ట్ సంస్థకు నామినేషన్ పద్ధతిపై యాష్ పాండ్ నిర్మాణం కాంట్రాక్ట్‌ను అప్పగించారు. నిజానికి దీని అవసరమే లేదని విద్యుత్ కేంద్రం డీపీఆర్‌లో తొలుత పేర్కొన్నారు. అంతలోనే టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ కట్టబెట్టడం విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంపై అప్పట్లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. దీనిపై లోకాయుక్త విచారణకు హైకోర్టు ఆదేశించింది. 2019లో ఎన్నికల నిధి కోసమే ఈ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. అప్పటి టీడీపీ ఎమ్మెల్యేకు, అప్పటి ప్రభుత్వాధి నేత కుమారుడు చినబాబుకు వాటాలు ముట్టినట్టు తెలియవచ్చింది. ఈ కారణంగానే జెన్కో బోర్డు ఆగమేఘాలపై కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు తీర్మానం కూడా చేసింది. డైరెక్టర్‌పై వేటు! ప్రస్తుతం థర్మల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి గతంలో కృష్ణపట్నంలో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్నారు. కాంట్రాక్ట్ బేరసారాల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్టు జెన్కో వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయనే డైరెక్టర్‌గా ఉండటం వల్ల విచారణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే సందేహాలొస్తున్నాయి. దీంతో ఆయనను పక్కనపెట్టే ఆలోచనలో అధికారులున్నారు. ఏపీపీడీసీఎల్ సీజీఎంగా పనిచేసి ఇటీవలే రిటైరైన వ్యక్తిపై యాష్ పాండ్‌తో పాటు, థర్మల్ కేంద్రంలో జరిగిన బొగ్గు లావాదేవీలపైనా ఫిర్యాదులున్నాయి. దీనిపై విచారణ జరుగుతున్న కారణంగా ఆయన పదవీ విరమణ అనంతర సదుపాయాలన్నీ జెన్కో బోర్టు నిలిపివేసిందని సమాచారం. కొత్తగా యాష్ పాండ్ వ్యవహారంపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంది. మరో ఇద్దరు డైరెక్టర్ల పాత్రపైనా ఆరా ఈ కాంట్రాక్ట్ వ్యవహారంలో సహకరించిన ఇద్దరు డైరెక్టర్ల పాత్రపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. అప్పటి థర్మల్ డైరెక్టర్‌పై గతంలో ఏసీబీ కేసు నమోదైంది. కాంట్రాక్ట్ సంస్థల ప్రభావంతోనే ఈ కేసును జెన్కో విచారణ జరపకుండా మూసేయడంపైనా ఆరా తీస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలు చూసిన అప్పటి డైరెక్టర్ నియామకంలో అనర్హత వ్యవహారాలపై ఫిర్యాదులొచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఆయన నియామకం వెనుక లబ్ధి పొందిన నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలొచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్ష విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. -
దారుణం: బూడిద ఐదుగురిని కప్పెట్టేసింది!
భోపాల్: రిలయన్స్‌కు చెందిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ నుంచి ప్రమాదకర బూడిద వ్యర్థాలు లీక్ అవడంతో సింగ్రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. నిబంధనలు పాటించకుండా గ్రామ సమీపంలోనే విద్యుత్ ప్లాంట్ బూడిద వ్యర్థాలు కుమ్మరించడంతో ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ కేవీఎస్ చౌధరి అన్నారు. స్థానికంగా ఇళ్లను భారీ ఎత్తున బూడిద కప్పేయడంతో బాధితులు గల్లంతయ్యారని తెలిపారు. ఘటనకు బాధ్యులైన సంస్థ నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. ఇక పంట పొలాల్లో మేటలు వేసిన బూడిద వ్యర్థాల ఫొటోలు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. జిల్లాలో ఏడాది కాలంలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. 2019 ఆగస్టులో ఎన్టీపీసీ నిర్వహణలో ఉన్న ఎస్సార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. నాడు ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు.. విద్యుత్ కంపెనీలకు నోటీసులు కూడా జారీ చేసింది. వ్యర్థాల నిర్వహణలో పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీనిచ్చిన కంపెనీలు అనంతరం వాటిని పట్టించుకోలేదు. కాగా, సింగ్రౌలి జిల్లాలో 21 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న బొగ్గు ఆధారిత 10 విద్యుత్ ఉత్పత్రి కేంద్రాలున్నాయి. వాటితో అత్యంత కాలుష్యమయమైన పారిశ్రామిక ప్రాంతంగా సింగ్రౌలి మారింది. -
బూడిదతో బెంబేలెత్తుతున్న ప్రజలు
సాక్షి, పాల్వంచ: కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) నుంచి వెలువడే వృథా బూడిద నిల్వలు ఉండే..యాష్‌పాండ్ చుట్టు పక్కల ప్రాంతాల వారు బెంబేలెత్తుతున్నారు. ఈ బూడిద కాలుష్యంతో యాష్‌పాండ్‌కు సమీపంలో పునుకుల, పుల్లాయిగూడెం, సూరారం గ్రామాల ప్రజలు నిత్యం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బూడిద గాలిలోకి లేవకుండా కేటీపీఎస్ యాజమాన్యం ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిటెటర్ (ఈఎస్పీ)లను ఉపయోగిస్తున్నా..పనితీరు సక్రమంగా లేకపోవడంతో కాలుష్యం వెదజల్లుతోంది. నీటిద్వారా యాష్‌పాండ్‌కు తరలిస్తున్నారు. సమీపంలోని కాల్వలు, కిన్నెరసాని ప్రాంతం బూడిదతో నిండి కాలుష్యభరితంగా మారుతున్నాయి. పీల్చుతున్న కార్మికులు, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. జెన్కో టన్ను రూ.10చొప్పున విక్రయిస్తుండగా.. ప్లైయాష్ను సిమెంట్, ఇటుకల కంపెనీలు ప్రతిరోజూ వెయ్యి టన్నుల బూడిదను తీసుకెళ్తుంటాయి. మిలిగిన నిల్వలు అలా పేరుకుపోతుంటాయి. నిత్యం వందలాది లారీల లోడ్లను హైదరాబాద్, మిర్యాలయగూడెం, జగ్గయ్యపేట, కట్టగూడెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధిక లోడ్‌తో ఊరి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. గాలికి బూడిద రోడ్లపై, నివాసాలపైకి చేరి ఇబ్బంది పడుతున్నారు. బూడిదతో కూడిన గాలి పీల్చడం వల్ల స్థానికులు ఆయాసం, ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నారుల ఒంటిపై దురదలు వస్తున్నాయి. ఇటీవల కేటీపీఏస్ యాజమాన్యం కిన్నెరసాని ప్రధాన రహదారినుంచి యాష్‌పాండ్ వరకు తారురోడ్డు నిర్మించగా..25టన్నుల లోడుకు బదులు 30 నుంచి 40 టన్నుల బూడిద లోడు ఒక్కో లారీలో తరలిస్తుండడంతో అది కూడా అధ్వానంగా మారింది. యాష్‌పాండ్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో మేతకు వెళ్లి పశువులు, మేకలు, గొర్రెలు బూడిద గుంతల్లో ఇరుక్కుపోయి మరణిస్తున్నాయి. అనేకమార్లు నోటీసులు.. యాష్‌పాండ్‌లో పడి మృతి చెందిన పశువులు కేటీపీఎస్ కర్మాగారం ద్వారా బూడిద చెరువులోకి పంపిస్తున్న బూడిద సమీపంలోని కిన్నెరసాని వాగులో కలవడం ద్వారా పశువులు, పంటల దెబ్బతింటున్నాయి. బూడిద కాలుష్యాన్ని కిన్నెరసానివాగులో కలవకుండా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అనేక సార్లు నోటీసులు జారీ చేసింది. కర్మగారంలో సెడ్మెంటేషన్ ట్యాంక్‌ను నిర్మించాలని, బూడిద నియంత్రణ యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించినా ఆచరణకు నోచట్లేదు. పొలం, జలం.. బూడిదమయం యాష్‌పాండ్ పరిసరాలన్నీ బూడిదతో నిండి కనిపిస్తుంటాయి. సమీపంలోని కిన్నెరసాని వాగు జలం రంగు మారి ప్రవహిస్తుంటుంది. పొలాలన్నీ సారం కోల్పోతున్నాయి. ఈ నీళ్లను తాగిన పశువులు చనిపోతున్నాయి. జీవాల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. -
డైవర్షన్!
సాక్షి, ముత్తుకూరు(నెల్లూరు): ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మించిన కొత్త (డైవర్షన్) యాష్‌పాండ్‌లోకి ఉప్పునీటి బూడిద విడుదల జరుగుతోంది. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతాయని పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.50 కోట్లకుపైగా వ్యయం చేసి 100 ఎకరాల విస్తీర్ణంలో డైవర్షన్ యాష్‌పాండ్ నిర్మించారు. కాలుష్య నియంత్రణ మండలి అభ్యంతరాల నుంచి బయటపడి, 100 ఎకరాల యాష్‌పాండ్‌ను 30 ఎకరాలకు కుదించారు. అయితే మంచినీరు కలిసిన బూడిదను ఈ యాష్‌పాండ్‌లోకి విడుదల చేయాల్సి ఉండగా, పాత యాష్‌పాండ్ మాదిరిగానే సముద్రపు(ఉప్పు)నీరు కలిసిన బూడిదను విడుదల చేస్తున్నారు. సముద్రపు ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే ‘వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్’ నిర్మాణం పూర్తికాకపోవడమే దీనికి కారణం. మూడో యూనిట్ కింద నిర్మించే 800 మెగావాట్ల ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి మంచినీటితో నిర్వహించేందుకు, ఉద్యోగుల కాలనీలకు తాగునీరు అందించేందుకు 33 ఎంఎల్డీ, 21 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) వాటర్ ట్రీట్ ప్లాంట్ల నిర్మాణం తలపెట్టారు. మొదటి దశ ప్లాంటు పనులు గత ఏడాది జూన్‌కే పూర్తికావాల్సి ఉంది. ఏడాది గడిచినా కూడా పనులు పూర్తికాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. పాత దాని వలే కొత్త యాష్‌పాండ్‌తో కూడా కాలుష్యం వ్యాపిస్తుందని ఇటు రైతులు, భూగర్భ జలాలు కలుషితమవుతాయని అటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాష్‌పాండ్ ఎత్తు పెంచే టెండర్ రద్దు? బూడిదతో పొంగిపొర్లుతున్న పాత యాష్‌పాండ్‌లోకి బూడిద విడుదల నిలిపివేశారు. దీన్ని ఐదు మీటర్ల ఎత్తు పెంచేందుకు రూ.17 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ పనులకు టెండర్లు కూడా పిలిచారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడడంతో ఈ టెండర్ రద్దు అయ్యిందని ఇంజినీర్లు చెబుతున్నారు. అందువల్లనే ఈ పనులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ కాలేదని వెల్లడించారు. ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల్లో జాప్యం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కావడంలో జాప్యం జరిగినట్టు ఏపీజెన్కో ప్రాజెక్ట్ ఇంజినీర్లు పేర్కొన్నారు. దీని వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఉప్పునీటి బూడిద విడుదల చేయాల్సి వస్తోందని తెలిపారు. సముద్రం నుంచి నీరు తరలించేందుకు పైపులైన్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నా. వాటర్ పంప్‌హౌస్ నుంచి నీళ్లు తీసుకోవడమే మిగిలిందని తెలిపారు. త్వరలో నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. అలాగే డైవర్షన్ యాష్‌పాండ్‌లోకి ఉప్పునీరు కలిసిన బూడిదను ఆరు నెలల పాటు విడుదల చేయవచ్చని ఎంఓయూలో గడువు ఇచ్చి ఉన్నారని ఇంజినీర్లు తెలిపారు. మంచినీటి బూడిద విడుదల చేస్తామన్నారు కొత్త (డైవర్షన్) యాష్‌పాండ్‌లోకి మంచినీటి బూడిద విడుదల చేస్తామని గతంతో ఏపీజెన్కో ఇంజినీర్లు ప్రకటించారు. ఇప్పుడేమో ఉప్పునీటి బూడిద విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నేలటూరు, పైనాపురం ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఉప్పు మయంగా మారాయి. పంటలు పండే పరిస్థితి లేకుండాపోయింది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోంది. కాలుష్యానికి గురయ్యే దేవరదిబ్బ గిరిజనకాలనీని ఎందుకు తరలించలేకపోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏమైంది. కొత్త ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి. – నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు, ముత్తుకూరు -
యాష్‌పాండ్‌కు మరో రెండు ఔట్లెట్లు
సీఆర్డీఏకు జెన్కో బూడిద ముత్తుకూరు : నేలటూరులోని ఏపీజెన్కో ప్రాజెక్టు యాష్‌పాండ్(బూడిద బావి)కి మరో రెండు ఔట్లెట్లు మంజూరైనట్లు ప్రాజెక్టు ఇంజనీర్లు బుధవారం తెలిపారు. ప్రస్తుతం రెండు ఔట్లెట్ల ద్వారా ద్రవ రూపంలో చేరే బూడిదతో యాష్‌పాండ్ ఓ వైపు పూర్తిగా నిండిపోయింది. దీంతో చెరువు మధ్య వరకు పైపును పొడిగించి బూడిద విడుదల చేయాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రూ.2.75 కోట్లతో మరో రెండు ఔట్లెట్లు, పైపులైన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. నూతన రాజధానిలో నిర్మించనున్న రోడ్లకు జెన్కో ప్రాజెక్టు బూడిద తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు.