భోపాల్: రిలయన్స్‌కు చెందిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ నుంచి ప్రమాదకర బూడిద వ్యర్థాలు లీక్ అవడంతో సింగ్రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. నిబంధనలు పాటించకుండా గ్రామ సమీపంలోనే విద్యుత్ ప్లాంట్ బూడిద వ్యర్థాలు కుమ్మరించడంతో ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ కేవీఎస్ చౌధరి అన్నారు. స్థానికంగా ఇళ్లను భారీ ఎత్తున బూడిద కప్పేయడంతో బాధితులు గల్లంతయ్యారని తెలిపారు. ఘటనకు బాధ్యులైన సంస్థ నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. ఇక పంట పొలాల్లో మేటలు వేసిన బూడిద వ్యర్థాల ఫొటోలు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి.
జిల్లాలో ఏడాది కాలంలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. 2019 ఆగస్టులో ఎన్టీపీసీ నిర్వహణలో ఉన్న ఎస్సార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. నాడు ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు.. విద్యుత్ కంపెనీలకు నోటీసులు కూడా జారీ చేసింది. వ్యర్థాల నిర్వహణలో పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీనిచ్చిన కంపెనీలు అనంతరం వాటిని పట్టించుకోలేదు. కాగా, సింగ్రౌలి జిల్లాలో 21 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న బొగ్గు ఆధారిత 10 విద్యుత్ ఉత్పత్రి కేంద్రాలున్నాయి. వాటితో అత్యంత కాలుష్యమయమైన పారిశ్రామిక ప్రాంతంగా సింగ్రౌలి మారింది.
Comments
Please login to add a commentAdd a comment