
క్షమాపణ లేఖ వదిలివెళ్లిన మంచి దొంగ
ఖర్గావ్: ‘జుజర్ భాయ్.. నిండా అప్పుల్లో మునిగి ఉన్నా..అప్పులోళ్లు రోజూ వేధించుకు తింటున్నారు..వాళ్లతో వేగలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దొంగతనం చేస్తున్నా..అదీ శ్రీరామ నవమి నాడు..! ఏమీ అనుకోకు, నీ డబ్బు మళ్లీ ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తా.. ఇది నా వాగ్దానం’అంటూ ఓ మంచి దొంగ ఓ దుకాణం నుంచి రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.
మధ్యప్రదేశ్‌లోని ఖర్గావ్ జిల్లా కొత్వాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జమీదార్ మొహల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘరానా చోరీ ఘటన చోటుచేసుకుంది. మరునాడు దుకాణం తెరిచిన జుజర్ అలీ బొహ్రాకు నగదు ఉంచిన బ్యాగులో ఈ లేఖ కనిపించింది. ఆశ్చర్యపోయిన ఆయన విషయం పోలీసులకు తెలిపారు. చోరుడు ప్రింటెడ్ లేఖలో దుకాణం యజమానిని జుజర్ భాయ్ అంటూ మర్యాదగా సంబోధించాడని పోలీస్ ఎస్సై అర్షద్ ఖాన్ చెప్పారు.
బ్యాగులో ఉంచిన రూ.2.84 లక్షలకు గాను అతడు రూ.2.45 లక్షలు మాత్రమే తీసుకెళ్లి, రూ.38వేలను లేఖతోపాటు బ్యాగులోనే వదిలివెళ్లాడని యజమాని తెలిపాడన్నారు. రామ నవమి పండగ నాడు ఇలా దొంగతనానికి పాల్పడుతున్నందుకు క్షమించాలని కూడా దుకాణం యజమానిని అతడు కోరినట్లు ఎస్సై వివరించారు. ‘నేనుండేది మీ చుట్టుపక్కల ప్రాంతంలోనే. నాకు చాలా అప్పులున్నాయి.
అప్పిచ్చిన వాళ్లు రోజూ నా ఇంటికి వస్తున్నారు. దొంగతనం చేయాలని నాకు ఏ మాత్రంలేదు. కానీ, గత్యంతరం లేదు. ఈ డబ్బుతో నాకు చాలా అవసరముంది. అయితే, అవసరమైనంత మాత్రమే తీసుకెళ్తున్నా. మిగతాది బ్యాగులోనే వదిలిపెడ్తున్నా. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తా. అప్పుడిక మీరు నన్ను పోలీసులకు అప్పగించొచ్చు’అని అందులో వివరించాడు. అంతేకాదు, ఈ లేఖలో పేర్కొన్న ప్రతి విషయమూ సత్యమేనని స్పష్టం చేశాడన్నారు.