Reliance Power Plant
-
అంబానీ ‘పవర్’ను కొంటున్న అదానీ పవర్!
దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్‌తో సహా అనేక రంగాలలో ఉన్న అదానీ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న ఆయన విద్యుత్ రంగంలో మరో ముందడుగు వేసే యోచనలో ఉన్నారు.రూ. 2.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన అతని అదానీ పవర్.. నాగ్‌పూర్‌లో ఉన్న బుటిబోరి థర్మల్ పవర్ ప్లాంట్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోందని ‘మింట్’ నివేదిక పేర్కొంది. ఈ పవర్ ప్రాజెక్ట్‌కు రుణదాతగా ఉన్న సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీతో అదానీ గ్రూప్ మాట్లాడుతోందని, ఈ డీల్ విలువ రూ.2,400 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని నివేదిక పేర్కొంది.ఈ పవర్ ప్లాంట్ ఒకప్పుడు అనిల్ అంబానీకి చెందిన దివాలా తీసిన రిలయన్స్ పవర్ ఆధీనంలో ఉండేది. ఇది ఇప్పుడు రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ అయిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ కింద ఉంది. ఈ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 600 మెగావాట్లు. ఈ వార్తల తర్వాత సోమవారం (ఆగస్టు 19) రిలయన్స్ పవర్ షేర్లు 5 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకాయి. ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ.32.79 వద్ద ముగిసింది. -
దారుణం: బూడిద ఐదుగురిని కప్పెట్టేసింది!
భోపాల్: రిలయన్స్‌కు చెందిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ నుంచి ప్రమాదకర బూడిద వ్యర్థాలు లీక్ అవడంతో సింగ్రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. నిబంధనలు పాటించకుండా గ్రామ సమీపంలోనే విద్యుత్ ప్లాంట్ బూడిద వ్యర్థాలు కుమ్మరించడంతో ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ కేవీఎస్ చౌధరి అన్నారు. స్థానికంగా ఇళ్లను భారీ ఎత్తున బూడిద కప్పేయడంతో బాధితులు గల్లంతయ్యారని తెలిపారు. ఘటనకు బాధ్యులైన సంస్థ నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. ఇక పంట పొలాల్లో మేటలు వేసిన బూడిద వ్యర్థాల ఫొటోలు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. జిల్లాలో ఏడాది కాలంలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. 2019 ఆగస్టులో ఎన్టీపీసీ నిర్వహణలో ఉన్న ఎస్సార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. నాడు ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు.. విద్యుత్ కంపెనీలకు నోటీసులు కూడా జారీ చేసింది. వ్యర్థాల నిర్వహణలో పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీనిచ్చిన కంపెనీలు అనంతరం వాటిని పట్టించుకోలేదు. కాగా, సింగ్రౌలి జిల్లాలో 21 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న బొగ్గు ఆధారిత 10 విద్యుత్ ఉత్పత్రి కేంద్రాలున్నాయి. వాటితో అత్యంత కాలుష్యమయమైన పారిశ్రామిక ప్రాంతంగా సింగ్రౌలి మారింది. -
‘తిలయా’ నుంచి తప్పుకున్న రిలయన్స్ పవర్
న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్రంలోని తిలయా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (యూఎంపీపీ) నుంచి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ తప్పుకుంది. తన వాటాను రూ.712.64 కోట్ల మొత్తానికి వదులుకుంది. ఇందులో రూ.600 కోట్ల బ్యాంకు గ్యారంటీలు కాగా మిగిలిన రూ.112.64 కోట్లను రిలయన్స్ పవర్‌కు జార్ఖండ్ ఉర్జా వికాస్ నిగమ్ (జేయూవీఎన్) లిమిటెడ్ చెల్లిస్తుంది. దీంతో ఆర్‌పవర్ వాటా జేయూవీఎన్ పరమయింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం యూఎంపీసీ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నట్టు అనిల్ గత సెప్టెంబర్‌లో జరిగిన కంపెనీ ఏజీఎంలో వెల్లడించారు. ఇందులో భాగంగా ఇటీవల ఆయన ఏపీ సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడారు కూడా. కృష్ణపట్నం నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును ఏపీ, తమిళనాడు, మహరాష్ట్ర, కర్ణాటకలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఆర్ పవర్‌కు 3 యూఎంపీపీలను ఇవ్వగా ‘సన్సా’ ఒక్కటే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
‘దిమ్మ’ తిరిగే క్లైమాక్స్..!
* రాగి తీగలు దొంగిలించి.. దిమ్మలుగా మార్చిన ముఠా * రూ. ఏడు లక్షల విలువైన రాగి స్వాధీనం * తొమ్మిది మంది అరెస్ట్ సామర్లకోట : స్థానిక ఏడీబీ రోడ్డులో ఉన్న రిలయన్స పవర్ ప్లాంట్‌లో చోరీకి గురైన టన్నున్నర రాగిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. సోమవారం పెద్దాపురం డీఎస్పీ ఓలేటి రవీంద్రబాబు సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఆ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... రిలయన్స పవర్ ప్లాంట్‌లో ఆగస్టు 8న రూ.ఐదు లక్షల విలువైన కాపర్ వస్తువులు, ఆగస్టు 25న రూ.2.10 లక్షల విలువైన కాపర్ కేబుల్ చోరీకి గురైనట్టు ఆ ఫ్యాక్టరీ డీజీఎం టి.సురేష్‌బాబు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు రెండు కేసులు నమోదు చేసి పెద్దాపురం సీఐ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సామర్లకోట - కాకినాడ ఏడీబీ రోడ్డులో ఉండూరు బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా ఉన్న రెండు వాహనాలను పోలీసులు పరిశీలించారు. రాగి కేబుల్, వస్తువులను దిమ్మలుగా కరిగించి టాటా మేజిక్, టాటా ఏస్ వ్యానులో తీసుకువెళుతున్నట్టు గుర్తించారు. కాకినాడకు చెందిన యనవరెడ్డి శ్రీనివాసరెడ్డి, విశాఖపట్నానికి చెందిన మిరియాల అప్పలరాజు, నీలపు అప్పలరెడ్డి, దారకొండ కొండబాబు, మెట్టు ఉదయ్‌కుమార్, నీలాపు నాగిరెడ్డి, కోటనందూరు మండలం, అల్లిపూడి గ్రామానికి చెందిన వడ్లమూరి నాగేశ్వరరావు, తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన దారకొండ లోవరాజు, శివలంక వడాలరావులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు. రాగి వస్తువులను పిఠాపురం మండలం చిత్రాడలో కరిగించి దిమ్మలుగా తయారు చేసినట్టు చెప్పారు. మరో ఐదుగురి నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. సీఐ కె.నాగేశ్వరరావు, ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్, క్రైం ఎస్సై వల్లీ, ఏఎస్సై బి. నరసింహరావు, హెచ్‌సీలు గంగిరెడ్డి బలరామ్మూర్తి, జీఎస్‌ఎన్‌మూర్తి, కానిస్టేబుళ్లు రాధాకృష్ణ, కుమార్, రాకేష్, నాగరాజు, ఎలమంచిలి కృష్ణ, భద్రరావు, యూఆర్కే రాజు, దుర్గాప్రసాద్‌లు ఈ కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. వీరికి రివార్డులకు సిఫారసు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్సై నాగార్జున, ఏఎస్సై జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.