
న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్రంలోని తిలయా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (యూఎంపీపీ) నుంచి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ తప్పుకుంది. తన వాటాను రూ.712.64 కోట్ల మొత్తానికి వదులుకుంది. ఇందులో రూ.600 కోట్ల బ్యాంకు గ్యారంటీలు కాగా మిగిలిన రూ.112.64 కోట్లను రిలయన్స్ పవర్‌కు జార్ఖండ్ ఉర్జా వికాస్ నిగమ్ (జేయూవీఎన్) లిమిటెడ్ చెల్లిస్తుంది. దీంతో ఆర్‌పవర్ వాటా జేయూవీఎన్ పరమయింది.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం యూఎంపీసీ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నట్టు అనిల్ గత సెప్టెంబర్‌లో జరిగిన కంపెనీ ఏజీఎంలో వెల్లడించారు. ఇందులో భాగంగా ఇటీవల ఆయన ఏపీ సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడారు కూడా. కృష్ణపట్నం నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును ఏపీ, తమిళనాడు, మహరాష్ట్ర, కర్ణాటకలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఆర్ పవర్‌కు 3 యూఎంపీపీలను ఇవ్వగా ‘సన్సా’ ఒక్కటే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.