‘దిమ్మ’ తిరిగే క్లైమాక్స్..!
* రాగి తీగలు దొంగిలించి.. దిమ్మలుగా మార్చిన ముఠా
* రూ. ఏడు లక్షల విలువైన రాగి స్వాధీనం
* తొమ్మిది మంది అరెస్ట్
సామర్లకోట : స్థానిక ఏడీబీ రోడ్డులో ఉన్న రిలయన్‌స పవర్ ప్లాంట్‌లో చోరీకి గురైన టన్నున్నర రాగిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. సోమవారం పెద్దాపురం డీఎస్పీ ఓలేటి రవీంద్రబాబు సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో ఆ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... రిలయన్‌స పవర్ ప్లాంట్‌లో ఆగస్టు 8న రూ.ఐదు లక్షల విలువైన కాపర్ వస్తువులు, ఆగస్టు 25న రూ.2.10 లక్షల విలువైన కాపర్ కేబుల్ చోరీకి గురైనట్టు ఆ ఫ్యాక్టరీ డీజీఎం టి.సురేష్‌బాబు ఫిర్యాదు చేశారు.
ఆ మేరకు రెండు కేసులు నమోదు చేసి పెద్దాపురం సీఐ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సామర్లకోట - కాకినాడ ఏడీబీ రోడ్డులో ఉండూరు బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా ఉన్న రెండు వాహనాలను పోలీసులు పరిశీలించారు. రాగి కేబుల్, వస్తువులను దిమ్మలుగా కరిగించి టాటా మేజిక్, టాటా ఏస్ వ్యానులో తీసుకువెళుతున్నట్టు గుర్తించారు.
కాకినాడకు చెందిన యనవరెడ్డి శ్రీనివాసరెడ్డి, విశాఖపట్నానికి చెందిన మిరియాల అప్పలరాజు, నీలపు అప్పలరెడ్డి, దారకొండ కొండబాబు, మెట్టు ఉదయ్‌కుమార్, నీలాపు నాగిరెడ్డి, కోటనందూరు మండలం, అల్లిపూడి గ్రామానికి చెందిన వడ్లమూరి నాగేశ్వరరావు, తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన దారకొండ లోవరాజు, శివలంక వడాలరావులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు.
రాగి వస్తువులను పిఠాపురం మండలం చిత్రాడలో కరిగించి దిమ్మలుగా తయారు చేసినట్టు చెప్పారు. మరో ఐదుగురి నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. సీఐ కె.నాగేశ్వరరావు, ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్, క్రైం ఎస్సై వల్లీ, ఏఎస్సై బి. నరసింహరావు, హెచ్‌సీలు గంగిరెడ్డి బలరామ్‌మూర్తి, జీఎస్‌ఎన్‌మూర్తి, కానిస్టేబుళ్లు రాధాకృష్ణ, కుమార్, రాకేష్, నాగరాజు, ఎలమంచిలి కృష్ణ, భద్రరావు, యూఆర్‌కే రాజు, దుర్గాప్రసాద్‌లు ఈ కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. వీరికి రివార్డులకు సిఫారసు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్సై నాగార్జున, ఏఎస్సై జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.