ADB ROAD
-
కారు అదుపు తప్పి..ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ఇద్దరికి తీవ్ర గాయాలు త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు గండేపల్లి (జగ్గంపేట) : ఏడీబీ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయపడ్డారు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానిక ఎసై కె.దుర్గా శ్రీనివాసరావు కథనం ప్రకారం మండలంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీకాకుళానికి చెందిన యవ్వారి మనోజ్‌కుమార్ (21), అనకాపల్లికి చెందిన రవిరాజు ఈఈఈ ఫైనల్ ఇయర్, రాజోలుకు చెందిన కంచి కౌశిక్ మెకానికల్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. పెద్దాపురం బ్యాంక్ కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ కళాశాలకు రోజు వెళ్లి వస్తుంటారు. సోమవారం రవిరాజుకు చెందిన కారులో స్నేహితుడైన కౌశిక్‌ను కళాశాలలో డ్రాప్ చేసేందుకు కళాశాల సమీపంలోకి వచ్చి వెనుదిరిగి పెద్దాపురం బయలుదేరారు. లలిత గొడౌన్ వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాలువలోంచి దూసుకెళ్లి గొడౌన్ గేట్ వద్ద చెట్టును, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది షెల్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ముగ్గురు కారులో చిక్కుకుపోయారు. గొడౌన్‌కు చెందిన పలువురు అక్కడికు చేరుకుని క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు. అప్పటికే మనోజ్ కుమార్ మృతి చెందినట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపింది. తీవ్ర గాయాలతో ఉన్న రవిరాజు, కౌశిక్‌లను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఏఎసై వరహాలరాజు వివరాలు సేకరించారు. ప్రస్తుతం రవిరాజు పరిస్థితి విషమంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. భీతిల్లిన సిబ్బంది షెల్టర్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది.. ఈ ప్రమాదంతో భీతిల్లారు. ఒక్కసారిగా పెద్దగా శబ్దం రావడంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. షెల్టర్‌ను కారు ఢీకొనడంతో తమకు ప్రమాదం తప్పిందని పడాల శ్రీనివాస్, మద్దాల విలియం తెలిపారు. అతివేగమా.....రోడ్డుపై బురదగా ఉన్న గ్రావెలా? విద్యార్థులు ప్రయాణం చేస్తున్న కారును వేగంగా నడపడంతో ఈ ప్రమాదం సంభవించిందా...లేక రోడ్డుపై బురద కారణమా అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లోనే రోడ్డు నునుపుగా ఉంటుందని, వర్షం పడడం, ఈ రహదారిలో గ్రావెల్‌ను తరలిస్తున్న లారీ డ్రైవర్లు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రోడ్డుపై గ్రావెల్ పడుతోందని అంటున్నారు. దీంతో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఎన్. సతీష్‌రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు చేపట్టారు. మనోజ్ కుమార్ మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కాకినాడలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వైద్యులతో మాట్లాడారు. -
రూ.272.3 కోట్లతో ఏడీబీ రోడ్డు విస్తరణ
కోటపాడు (రంగంపేట) : జిల్లాలో రాజానగరం హైస్కూల్ నుంచి రంగంపేట మీదుగా సామర్లకోట బ్రిడ్జి వరకూ 30 కిలోమీటర్ల ఏడీబీ రోడ్డును రూ.272.3 కోట్లతో విస్తరిస్తున్నట్టు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్ అండ్ బీ) డీఈ వై.రవీంద్ర తెలిపారు. కోటపాడు గ్రామంలో ఏడీబీ రోడ్డు విస్తరణ కొలతలను మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మొత్తం 33 మీటర్ల వెడల్పుతో ఏడీబీ రోడ్డును విస్తరిస్తామన్నారు. కొలతలను పరిశీలించేందుకు వచ్చిన పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా కొలతలు పరిశీలించి, పండ్లతోటలు, ఇళ్లు, దుకాణాలు ఎంత మేర పోతున్నాయి? ఎంత మేర నష్టం జరుగుతుందనే విషయాలను సేకరిస్తున్నామన్నారు. ఈ నెలాఖరులోగా కొలతల పరిశీలన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.రామారావు, పెద్దాపురం డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ ఏకాశి, మండల సర్వేయర్ రమణమూర్తి, ఆర్అండ్బీ జేఈ బి.ఎ.ఆదినారాణ, వీఆర్వో దొరబాబు, చైన్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పరామర్శకు వెళ్లి వస్తూ..
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మహిళలు వడిశలేరు వద్ద ఏడీబీ రోడ్డుపై ఘటన ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు ఆస్పత్రికి తరలిస్తుండగా డ్రైవర్ మృతి వడిశలేరు (రంగంపేట) : వారిద్దరూ అక్కాచెల్లెలు.. సోదరి కూతురి కోడలు దినకర్మకు పెదపూడి నుంచి రాజానగరం వచ్చారు. కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్లేందుకు రాజానగరం సెంటర్‌కు వచ్చారు. బస్సు మిస్‌కావడంతో అటుగా కాకినాడవైపు వెళుతున్న కారును ఆపి ఎక్కారు. ఎక్కిన కొద్ది నిముషాలకే వారు ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రగాయాలపాలైన కారు డ్రైవర్ కూడా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. రంగంపేట మండలం వడిశలేరులో ఏడీబీ రోడ్డుపై గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులతో పాటు మరికొందరు గాయపడ్డారు. పోలీసులు, మృతుల బంధువుల కథనం ప్రకారం.. రాజానగరంలోని దివంగత కురుకూరి అన్నపూర్ణ కుమార్తె కొండపల్లి భవాని కోడలు అరుణ ఈ నెల రెండో తేదీన అనారోగ్యంతో మృతి చెందగా.. ఈ నెల 12న ఆమెకు పెద్దదిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని పెదపూడి గ్రామానికి చెందిన ఈదేటి మాచరమ్మ(70), పెద్దాడ గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకటలక్ష్మి(65) పెదపూడి వెళ్లేందుకు రాజానగరం హైస్కూల్ సెంటర్‌కు వచ్చారు. గొల్లలమామిడాడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో కాకినాడ వెళ్లే చిన్నకారు ఎక్కారు. వడిశలేరు గ్రామం దాటిన తరువాత చిన్నకారు రాళ్ల లోడు లారీని తప్పించి, రంగంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వెళ్లే ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. చిన్నకారులో ప్రయాణిస్తున్న మాచరమ్మ, వెంకటలక్ష్మిలకు తలకు తీవ్రగాయాలవడంతో ప్రమాదస్థలంలోనే వారు మృతి చెందారు. కాకినాడ వలసపాకలకు చెందిన టాక్సీ డ్రైవర్ రాయుడు సతీష్‌కుమార్(35) రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో చనిపోయాడు. చిన్నకారులో ప్రయాణిస్తున్న కాకినాడకు చెందిన జాల సరస్వతికి, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పుట్టా సత్యవతి, రాజమహేంద్రవరం రూరల్ మండలం నామవరానికి చెందిన పెంటా అప్పల నరసమ్మకు స్వల్పగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం రాజానగరం పంపారు. సంఘటన స్థలాన్ని పెద్దాపురం సీఐ ఎస్ ప్రసన్నవీరయ్యగౌడ్, ఎస్సై ఎన్ సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ డ్రైవర్ అడ్డూరి అబ్బాయి చాకచక్యంగా ఎడమవైపు కాలువలోకి బస్సును పోనిచ్చి ఆపడంతో ఎదురుగా ఉన్న కల్వర్టును ఢీకొట్టకుండా 56 మంది ప్రాణాలను కాపాడగలిగాడని స్థానికులు చెప్పారు. ప్రమాద స్థలాన్ని ఎంపీడీఓ కె.కిషోర్‌కుమార్, తహసీల్దార్ బి.రామారావు, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు కోన సత్యనారాయణ తదితరులు సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘కోడలి దిన కార్యక్రమానికి వచ్చి నాలుగు రోజులు పాటు కలిసి మెలసి ఉన్న పెద్దమ్మ మాచరమ్మ, పిన్నమ్మ వెంటలక్ష్మిలు ప్రమాదంలో మృతి చెందడాన్ని మృతురాళ్ల సోదరి కుమార్తె కొండపల్లి భవానీ జీర్ణించుకోలేకపోతోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన పిన్నమ్మ ఏకైక కుమారుడికి ఏ విధంగా సమా«ధానం చెప్పను దేవుడా!’’ అంటూ బోరున విలపించింది. తమకు ధైర్యం చెప్పి వెళ్లిన వాళ్లు విగతజీవులుగా మారడం ఊహించలేకపోతున్నామని భవాని భర్త రామన్న, కుమారుడు సురేష్‌కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. -
ఆర్టీసీ బస్సు -108 వాహనం ఢీ: ముగ్గురు మృతి
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలో ఏడీబీ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న108 వాహానం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 108 వాహనంలో ఉన్న రోగి అక్కడికక్కడే మృతి చెందగా, అదే వాహనంలో ఉన్న డ్రైవర్, పారా మెడికల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వారిని పెద్దపురం ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన మూడు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
‘దిమ్మ’ తిరిగే క్లైమాక్స్..!
* రాగి తీగలు దొంగిలించి.. దిమ్మలుగా మార్చిన ముఠా * రూ. ఏడు లక్షల విలువైన రాగి స్వాధీనం * తొమ్మిది మంది అరెస్ట్ సామర్లకోట : స్థానిక ఏడీబీ రోడ్డులో ఉన్న రిలయన్స పవర్ ప్లాంట్‌లో చోరీకి గురైన టన్నున్నర రాగిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. సోమవారం పెద్దాపురం డీఎస్పీ ఓలేటి రవీంద్రబాబు సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఆ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... రిలయన్స పవర్ ప్లాంట్‌లో ఆగస్టు 8న రూ.ఐదు లక్షల విలువైన కాపర్ వస్తువులు, ఆగస్టు 25న రూ.2.10 లక్షల విలువైన కాపర్ కేబుల్ చోరీకి గురైనట్టు ఆ ఫ్యాక్టరీ డీజీఎం టి.సురేష్‌బాబు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు రెండు కేసులు నమోదు చేసి పెద్దాపురం సీఐ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సామర్లకోట - కాకినాడ ఏడీబీ రోడ్డులో ఉండూరు బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా ఉన్న రెండు వాహనాలను పోలీసులు పరిశీలించారు. రాగి కేబుల్, వస్తువులను దిమ్మలుగా కరిగించి టాటా మేజిక్, టాటా ఏస్ వ్యానులో తీసుకువెళుతున్నట్టు గుర్తించారు. కాకినాడకు చెందిన యనవరెడ్డి శ్రీనివాసరెడ్డి, విశాఖపట్నానికి చెందిన మిరియాల అప్పలరాజు, నీలపు అప్పలరెడ్డి, దారకొండ కొండబాబు, మెట్టు ఉదయ్‌కుమార్, నీలాపు నాగిరెడ్డి, కోటనందూరు మండలం, అల్లిపూడి గ్రామానికి చెందిన వడ్లమూరి నాగేశ్వరరావు, తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన దారకొండ లోవరాజు, శివలంక వడాలరావులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు. రాగి వస్తువులను పిఠాపురం మండలం చిత్రాడలో కరిగించి దిమ్మలుగా తయారు చేసినట్టు చెప్పారు. మరో ఐదుగురి నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. సీఐ కె.నాగేశ్వరరావు, ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్, క్రైం ఎస్సై వల్లీ, ఏఎస్సై బి. నరసింహరావు, హెచ్‌సీలు గంగిరెడ్డి బలరామ్మూర్తి, జీఎస్‌ఎన్‌మూర్తి, కానిస్టేబుళ్లు రాధాకృష్ణ, కుమార్, రాకేష్, నాగరాజు, ఎలమంచిలి కృష్ణ, భద్రరావు, యూఆర్కే రాజు, దుర్గాప్రసాద్‌లు ఈ కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. వీరికి రివార్డులకు సిఫారసు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్సై నాగార్జున, ఏఎస్సై జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని బైక్ దగ్ధం
సామర్లకోట, న్యూస్‌లైన్ : కాకినాడ-సామర్లకోట ఏడీబీ రోడ్డులో అచ్చంపేట వంతెన మలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మోటార్ బైక్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఓ యువతి గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట మండలం హుస్సేన్‌పురానికి చెందిన మద్దిల నిరీక్షణకుమార్, ప్రసన్న అన్నాచెల్లెళ్లు. ఆది వారం కావడంతో మోటార్ బైక్‌పై నిరీక్షణ కుమార్‌తో కలిసి ప్రసన్న కాకినాడలో చర్చికి బయలుదేరింది. ఏడీబీ రోడ్డు అచ్చంపేట వంతెన మలుపు వద్ద ఎదురుగా మోటార్ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేశాడు. దీంతో నిరీక్షణ కుమార్ నడుపుతున్న బైక్ దానిని ఢీకొంది. ఈ ధాటికి వెనుక కూర్చున ప్రసన్న రోడ్డుపై పడిపోయింది. ఆమెను కా పాడే ప్రయత్నంలో ఉండగా, కాకినాడ నుంచి లారీ దూసుకురావడాన్ని గమనించి బైక్‌పై నుంచి నిరీక్షణకుమార్ దూకేశాడు.దీంతో బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లిన ఆ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. ఈ క్రమం లో బైక్ నుంచి మంటలు చెలరేగి, కాలి బూడిదైంది. లారీని గుర్తించలేదని నిరీక్షణకుమార్ చెప్పాడు. ప్రసన్న తలకు తీవ్ర గాయమైంది. 108కు ఫోన్ చేయగా సకాలంలో రాలేదు. దీంతో ఆమెను ఆటోలో మా ధవపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.