Copper goods
-
ఏటా 10లక్షల టన్నుల సామర్థ్యంతో అదానీ కాపర్ ఫెసిలిటీ
గుజరాత్‌లోని ముంద్రాలో అదానీ గ్రూప్ 1.1 బిలియన్ డాలర్లతో గ్రీన్‌ఫీల్డ్ కాపర్ ఫెసిలిటీని మార్చి 2024లో ప్రారంభించనుంది. ఏటా 10లక్షల టన్నుల సామర్థ్యంతో దీన్ని రూపొందిచనున్నట్లు సమాచారం. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ బంగారం, వెండి, నికెల్, సెలీనియంకు సంబంధించిన ఉప ఉత్పత్తులతో పాటు కాపర్ కేథోడ్‌లు, రాడ్లను ఉత్పత్తి చేయనుంది. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌తో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కూడా తయారుచేయనున్నారు. ఈ మిశ్రమం ఎరువులు, డిటర్జెంట్లు, ఫార్మాస్యూటికల్స్, పేపర్, షుగర్ బ్లీచింగ్, వాటర్ ట్రీట్మెంట్తోపాటు ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కాపర్‌ను విద్యుత్ పరికరాల ఉత్పత్తికి, పవర్ ట్రాన్స్మిషన్, పునరుత్పాదక ఇంధన రంగానికి విరివిగా వాడుతారు. దాంతొ భవిష్యత్తులో కాపర్‌కు చాలా డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. కానీ దేశంలో దాని నిలువలు పరిమితంగానే ఉన్నాయి. దేశీయ కంపెనీలు దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఈ ప్లాంట్‌కు సంబంధించిన ముడిసరుకును లాటిన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. ఇప్పటికే దేశీయంగా హిందాల్కో వంటి కంపెనీలు కాపర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. పారిశ్రామికంగా వినియోగించే లోహాల్లో స్టీల్, అల్యూమినియం తర్వాత స్థానంలో రాగి ఉంటుంది. భారతదేశంలో లోహల పరంగా తలసరి వినియోగం కేవలం 0.6 కిలోలు. అదే ప్రపంచ సగటు 3.2 కిలోలుగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దేశంలోని రాగి ఎగుమతులు ఇటీవల క్షీణించాయని కచ్ కాపర్ దీన్ని భర్తీ చేస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాపర్ ప్లాంట్ ఉప ఉత్పత్తులను తమ గ్రూప్ సంస్థ అదానీ సిమెంట్స్ వినియోగించుకోగలదని కంపెనీ తెలిపింది. -
Home Creations: పండగవేళ కాపర్ కాంతులు.. పాత వస్తువులతో ఇంటి అలంకరణ!
పాతకాలం నాటి ఇత్తడి, ఇనుము, కలప వస్తువులతో గృహాలకంరణ చేయడం అనేది మనకు తెలిసిందే. పూర్తి వింటేజ్ లుక్‌తో ఆకట్టుకునే ఈ స్టైల్ ఇంటి అందాన్ని ఎప్పుడూ కొత్తగా చూపుతూనే ఉంది. అయితే, మంచినీటిని నిల్వచేసుకుని తాగే రాగిపాత్రలు ఇప్పుడు ఇంటి కళలో వినూత్నంగా మెరిసిపోతున్నాయి. దీపాల వెలుగుల్లో కొత్త కాంతులు విరజిమ్ముతాయి. సంప్రదాయ జిలుగులే కాదు ఆధునికపు హంగులుగానూ ‘రాగి’ తన వైభవాన్ని చాటుతోంది. ఫ్లవర్వేజ్గానూ, హ్యాంగింగ్ బెల్స్గానూ, క్యాండిల్ స్టాండ్‌గానూ, పూలకుండీలుగా, పార్టిషన్ వాల్స్గానూ రాగి తన దర్జాను చూపుతోంది. పండగ జిలుగులు పండగల వేళ సంప్రదాయ కళ ఉట్టిపడాలంటే అందుకు తగినట్టు బ్రాస్ లేదా కాపర్ ఎంపిక తప్పనిసరి. ఒక చిన్న మార్పు పండగ కళను ఇంట రెట్టింపు చేస్తుంది. దీపాల పండగకు అలంకరణలో సంప్రదాయ కళ ఎప్పుడూ తన వైభవాన్ని చాటుతుంది. ఇందుకు నాటి రాగి పాత్రలు అలంకరణలో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. అలంకరణలో ఎన్ని ఆధునిక వస్తువులున్నా ఒక రాగి పాత్ర హోమ్ క్రియేషన్‌లో భాగం చేస్తే చాలు ఆ లుక్కే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకు, రోజువారీ వాడకంలో ఉన్న రాగి ప్లేట్లు, గ్లాసులు, టీ కెటిల్, చిన్న చిన్న రాగి పాత్రలు.. ప్రతీది ఇంటి అలంకరణలో గొప్పగా అమరిపోతుంది. అందుకు నిన్న మొన్నటి తరాలు దాచిన అపురూపమైన రాగి వస్తువులను అలంకరణకు ఎంచుకోవచ్చు. ఆధునిక కాంతి గృహాలంకరణలో కాపర్ కోటింగ్ ఓ అద్భుతాన్ని చూపడానికి ఎంచుకుంటున్నారు ఇటీవల ఇంటీరియర్ డిజైనర్లు. రాగితో డిజైన్ చేసిన టేబుల్ ల్యాంప్, హ్యాంగింగ్ ల్యాంప్‌లు ఆధునికంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రేలు, ఇండోర్ ప్లాంట్ పాట్స్ కూడా ఇదే జాబితాలో ఉంటున్నాయి. స్టాండ్లు, షెల్వ్స్, వాల్పేపర్లు, పార్టిషన్గానూ కాపర్ కొత్తగా మెరిసిపోతోంది. పాత్రలకే పరిమితం కాకుండా ఫ్రేమ్స్ రూపంలోనూ మోడర్న్ ఆర్ట్‌గా వినూత్నమైన అందాన్ని చూపుతోంది. ఖరీదులోనూ ఘనమైనదిగా కాపర్ ఇంటికి వింటేజ్ కళతో పాటు గ్రాండ్‌నెస్‌ను మోసుకువస్తుంది. కళాభిమానులు అనే కితాబులనూ అలంకరణ చేసినవారికి అందిస్తుంది. చూపులను కట్టిపడేసే రాగికి దీపకాంతులు జత చేరితే ఇక ఆ ఇంట దివ్యకాంతులు విరబూస్తాయి. -
ఆన్లైన్ మోసం
వజ్రపుకొత్తూరు రూరల్ : ఆన్లైన్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మండల కేంద్రం వజ్రపుకొత్తూరులో సోమవారం ఇలాంటి మోసం వెలుగు చూసింది. ఇదే గ్రామానికి చెందిన దువ్వాడ ఉమామమేశ్వరరావు సెల్ ఫోన్‌కు మీరు లక్కీ డ్రాలో రూ. 9 వేల విలువ గల శాంసాంగ్ మొబైల్ రూ.1600లకే దక్కించుకున్నారని ఆశ చూపడంతో అతని మిత్రుడు కొయిరి పాపారావు ఈ నగదును సదరు అడ్రాస్‌కు వారం రోజుల క్రితం పంపించారు. కాగా సోమవారం తన ఇంటికి వచ్చిన పార్సెల్‌ను విప్పి చూడగా దానిలో నాణ్యత లేని రాగి బొమ్మలు దర్శనం ఇవ్వడంతో వారు కంగుతిన్నారు. తాము నగదు చెల్లించి మోసపోయామని గుర్తించారు. అయితే తక్కువ నగదుతో సరిపోయిందని లేదంటే అధిక మొత్తంలో నగదు చెల్లించి ఉంటే పరిస్థితిని ఊహించి ఆందోళన చెందినట్టు బాధితుడు పాపారావు విలేకరుల ముందు వాపోయాడు. -
‘దిమ్మ’ తిరిగే క్లైమాక్స్..!
* రాగి తీగలు దొంగిలించి.. దిమ్మలుగా మార్చిన ముఠా * రూ. ఏడు లక్షల విలువైన రాగి స్వాధీనం * తొమ్మిది మంది అరెస్ట్ సామర్లకోట : స్థానిక ఏడీబీ రోడ్డులో ఉన్న రిలయన్స పవర్ ప్లాంట్‌లో చోరీకి గురైన టన్నున్నర రాగిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. సోమవారం పెద్దాపురం డీఎస్పీ ఓలేటి రవీంద్రబాబు సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఆ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... రిలయన్స పవర్ ప్లాంట్‌లో ఆగస్టు 8న రూ.ఐదు లక్షల విలువైన కాపర్ వస్తువులు, ఆగస్టు 25న రూ.2.10 లక్షల విలువైన కాపర్ కేబుల్ చోరీకి గురైనట్టు ఆ ఫ్యాక్టరీ డీజీఎం టి.సురేష్‌బాబు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు రెండు కేసులు నమోదు చేసి పెద్దాపురం సీఐ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సామర్లకోట - కాకినాడ ఏడీబీ రోడ్డులో ఉండూరు బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా ఉన్న రెండు వాహనాలను పోలీసులు పరిశీలించారు. రాగి కేబుల్, వస్తువులను దిమ్మలుగా కరిగించి టాటా మేజిక్, టాటా ఏస్ వ్యానులో తీసుకువెళుతున్నట్టు గుర్తించారు. కాకినాడకు చెందిన యనవరెడ్డి శ్రీనివాసరెడ్డి, విశాఖపట్నానికి చెందిన మిరియాల అప్పలరాజు, నీలపు అప్పలరెడ్డి, దారకొండ కొండబాబు, మెట్టు ఉదయ్‌కుమార్, నీలాపు నాగిరెడ్డి, కోటనందూరు మండలం, అల్లిపూడి గ్రామానికి చెందిన వడ్లమూరి నాగేశ్వరరావు, తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన దారకొండ లోవరాజు, శివలంక వడాలరావులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు. రాగి వస్తువులను పిఠాపురం మండలం చిత్రాడలో కరిగించి దిమ్మలుగా తయారు చేసినట్టు చెప్పారు. మరో ఐదుగురి నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. సీఐ కె.నాగేశ్వరరావు, ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్, క్రైం ఎస్సై వల్లీ, ఏఎస్సై బి. నరసింహరావు, హెచ్‌సీలు గంగిరెడ్డి బలరామ్మూర్తి, జీఎస్‌ఎన్‌మూర్తి, కానిస్టేబుళ్లు రాధాకృష్ణ, కుమార్, రాకేష్, నాగరాజు, ఎలమంచిలి కృష్ణ, భద్రరావు, యూఆర్కే రాజు, దుర్గాప్రసాద్‌లు ఈ కేసులను ఛేదించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. వీరికి రివార్డులకు సిఫారసు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్సై నాగార్జున, ఏఎస్సై జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.