పాతకాలం నాటి ఇత్తడి, ఇనుము, కలప వస్తువులతో గృహాలకంరణ చేయడం అనేది మనకు తెలిసిందే. పూర్తి వింటేజ్ లుక్‌తో ఆకట్టుకునే ఈ స్టైల్ ఇంటి అందాన్ని ఎప్పుడూ కొత్తగా చూపుతూనే ఉంది. అయితే, మంచినీటిని నిల్వచేసుకుని తాగే రాగిపాత్రలు ఇప్పుడు ఇంటి కళలో వినూత్నంగా మెరిసిపోతున్నాయి. దీపాల వెలుగుల్లో కొత్త కాంతులు విరజిమ్ముతాయి. సంప్రదాయ జిలుగులే కాదు ఆధునికపు హంగులుగానూ ‘రాగి’ తన వైభవాన్ని చాటుతోంది. ఫ్లవర్‌వేజ్‌గానూ, హ్యాంగింగ్ బెల్స్‌గానూ, క్యాండిల్ స్టాండ్‌గానూ, పూలకుండీలుగా, పార్టిషన్ వాల్స్‌గానూ రాగి తన దర్జాను చూపుతోంది.
పండగ జిలుగులు
పండగల వేళ సంప్రదాయ కళ ఉట్టిపడాలంటే అందుకు తగినట్టు బ్రాస్ లేదా కాపర్ ఎంపిక తప్పనిసరి. ఒక చిన్న మార్పు పండగ కళను ఇంట రెట్టింపు చేస్తుంది. దీపాల పండగకు అలంకరణలో సంప్రదాయ కళ ఎప్పుడూ తన వైభవాన్ని చాటుతుంది. ఇందుకు నాటి రాగి పాత్రలు అలంకరణలో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. అలంకరణలో ఎన్ని ఆధునిక వస్తువులున్నా ఒక రాగి పాత్ర హోమ్ క్రియేషన్‌లో భాగం చేస్తే చాలు ఆ లుక్కే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకు, రోజువారీ వాడకంలో ఉన్న రాగి ప్లేట్లు, గ్లాసులు, టీ కెటిల్, చిన్న చిన్న రాగి పాత్రలు.. ప్రతీది ఇంటి అలంకరణలో గొప్పగా అమరిపోతుంది. అందుకు నిన్న మొన్నటి తరాలు దాచిన అపురూపమైన రాగి వస్తువులను అలంకరణకు ఎంచుకోవచ్చు.
ఆధునిక కాంతి
గృహాలంకరణలో కాపర్ కోటింగ్ ఓ అద్భుతాన్ని చూపడానికి ఎంచుకుంటున్నారు ఇటీవల ఇంటీరియర్ డిజైనర్లు. రాగితో డిజైన్ చేసిన టేబుల్ ల్యాంప్, హ్యాంగింగ్ ల్యాంప్‌లు ఆధునికంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రేలు, ఇండోర్ ప్లాంట్ పాట్స్ కూడా ఇదే జాబితాలో ఉంటున్నాయి. స్టాండ్లు, షెల్వ్స్, వాల్‌పేపర్లు, పార్టిషన్‌గానూ కాపర్ కొత్తగా మెరిసిపోతోంది. పాత్రలకే పరిమితం కాకుండా ఫ్రేమ్స్ రూపంలోనూ మోడర్న్ ఆర్ట్‌గా వినూత్నమైన అందాన్ని చూపుతోంది. ఖరీదులోనూ ఘనమైనదిగా కాపర్ ఇంటికి వింటేజ్ కళతో పాటు గ్రాండ్‌నెస్‌ను మోసుకువస్తుంది. కళాభిమానులు అనే కితాబులనూ అలంకరణ చేసినవారికి అందిస్తుంది. చూపులను కట్టిపడేసే రాగికి దీపకాంతులు జత చేరితే ఇక ఆ ఇంట దివ్యకాంతులు విరబూస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment