నిర్మాణంలో ఉన్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్
సాక్షి, ముత్తుకూరు(నెల్లూరు): ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మించిన కొత్త (డైవర్షన్) యాష్‌పాండ్‌లోకి ఉప్పునీటి బూడిద విడుదల జరుగుతోంది. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతాయని పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.50 కోట్లకుపైగా వ్యయం చేసి 100 ఎకరాల విస్తీర్ణంలో డైవర్షన్ యాష్‌పాండ్ నిర్మించారు.
కాలుష్య నియంత్రణ మండలి అభ్యంతరాల నుంచి బయటపడి, 100 ఎకరాల యాష్‌పాండ్‌ను 30 ఎకరాలకు కుదించారు. అయితే మంచినీరు కలిసిన బూడిదను ఈ యాష్‌పాండ్‌లోకి విడుదల చేయాల్సి ఉండగా, పాత యాష్‌పాండ్ మాదిరిగానే సముద్రపు(ఉప్పు)నీరు కలిసిన బూడిదను విడుదల చేస్తున్నారు.
సముద్రపు ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే ‘వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్’ నిర్మాణం పూర్తికాకపోవడమే దీనికి కారణం. మూడో యూనిట్ కింద నిర్మించే 800 మెగావాట్ల ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి మంచినీటితో నిర్వహించేందుకు, ఉద్యోగుల కాలనీలకు తాగునీరు అందించేందుకు 33 ఎంఎల్‌డీ, 21 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) వాటర్ ట్రీట్ ప్లాంట్ల నిర్మాణం తలపెట్టారు. మొదటి దశ ప్లాంటు పనులు గత ఏడాది జూన్‌కే పూర్తికావాల్సి ఉంది.
ఏడాది గడిచినా కూడా పనులు పూర్తికాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. పాత దాని వలే కొత్త యాష్‌పాండ్‌తో కూడా కాలుష్యం వ్యాపిస్తుందని ఇటు రైతులు, భూగర్భ జలాలు కలుషితమవుతాయని అటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యాష్‌పాండ్ ఎత్తు పెంచే టెండర్ రద్దు?
బూడిదతో పొంగిపొర్లుతున్న పాత యాష్‌పాండ్‌లోకి బూడిద విడుదల నిలిపివేశారు. దీన్ని ఐదు మీటర్ల ఎత్తు పెంచేందుకు రూ.17 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ పనులకు టెండర్లు కూడా పిలిచారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడడంతో ఈ టెండర్ రద్దు అయ్యిందని ఇంజినీర్లు చెబుతున్నారు. అందువల్లనే ఈ పనులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ కాలేదని వెల్లడించారు.
ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనుల్లో జాప్యం
వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కావడంలో జాప్యం జరిగినట్టు ఏపీజెన్‌కో ప్రాజెక్ట్ ఇంజినీర్లు పేర్కొన్నారు. దీని వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఉప్పునీటి బూడిద విడుదల చేయాల్సి వస్తోందని తెలిపారు. సముద్రం నుంచి నీరు తరలించేందుకు పైపులైన్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నా. వాటర్ పంప్‌హౌస్ నుంచి నీళ్లు తీసుకోవడమే మిగిలిందని తెలిపారు.
త్వరలో నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. అలాగే డైవర్షన్ యాష్‌పాండ్‌లోకి ఉప్పునీరు కలిసిన బూడిదను ఆరు నెలల పాటు విడుదల చేయవచ్చని ఎంఓయూలో గడువు ఇచ్చి ఉన్నారని ఇంజినీర్లు తెలిపారు.
మంచినీటి బూడిద విడుదల చేస్తామన్నారు
కొత్త (డైవర్షన్) యాష్‌పాండ్‌లోకి మంచినీటి బూడిద విడుదల చేస్తామని గతంతో ఏపీజెన్‌కో ఇంజినీర్లు ప్రకటించారు. ఇప్పుడేమో ఉప్పునీటి బూడిద విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నేలటూరు, పైనాపురం ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఉప్పు మయంగా మారాయి. పంటలు పండే పరిస్థితి లేకుండాపోయింది. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోంది. కాలుష్యానికి గురయ్యే దేవరదిబ్బ గిరిజనకాలనీని ఎందుకు తరలించలేకపోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏమైంది. కొత్త ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి.
– నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు, ముత్తుకూరు
Comments
Please login to add a commentAdd a comment