Water Treatment Plant
-
కేశవాపూర్ కుదింపు!
సాక్షి, హైదరాబాద్:మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ సమీపంలో చేపట్టదలిచిన కేశవాపూర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని కుదించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ అంశంలో చిక్కు ముళ్లు కొలిక్కి వచ్చే అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో దీని సామర్థ్యాన్ని సగానికి తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం 10 టీఎంసీల సామర్థ్యంతో దీనికి ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇవ్వగా, తాజాగా 5.04 టీఎంసీలకే దీన్ని పరిమితం చేసేలా వ్యాప్కోస్ సంస్థతో సర్వే చేయించింది. 5 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణం చేపడితే దాని నిర్మాణానికి రూ.3,363 కోట్ల మేర వ్యయం అవుతుందని వ్యాప్కోస్ నీటిపారుదల శాఖకు, మున్సిపల్ శాఖకు నివేదించింది. భూసేకరణ జాప్యంతోనే.. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి హైదరాబాద్ తాగునీటి అవసరాలను చేపట్టేలా కేశవాపూర్ రిజర్వాయర్‌ను 10 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని నిర్ణయిం చారు. రిజర్వాయర్ నిర్మాణానికి 13 కి.మీ. కట్ట నిర్మాణం చేయాల్సి ఉంటుందని తేల్చగా, కొండపోచమ్మ సాగర్ మీదుగా కేశవాపూర్ రిజర్వాయర్‌కు మూడు 3,600 ఎంఎం డయా గ్రావిటీ పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రిజర్వాయర్ నుంచి వచ్చే రా వాటర్‌ను ఘణపూర్‌లో నీటి శుద్ధి కేంద్రంలో (డబ్ల్యూటీపీ) శుద్ధి చేసి శామీర్‌పేట్, సైనిక్‌పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్ మెయిన్ పైప్ లైన్లకు స్వచ్ఛమైన జలాలను పంపింగ్ చేయాల్సి ఉంటుంది. కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 3,822 ఎకరాల భూమి అవసరం ఉండగా, మొత్తంగా రూ.4,777.59 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. భూసేకరణ, పరిహారం చెల్లింపునకు రూ.518.7 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇవి పోనూ రిజర్వాయర్ పనులకు రూ.3,918 కోట్లతో టెండర్ల ప్రక్రియ సైతం పూర్తికాగా, పనులు మాత్రం మొదలు కాలేదు. ఈ పనులు చేపట్టేందుకు బొంరాస్‌పేట, పొన్నాల గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. ఇక్కడి రైతులు భూసేకరణకు సహకరించడం లేదు. భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు సమావేశాలు నిర్వహించినా ముంపు గ్రామాల ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం 5 టీఎంసీలు కుదించి, దానికనుగుణంగా ప్రాజెక్టు నివేదికతతయారు చేసి ఇవ్వాలని వ్యాప్కోస్ను ఆదేశించింది. దీనిపై కసరత్తు చేసి న వ్యాప్కోస్ ప్రభుత్వ భూమి 918.84 ఎకరాల మేర అటవీ భూమి ప్రాం తంలోనే నిర్మాణం చేసేలా 5.04 టీఎంసీలతో కేశవాపూర్‌ను నిర్మించే అవకాశం ఉందని తేల్చింది. రూ.3,363 కోట్లు అవసరం.. రా వాటర్ తరలించేందుకు ఏర్పాటు చేయనున్న రెండు వరుసల ప్రధాన పైప్ లైన్ పొడవు గతంలో 18.2 కి.మీ. ఉండగా, ప్రస్తుతం దాన్ని ఒకటే వరుసలో 34.85 కి.మీ.లకు ప్రతిపాదించింది. దీనికి మొత్తంగా రూ.3,363 కోట్లు అవుతుందని లెక్కగట్టింది. ఇందులో భూసేకరణ అవసరాలకు రూ.75 కోట్లు అవసరం ఉంటుందని తేల్చింది. దీంతో పాటే కొండపోచమ్మ సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని శుద్ధి చేసేందుకు డబ్ల్యూటీపీ నిర్మాణం చేయాల్సి ఉండగా, దానికి రూ.1,006 కోట్లు అంచనా కట్టింది. ఇందులో పైప్ లైన్ నిర్మాణానికే రూ.385 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టింది. -
26, 27న నీళ్లు బంద్
గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాలకు ఈ నెల 26, 27 తేదీల్లో గండిపేట నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. మరమ్మతు పనుల కారణంగాఈ చర్య చేపడుతున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. తిరిగి 28న నీటిసరఫరాను పునరుద్ధరిస్తామన్నారు. సాక్షి ,సిటీబ్యూరో: ఉస్మాన్‌సాగర్ (గండిపేట్)కాల్వ, ఆసిఫ్‌నగర్ నీటిశుద్ధికేంద్రం వద్ద ఫిల్టర్బెడ్ల మరమ్మతుల కారణంగా ఈ నెల 26, 27 తేదీల్లో పలు ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. దీంతో కాకతీయనగర్, సాలార్జంగ్కాలనీ, పద్మనాభనగర్, ఖాదర్‌బాగ్, విజయనగర్‌కాలనీ, చింతల్‌బస్తీ, హుమయూన్‌నగర్, సయ్యద్‌నగర్, ఏసీగార్డ్స్, ఖైరతాబాద్, మల్లేపల్లి, బోయిగూడా కమాన్, ఆగాపురా, నాంపల్లి, దేవీబాగ్, అఫ్జల్‌సాగర్, సీతారాంబాగ్, హబీబ్‌నగర్, ఎస్ఆర్టీ, జవహర్‌నగర్, పీఎన్టీ కాలనీ, సాయన్న గల్లీ, అశోక్‌నగర్, ఇలాచిగూడా, జ్యోతినగర్, వినాయక్‌నగర్, మైసమ్మబండ, ఎంసీహెచ్ క్వార్టర్స్,సెక్రటేరియట్, రెడ్‌హిల్స్, హిందీనగర్, గోడేఖీ కబర్, గన్‌ఫౌండ్రి, దోమల్‌గూడా, లక్డికాపూల్, మణికొండ, పుప్పాల్గూడా, నార్సింగి ప్రాంతాలకు నీటిసరఫరా నిలిచిపోనుంది. ఈ నెల 28 తిరిగి నీటిసరఫరా పునరుద్ధరిస్తామని జలమండలి అధికారులు ప్రకటించారు. -
డైవర్షన్!
సాక్షి, ముత్తుకూరు(నెల్లూరు): ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మించిన కొత్త (డైవర్షన్) యాష్‌పాండ్‌లోకి ఉప్పునీటి బూడిద విడుదల జరుగుతోంది. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతాయని పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.50 కోట్లకుపైగా వ్యయం చేసి 100 ఎకరాల విస్తీర్ణంలో డైవర్షన్ యాష్‌పాండ్ నిర్మించారు. కాలుష్య నియంత్రణ మండలి అభ్యంతరాల నుంచి బయటపడి, 100 ఎకరాల యాష్‌పాండ్‌ను 30 ఎకరాలకు కుదించారు. అయితే మంచినీరు కలిసిన బూడిదను ఈ యాష్‌పాండ్‌లోకి విడుదల చేయాల్సి ఉండగా, పాత యాష్‌పాండ్ మాదిరిగానే సముద్రపు(ఉప్పు)నీరు కలిసిన బూడిదను విడుదల చేస్తున్నారు. సముద్రపు ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే ‘వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్’ నిర్మాణం పూర్తికాకపోవడమే దీనికి కారణం. మూడో యూనిట్ కింద నిర్మించే 800 మెగావాట్ల ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి మంచినీటితో నిర్వహించేందుకు, ఉద్యోగుల కాలనీలకు తాగునీరు అందించేందుకు 33 ఎంఎల్డీ, 21 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) వాటర్ ట్రీట్ ప్లాంట్ల నిర్మాణం తలపెట్టారు. మొదటి దశ ప్లాంటు పనులు గత ఏడాది జూన్‌కే పూర్తికావాల్సి ఉంది. ఏడాది గడిచినా కూడా పనులు పూర్తికాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. పాత దాని వలే కొత్త యాష్‌పాండ్‌తో కూడా కాలుష్యం వ్యాపిస్తుందని ఇటు రైతులు, భూగర్భ జలాలు కలుషితమవుతాయని అటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాష్‌పాండ్ ఎత్తు పెంచే టెండర్ రద్దు? బూడిదతో పొంగిపొర్లుతున్న పాత యాష్‌పాండ్‌లోకి బూడిద విడుదల నిలిపివేశారు. దీన్ని ఐదు మీటర్ల ఎత్తు పెంచేందుకు రూ.17 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ పనులకు టెండర్లు కూడా పిలిచారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడడంతో ఈ టెండర్ రద్దు అయ్యిందని ఇంజినీర్లు చెబుతున్నారు. అందువల్లనే ఈ పనులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ కాలేదని వెల్లడించారు. ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల్లో జాప్యం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కావడంలో జాప్యం జరిగినట్టు ఏపీజెన్కో ప్రాజెక్ట్ ఇంజినీర్లు పేర్కొన్నారు. దీని వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఉప్పునీటి బూడిద విడుదల చేయాల్సి వస్తోందని తెలిపారు. సముద్రం నుంచి నీరు తరలించేందుకు పైపులైన్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నా. వాటర్ పంప్‌హౌస్ నుంచి నీళ్లు తీసుకోవడమే మిగిలిందని తెలిపారు. త్వరలో నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. అలాగే డైవర్షన్ యాష్‌పాండ్‌లోకి ఉప్పునీరు కలిసిన బూడిదను ఆరు నెలల పాటు విడుదల చేయవచ్చని ఎంఓయూలో గడువు ఇచ్చి ఉన్నారని ఇంజినీర్లు తెలిపారు. మంచినీటి బూడిద విడుదల చేస్తామన్నారు కొత్త (డైవర్షన్) యాష్‌పాండ్‌లోకి మంచినీటి బూడిద విడుదల చేస్తామని గతంతో ఏపీజెన్కో ఇంజినీర్లు ప్రకటించారు. ఇప్పుడేమో ఉప్పునీటి బూడిద విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నేలటూరు, పైనాపురం ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఉప్పు మయంగా మారాయి. పంటలు పండే పరిస్థితి లేకుండాపోయింది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోంది. కాలుష్యానికి గురయ్యే దేవరదిబ్బ గిరిజనకాలనీని ఎందుకు తరలించలేకపోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏమైంది. కొత్త ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి. – నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు, ముత్తుకూరు -
ఆ 3 కోట్లు ఉత్తమ్‌వి కావా?
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘‘2014 ఎన్నికలప్పుడు కోదాడలో రూ.3 కోట్లు ఇన్నోవాలో దొరికింది వాస్తవం కాదా..? అవి ఉత్తమ్‌కుమార్‌రెడ్డివి కావా? ఉన్నమాట అంటే జానారెడ్డికి అం త ఉలుకు ఎందుకు?’’అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. మంగళవారం సూర్యాపేటలో రూ.81 కోట్లతో నిర్మించనున్న మురుగు నీటి శుద్ధి ప్లాంట్, నాలా, కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో 1,110 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించాలని పిలుపునిచ్చారు. కోదాడ నుంచే విజయయాత్ర .. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలు చేసినట్లు 40 మంది కాంగ్రెస్ నాయకులు బస్సు యాత్రల పేరుతో దొంగ యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చరమగీతం పాడి, తెలంగాణ ముఖ ద్వారం కోదాడ నుంచే విజయయాత్ర ప్రారంభం కావాలని, గులాబీ జెండా పాతాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీతారామ ప్రాజెక్టుతో గోదావరి నీళ్లు పాలేరుకు తెస్తామని, నాగార్జునసాగర్ నీళ్లతో కోదాడను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రైతు బిడ్డగా, రైతుగా.. రైతుల పక్ష పాతిగా ఉంటూ వారి కోసం ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి పథకం ప్రవేశపెట్టారని దేశంలో ఏ సీఎం ఇలా రైతుల గురించి ఆలోచించలేదన్నారు. రైతులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా ప్రకటించారని, రాష్ట్రంలోని 72 లక్షల రైతు కుటుంబాలు దీని పరిధిలోకి వస్తాయన్నారు. నల్లగొండలో ఫ్లోరిన్ భూతం జిల్లాలోని కాంగ్రెస్ నేతల పుణ్యమేనన్నారు.. జానారెడ్డి నియోజకవర్గం పక్కనే ఉన్న దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో ఏటా ఫ్లోరోసిస్ పెరిగిందని.. 7 సార్లు గెలిచిన ఆయన ఏం చేశారన్నారు. ఆడకూతుళ్లకు మేనమామ కేసీఆర్.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో రాష్ట్రంలోని ఆడకూతుళ్లకు కేసీఆర్ మేనమామ లాగా మారారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.5,500 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ జలాల కోసం ఇదే కోదాడ నుంచి హాలియా వరకు నాడు కేసీఆర్ పాదయాత్ర చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతంలో సుద్ద బావులు ఇస్తే.. రాష్ట్రం వచ్చాక ఊట బావులను ఇచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సభలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
నీటిశుద్ధి కేంద్రాలకు మరమ్మతులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా సరైన నీటిసరఫరా లేక నిరుపయోగంగా మూలనపడి ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పునరుద్ధరించేందుకు ఢిల్లీ జల్ బోర్డ్ (డీ జేబీ) నిర్ణయించింది. హరియాణా రాష్ట్రం మరో నెలన్నర రోజుల్లో మునాల్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయనున్నందున అప్పట్లోగా వాటర్ ప్లాంట్ల మరమ్మతులు పూర్తిచేసి పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డీజేబీ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించినట్లు వారు తెలిపారు. ఈ నీటిశుద్ధి కేంద్రాలు అందుబాటులోకి వస్తే దక్షిణ, నైరుతి,వాయవ్య, పశ్చిమ ఢిల్లీలో నివసించే సుమారు 20 లక్షల మంది పేదలకు మంచినీటిని సరఫరాచేయగలుగుతామని డీజేబీ తెలిపింది. నగరంలో పరిశుద్ధ నీటి సరఫరా విషయమై ఇటీవల డీజేబీని హైకోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. దాంతో ఇరాదత్నగర్లో ఉన్న రావాటర్ పంప్ హౌజ్‌ను మునాక్ కెనాల్‌తో అనుసంధానించే పనిని బోర్డు పూర్తిచేసింది. ప్రస్తుతం నీటిశుద్ధి కర్మాగారం పనితీరును పరీక్షిస్తున్నారు. పంప్ హౌజ్ నుంచి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ముడినీరు తీసుకువచ్చే లైన్లను పూర్తిచేయడం కోసం బోర్డు తాత్కాలిక అలైన్మెంట్ చేసింది. అమర్‌కాలనీ, భాగ్యవిహార్లలో ఇంకా పూర్తి కాని పనులను ఎలాంటి కూల్చివేతలు జరుపకుండా పోలీసు రక్షణతో నిర్మిస్తున్నారు. ఈ నీటిలైన్ల కనెక్షన్లు 20 రోజుల్లో పూర్తవుతాయని, నెలరోజుల్లో ద్వారకా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయడం మొదలవుతుందని డీజేబీ తెలిపింది. 40 ఎంజీడీల సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును మూడేళ్ల కింద నిర్మించారు. పదేళ్ల కిందట నిర్మించిన 20 ఎంజీడీల సామర్థ్యం కలిగిన బవానా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ముడినీటి సరఫరా లేకపోవడం వల్ల అది ఇప్పటి వరకు పనిచేయలేదు. ఇన్నాళ్లుగా మూలనపడిన ఈ ప్లాంటులో ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహించి పాతబడిన యంత్రాలను పరీక్షిస్తున్నారు. అవసరమైన మరమ్మతులు చేసి దాన్ని వినియోగించుకోవడానికి డీజేబీ యత్నిస్తోంది. ఇప్పటికే ఫిల్టరు బెడ్లను, క్లారిఫైయర్లను శుభ్రం చేశారు, ఫిల్టర్ మీడియాను మార్చారు. ఈ ప్లాంటు కూడా మరో 20 రోజుల్లో వినియోగంలోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.అలాగే సగం సామర్థ్యంతో పనిచేస్తున్న ఓఖ్లా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఢిల్లీ జల్‌బోర్డు సిబ్బంది కషిచేస్తున్నారు. -
శ్రీశైలాలయ పనులు వివాదాస్పదం
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివాదాస్పదమయ్యాయి. ఈ పనులపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బృహత్తర ప్రణాళికలో భాగంగా రూ.600 కోట్లతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, షాపింగ్ కాంప్లెక్స్, క్యూకాంప్లెక్స్, డార్మెటరీ, కల్యాణమండపం, పుష్కరిణి నిర్మించాలని భావించారు. ఇందులో అతి ముఖ్యమైనది రూ.49 కోట్లతో చేపట్టిన నీటిశుద్ధి, భూగర్భ నీటివ్యవస్థ. మరో రూ.25 కోట్లతో సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయం, రూ.14 కోట్లతో డార్మెటరీల నిర్మాణం, రూ.7 కోట్లతో స్నానఘట్టాలు, రూ.3.50 కోట్లతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, చంద్రావతి కళ్యాణ మండపం పనులు చేస్తున్నారు. ఈ పనులన్నీ ఏడాదిన్నరగా కొనసా..గుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లోపంతో జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. విధ్వంసం..అభివృద్ధి ఏకకాలంలో చూపించిన ఈఓ ఆజాద్.. శ్రీశైలాలయప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో ఈఓ చంద్రశేఖర ఆజాద్ చేపట్టిన అభివృద్ధి పనులు చేపట్టారు. అదే సమయంలో అతి ప్రాచీన, పురాతన కట్టడాలను నేలమట్టం చేసి విధ్వంసం సృష్టించారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఆలయప్రాంగణంలో ఈశాన్యదిశగా భారీ ఎత్తున తవ్వకాలను చేపట్టి, అదేస్థానంలో తిరిగి నూతన కట్టడాలను నిర్మించారు. సాలుమండపాల్లో కొంత భాగాన్ని తొలగించి తిరిగి కొత్తగా కోటగోడ దక్షిణ వాయువ్యంలో నిర్మించడంపై భక్తులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పంచభుతాల ప్రతిష్ఠిత ఆలయాల పక్కనే ఉన్న మండ పాన్ని తొలగించి మెట్ల మార్గాన్ని అదనంగా పొడగించడం స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అదే విధంగా అభివృద్ధి పేరున సుమారు పాతిక అడుగుల మేర ఎత్తున గాల్వలం షీట్లతో విశాలమైన షెడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ఆలయప్రాంగణం శోభను కొల్పోయిందని, పురాతన ఆనవాళ్లన్నీ నాశనం చేశారని పండితులు కొందరు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలకు భంగం... మల్లన్న లింగ స్వరూపం అరిగిపోతుందనే కారణం చూపిస్తూ సువర్ణకవచం ఏర్పాటు చేయాలనే ఆలోచనను వీరశైవ భక్తులు, పండితులు వ్యతిరేకించారు. దీనిపై అనేక విమర్శలు రావటంతో ఆ ప్రయత్నాన్ని నిలిపివేసి చివరకు లింగంచుట్టూ గాడి ఏర్పందని, దాన్ని పూడ్చివేసి మూలికలు, రసాయనాలు, పాషాణాలతో అష్టబంధనంచేయాలని సంకల్పించారు. ఇందుకు జగద్గురు పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, విశాఖ శారదా పీఠాధిపతితో పాటు పలువురు పీఠాధిపతులు అనుమతి పత్రాలు అందజేశారని ఈఓ పేర్కొంటున్నారు. అయితే ఇప్పటి వరకు స్వామిజీలు, పీఠాధిపతులు ఇచ్చిన అనుమతి పత్రాలను బయటపెట్టిన దాఖలాలు లేకపోవటం గమనార్హం. మల్లన్న అష్టబంధన కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తటం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గత నెల జూన్ 9న జరగాల్సిన అష్టబంధన కార్యక్రమం, పరివార ఆలయాలపై కలశస్థాపన, స్వామివార్ల గర్భాలయం కుంబాభిషేకం పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఎక్కడి పనులు అక్కడ నిలిపివేసి యధాస్థితిని కొనసాగించాల్సిందిగా‘ కెప్ట్ అబయన్స్’ ఉత్తర్వులు ఈఓకు జారీచేశారు. ఓ వైపు పురాతన కట్టడాలను తొలగిస్తూనే మరోవైపు ఆలయ ప్రాంగణంలోని కట్టడాలలో సహజత్వాన్ని తీసుకురావడానికి రాతి నిర్మాణాలపై ఏర్పాటు చేసిన టైల్స్, సున్నపు పొరలను శాండ్‌బ్లాస్టింగ్ ద్వారా తొలగించే ప్రక్రియ చేపట్టారు. అదే విధంగా భారీ షెడ్లు ఏర్పాటు చేయటంతో ఆలయప్రాంగణం రూపురేఖలు కోల్పోయి సహజత్వానికి భిన్నంగా దర్శనమిస్తోంది.