మంగళవారం కోదాడలో జరిగిన సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘‘2014 ఎన్నికలప్పుడు కోదాడలో రూ.3 కోట్లు ఇన్నోవాలో దొరికింది వాస్తవం కాదా..? అవి ఉత్తమ్‌కుమార్‌రెడ్డివి కావా? ఉన్నమాట అంటే జానారెడ్డికి అం త ఉలుకు ఎందుకు?’’అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. మంగళవారం సూర్యాపేటలో రూ.81 కోట్లతో నిర్మించనున్న మురుగు నీటి శుద్ధి ప్లాంట్, నాలా, కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో 1,110 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించాలని పిలుపునిచ్చారు.
కోదాడ నుంచే విజయయాత్ర ..
వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలు చేసినట్లు 40 మంది కాంగ్రెస్ నాయకులు బస్సు యాత్రల పేరుతో దొంగ యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చరమగీతం పాడి, తెలంగాణ ముఖ ద్వారం కోదాడ నుంచే విజయయాత్ర ప్రారంభం కావాలని, గులాబీ జెండా పాతాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీతారామ ప్రాజెక్టుతో గోదావరి నీళ్లు పాలేరుకు తెస్తామని, నాగార్జునసాగర్ నీళ్లతో కోదాడను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి రైతు బిడ్డగా, రైతుగా.. రైతుల పక్ష పాతిగా ఉంటూ వారి కోసం ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి పథకం ప్రవేశపెట్టారని దేశంలో ఏ సీఎం ఇలా రైతుల గురించి ఆలోచించలేదన్నారు. రైతులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా ప్రకటించారని, రాష్ట్రంలోని 72 లక్షల రైతు కుటుంబాలు దీని పరిధిలోకి వస్తాయన్నారు. నల్లగొండలో ఫ్లోరిన్ భూతం జిల్లాలోని కాంగ్రెస్ నేతల పుణ్యమేనన్నారు.. జానారెడ్డి నియోజకవర్గం పక్కనే ఉన్న దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో ఏటా ఫ్లోరోసిస్ పెరిగిందని.. 7 సార్లు గెలిచిన ఆయన ఏం చేశారన్నారు.
ఆడకూతుళ్లకు మేనమామ కేసీఆర్..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో రాష్ట్రంలోని ఆడకూతుళ్లకు కేసీఆర్ మేనమామ లాగా మారారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.5,500 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ జలాల కోసం ఇదే కోదాడ నుంచి హాలియా వరకు నాడు కేసీఆర్ పాదయాత్ర చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతంలో సుద్ద బావులు ఇస్తే.. రాష్ట్రం వచ్చాక ఊట బావులను ఇచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సభలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment