సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం)లో బూడిద గుంత (యాష్ పాండ్) నిర్మాణంలో చోటుచేసుకున్న కుంభకోణంపై ఏపీ జెన్‌కో దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణం వెనుక కీలక పాత్రధారుల వివరాలను జెన్‌కో సేకరిస్తోంది. టెండర్లు పిలవకుండానే రూ.56.50 కోట్ల విలువైన కాంట్రాక్ట్ కట్టబెట్టిన వైనంపై విచారణ జరపాలని లోకాయుక్తకు రాష్ట్ర హైకోర్టు సూచించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి సంస్థ (ఏపీపీడీసీఎల్), ఏపీ జెన్‌కో సంబంధిత ఫైళ్లన్నీ పరిశీలిస్తోంది. లోకాయుక్తకు వాస్తవ సమాచారాన్ని నివేదించేందుకు సన్నాహాలు చేస్తోంది.
చినబాబు, టీడీపీ నేతల కోసమే కాంట్రాక్ట్?
కృష్ణపట్నంలో అవసరం లేకపోయినా 2015లో అప్పటి ప్రభుత్వం 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. టెండర్ నిబంధనల్లో కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ సూచించిన నిబంధనల్ని పాటించకుండా.. నచ్చిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టేలా టెండర్ డాక్యుమెంట్ రూపొందించింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎక్కువ ధరలకు కాంట్రాక్ట్ కట్టబెట్టడాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపై అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో టీడీపీ సర్కార్‌ను నిలదీసింది. అయినప్పటికీ 2017లో అదే కాంట్రాక్ట్ సంస్థకు నామినేషన్ పద్ధతిపై యాష్ పాండ్ నిర్మాణం కాంట్రాక్ట్‌ను అప్పగించారు.
నిజానికి దీని అవసరమే లేదని విద్యుత్ కేంద్రం డీపీఆర్‌లో తొలుత పేర్కొన్నారు. అంతలోనే టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ కట్టబెట్టడం విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంపై అప్పట్లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. దీనిపై లోకాయుక్త విచారణకు హైకోర్టు ఆదేశించింది. 2019లో ఎన్నికల నిధి కోసమే ఈ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. అప్పటి టీడీపీ ఎమ్మెల్యేకు, అప్పటి ప్రభుత్వాధి నేత కుమారుడు చినబాబుకు వాటాలు ముట్టినట్టు తెలియవచ్చింది. ఈ కారణంగానే జెన్‌కో బోర్డు ఆగమేఘాలపై కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు తీర్మానం కూడా చేసింది.
డైరెక్టర్‌పై వేటు!
ప్రస్తుతం థర్మల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి గతంలో కృష్ణపట్నంలో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్నారు. కాంట్రాక్ట్ బేరసారాల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్టు జెన్‌కో వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయనే డైరెక్టర్‌గా ఉండటం వల్ల విచారణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే సందేహాలొస్తున్నాయి. దీంతో ఆయనను పక్కనపెట్టే ఆలోచనలో అధికారులున్నారు. ఏపీపీడీసీఎల్ సీజీఎంగా పనిచేసి ఇటీవలే రిటైరైన వ్యక్తిపై యాష్ పాండ్‌తో పాటు, థర్మల్ కేంద్రంలో జరిగిన బొగ్గు లావాదేవీలపైనా ఫిర్యాదులున్నాయి. దీనిపై విచారణ జరుగుతున్న కారణంగా ఆయన పదవీ విరమణ అనంతర సదుపాయాలన్నీ జెన్‌కో బోర్టు నిలిపివేసిందని సమాచారం. కొత్తగా యాష్ పాండ్ వ్యవహారంపై ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంది.
మరో ఇద్దరు డైరెక్టర్ల పాత్రపైనా ఆరా
ఈ కాంట్రాక్ట్ వ్యవహారంలో సహకరించిన ఇద్దరు డైరెక్టర్ల పాత్రపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. అప్పటి థర్మల్ డైరెక్టర్‌పై గతంలో ఏసీబీ కేసు నమోదైంది. కాంట్రాక్ట్ సంస్థల ప్రభావంతోనే ఈ కేసును జెన్‌కో విచారణ జరపకుండా మూసేయడంపైనా ఆరా తీస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలు చూసిన అప్పటి డైరెక్టర్ నియామకంలో అనర్హత వ్యవహారాలపై ఫిర్యాదులొచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఆయన నియామకం వెనుక లబ్ధి పొందిన నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలొచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్ష విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment