krishnapatnam thermal power plant
-
బూడిద గుంతలో బొక్కిందెవరు!
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం)లో బూడిద గుంత (యాష్ పాండ్) నిర్మాణంలో చోటుచేసుకున్న కుంభకోణంపై ఏపీ జెన్కో దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణం వెనుక కీలక పాత్రధారుల వివరాలను జెన్కో సేకరిస్తోంది. టెండర్లు పిలవకుండానే రూ.56.50 కోట్ల విలువైన కాంట్రాక్ట్ కట్టబెట్టిన వైనంపై విచారణ జరపాలని లోకాయుక్తకు రాష్ట్ర హైకోర్టు సూచించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి సంస్థ (ఏపీపీడీసీఎల్), ఏపీ జెన్కో సంబంధిత ఫైళ్లన్నీ పరిశీలిస్తోంది. లోకాయుక్తకు వాస్తవ సమాచారాన్ని నివేదించేందుకు సన్నాహాలు చేస్తోంది. చినబాబు, టీడీపీ నేతల కోసమే కాంట్రాక్ట్? కృష్ణపట్నంలో అవసరం లేకపోయినా 2015లో అప్పటి ప్రభుత్వం 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. టెండర్ నిబంధనల్లో కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ సూచించిన నిబంధనల్ని పాటించకుండా.. నచ్చిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టేలా టెండర్ డాక్యుమెంట్ రూపొందించింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎక్కువ ధరలకు కాంట్రాక్ట్ కట్టబెట్టడాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపై అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అసెంబ్లీలో టీడీపీ సర్కార్‌ను నిలదీసింది. అయినప్పటికీ 2017లో అదే కాంట్రాక్ట్ సంస్థకు నామినేషన్ పద్ధతిపై యాష్ పాండ్ నిర్మాణం కాంట్రాక్ట్‌ను అప్పగించారు. నిజానికి దీని అవసరమే లేదని విద్యుత్ కేంద్రం డీపీఆర్‌లో తొలుత పేర్కొన్నారు. అంతలోనే టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ కట్టబెట్టడం విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంపై అప్పట్లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. దీనిపై లోకాయుక్త విచారణకు హైకోర్టు ఆదేశించింది. 2019లో ఎన్నికల నిధి కోసమే ఈ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. అప్పటి టీడీపీ ఎమ్మెల్యేకు, అప్పటి ప్రభుత్వాధి నేత కుమారుడు చినబాబుకు వాటాలు ముట్టినట్టు తెలియవచ్చింది. ఈ కారణంగానే జెన్కో బోర్డు ఆగమేఘాలపై కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు తీర్మానం కూడా చేసింది. డైరెక్టర్‌పై వేటు! ప్రస్తుతం థర్మల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి గతంలో కృష్ణపట్నంలో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్నారు. కాంట్రాక్ట్ బేరసారాల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్టు జెన్కో వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయనే డైరెక్టర్‌గా ఉండటం వల్ల విచారణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే సందేహాలొస్తున్నాయి. దీంతో ఆయనను పక్కనపెట్టే ఆలోచనలో అధికారులున్నారు. ఏపీపీడీసీఎల్ సీజీఎంగా పనిచేసి ఇటీవలే రిటైరైన వ్యక్తిపై యాష్ పాండ్‌తో పాటు, థర్మల్ కేంద్రంలో జరిగిన బొగ్గు లావాదేవీలపైనా ఫిర్యాదులున్నాయి. దీనిపై విచారణ జరుగుతున్న కారణంగా ఆయన పదవీ విరమణ అనంతర సదుపాయాలన్నీ జెన్కో బోర్టు నిలిపివేసిందని సమాచారం. కొత్తగా యాష్ పాండ్ వ్యవహారంపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంది. మరో ఇద్దరు డైరెక్టర్ల పాత్రపైనా ఆరా ఈ కాంట్రాక్ట్ వ్యవహారంలో సహకరించిన ఇద్దరు డైరెక్టర్ల పాత్రపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. అప్పటి థర్మల్ డైరెక్టర్‌పై గతంలో ఏసీబీ కేసు నమోదైంది. కాంట్రాక్ట్ సంస్థల ప్రభావంతోనే ఈ కేసును జెన్కో విచారణ జరపకుండా మూసేయడంపైనా ఆరా తీస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలు చూసిన అప్పటి డైరెక్టర్ నియామకంలో అనర్హత వ్యవహారాలపై ఫిర్యాదులొచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఆయన నియామకం వెనుక లబ్ధి పొందిన నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలొచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్ష విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. -
కృష్ణపట్నం బొగ్గు పక్కదారి!
సాక్షి, అమరావతి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం)లో బొగ్గు నాణ్యత ఒక్కసారిగా పడిపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వాస్తవాలను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని ఇంధనశాఖ నిర్ణయించడంతో జెన్కో అధికారుల్లో కలవరం మొదలైంది. నివేదిక ఇవ్వకుండా తాత్సారం కృష్ణపట్నం థర్మల్ విద్యుత్తు కేంద్రానికి సరఫరా అయ్యే బొగ్గు నాణ్యత తగ్గడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి కమిటీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. బొగ్గు క్షేత్రాల నుంచే నాసిరకం బొగ్గు వస్తోందా? లేదంటే మధ్యలో ఇంకేదైనా వ్యవహారం జరుగుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణపట్నం ప్లాంట్‌కు వచ్చే బొగ్గు పూర్తిగా తడిసిపోయి డొల్లగా ఉంటోందని, మండిస్తే సరైన ఉష్ణశక్తి రావడం లేదని ప్లాంట్ ఇంజనీర్లు ఇటీవల ఇంధనశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. కృష్ణపట్నం ఏపీపీడీసీఎల్ పరిధిలోది కావడంతో వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని జెన్కో ఎండీ ఆదేశించినట్టు తెలిసింది. ఏపీపీడీసీఎల్ ముఖ్య అధికారి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ఇవ్వకుండా కాంట్రాక్టు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. దీన్నిబట్టి నాసిరకం బొగ్గును ప్లాంట్‌కు చేరవేయడంలో కాంట్రాక్టర్ల హస్తం ఉందని, ఏపీపీడీసీఎల్ అధికారులు వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లేని బొగ్గు వాడటం వల్ల వినియోగం పెరిగి థర్మల్ ప్లాంట్ బాయిలర్స్పై ప్రభావం పడుతోందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతోంది? కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 1,600 మెగావాట్లు. ఇక్కడ నిత్యం 16 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగిస్తారు. ఈ ప్లాంట్‌కు మహానది కోల్ ఫీల్డ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేస్తోంది. ఒడిశాలోని తాల్చేరు గనుల నుంచి సేకరించే బొగ్గును సమీపంలోనే వాష్ చేస్తారు. ఓ ప్రైవేటు సంస్థకు ఈ కాంట్రాక్టు బాధ్యతను అప్పగించారు. వ్యర్థాన్ని తొలగించాక బొగ్గును నేరుగా పారాదీప్ పోర్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి సముద్రమార్గం ద్వారా కృష్ణపట్నం పోర్టుకు చేరుతుంది. అనంతరం కన్వేయర్ బెల్ట్ ద్వారా థర్మల్ ప్లాంట్‌కు నేరుగా చేరుతుంది. వాస్తవానికి బొగ్గు మైన్ దగ్గరే నాణ్యత పరీక్ష కోసం నమూనాలు సేకరిస్తారు. తర్వాత ప్లాంట్ దగ్గర మరో శాంపుల్ తీస్తారు. బొగ్గు క్షేత్రాల దగ్గర ఎంసీఎల్ తీసే శాంపుల్ 4,120 జీసీవీ (ఉష్ణశక్తి) వరకూ ఉంటుంది. కానీ ప్లాంట్‌లో ఇది 3,700 ఉంటోందని, గత నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉందని కృష్ణపట్నం సీనియర్ ఇంజనీర్లు గుర్తించారు. ఉన్నతాధికారులు మాత్రం ఎంసీఎల్ శాంపుల్స్ నాణ్యతనే పరిగణలోనికి తీసుకుని వాస్తవాలను దాచిపెడుతున్నట్లు తెలిసింది. ఈ బొగ్గును కేంద్ర ప్రభుత్వ సంస్థ సింఫర్కు థర్డ్ పార్టీ పరీక్షకు పంపుతారు. దీన్ని కూడా కొంతమంది మేనేజ్ చేస్తున్నారని, నాణ్యత ఉన్న శాంపుల్స్ పంపుతున్నారని తెలిసింది. వాష్ చేసిన బొగ్గును ప్లాంట్‌కు చేరవేసే కాంట్రాక్టు సంస్థలు నాణ్యమైన బొగ్గును ఇతర ప్రైవేట్ సంస్థలకు అమ్ముకునే వీలుంది. అందుకనే నాసిరకం బొగ్గును కలుపుతున్నట్లు కృష్ణపట్నం ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. పోర్టులో గోల్మాల్? పారాదీప్ లేదా కృష్ణపట్నం పోర్టులో గోల్మాల్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రైవేట్ థర్మల్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గును తరలిస్తూ కాంట్రాక్టు సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని, ఏపీపీడీసీఎల్ ఉన్నతాధికారికి భారీగా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీనిపై జెన్కో అధికారులను సంప్రదించగా వర్షాల కారణంగా బొగ్గు తడిసి నాణ్యత తగ్గుతోందన్నారు. నాణ్యత తగ్గడంపై విచారణకు ఆదేశించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీనిపై ఏపీపీడీసీఎల్ సీజీఎం రాఘవేంద్రరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. -
కృష్ణపట్నానికి మరో ఆటంకం
మరింత ఆలస్యం కానున్న 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాక్షి, హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టుకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి మరికొంత ఆలస్యం తప్పదని తెలుస్తోంది.ఈ వారంలోనే అధికారికంగా ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంది. ఈ దిశగా అన్ని చర్యలూ తీసుకున్నారు. ఆఖరి నిమిషంలో సాంకేతిక లోపం ఏర్పడింది. బయటకు వెళ్లాల్సిన బూడిద రివర్స్‌లో ట్రంక్ల్లోకి రావడంతో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు ఫ్యాన్ అమరికలో లోపం ఉన్నట్టు గుర్తించారు. నిరంతర విద్యుత్ అందిస్తామంటున్న ప్రభుత్వం కృష్ణపట్నం విద్యుత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2008 జూలై 17న అప్పటి సీఎం వైఎస్ ్డ దీనికి శంకుస్థాపన చేశారు. 1600 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.8,432 కోట్లు. ఇప్పుడిది రూ.10,450 కోట్లకు చేరింది. తొలినాళ్లలో ప్రధాన కాంట్రాక్టు టాటా సంస్థకు అప్పగించారు. మొదటి యూనిట్ ఈ నెలలో 800 మెగావాట్ల విద్యుత్‌ను అందించాల్సి ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతోంది. సాంకేతిక సమస్యలు తలెత్తకుంటే 2014 జనవరిలోనే ఇది విద్యుత్ ఉత్పత్తి అందించి ఉండేది. కొన్నాళ్లు బొగ్గు కొరత ఏర్పడింది. చివరకు సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదటి వారంలో మొదటి యూనిట్ పని ప్రారంభిస్తుందని అధికారులు ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం జరిపిన ట్రయల్ రన్లో 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఈ దశలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. 300 మెగావాట్ల ఉత్పత్తి: జెన్కో సీఎండీ ఫ్యాన్ అమరికలో లోపాలున్న మాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ జెన్కో సీఎండీ విజయానంద్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. సమస్యను పరిశీలించిన నిపుణులు.. ఫ్యాన్‌ను రివర్స్ పెట్టమన్నారని, ఈ దిశగా చర్యలు తీసుకోవడం సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పారు.