శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టుకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి.
మరింత ఆలస్యం కానున్న 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టుకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి మరికొంత ఆలస్యం తప్పదని తెలుస్తోంది.ఈ వారంలోనే అధికారికంగా ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంది. ఈ దిశగా అన్ని చర్యలూ తీసుకున్నారు. ఆఖరి నిమిషంలో సాంకేతిక లోపం ఏర్పడింది. బయటకు వెళ్లాల్సిన బూడిద రివర్స్‌లో ట్రంక్‌ల్లోకి రావడంతో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు ఫ్యాన్ అమరికలో లోపం ఉన్నట్టు గుర్తించారు. నిరంతర విద్యుత్ అందిస్తామంటున్న ప్రభుత్వం కృష్ణపట్నం విద్యుత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
2008 జూలై 17న అప్పటి సీఎం వైఎస్ ్డ దీనికి శంకుస్థాపన చేశారు. 1600 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.8,432 కోట్లు. ఇప్పుడిది రూ.10,450 కోట్లకు చేరింది. తొలినాళ్లలో ప్రధాన కాంట్రాక్టు టాటా సంస్థకు అప్పగించారు. మొదటి యూనిట్ ఈ నెలలో 800 మెగావాట్ల విద్యుత్‌ను అందించాల్సి ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతోంది. సాంకేతిక సమస్యలు తలెత్తకుంటే 2014 జనవరిలోనే ఇది విద్యుత్ ఉత్పత్తి అందించి ఉండేది. కొన్నాళ్లు బొగ్గు కొరత ఏర్పడింది. చివరకు సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదటి వారంలో మొదటి యూనిట్ పని ప్రారంభిస్తుందని అధికారులు ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం జరిపిన ట్రయల్ రన్‌లో 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఈ దశలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది.
300 మెగావాట్ల ఉత్పత్తి: జెన్‌కో సీఎండీ
ఫ్యాన్ అమరికలో లోపాలున్న మాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ జెన్‌కో సీఎండీ విజయానంద్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. సమస్యను పరిశీలించిన నిపుణులు.. ఫ్యాన్‌ను రివర్స్ పెట్టమన్నారని, ఈ దిశగా చర్యలు తీసుకోవడం సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పారు.