అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లతో భారీగా నష్టం
జెన్‌కో విద్యుత్ కేంద్రాల నిర్వహణ, మరమ్మతులు మెరుగుపరచాలి
సంస్థ ప్రతిపాదించిన వ్యయాలు హేతుబద్ధంగా లేవు
సామాన్య ప్రజలకు శాపంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు
ఈఆర్సీ బహిరంగ విచారణలో వక్తల స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల్లో స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి నిర్వహించకపోవడంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇతర మార్గాల్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి భారీగా నష్టపోతున్నాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్ రావు తప్పుబట్టారు. ప్రైవేటు విద్యుత్ కొనాల్సి రావడంతో తుదకు రాష్ట్ర ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. జెన్‌కో ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జెన్‌కో విద్యుత్ కేంద్రాల నిర్వహణ, మరమ్మతులు మెరుగుపరచాలని సూచించారు. ట్రూఅప్ చార్జీలతో పాటు ఎంవైటీ పిటిషన్‌లోని వ్యయాలు అసాధారణంగా, అవాంఛనీయంగా ఉన్నాయని, ప్రజలపై భారంపడకుండా నియంత్రించాలని ఈఆర్సీని కోరారు. 2022–23కి సంబంధించి జెన్‌కో దాఖలు చేసిన రూ.830.61 కోట్ల ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలతో పాటు 2024–25 నుంచి 2028–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్లపై సోమవారం విద్యుత్ నియంత్రణ్ భవన్‌లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) బహిరంగ విచారణ నిర్వహించింది. వేణుగోపాల్‌రావుతో పాటు పారిశ్రామిక, వ్యాపార సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వెల్లడించారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యలకు తమ సలహాలు, సూచనలు తెలియజేశారు.
దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి
‘తక్కువ వ్యవధిలో కీలక పిటిషన్లపై నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పెట్టుబడిదారీ అనుకూల విధానాలు సామాన్య ప్రజలకు శాపంగా మారుతున్నాయి. విద్యుత్ సంస్థలను నియంత్రించడానికి ఈఆర్సీ తన పరిధిలోని అధికారాలను వినియోగించుకునే విషయంలో వెనుకాడరాదు..’ అని వేణుగోపాల్ రావు సూచించారు.
ఫిక్స్‌డ్ చార్జీలపై ఫ్యాప్సీ అభ్యంతరం
విద్యుత్ కేంద్రాల ఫిక్స్‌డ్ చార్జీలను అసాధారణ రీతిలో పెంచి ప్రతిపాదించడంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్(ఫ్యాప్సీ) ప్రతినిధి రమణ్‌దీప్ సింగ్ అభ్యంతరం తెలిపారు. పలు పారిశ్రామిక సంఘాల తరఫున ఆయన మాట్లాడారు. ‘కొత్తగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఫిక్స్‌డ్ చార్జీలు భారంగా మారాయి. దీనితో పోల్చితే పాత విద్యుత్ కేంద్రాలు మెరుగ్గా విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. జెన్‌కో ప్రతిపాదించిన వివిధ రకాల వ్యయాలు హేతుబద్ధంగా లేవు. జెన్‌కో వార్షిక నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్‌ఎం) వ్యయం రూ.792 కోట్లు ఉంటే, అందులో రూ.696.98 కోట్లు వేతన సవరణ వాటా ఉంది..’ అని అన్నారు.
ఐదేళ్లలో ఆదాయ అవసరాలు రూ.43,713 కోట్లు: జెన్‌కో
వచ్చే ఐదేళ్లలో రుణాలకు వడ్డీల చెల్లింపులకు రూ.4,789 కోట్లు, ఫిక్స్‌డ్ చార్జీలు రూ.35,931 కోట్లు, అదనపు పెన్షన్ వ్యయాలు రూ.8,205 కోట్లు, మూలధన పెట్టుబడి వ్యయాలు రూ.1,664 కోట్లు, ఇతరత్రాలు కలిపి మొత్తం రూ.43,713 కోట్ల ఆదాయం అవసరం కానుందని జెన్‌కో తెలియజేసింది. ఆ మేరకు ఆదాయార్జనకు అనుమతిస్తూ ట్రూఅప్, ఎంవైటీ పిటిషన్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. కాగా జెన్‌కో పిటిషన్లపై పలువురి అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 29లోగా ఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment