Private power
-
ప్రైవేట్ విద్యుత్‌తో ప్రజలపై భారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల్లో స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి నిర్వహించకపోవడంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇతర మార్గాల్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి భారీగా నష్టపోతున్నాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్ రావు తప్పుబట్టారు. ప్రైవేటు విద్యుత్ కొనాల్సి రావడంతో తుదకు రాష్ట్ర ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. జెన్కో ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జెన్కో విద్యుత్ కేంద్రాల నిర్వహణ, మరమ్మతులు మెరుగుపరచాలని సూచించారు. ట్రూఅప్ చార్జీలతో పాటు ఎంవైటీ పిటిషన్‌లోని వ్యయాలు అసాధారణంగా, అవాంఛనీయంగా ఉన్నాయని, ప్రజలపై భారంపడకుండా నియంత్రించాలని ఈఆర్సీని కోరారు. 2022–23కి సంబంధించి జెన్కో దాఖలు చేసిన రూ.830.61 కోట్ల ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలతో పాటు 2024–25 నుంచి 2028–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్లపై సోమవారం విద్యుత్ నియంత్రణ్ భవన్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) బహిరంగ విచారణ నిర్వహించింది. వేణుగోపాల్‌రావుతో పాటు పారిశ్రామిక, వ్యాపార సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వెల్లడించారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యలకు తమ సలహాలు, సూచనలు తెలియజేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి ‘తక్కువ వ్యవధిలో కీలక పిటిషన్లపై నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పెట్టుబడిదారీ అనుకూల విధానాలు సామాన్య ప్రజలకు శాపంగా మారుతున్నాయి. విద్యుత్ సంస్థలను నియంత్రించడానికి ఈఆర్సీ తన పరిధిలోని అధికారాలను వినియోగించుకునే విషయంలో వెనుకాడరాదు..’ అని వేణుగోపాల్ రావు సూచించారు. ఫిక్స్డ్ చార్జీలపై ఫ్యాప్సీ అభ్యంతరం విద్యుత్ కేంద్రాల ఫిక్స్డ్ చార్జీలను అసాధారణ రీతిలో పెంచి ప్రతిపాదించడంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్(ఫ్యాప్సీ) ప్రతినిధి రమణ్‌దీప్ సింగ్ అభ్యంతరం తెలిపారు. పలు పారిశ్రామిక సంఘాల తరఫున ఆయన మాట్లాడారు. ‘కొత్తగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఫిక్స్డ్ చార్జీలు భారంగా మారాయి. దీనితో పోల్చితే పాత విద్యుత్ కేంద్రాలు మెరుగ్గా విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. జెన్కో ప్రతిపాదించిన వివిధ రకాల వ్యయాలు హేతుబద్ధంగా లేవు. జెన్కో వార్షిక నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయం రూ.792 కోట్లు ఉంటే, అందులో రూ.696.98 కోట్లు వేతన సవరణ వాటా ఉంది..’ అని అన్నారు. ఐదేళ్లలో ఆదాయ అవసరాలు రూ.43,713 కోట్లు: జెన్కో వచ్చే ఐదేళ్లలో రుణాలకు వడ్డీల చెల్లింపులకు రూ.4,789 కోట్లు, ఫిక్స్డ్ చార్జీలు రూ.35,931 కోట్లు, అదనపు పెన్షన్ వ్యయాలు రూ.8,205 కోట్లు, మూలధన పెట్టుబడి వ్యయాలు రూ.1,664 కోట్లు, ఇతరత్రాలు కలిపి మొత్తం రూ.43,713 కోట్ల ఆదాయం అవసరం కానుందని జెన్కో తెలియజేసింది. ఆ మేరకు ఆదాయార్జనకు అనుమతిస్తూ ట్రూఅప్, ఎంవైటీ పిటిషన్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. కాగా జెన్కో పిటిషన్లపై పలువురి అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 29లోగా ఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. -
బాబు షాక్ ఖరీదు రూ.94 వేల కోట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : విద్యుత్తు రంగంలో గత సర్కారు అడ్డగోలు ఒప్పందాలు, తప్పిదాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో ఇష్టారాజ్యంగా చేసుకున్న ఒప్పందాలు (పీపీఏ) గుదిబండలా పరిణమించాయి. సరిగ్గా చెప్పాలంటే అదే రేటుతో ఇప్పుడు ఒప్పందం చేసుకుంటే వినియోగదారులపై దాదాపు రూ.లక్ష కోట్ల భారం పడేది! సాధారణంగా సౌర, పవన విద్యుదుత్పత్తి వ్యయం తొలి పదేళ్లు స్థిరంగా కొనసాగి తరువాత నుంచి క్రమంగా తగ్గుతుంది. టీడీపీ సర్కారు మాత్రం వినియోగదారుల నడ్డి విరిచేలా పాతికేళ్ల పాటు అధిక ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం దారుణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ జరిగింది... టీడీపీ హయాంలో 2014–2019 మధ్య ఎస్పీడీసీఎల్ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు రూ.5.98 చొప్పున చెల్లించాలి. రెండో ఏడాది నుంచి ఏటా మూడు శాతం చొప్పున పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగుతుంది. పదో ఏడాది నాటికి ఒక్కో యూనిట్ కొనుగోలుకు రూ.7.8025 చొప్పున చెల్లించాలి. పదో ఏడాది చెల్లిస్తున్న ధరనే ఒప్పంద కాలం ముగిసే వరకు అంటే 25వ సంవత్సరం దాకా చెల్లించేలా గత సర్కారు ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం తొలి ఏడాది యూనిట్ రూ.5.98 చొప్పున 464 మెగావాట్లకుగాను రూ.365.89 కోట్లు చెల్లించాలి. ఏటా 3 శాతం చొప్పున పెంచడం వల్ల పదో ఏడాది రూ.477.41 కోట్లు చెల్లించాలి. వెరసి 25 ఏళ్లకు గాను కేవలం 464 మెగావాట్లకు చెల్లించాల్సిన మొత్తం రూ.10,978 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఇలా ఆదా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో పునరుత్పాదక ఇంధన రంగంలో మూడు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గత నెలలో ఏపీ జెన్కో, ఎన్‌హెచ్‌పీసీ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. మొత్తం రూ.25,850 కోట్ల పెట్టుబడుల ద్వారా 5,314 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 5,300 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్‌కు రూ.2.49 చొప్పున 25 ఏళ్ల పాటు చెల్లిస్తారు. 5,134 మెగావాట్లకు గాను పాతికేళ్లకు ప్రభుత్వం చెల్లించే మొత్తం కేవలం రూ.16,425 కోట్లు మాత్రమే. అంటే ఒక్కో యూనిట్ గత సర్కారు హయాంతో పోలిస్తే సగం కంటే తక్కువ ధరకే లభించడంతోపాటు రూ.వేల కోట్లు ఆదా అయ్యాయి. టీడీపీ పాలనలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం చెల్లిస్తే విద్యుత్తు వినియోగదారులపై అక్షరాలా రూ.94 వేల కోట్ల మేర అదనపు భారం పడేది. పాలకులు ముందుచూపుతో వ్యవహరిస్తే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలే రుజువు చేస్తున్నాయి! ఊరూ.. పేరూ ఒకటే! 464 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా నిమిత్తం ఎస్పీడీసీఎల్ 15 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఇందులో విచిత్రం ఏమిటంటే తొమ్మిది కంపెనీల రిజిస్టర్డ్ ఆఫీసు, కార్పొరేట్ ఆఫీసుల చిరునామా ఒకటే కావడం గమనార్హం. అంతేకాదు.. ఐదు కంపెనీలలో ముగ్గురు కామన్ డైరెక్టర్లుగా ఉండటం మరో విచిత్రం. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు, కొందరు డైరెక్టర్లు కనీసం ఐటీ రిటర్నులు కూడా దాఖలు చేయకపోయినా రూ.కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు చూపడం మరో విశేషం. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడికి చెందిన కంపెనీలు కూడా వీటిలో ఉండటం పరిశీలనాంశం. ఎల్లో మీడియా ఇవన్నీ దాచిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే యత్నం చేయటాన్ని పరిశీలకులు తప్పుబడుతున్నారు. -
Electricity Policy: ఏపీ బాటలో యూపీ
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన విధానాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ప్రజలకు చౌకగా విద్యుత్ అందించాలంటే అడ్డగోలు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించింది. ప్రజాసంక్షేమం కోసం చేపట్టిన ఈ చర్యను విపక్షాలు రాజకీయం చేశాయి. ఎల్లో మీడియా ఇష్టానుసారం వక్రీకరించింది. అయితే.. ఇప్పుడు అనేక రాష్ట్రాలు వైఎస్ జగన్ సర్కార్ విధానమే భేష్ అంటున్నాయి. గతేడాది గుజరాత్, తాజాగా ఉత్తరప్రదేశ్ (యూపీ) ప్రభుత్వాలు ఇదే బాట పట్టాయి. డిస్కమ్‌లను ఆర్థికంగా దెబ్బతీసే ఖరీదైన విద్యుత్ ఒప్పందాలకు ఆ రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి. విపక్షం, ఎల్లో మీడియాల దుష్ప్రచారం ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలు విద్యుత్ కొనుగోళ్లలో మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటే.. ఇక్కడ మాత్రం విపక్షం, ఎల్లో మీడియాలు పీపీఏల పునఃసమీక్షపై వివాదం సృష్టించాయి. దీనివల్ల పెట్టుబడిదారుల్లో అభద్రతాభావం నెలకొంటుందని దుష్ప్రచారం చేశాయి. చివరకు సోలార్, విండ్ ఉత్పత్తిదారులు కోర్టు వరకు వెళ్లారు. దీంతో ప్రస్తుతం యూనిట్ పవన విద్యుత్‌కు రూ.2.43, సోలార్కు రూ.2.44 చొప్పున డిస్కమ్‌లు తాత్కాలికంగా చెల్లిస్తున్నాయి. దీని వెనుక కారణాలను విశ్లేషిస్తే.. ► గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు అడ్డగోలుగా పవన, సౌరవిద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. 13,794 మిలియన్ యూనిట్ల (ఎంయూల) విద్యుత్‌ను అవసరం లేకుండా కొనేలా చేసింది. దీంతో డిస్కమ్‌లు రూ.5,497.3 కోట్ల అదనపు భారం మోయాల్సి వచ్చింది. ఈ పీపీఏల కారణంగా ఇప్పటికీ ఏటా రూ.2 వేల కోట్లను అదనంగా విద్యుత్ కొనుగోలుకు ఖర్చుచేయాల్సి వస్తోంది. ► 2016–17లో పవన, సౌరవిద్యుత్‌ను 2,433 మిలియన్ యూనిట్లు (5 శాతం) కొనాల్సిన అవసరం ఉంటే.. 4,173 ఎంయూలు (8.6 శాతం), 2017–18లో 4,612 ఎంయూలు (9 శాతం) అవసరమైతే.. 9,714 ఎంయూలు (19 శాతం), 2018–19లో 6,190 ఎంయూలు (11 శాతం) కొనాల్సి ఉంటే, 13,142 ఎంయూలు (23.4 శాతం) కొనుగోలు చేశారు. ► సోలార్ విద్యుత్ యూనిట్ రూ.3లోపే లభిస్తుంటే.. పాత పీపీఏల వల్ల యూనిట్‌కు గరిష్టంగా రూ.5.96 వరకు, పవన విద్యుత్‌కు రూ.4.84 చొప్పున చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీదైన పవర్‌కు యూపీ కత్తెర ఉత్తరప్రదేశ్ నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం (యూపీఎన్‌ఈడీఏ) తుదిదశకు చేరిన సోలార్ విద్యుత్ టెండర్లను ఈ నెల 2వ తేదీన రద్దుచేసింది. దీనికి కారణాలను కూడా బిడ్డింగ్ సంస్థలకు చెప్పలేదు. ఈ సంస్థ గతేడాది ఫిబ్రవరిలో 500 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచింది. మొత్తం 4 సంస్థలు యూనిట్ రూ.2.69 ధరకు విద్యుత్ అందించేందుకు రావడంతో ఎల్–1గా ప్రకటించారు. ఇదే సమయంలో సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) గుజరాత్లో గరిష్టంగా యూనిట్ రూ.1.99, రాజస్థాన్‌లో యూనిట్ రూ. 2కు ఇవ్వడానికి ఒప్పందాలు చేసుకుంది. ఇతర రాష్ట్రాల్లో తక్కువగా విద్యుత్ వస్తున్న కారణంగా ఉత్తరప్రదేశ్ తాజా చర్యలు చేపట్టింది. ఏపీని ఆదర్శంగా తీసుకున్న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం.. ఎక్కువ ధర చెల్లించే పాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ఏడాదే రద్దు చేసింది. ఈ పీపీఏల్లో పెద్ద ప్రైవేటు కంపెనీలు కూడా ఉన్నాయి. -
ప్రజాధనానికి పంగ‘నామా’లు
-
రూ.21 వేల కోట్ల ప్రజాధనానికి పంగ‘నామా’లు
సాక్షి, అమరావతి: మరో ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. సింహపురి విద్యుత్ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు అనుమతించింది. ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుది కావడం విశేషం. అందుకే మార్కెట్లో ఎక్కడా లేని విధంగా యూనిట్‌కు రూ.4.80 చొప్పున చెల్లించేందుకుప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు ఏకంగా 12 ఏళ్ల కాలపరిమితితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్)పై దాదాపు రూ.21 వేల కోట్ల అదనపు భారం పడనుంది. సింహపురి సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని డిస్కమ్‌లు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రంలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, ఇంకా కొనాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ రంగ నిపుణులు విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ముందు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఏపీఈఆర్సీ హడావుడిగా గురువారం హైదరాబాద్‌లో ప్రజాభిప్రాయ సేకరణ తంతు ముగించింది. ఈ నెల 10వ తేదీన పీపీఏకు సంబంధించిన ఆదేశాలు ఇస్తామని ప్రకటించింది. సింహపురితో లాలూచీ రాష్ట్రంలో భారీగా పరిశ్రమలొస్తాయని, విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని డిస్కమ్‌లు అతిగా అంచనా వేశాయి. ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. ఇందులో భాగంగానే 2016 జనవరిలో 2,400 మెగావాట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచాయి. 400 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.4.35కు అందించేందుకు సింహపురి ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. అయితే, అప్పటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేటు పడిపోయింది. ఈ నేపథ్యంలో సింహపురికి అత్యధికంగా చెల్లించడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా సింహపురి విద్యుత్‌పై అభ్యంతరాలు తెలిపాయి. ఏపీఈఆర్సీ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో 2017 నవంబర్‌లో ప్రభుత్వం తరపున ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సింహపురి విద్యుత్‌పై పునరాలోచించుకుంటామని ఏపీఈఆర్సీకి లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం ముందుకు సాగలేదు. వారం రోజుల క్రితం ఉన్నట్టుండి ఇంధనశాఖ మనసు మార్చుకుంది. బిడ్డింగ్‌లో వచ్చిన సింహపురి విద్యుత్‌ను తీసుకోవాల్సిందేనంటూ కమిషన్‌కు లేఖ రాసింది. బిడ్డింగ్‌లో యూనిట్ రూ.4.35 ఉంటే... ఇప్పుడు యూనిట్ రూ.4.80 చొప్పున కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. దీంతో కమిషన్ గుట్టుచప్పుడు కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ ముగించి, ఆదేశాలివ్వడానికి సిద్ధపడింది. కొనుగోలు అవసరమా? రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ లభ్యత ఏడాదికి 67,948 మిలియన్ యూనిట్లుగా ఉంది. కానీ, డిమాండ్ ఏడాదికి 57,018 మిలియన్ యూనిట్లు మాత్రమే. అంటే ప్రస్తుతం 10 వేల మిలియన్ యూనిట్ల మేర మిగులు కరెంటు ఉంది. కాబట్టి 8,700 మిలియన్ యూనిట్ల మేర జెన్కో ఉత్పత్తిని నిలిపివేస్తామని, మిగిలిన కరెంటును బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని డిస్కమ్‌లు తెలిపాయి. కానీ, ఇంతవరకూ ఒక్క యూనిట్ కూడా బయట అమ్మలేదు. తక్కువ ధరకు లభించే ఏపీ జెన్కో కరెంటును నిలిపివేసి మరీ ప్రైవేటు విద్యుత్ కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. తాజాగా సింహపురి నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రోజూ 10 మిలియన్ యూనిట్ల మేర జెన్కో ఉత్పత్తికి బ్రేక్ పడుతుంది. సింహపురికి అత్యధికంగా చెల్లించడమే కాదు... ఏపీ జెన్కో విద్యుత్ ప్లాంట్లు ఉత్పత్తి ఆగిపోయి మరింత అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. లబ్ధి ఇలా.. సింహపురి విద్యుత్ సంస్థతో గతంలో డిస్కమ్‌లకు ఎలాంటి కొనుగోలు ఒప్పందాలు లేవు. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నప్పుడు కూడా ఈ సంస్థ ఎక్కువ ధరలకు బయటి మార్కెట్లో కరెంటును అమ్ముకుంది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు గణనీయంగా పడిపోయాయి. సింహపురి సంస్థ పూర్తిగా విదేశీ బొగ్గుతో నడుస్తుంది కాబట్టి ఉత్పత్తి వ్యయం ఎక్కువ. దీంతో ఆ సంస్థ విద్యుత్‌ను అమ్ముకోలేని పరిస్థితి ఉంది. సంస్థ యాజమాని రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహి తుడు కావడం వల్ల నేరుగా ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింహపురి సంస్థ నుంచి రోజుకు కనీసం 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుంది. యూనిట్ రూ.4.80 చొప్పున రోజుకు రూ.4.80 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.1,752 కోట్లు అవుతుంది. 12 ఏళ్ల ఒప్పందం కాబట్టి మొత్తం రూ.21,024 కోట్లు చెల్లించక తప్పదు. -
విద్యుత్ వినియోగదారులకు ట్రూ–అప్ షాక్!
రూ. 887 కోట్ల అదనపు భారం సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగ దారులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 2015–16 సంవత్సరంలో ఆమోదించిన దానికన్నా ఎక్కువైన ఖర్చు (ట్రూ–అప్)ను రాబట్టేందుకు డిస్కమ్‌లు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు ఇచ్చాయి. ఈ అదనపు భారం రూ.887 కోట్లు. 2017–18లో ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి రాబట్టేందుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. కమిషన్ దీనికి అనుమతిస్తే ఏప్రిల్ నుంచి పెరిగే కొత్త విద్యుత్ చార్జీల్లో దీన్ని కలుపుతారు. ఇప్పటికే రూ. 859 కోట్లను ప్రజల నుంచి రాబట్టేందుకు డిస్కమ్‌లు అనుమతి కోరాయి. విద్యుత్ నియంత్రణ మండలి సూచించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ప్రైవేటు విద్యుత్‌ను కొనడం వల్లే అదనంగా రూ. 887 కోట్ల భారం పడిందని డిస్కమ్‌లు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. 2015–16 సంవత్సరంలో 54,225 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. -
ప్రైవేటు విద్యుత్‌ను వదులుకోలేం
‘సాక్షి’ కథనంపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందన ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేయాల్సిందే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేస్తుండటం వల్ల గత రెండేళ్లుగా జెన్కో ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) భారీగా పడిపోయిందంటూ ‘సాక్షి’ మంగళవారం ‘ప్రైవేటు విద్యుత్‌పై అంత ప్రేమ ఎందుకో...అయ్యో పాపం జెన్కో’ పేరిట ప్రచురించిన కథనంపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. అవసరంలేదని ప్రైవేటు విద్యుత్‌ను వదులుకుంటే అవసరమైనప్పుడు దొరకదని స్పష్టం చేశారు. ఓసారి ఒప్పందం చేసుకున్నాక ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు ఆ మేరకు చెల్లించక తప్పదన్నారు. ‘‘పీక్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని జెన్కో ఉత్పత్తి పోగా మిగిలిన విద్యుత్‌ను ప్రైవేటు నుంచి కొనుగోలు చేస్తున్నాం. 15 శాతానికి మించి ప్రైవేటు విద్యుత్‌ను తగ్గించుకోలేం. మిగతాది జెన్‌కోయే తగ్గించుకోవాల్సి ఉంటుంది’’ అని మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలు చట్టం, ఒప్పందాల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నాయన్నారు. విద్యుత్ సంస్థలు ప్రజలకు నష్టం కలిగించే చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పీక్ విద్యుత్ డిమాండ్ 7,200 మెగావాట్లు ఉండగా వర్షాలు లేదా వాతావరణం చల్లబడటం వల్ల ఒక్కోసారి వెయ్యి నుంచి 2 వేల మెగావాట్ల డిమాండ్ పడిపోతోందన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఒప్పందం మేరకు 15 శాతం ప్రైవేటు విద్యుత్‌ను తగ్గించుకుంటున్నామన్నారు. మిగతాది జెన్‌కోయే విద్యుత్‌ను తగ్గించుకోవాల్సిందేనని...దీనివల్ల కనీసం జెన్కో ఇంధన ఖర్చులను తగ్గించుకోవచ్చన్నారు. జెన్కో పీఎల్ఎఫ్ చాలా తక్కువగా ఉందని..ప్రైవేటు విద్యుత్ కొనడం వల్ల ఏదో నష్టం జరుగుతోందని..ప్రజలపై భారం పడుతోందన్న సమాచారం సరికాదన్నారు. ప్రతిక్షణం ప్రతి రూపాయిని ఎలా మిగ ల్చాలి... ప్రజలకు ఎలా లాభం చేయాలి... విద్యుత్ సంస్థలు నష్టపోకుండా ఎలా చూసుకోవాలనే ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. శ్వేతపత్రం అవసరం లేదు... టీజేఏసీ డిమాండ్ చేస్తున్నట్లు విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్లపై కొత్తగా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం లేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వమే శ్వేతపత్రంలాగా పారదర్శకంగా ఉందన్నారు. నిర్వహణ లోపాలతో విద్యుత్‌కు అంతరాయం కలిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. హైదరాబాద్‌లో తరచూ విద్యుత్ అంతరాయాలు కలుగుతున్నాయన్న ఫిర్యాదులుతోనే సమీక్ష నిర్వహించానన్నారు. ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో పీక్ డిమాండ్ 7,200 మెగావాట్లుగా ఉందని...వర్షాకాలానికి వ్యవసాయ పనులు మొదలైతే అది 9,000 మెగావాట్లకు చేరుతుందన్నారు. కాగా, విద్యుత్ సౌధలో విలేకరుల ప్రవేశంపై ఆంక్షలు లేవని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇంటలిజెన్స్ హెచ్చరికల మేరకు ఎవరు వచ్చినా విచారించి లోపలకు అనుమతిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి కూడా పాల్గొన్నారు. -
తనిఖీలు తప్పవు
న్యూఢిల్లీ:కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తనిఖీలకు ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థలు సహకరించాల్సిందేనని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ నుద్దేశించి మాట్లాడారు. తమ ఆర్థిక లావాదేవీల తనిఖీని చేపట్టేందుకు వచ్చే కాగ్ అధికారులకు ప్రైవేట్ విద్యుత్ సరఫరా సంస్థలు సహకరించాలన్నారు. ‘నగరంలో విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ జరిగినప్పటినుంచి ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీలపై కాగ్ తనిఖీలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియకు సహకరించని కంపెనీల లెసైన్సులు రద్దు చేస్తామ’ని ఆయన హెచ్చరించారు. 2002లో ఢిల్లీ ప్రభుత్వం విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించిన విషయం తెలిసిందే. అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయబోమన్నారు. నగరంలో విద్యుత్ పంపిణీ చేస్తున్న మూడు ప్రైవేట్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై కాగ్ ఆడిట్‌కు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సర్కారు గత వారం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని ఆయా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో నవాబ్‌జంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కాగా, మీటర్లు వేగంగా తిరుగుతున్నాయన్న ఫిర్యాదులపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, త్వరలోనే దానిపై కూడా చర్యలు తీసుకుంటామని జంగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వాహనాలపై ఎర్రబుగ్గలు వాడరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే వారికి ప్రత్యేక రక్షణను తిరస్కరించింది. ‘ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అంతమొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే ఆందోళనతో వచ్చిన లోక్‌పాల్‌ను అమలుచే సేందుకు అధిక ప్రాధాన్యమిస్తాం..’ అని జంగ్ పేర్కొన్నారు. పజల దైనందిన జీవితాలను ప్రతిబింబించేలా పథకాల అమలుకు కేజ్రీవాల్ ప్రభుత్వం కృషిచేస్తుందని జంగ్ చెప్పారు. నగర అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల్లో లోపాలను సరిచేసుకోవడానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ నగర ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే, వాటి సత్వర పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తుందని పేర్కొన్నారు. మొహల్లాల స్థాయిలో అభివృద్ధి పనులను ఎంపిక చేసే విషయంలో స్థానికుల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. పనుల నాణ్యత, నిర్వహణలపై మొహల్లా సభల్లో నిర్ణయించిన మేరకే ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు ఏడాదిలోగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. దీంతో ఢిల్లీలో నివసించే 30 శాతానికిపైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మురికివాడల్లో నివసించే వారికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడంలోనూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా రక్షణకు ప్రత్యేక కోర్టులు నగరంలో మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎల్జీ నజీబ్ జంగ్ తెలిపారు. దీని నిమిత్తం ఆరు నెలల్లోగా కొత్త కోర్టులను ఏర్పాటుచేయడమేగాక, జడ్జిల నియామకాలను కూడా చేపడతామన్నారు. మహిళలు, బాలికల రక్షణ ప్రస్తుత ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్ అని ఆయన అన్నారు. ‘నగరంలో 50 శాతానికిపైగా ప్రజలు బహిరంగ స్థలాల్లో సంచరించడానికి భయపడుతున్నారు. ఇది ప్రభుత్వానికి చాలా అవమానకరం..’ అని ఆయన చెప్పారు. మహిళలు, బాలికలు ఎటువంటి వేధింపులకు గురికాకుండా ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. మహిళలపై వేధింపుల కేసులను మూడు నెలల కాలంలోనే పరిష్కరించేందుకు కొత్త కోర్టులు కృషిచేస్తాయన్నారు. ఇదిలా ఉండగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పాటుచేస్తామని ఆప్ తన ఎన్నికల హామీల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. దేశ రాజధానిలో 2012 డిసెంబర్ 16న జరిగిన ‘నిర్భయ’ కేసు తర్వాత పోలీసులు, ప్రభుత్వం మహిళా రక్షణకు పలు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా మానభంగ కేసుల్లో 20 రోజుల్లోనే చార్జిషీట్ తయారుచేయాలని నిర్ణయించింది. జన్‌లోక్‌పాల్‌కు ప్రాధాన్యం ఢిల్లీ ప్రభుత్వం జన్‌లోక్‌పాల్‌కు ప్రాధాన్యమివ్వాలని నజీబ్ జంగ్ కోరారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలన్నారు. ‘మార్పుకు ఢిల్లీ ప్రజలు ఓటువేశారు..’ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నూతన ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం, ప్రజల మధ్య అవగాహనను పెంపొందించేందుకు జన్‌లోక్‌పాల్‌కు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్రహోదా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలసి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. స్కూళ్లలో డొనేషన్లను రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్ల కన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతామని, మరో 500 కొత్త స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించనుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.