ప్రైవేటు విద్యుత్‌ను వదులుకోలేం
ప్రైవేటు విద్యుత్‌ను వదులుకోలేం
Published Wed, Apr 20 2016 3:14 AM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM
‘సాక్షి’ కథనంపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందన
ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేస్తుండటం వల్ల గత రెండేళ్లుగా జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్‌ఎఫ్) భారీగా పడిపోయిందంటూ ‘సాక్షి’ మంగళవారం ‘ప్రైవేటు విద్యుత్‌పై అంత ప్రేమ ఎందుకో...అయ్యో పాపం జెన్‌కో’ పేరిట ప్రచురించిన కథనంపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. అవసరంలేదని ప్రైవేటు విద్యుత్‌ను వదులుకుంటే అవసరమైనప్పుడు దొరకదని స్పష్టం చేశారు. ఓసారి ఒప్పందం చేసుకున్నాక ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు ఆ మేరకు చెల్లించక తప్పదన్నారు. ‘‘పీక్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని జెన్‌కో ఉత్పత్తి పోగా మిగిలిన విద్యుత్‌ను ప్రైవేటు నుంచి కొనుగోలు చేస్తున్నాం. 15 శాతానికి మించి ప్రైవేటు విద్యుత్‌ను తగ్గించుకోలేం. మిగతాది జెన్‌కోయే తగ్గించుకోవాల్సి ఉంటుంది’’ అని మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు చట్టం, ఒప్పందాల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నాయన్నారు.
విద్యుత్ సంస్థలు ప్రజలకు నష్టం కలిగించే చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పీక్ విద్యుత్ డిమాండ్ 7,200 మెగావాట్లు ఉండగా వర్షాలు లేదా వాతావరణం చల్లబడటం వల్ల ఒక్కోసారి వెయ్యి నుంచి 2 వేల మెగావాట్ల డిమాండ్ పడిపోతోందన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఒప్పందం మేరకు 15 శాతం ప్రైవేటు విద్యుత్‌ను తగ్గించుకుంటున్నామన్నారు. మిగతాది జెన్‌కోయే విద్యుత్‌ను తగ్గించుకోవాల్సిందేనని...దీనివల్ల కనీసం జెన్‌కో ఇంధన ఖర్చులను తగ్గించుకోవచ్చన్నారు. జెన్‌కో పీఎల్‌ఎఫ్ చాలా తక్కువగా ఉందని..ప్రైవేటు విద్యుత్ కొనడం వల్ల ఏదో నష్టం జరుగుతోందని..ప్రజలపై భారం పడుతోందన్న సమాచారం సరికాదన్నారు. ప్రతిక్షణం ప్రతి రూపాయిని ఎలా మిగ ల్చాలి... ప్రజలకు ఎలా లాభం చేయాలి... విద్యుత్ సంస్థలు నష్టపోకుండా ఎలా చూసుకోవాలనే ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.
శ్వేతపత్రం అవసరం లేదు...
టీజేఏసీ డిమాండ్ చేస్తున్నట్లు విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్లపై కొత్తగా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం లేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వమే శ్వేతపత్రంలాగా పారదర్శకంగా ఉందన్నారు. నిర్వహణ లోపాలతో విద్యుత్‌కు అంతరాయం కలిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. హైదరాబాద్‌లో తరచూ విద్యుత్ అంతరాయాలు కలుగుతున్నాయన్న ఫిర్యాదులుతోనే సమీక్ష నిర్వహించానన్నారు.
ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో పీక్ డిమాండ్ 7,200 మెగావాట్లుగా ఉందని...వర్షాకాలానికి వ్యవసాయ పనులు మొదలైతే అది 9,000 మెగావాట్లకు చేరుతుందన్నారు. కాగా, విద్యుత్ సౌధలో విలేకరుల ప్రవేశంపై ఆంక్షలు లేవని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇంటలిజెన్స్ హెచ్చరికల మేరకు ఎవరు వచ్చినా విచారించి లోపలకు అనుమతిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి కూడా పాల్గొన్నారు.
Advertisement