సీఎం రేవంత్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇస్తున్న ఎమ్మెల్సీలు కోదండరాం, ఆమేర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామారెడ్డి (కోదండరాం), ఆమేర్ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గతంలో నియమితులైన డి.రాజేశ్వర్‌రావు, ఫారూక్ హుస్సేన్‌ల పదవీకాలం 2023 ఏప్రిల్ 27తో ముగిసిపోగా, అప్పటి నుంచి ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలని ప్రతిపాదించగా, నిబంధనల ప్రకారం వీరికి అర్హతలు లేవని గవర్నర్ తమిళిసై అప్పట్లో తిరస్కరించారు.
ఈ అభ్యర్థులిద్దరూ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామారెడ్డి, ఆమేర్ అలీఖాన్‌ల పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై సత్వరమే ఆమోదించారు. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇక ఆమేర్ అలీఖాన్ ఉర్దూ దినపత్రిక సియాసత్‌కి న్యూస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment