కోదండరాంకు కీలక పదవి! | Chances To Congress Party Give Key Position To Kodandaram | Sakshi
Sakshi News home page

కోదండరాంకు కీలక పదవి!

Published Tue, Dec 26 2023 12:53 AM | Last Updated on Tue, Dec 26 2023 12:53 AM

Chances To Congress Party Give Key Position To Kodandaram - Sakshi

సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టితో సమావేశమైన కోదండరాం తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ జేఏసీ చైర్మన్‌ హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్‌ కోదండరాం సేవలను కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్‌ అధ్యక్షుడి హోదాలో ఆయన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సోమవారం సచివాలయంలో భేటీ కావడంతో ఈ చర్చ ఊపందుకుంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ఇస్తారని, లేదంటే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కూడా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి దానికి వైస్‌చైర్మన్‌గా కోదండరాంను నియమించే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వస్తున్నాయి.  

బేషరతుగా మద్దతు... 
వాస్తవానికి తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) ఏర్పాటు తర్వాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కోదండరాం కాంగ్రెస్‌ పార్టీ పక్షాన నిలబడ్డారు. 2018 ఎన్నికల్లో పార్టీ తరఫున కొన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 2023లో ఒక్క అసెంబ్లీ స్థానం కోసం కూడా డిమాండ్‌ చేయకుండా బేషరతుగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. ఆ సమయంలోనే కోదండరాంకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తగిన హోదా కలి్పస్తామని, తెలంగాణ అమరవీరుల సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత ఆయనకు అప్పగిస్తామని కాంగ్రెస్‌ వర్గాలు హామీ ఇచ్చాయి. 

మర్యాద పూర్వకమేనని చెబుతున్నా... 
టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎం. నర్సయ్య సోమవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సచివాలయంలో కలిశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి భట్టిని కలిసి అభినందనలు తెలిపారు. భేటీలో భాగంగా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు, వాటిపై ప్రజల అభిప్రాయం, వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ప్రాధాన్యాలపై భట్టితో టీజేఎస్‌ బృందం చర్చించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement