మరో ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. సింహపురి విద్యుత్ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు అనుమతించింది. ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుది కావడం విశేషం. అందుకే మార్కెట్‌లో ఎక్కడా లేని విధంగా యూనిట్‌కు రూ.4.80 చొప్పున చెల్లించేందుకుప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు ఏకంగా 12 ఏళ్ల కాలపరిమితితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్)పై దాదాపు రూ.21 వేల కోట్ల అదనపు భారం పడనుంది.