DISCAM
-
‘డిస్కం’ల ఆధునికీకరణకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగం సుస్థిరతను సాధించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆధునికీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మూడేళ్లలో డిస్కంలను ఆదుకునేందుకు ప్రభుత్వం దాదాపు రూ.48,882 కోట్లు ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు. విద్యుత్ సంస్థలను బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని మంత్రి అన్నారు. రైతులకు 9 గంటలు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించడంతోపాటు వినియోగదారులకు ప్రపంచ ప్రమాణాలతో నిరంతర సరఫరాను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన స్థాపిత ఇంధన సామర్థ్యంలో 42 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సాధించిందని తెలిపారు. ఇటీవల 6,500 మెగావాట్ల సోలార్, 2,050 మెగావాట్ల పవన, 10,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను ప్రైవేట్ డెవలపర్లకు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, జేఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి, డిస్కంల సీఎండీలు జె పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు పాల్గొన్నారు. -
‘టెలిస్కోపిక్’తో తక్కువ బిల్లులు
సాక్షి, అమరావతి: టెలిస్కోపిక్ బిల్లింగ్ ద్వారా తక్కువ భారం పడుతుందని గృహ విద్యుత్ వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ విద్యుత్ సంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ఆదివారం ఆయన వెబినార్ ద్వారా సమీక్షించారు. ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డిస్కమ్‌ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మాజనార్దన్ రెడ్డి, కె.సంతోష్ రావు, డైరెక్టర్లు ఏవీకే భాస్కర్, కె.ముథుపాండియన్, జి.చంద్రశేఖరరాజు ఇందులో పాల్గొన్నారు. టెలిస్కోపిక్ బిల్లింగ్‌కు సంబంధించిన వివరాలతో కరపత్రాలను విద్యుత్తు బిల్లులతో వినియోగదారులకు అందజేయాలని ఇంధన శాఖ కార్యదర్శి సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. నూతన టెలిస్కోపిక్ విధానంతో వినియోగదారులకు మేలు జరుగుతుంది. దీనివల్ల మొత్తం వినియోగానికి ఒకే స్లాబ్‌లో బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్లు వాడితే తొలి 30 యూనిట్లకు యూనిట్ రూ.1.90 చొప్పున, తర్వాత 45 యూనిట్లకు యూనిట్ రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్ రూ.4.50, అనంతరం 100 యూనిట్లకు యూనిట్ రూ.6, చివరి 25 యూనిట్లకు యూనిట్ రూ.8.75 చొప్పున బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా ప్రక్రియను బలోపేతం చేసేందుకు ఏపీఈఆర్సీ కొత్త విద్యుత్తు టారిఫ్ ప్రకటించింది. 1.91 కోట్ల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంలో డిస్కమ్‌లకు ఊరట కల్పించేలా కొత్త టారిఫ్ ఉంది. రాష్ట్రంలో 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడే వారికి యూనిట్ రూ.3.11 చార్జీ పడుతుంది. ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కర్ణాటక, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో 100 యూనిట్లలోపు వాడే వినియోగదారులు యూనిట్ రూ.8.26, రూ.8.33, రూ.7.74, రూ.7.20, రూ.6.19, రూ.6.61, రూ.6.10 చొప్పున చెల్లిస్తున్నారు. రాష్ట్రంలోని 1.50 కోట్ల మంది గృహ వినియోగదారుల్లో 1.44 కోట్ల (95%) మంది 225 యూనిట్లలోపు వినియోగించే కేటగిరీలోనే ఉన్నారు. 225 యూనిట్లలోపు వినియోగించే వారి నుంచి డిస్కంలు సగటు ధర కంటే తక్కువగానే చార్జీలు వసూలు చేస్తున్నాయి. మూడు డిస్కంలకు మొత్తం సర్వీసు చార్జీ రూ.6.82 నుంచి రూ.6.98కి పెరిగినా వినియోగదారుల నుంచి తక్కువగానే వసూలు చేస్తున్నాం. జిల్లాల విభజన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పట్టణీకరణతో విద్యుత్తు డిమాండ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: పోలీస్ ఉద్యోగాల కోసం... యువతకు ఉచిత శిక్షణ) -
ప్రైవేటు చేతుల్లోకి విద్యుత్ పంపిణీ రంగం!
సాక్షి, హైదరాబాద్: ‘టెలికం రంగం తరహాలో విద్యుత్ పంపిణీ రంగాన్ని డీ లైసెన్స్డ్ చేస్తున్నాం. ప్రస్తుతమున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అలాగే ఉంటాయి. విద్యుత్ పంపిణీ వ్యవస్థ (వైర్లు) నిర్వహణ డిస్కంల పరిధిలోనే ఉంటుంది. డిస్కంలకు పోటీగా ఎవరైనా ప్రైవేటు ఆపరేటర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకోవచ్చు. వీళ్లు ఎవరి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసి ఎవరికైనా అమ్ముకోవచ్చు. డిస్కంల వైర్లను వాడుకుని తమ వినియోగదారులకు విద్యుత్ అమ్ముకుంటారు. దీంతో విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కంల గుత్తాధిపత్యం కనుమరుగవుతుంది..’అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు–2020పై బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల విద్యుత్ శాఖ కార్యదర్శులు, విద్యుత్ సంస్థల సీఎండీలతో మాట్లాడారు. ‘ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడి వినియోగదారులకు డిస్కంలు విద్యుత్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎవరు తక్కువ ధరకు అమ్మితే వినియోగదారులు వారి వద్ద విద్యుత్ కొంటారు. పోటీతో వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుంది..’అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ‘ఇకపై డిస్కంలు రెండు రకాల వ్యాపారాలు చేయాలి. వినియోగదారులకు విద్యుత్‌ను అమ్ముకోవడంతో పాటు ప్రైవేటు ఆపరేటర్లతో వైర్ల వ్యాపారం చేయాలి. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే వినియోగదారులపై డిస్కంలు విధించే వీలింగ్ చార్జీలు.. తమ సొంత వినియోగదారులతో సమానంగా ఉండాలి. వివక్షకు ఆస్కారం ఉండదు. ఫలాన వారికి వైర్లు ఇవ్వబోమని డిస్కంలు చెప్పడానికి వీల్లేదు..’అని ఆర్కే తెలిపారు. క్రాస్ సబ్సిడీ కోసం సెంట్రల్ ఫండ్.. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే తదితర కేటగిరీల వినియోగదారులపై అధిక విద్యుత్ చార్జీలు విధించి, వ్యవసాయం, గృహ వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్‌ను డిస్కంలు పంపిణీ చేస్తున్నాయి. దీనిని క్రాస్ సబ్సిడీ అంటారు. విద్యుత్ టారీఫ్‌లో క్రాస్ సబ్సిడీని కొనసాగించడానికి ‘యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్’పేరుతో ప్రత్యేక ఫండ్ పెట్టనున్నామని ఆర్కే సింగ్ తెలిపారు. అదనంగా వసూలు చేసే మొత్తాన్ని ఈ ఫండ్‌లో జమా చేసి సబ్సిడీ వినియోగదారులకు ఇస్తామన్నారు. ఈ ఫండ్ కేంద్రం పరిధిలో ఉంటుందని వెల్లడించారు. అదనపు చార్జీలు వచ్చే ప్రాంతంలోని ఆపరేటర్లకు లాభాలు, సబ్సిడీ వినియోగదారులున్న ప్రాంతాల్లోని ఆపరేటర్లకు నష్టాలు రావచ్చు. లాభాల్లో ఉన్న ఆపరేటర్ నుంచి అదనపు చార్జీలను ఈ ఫండ్‌లో జమ చేసి నష్టాల్లో ఉండే ఆపరేటర్లకు బదిలీ చేస్తామని ఆయన వివరించారు. లాభాలు వచ్చే ప్రాంతాలను ఆపరేటర్లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉండదని, జిల్లాల వారీగా వారికి కేటాయింపులు చేస్తామని ఆయన తెలిపినట్టు సమాచారం. పీపీఏలన్నీ పంచుకోవాలి.. ‘ప్రస్తుతం డిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందా (పీపీఏ) లను తమ వద్దే పెట్టుకోవాలంటే అన్నింటిని పెట్టుకోవాలి. లేకుంటే ప్రైవేటు ఆపరేటర్లతో అన్నింటిని పంచుకోవాలి. అధిక విద్యుత్ ధరలు కలిగిన పీపీఏలను ప్రైవేటు ఆపరేటర్లకు వదులుకుని తక్కువ ధరలు కలిగిన వాటిని తమ వద్దే పెట్టుకుంటామంటే కుదరదు.. డిస్కంలు పీపీఏలను పంచుకోవడానికి ముందుకురాకుంటే ప్రైవేటు ఆపరేటర్లు కొత్త పీపీఏలు చేసుకుంటారు..’అని ఆర్కే సింగ్ వెల్లడించారు. ప్రైవేటు గుత్తాధిపత్యానికి నో చాన్స్.. భవిష్యత్తులో ప్రైవేటు ఆపరేటర్లందరినీ ఓ ప్రైవేటు కంపెనీ కొనేసి ప్రైవేటు గుత్తాధిపత్యానికి తెరతీయడానికి అవకాశం ఇవ్వకుండా విద్యుత్ బిల్లులో ఏమైనా రక్షణ కల్పిస్తారా? అని రాష్ట్రాల అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఎవరు తక్కువ ధరకు విద్యుత్ అమ్మితే వినియోగదారులు వారి వద్ద కొంటారని, ప్రైవేటు గుత్తాధిపత్యానికి అవకాశం ఉండదని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది. వినియోగదారులు తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీకి మారితే వారికి అదే మీటర్ కొనసాగిస్తారా? విద్యుత్ చౌర్యానికి ఎవరు బాధ్యులు? కేసులెవరు పెట్టాలి? మీటర్ రీడింగ్ ఎవరు తీస్తారు? మీటర్లను ఎవరు నిర్వహిస్తారు? అన్న అంశాలపై పరిశీలన చేస్తామని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (అప్టెల్) ప్రాంతీయ బెంచ్‌ను దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలు కోరాయి. మరి ఉద్యోగుల పరిస్థితేంటి?: ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ విద్యుత్ సవరణ బిల్లు–2020ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం చేసిన తీర్మానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ డిస్కంలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారని, ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతిస్తే వారి గతేంటని ఆయన కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ప్రస్తుతం మీటర్ రీడింగ్ నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం వరకు అన్ని పనులు ప్రైవేటు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చేస్తున్నారని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. ప్రైవేటు ఆపరేటర్లతో విద్యుత్ ఉద్యోగులపై ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రైవేటు ఆపరేటర్లతో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ప్రస్తుత ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అక్కడికి వెళ్తారని ఆయన చెప్పినట్టు సమాచారం. తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు నిబంధన ఆచరణలో తెలంగాణకు సాధ్యం కాదని, ఈ విషయంలో జరిమానా విధించాలన్న యోచనను వెనక్కి తీసుకోవాలని ప్రభాకర్‌రావు కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ను కోరారు. ఈ విషయంపై పరిశీలన చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
ప్రజాధనానికి పంగ‘నామా’లు
-
రూ.21 వేల కోట్ల ప్రజాధనానికి పంగ‘నామా’లు
సాక్షి, అమరావతి: మరో ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. సింహపురి విద్యుత్ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు అనుమతించింది. ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుది కావడం విశేషం. అందుకే మార్కెట్లో ఎక్కడా లేని విధంగా యూనిట్‌కు రూ.4.80 చొప్పున చెల్లించేందుకుప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు ఏకంగా 12 ఏళ్ల కాలపరిమితితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్)పై దాదాపు రూ.21 వేల కోట్ల అదనపు భారం పడనుంది. సింహపురి సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని డిస్కమ్‌లు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రంలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, ఇంకా కొనాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ రంగ నిపుణులు విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ముందు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఏపీఈఆర్సీ హడావుడిగా గురువారం హైదరాబాద్‌లో ప్రజాభిప్రాయ సేకరణ తంతు ముగించింది. ఈ నెల 10వ తేదీన పీపీఏకు సంబంధించిన ఆదేశాలు ఇస్తామని ప్రకటించింది. సింహపురితో లాలూచీ రాష్ట్రంలో భారీగా పరిశ్రమలొస్తాయని, విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని డిస్కమ్‌లు అతిగా అంచనా వేశాయి. ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. ఇందులో భాగంగానే 2016 జనవరిలో 2,400 మెగావాట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచాయి. 400 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.4.35కు అందించేందుకు సింహపురి ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. అయితే, అప్పటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేటు పడిపోయింది. ఈ నేపథ్యంలో సింహపురికి అత్యధికంగా చెల్లించడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా సింహపురి విద్యుత్‌పై అభ్యంతరాలు తెలిపాయి. ఏపీఈఆర్సీ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో 2017 నవంబర్‌లో ప్రభుత్వం తరపున ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సింహపురి విద్యుత్‌పై పునరాలోచించుకుంటామని ఏపీఈఆర్సీకి లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం ముందుకు సాగలేదు. వారం రోజుల క్రితం ఉన్నట్టుండి ఇంధనశాఖ మనసు మార్చుకుంది. బిడ్డింగ్‌లో వచ్చిన సింహపురి విద్యుత్‌ను తీసుకోవాల్సిందేనంటూ కమిషన్‌కు లేఖ రాసింది. బిడ్డింగ్‌లో యూనిట్ రూ.4.35 ఉంటే... ఇప్పుడు యూనిట్ రూ.4.80 చొప్పున కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. దీంతో కమిషన్ గుట్టుచప్పుడు కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ ముగించి, ఆదేశాలివ్వడానికి సిద్ధపడింది. కొనుగోలు అవసరమా? రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ లభ్యత ఏడాదికి 67,948 మిలియన్ యూనిట్లుగా ఉంది. కానీ, డిమాండ్ ఏడాదికి 57,018 మిలియన్ యూనిట్లు మాత్రమే. అంటే ప్రస్తుతం 10 వేల మిలియన్ యూనిట్ల మేర మిగులు కరెంటు ఉంది. కాబట్టి 8,700 మిలియన్ యూనిట్ల మేర జెన్కో ఉత్పత్తిని నిలిపివేస్తామని, మిగిలిన కరెంటును బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని డిస్కమ్‌లు తెలిపాయి. కానీ, ఇంతవరకూ ఒక్క యూనిట్ కూడా బయట అమ్మలేదు. తక్కువ ధరకు లభించే ఏపీ జెన్కో కరెంటును నిలిపివేసి మరీ ప్రైవేటు విద్యుత్ కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. తాజాగా సింహపురి నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రోజూ 10 మిలియన్ యూనిట్ల మేర జెన్కో ఉత్పత్తికి బ్రేక్ పడుతుంది. సింహపురికి అత్యధికంగా చెల్లించడమే కాదు... ఏపీ జెన్కో విద్యుత్ ప్లాంట్లు ఉత్పత్తి ఆగిపోయి మరింత అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. లబ్ధి ఇలా.. సింహపురి విద్యుత్ సంస్థతో గతంలో డిస్కమ్‌లకు ఎలాంటి కొనుగోలు ఒప్పందాలు లేవు. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నప్పుడు కూడా ఈ సంస్థ ఎక్కువ ధరలకు బయటి మార్కెట్లో కరెంటును అమ్ముకుంది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు గణనీయంగా పడిపోయాయి. సింహపురి సంస్థ పూర్తిగా విదేశీ బొగ్గుతో నడుస్తుంది కాబట్టి ఉత్పత్తి వ్యయం ఎక్కువ. దీంతో ఆ సంస్థ విద్యుత్‌ను అమ్ముకోలేని పరిస్థితి ఉంది. సంస్థ యాజమాని రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహి తుడు కావడం వల్ల నేరుగా ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింహపురి సంస్థ నుంచి రోజుకు కనీసం 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుంది. యూనిట్ రూ.4.80 చొప్పున రోజుకు రూ.4.80 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.1,752 కోట్లు అవుతుంది. 12 ఏళ్ల ఒప్పందం కాబట్టి మొత్తం రూ.21,024 కోట్లు చెల్లించక తప్పదు. -
తుది నిర్ణయం తెలంగాణ ఈఆర్సీదే!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి తమ సంస్థలు కొనుగోలు చేసే విద్యుత్ ధరలపై తుది నిర్ణయం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)దేనని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) స్పష్టం చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయం పెరుగుదలపై ఆ రాష్ట్ర ఈఆర్సీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా సవరించే కొనుగో లు ఒప్పందాన్ని మళ్లీ తెలంగాణ ఈఆర్సీ ఆమోదించాల్సి ఉం టుందన్నాయి. మార్వా విద్యుత్ ప్లాంటు పెట్టుబడి వ్యయం పెరగడంతో.. ఆ మేర విద్యుత్ ధర పెంచాలంటూ ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆ రాష్ట్ర ఈఆర్సీ విచారణ నిర్వహించింది. మార్వా ప్లాంటు విద్యుత్ ధరను ఆ రాష్ట్ర ఈఆర్సీ పెంచితే.. దాని నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్న తెలంగాణపై తీవ్ర భారం పడుతుంది. దీంతో తెలంగాణ డిస్కంల అధికారులు.. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ విచారణకు హాజరై రాష్ట్రం తరఫున వాదనలు వినిపించారు. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) నిర్దేశించిన అన్నిరకాల పరిమితులకు మించి మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయం, నిర్మాణ వ్యవధి పెరిగాయని.. దీంతో విద్యుత్ ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ప్లాంటు నిర్మాణానికి మెగావాట్‌కు రూ.6.32 కోట్ల వ్యయంతో అనుమతించారని.. కానీ నిర్మాణంలో జాప్యం, వడ్డీలు పెరగడం తో ఈ వ్యయం మెగావాట్‌కు రూ.9.2 కోట్లకు చేరిందన్నారు. గతంలో అనేక విద్యుత్ కేంద్రాల పెట్టుబడి వ్యయాన్ని.. ఆయా రాష్ట్రాల ఈఆర్సీలు, సీఈఆర్సీ తగ్గించి ఆమోదించాయని ఉదాహరణలతో వివరించారు. అందువల్ల మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయాన్ని పునఃసమీక్షించి.. తగ్గించాకే ఆమోదించాలని కోరారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పెరిగిన వ్యయాన్ని ఆమోదిస్తే మోతే! ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ ప్లాంటు నుంచి 12 ఏళ్లపాటు 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2015లో దీర్ఘకాలిక ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ తాత్కాలికంగా నిర్ణయించిన మేరకు యూనిట్‌కు రూ.3.90 లెక్కన గతేడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా జరుగుతోంది. అయితే రూ.8,999 కోట్ల మేర పెరిగిన ప్లాంటు నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని యూనిట్‌కు రూ.4.47కు ధర పెంచాలని ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర ఈఆర్సీని కోరింది. దీంతోపాటు తొలినుంచి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి ట్రూప్ చార్జీల (ప్రస్తుతం నిర్ణయించనున్న ధరకు, తాత్కాలిక ధరకు మధ్య తేడా సొమ్ము)ను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరింది. దీనిని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదిస్తే.. ట్రూప్ చార్జీల కింద రూ.788 కోట్లు చెల్లించాల్సి రావడంతోపాటు విద్యుత్ ధర కూడా భారంగా మారుతుంది. బలంగా వాదనలు వినిపించాం ‘‘మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయం పెంపును ఆమోదించవద్దని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ముందు బలంగా వాదనలు వినిపించాం. ధరలు పెంచే అవకాశం లేదు. ఒకవేళ ధర పెంచితే అప్పిలేట్ ట్రిబ్యునల్, సీఈఆర్సీల్లో సవాలు చేస్తాం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునః సమీక్షించే ఆలోచన లేదు..’’– డి.ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో సీఎండీ -
ఉత్త పుణ్యానికి రూ.957 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కొనుగోలు చేయని విద్యుత్‌కు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అక్షరాల రూ.957.45 కోట్ల చార్జీలు చెల్లిం చాయి. రాష్ట్ర అవసరాలకు కావాల్సిన విద్యుత్ సమీకరణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న డిస్కంలు.. అంచనాలు తలకిందులవడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాయి. అంచనాలకు తగ్గట్లు డిమాండ్ లేక 2016–17లో 4,910 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను బ్యాకింగ్ డౌన్ చేయించాయి. ఒక్కో యూనిట్‌కు రూ.1.95 చొప్పున ఆ 4,910 ఎంయూలకు రూ.957.45 కోట్ల స్థిర చార్జీలు విద్యుదుత్పత్తి కంపెనీలకు చెల్లించాయి. కొనకపోయినా ఎందుకంటే.. రాష్ట్ర విద్యుత్ అవసరాలను అంచనా వేసి ఆ మేరకు విద్యుత్ సమీకరించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలతో డిస్కం లు ముందస్తుగా కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లు చేసుకున్నాయి. దీంతో విద్యుత్ కొనుగోలు చేయకపోయినా ఉత్పత్తి కంపెనీలకు విద్యుత్ స్థిర చార్జీలు లేక జరిమానా డిస్కంలు చెల్లించాలి. ప్లాంట్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన విద్యుదుత్పత్తి కంపెనీలు.. నిరంతరంగా ఉత్పత్తి చేసి అమ్మకాలు సాగిస్తేనే మనుగడలో ఉంటాయి. డిమాండ్ లేనపుడు ఉత్పత్తి తగ్గించాల్సి వస్తే కంపెనీలు నష్టపోకుండా తగ్గించిన విద్యుత్‌కు స్థిర చార్జీలు లేదా జరిమానా చెల్లించాలని ఒప్పందాల్లో పొందుç ³రుస్తారు. ఇలా డిమాండ్ లేనప్పుడు ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించుకోవడం లేదా నిలుపుదల చేయడాన్ని బ్యాకింగ్ డౌన్ అంటారు. కొంప ముంచిన ఓపెన్ యాక్సెస్.. రాష్ట్రంలోని భారీ పరిశ్రమలు, రైల్వేలు, వాణిజ్య సంస్థలు, ఇతర వినియోగదారులు 2016–17లో ఓపెన్ యాక్సెస్ ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి 2,134 ఎంయూల విద్యుత్ కొనడం డిస్కంల కొంపముంచింది. విద్యుత్ చట్టం–2003లోని వెసులుబాటును ఉపయోగించుకుని డిస్కంలను కాదని బహిరంగ మార్కెట్ నుంచి తక్కువ ధరకు వినియోగదారులు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు పతనమవడంతో 2015–16లో 902 ఎంయూలు ఉన్న ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లు 2016–17 వచ్చేసరికి 2,134 ఎంయూలకు పెరిగాయి. ఓవైపు నిరంతర విద్యుత్ సరఫరాకు డిస్కంలు పెద్ద మొత్తంలో విద్యుత్ సమీకరించగా.. కొందరు వినియోగదారులు ఓపెన్ యాక్సెస్‌కు వెళ్లడం, అంచనాలకు తగ్గట్లు డిమాండ్ లేకపోవడంతో 4,910 ఎంయూల విద్యుత్ బ్యాకింగ్ డౌన్ చేసుకొని నష్టపోవాల్సి వచ్చింది. నిరంతర విద్యుత్ సరఫరా కోసమే: డిస్కంలు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ముందస్తు ప్రణాళికలతో విద్యుత్ సమీకరించామని ఈఆర్సీకి డిస్కంలు వివరణ ఇచ్చాయి. 2015–16లో రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,849 ఎంయూలు కాగా, 2016–17లో 9,191 ఎంయూలకు పెరిగిందన్నాయి. ముందస్తు ప్రణాళికల వల్లే డిమాండ్ పెరిగినా సరఫరా కొనసాగించామని సమర్థించుకున్నాయి. -
ముగిసిన విద్యుత్ ఉద్యోగుల క్రీడలు
కబడ్డీ విజేత నల్లగొండ జట్టు ద్వితీయ స్థానంలో వరంగల్ వరంగల్ స్పోర్ట్స్ : హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ కబడ్డీ, క్యారమ్ టోర్నమెంట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కౌన్సిల్ ఆపరేషన్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆదివారం ముగిశా యి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ వి.వెంకటేశ్వర్రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయని చెప్పారు. విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు మానసిక ప్రశాంతత కల్పించేందుకే క్రీడలు నిర్వహించామన్నారు. వరంగల్ వేదికగా పది జిల్లాల విద్యుత్ ఉద్యోగులు ఒకే చోట క్రీడలకు హాజరుకావడం సంతోషంగా ఉందని తెలిపారు. 300 మంది క్రీడాకారులు హాజరు హన్మకొండ జేఎన్ఎస్లో జరిగిన పోటీలకు తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సుమారు మూడు వందల మంది హాజరయ్యారు. కబడ్డీ పోటీల్లో నల్లగొండ జట్టు ప్రథమ బహుమతి సాధించగా.. వరంగల్ జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. ఖమ్మం జట్టు తృతీయ బహుమతి పొందింది. క్యారమ్స్‌లో విద్యుత్ సౌధ (హైదరాబాద్) ప్రథమ బహుమతి సాధించగా, ద్వితీయ స్థానంలో కరీంనగర్, తృతీయ స్థానంలో వరంగల్ క్రీడాకారులు బహుమతులను అందుకున్నారు. అనంతరం విజేతలకు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ వి.వెంకటేశ్వర్రావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎస్ఈ శివరాం, డీఈ శ్రీకాంత్, ఏడీఈ కుమారస్వామి, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ కేవీ.జాన్సన్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, పబ్లిసిటీ ఇన్చార్జి రౌతు రమేష్, గులాం రబ్బానీ, రాజిరెడ్డి, కుమారస్వామితో పాటు వివిధ జిల్లాల డీఈలు, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్లు ఖాళీ
ఎన్పీడీసీఎల్లో ఖాళీల సమస్య ఇప్పటికే రెండు పోస్టులు ఖాళీ రేపటితో మరో డైరెక్టరు పోస్టు ఏడాదిగా పట్టించుకోని ప్రభుత్వం విద్యుత్ పంపిణీ వ్యవస్థపై ప్రభావం కంపెనీలో లోపించిన పరిపాలన సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి(టీఎస్ఎన్పీడీసీఎల్)లో ఉన్నత స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త విధానాల అమలు, ప్రణాళిక రూపకల్పనపై ఈ ప్రభావం చూపుతోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను టీఎస్ ఎన్పీడీసీఎల్ నిర్వహిస్తోంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 5,612 గ్రామాలు ఉన్నాయి. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఎన్పీడీసీఎల్లో చైర్మన్‌తోపాటు నలుగు డైరెక్టర్లు ఉంటారు. ఆపరేషన్స్, ఫైనాన్స్, ప్రాజెక్టు, హెచ్ఆర్డీ విభాగాలకు అధిపతులుగా డైరెక్టర్లు వ్యవహరిస్తున్నారు. కీలకమైన ఫైనాన్స్, హెచ్ఆర్డీ విభాగాలకు డైరెక్టర్లు లేరు. టీఎస్ఎన్పీడీసీఎల్ మానవ వనరుల విభాగం(హెచ్ఆర్డీ) డైరెక్టర్ పోస్టు 2015 ఆగస్టు 1న ఖాళీ అయ్యింది. ఆర్థిక విభాగం డైరెక్టర్ సుదర్శన్ పదవీకాలం అదే ఏడాది ఆగస్టు 6తో ముగిసింది. ఈ రెండు డైరెక్టర్లు పోస్టులు ఖాళీగా ఉండగా... ఈనెల(జూలై) 31తో ప్రాజెక్టుల విభాగం పోస్టు ఖాళీ అవుతోంది. దాదాపు ఏడాదిగా రెండు డైరెక్టరు పోస్టులు ఖాళీగానే ఉండడంతో పరిపాలనపరమైన అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మరో పోస్టు ఖాళీ అవుతుండడంతో ఈ ఇబ్బందులు మరింత పెరగనున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలో కీలకమైన పోస్టులు ఖాళీ అవుతున్నా ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టడంలేదు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) నిబంధనల ప్రకారం ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్ కాలపరిమితి మొదట ఐదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యాక కొనసాగింపునకు అవకాశం ఉంటుంది. 70 ఏళ్ల గరిష్ట వయోపరిమితి మించని వారినే టీఎస్ఎన్పీడీసీఎల్లో డైరెక్టరుగా నియమించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటైన కొన్ని నెలల వరకు టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీగా ఐఏఎస్ అధికారి కార్తికేయమిశ్రా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్)లో డైరక్టర్‌గా పనిచేసిన కె.వెంకటనారాయణను రాష్ట్ర ప్రభుత్వం కార్తికేయమిశ్రా స్థానంలో సీఎండీగా 2014 ఆగస్టులో నియమించింది. ఖాళీ అవుతున్న డైరెక్టరు పోస్టులను మాత్రం భర్తీ చేయడంలేదు.