సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి తమ సంస్థలు కొనుగోలు చేసే విద్యుత్ ధరలపై తుది నిర్ణయం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ)దేనని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) స్పష్టం చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయం పెరుగుదలపై ఆ రాష్ట్ర ఈఆర్సీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా సవరించే కొనుగో లు ఒప్పందాన్ని మళ్లీ తెలంగాణ ఈఆర్సీ ఆమోదించాల్సి ఉం టుందన్నాయి.
మార్వా విద్యుత్ ప్లాంటు పెట్టుబడి వ్యయం పెరగడంతో.. ఆ మేర విద్యుత్ ధర పెంచాలంటూ ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆ రాష్ట్ర ఈఆర్సీ విచారణ నిర్వహించింది. మార్వా ప్లాంటు విద్యుత్ ధరను ఆ రాష్ట్ర ఈఆర్సీ పెంచితే.. దాని నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్న తెలంగాణపై తీవ్ర భారం పడుతుంది.
దీంతో తెలంగాణ డిస్కంల అధికారులు.. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ విచారణకు హాజరై రాష్ట్రం తరఫున వాదనలు వినిపించారు. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) నిర్దేశించిన అన్నిరకాల పరిమితులకు మించి మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయం, నిర్మాణ వ్యవధి పెరిగాయని.. దీంతో విద్యుత్ ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ప్లాంటు నిర్మాణానికి మెగావాట్‌కు రూ.6.32 కోట్ల వ్యయంతో అనుమతించారని.. కానీ నిర్మాణంలో జాప్యం, వడ్డీలు పెరగడం తో ఈ వ్యయం మెగావాట్‌కు రూ.9.2 కోట్లకు చేరిందన్నారు.
గతంలో అనేక విద్యుత్ కేంద్రాల పెట్టుబడి వ్యయాన్ని.. ఆయా రాష్ట్రాల ఈఆర్సీలు, సీఈఆర్సీ తగ్గించి ఆమోదించాయని ఉదాహరణలతో వివరించారు. అందువల్ల మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయాన్ని పునఃసమీక్షించి.. తగ్గించాకే ఆమోదించాలని కోరారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
పెరిగిన వ్యయాన్ని ఆమోదిస్తే మోతే!
ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ ప్లాంటు నుంచి 12 ఏళ్లపాటు 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2015లో దీర్ఘకాలిక ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ తాత్కాలికంగా నిర్ణయించిన మేరకు యూనిట్‌కు రూ.3.90 లెక్కన గతేడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా జరుగుతోంది.
అయితే రూ.8,999 కోట్ల మేర పెరిగిన ప్లాంటు నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని యూనిట్‌కు రూ.4.47కు ధర పెంచాలని ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర ఈఆర్సీని కోరింది. దీంతోపాటు తొలినుంచి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి ట్రూప్ చార్జీల (ప్రస్తుతం నిర్ణయించనున్న ధరకు, తాత్కాలిక ధరకు మధ్య తేడా సొమ్ము)ను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరింది. దీనిని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదిస్తే.. ట్రూప్ చార్జీల కింద రూ.788 కోట్లు చెల్లించాల్సి రావడంతోపాటు విద్యుత్ ధర కూడా భారంగా మారుతుంది.
బలంగా వాదనలు వినిపించాం
‘‘మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయం పెంపును ఆమోదించవద్దని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ముందు బలంగా వాదనలు వినిపించాం. ధరలు పెంచే అవకాశం లేదు. ఒకవేళ ధర పెంచితే అప్పిలేట్ ట్రిబ్యునల్, సీఈఆర్సీల్లో సవాలు చేస్తాం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునః సమీక్షించే ఆలోచన లేదు..’’– డి.ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment