సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారుల నుంచి మొత్తం రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల వసూళ్లకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమర్పించిన ప్రతిపాదనలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.
2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,015 కోట్ల విద్యుత్ కొనుగోలు ట్రూఅప్ చార్జీలతో పాటు 2006–07 నుంచి 2020–21 మధ్యకాలానికి సంబంధించి రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీల వసూళ్లు ఆ ప్రతిపాదనల్లో ఉన్నాయి.
విద్యుత్ చట్టం 2003, విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 తేదీ నుంచి కొత్త టారిఫ్ ఉత్తర్వులను అమలు చేయాల్సి ఉంది. దీనికి కనీసం వారం రోజుల ముందు టారిఫ్ ఉత్తర్వులను ఈఆర్సీ ప్రకటించాలి. ఈ నేపథ్యంలో గురువారం 2023–24కి సంబంధించిన వార్షిక టారిఫ్ ఉత్తర్వులతో పాటు ట్రూఅప్ చార్జీలపై ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయనుందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి.
ట్రూఅప్ చార్జీలపైనే ఉత్కంఠ
ప్రస్తుత విద్యుత్ టారిఫ్ 2023–24లోనూ యధాతథంగా కొనసాగించాలని వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్) నివేదికలో డిస్కంలు ప్రతిపాదించిన నేపథ్యంలో విద్యుత్ టారిఫ్‌లో మార్పులు ఉండే అవకాశాలు లేవు. అయితే రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై ఈఆర్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో రూ.5,986 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వినియోగదారులపై పడే భారాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల్లో ఎంత మేరకు వినియోగదారుల నుంచి వసూలు చేయాలి? ఎంత కాల వ్యవధిలో వసూలు చేయాలి? అన్న అంశాలపై ఈఆర్సీ నిర్ణయాన్ని ప్రకటించనుంది.
పారిశ్రామిక, వినియోగదారుల సంఘాల వ్యతిరేకత
ఏఆర్‌ఆర్‌తో పాటు ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై గత నెలలో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి అన్ని వర్గాల వినియోగదారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
డిస్కంలు 2019–20, 2020–21, 2021–22 సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్‌ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించలేదని, నిబంధనల మేరకు ఈ సంవత్సరాలకు సంబంధించిన ట్రూఅప్ చార్జీల వసూళ్లకు అనుమతి ఉండదని బహిరంగ విచారణలో విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామిక సంఘాలు వాదనలు వినిపించాయి.
ట్రూఅప్ చార్జీలు అంటే..?
ఒక ఆర్థిక సంవత్సరంలో అయ్యే విద్యుత్ పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) వ్యయం, విద్యుత్ కొనుగోలు వ్యయ అంచనాలను ఈఆర్సీ ముందస్తుగా ఆమోదిస్తుంది. దీనికి తగినట్టుగా కరెంట్ బిల్లుల వసూళ్లకు అనుమతిస్తుంది.
ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత లెక్క తేల్చిన వాస్తవ వ్యయంలో ఉండే హెచ్చుతగ్గులను ట్రూఅప్/ ట్రూడౌన్ చేయాల్సి ఉంటుంది. అంటే ముందస్తుగా అనుమతించిన వ్యయం కన్నా అధిక వ్యయం జరిగితే, ఆ మేరకు వ్యత్యాసాన్ని ఆ తర్వాత కాలంలో ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఒక వేళ తక్కువ వ్యయం జరిగితే ఆ తర్వాత కాలంలో విద్యుత్ చార్జీలను తగ్గించి ట్రూడౌన్ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment