TSERC
-
‘ట్రూఅప్’పై తేలేది నేడే..!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారుల నుంచి మొత్తం రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల వసూళ్లకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమర్పించిన ప్రతిపాదనలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,015 కోట్ల విద్యుత్ కొనుగోలు ట్రూఅప్ చార్జీలతో పాటు 2006–07 నుంచి 2020–21 మధ్యకాలానికి సంబంధించి రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీల వసూళ్లు ఆ ప్రతిపాదనల్లో ఉన్నాయి. విద్యుత్ చట్టం 2003, విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 తేదీ నుంచి కొత్త టారిఫ్ ఉత్తర్వులను అమలు చేయాల్సి ఉంది. దీనికి కనీసం వారం రోజుల ముందు టారిఫ్ ఉత్తర్వులను ఈఆర్సీ ప్రకటించాలి. ఈ నేపథ్యంలో గురువారం 2023–24కి సంబంధించిన వార్షిక టారిఫ్ ఉత్తర్వులతో పాటు ట్రూఅప్ చార్జీలపై ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయనుందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. ట్రూఅప్ చార్జీలపైనే ఉత్కంఠ ప్రస్తుత విద్యుత్ టారిఫ్ 2023–24లోనూ యధాతథంగా కొనసాగించాలని వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) నివేదికలో డిస్కంలు ప్రతిపాదించిన నేపథ్యంలో విద్యుత్ టారిఫ్‌లో మార్పులు ఉండే అవకాశాలు లేవు. అయితే రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై ఈఆర్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో రూ.5,986 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వినియోగదారులపై పడే భారాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల్లో ఎంత మేరకు వినియోగదారుల నుంచి వసూలు చేయాలి? ఎంత కాల వ్యవధిలో వసూలు చేయాలి? అన్న అంశాలపై ఈఆర్సీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. పారిశ్రామిక, వినియోగదారుల సంఘాల వ్యతిరేకత ఏఆర్‌ఆర్‌తో పాటు ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై గత నెలలో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి అన్ని వర్గాల వినియోగదారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. డిస్కంలు 2019–20, 2020–21, 2021–22 సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించలేదని, నిబంధనల మేరకు ఈ సంవత్సరాలకు సంబంధించిన ట్రూఅప్ చార్జీల వసూళ్లకు అనుమతి ఉండదని బహిరంగ విచారణలో విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామిక సంఘాలు వాదనలు వినిపించాయి. ట్రూఅప్ చార్జీలు అంటే..? ఒక ఆర్థిక సంవత్సరంలో అయ్యే విద్యుత్ పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) వ్యయం, విద్యుత్ కొనుగోలు వ్యయ అంచనాలను ఈఆర్సీ ముందస్తుగా ఆమోదిస్తుంది. దీనికి తగినట్టుగా కరెంట్ బిల్లుల వసూళ్లకు అనుమతిస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత లెక్క తేల్చిన వాస్తవ వ్యయంలో ఉండే హెచ్చుతగ్గులను ట్రూఅప్/ ట్రూడౌన్ చేయాల్సి ఉంటుంది. అంటే ముందస్తుగా అనుమతించిన వ్యయం కన్నా అధిక వ్యయం జరిగితే, ఆ మేరకు వ్యత్యాసాన్ని ఆ తర్వాత కాలంలో ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఒక వేళ తక్కువ వ్యయం జరిగితే ఆ తర్వాత కాలంలో విద్యుత్ చార్జీలను తగ్గించి ట్రూడౌన్ చేయాల్సి ఉంటుంది. -
విద్యుత్ బిల్లులు భారం కాకుండా ఉండాలంటే.. ఇదొక్కటే మార్గం!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో చార్జీలు పెరగకుండా.. విద్యుత్ బిల్లులు భారం కాకుండా ఉండాలంటే.. కరెంటు వినియోగంలో పొదుపు ఒక్కటే మార్గమని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు. రాష్ట్రంలో పీక్ విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే వేళల్లో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గరిష్టంగా యూనిట్‌కు రూ.12 ధరతో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరుపుతున్నాయి. దీంతో డిస్కంల విద్యుత్ కొనుగోళ్ల వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఈ వ్యయభారాన్ని చివరకు వినియోగదారులపై బిల్లులను మరింతగా పెంచి బదిలీ చేయకతప్పదని ఆయన స్పష్టం చేశారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు ఈ బిల్లులు మోయలేని భారంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, విద్యుత్ పొదుపు చర్యలను పాటించి సలువుగా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అవసరం లేకున్నా విద్యుత్‌ను వృథాగా వినియోగిస్తుండడంతోనే బిల్లులు అధికంగా వస్తున్నాయని, విద్యుత్ పొదుపుపై రాష్ట్రంలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈఆర్సీ తరఫున వినియోగదారులకు సూచనలు, సలహాలతో ఆదివారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన్నీరు శ్రీరంగారావు -
జలమండలికి ప్రత్యేక టారిఫ్
సాక్షి, హైదరాబాద్: జలమండలికి సంబంధించిన విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం విడుదల చేయట్లేదని, వీటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) తోసిపుచ్చింది. జలమండలికి ప్రస్తుతం రాయితీపై అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్ స్థానంలో పాత హెచ్‌టీ–4(బీ) కేటగిరీ టారిఫ్‌ను కొనసాగించా లన్న డిస్కంల మరో విజ్ఞప్తిని కూడా ఈఆర్సీ నిరాకరించింది. జలమండలి ప్రత్యేక టారిఫ్‌పై పెండింగ్‌లో ఉన్న కేసులో ఇటీవల డిస్కంలు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. సత్వరమే పెండింగ్ టారిఫ్ ప్రతిపాదనలను దాఖలు చేయాలని, టారిఫ్ ఉత్తర్వుల్లో జలమండలికి సంబంధించిన ప్రత్యేక టారిఫ్ అంశంపై తుది ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అప్పట్లోగా జలమండలికి సంబంధించిన తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు విద్యుత్ కనెక్షన్లను కట్ చేయబోమని డిస్కంలు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని ఈఆర్సీ కోరింది. హైదరాబాద్ మెట్రో రైలు కోసం యూనిట్ విద్యుత్‌కు రూ.3.95 చొప్పున అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్‌ను తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు సైతం వర్తింపజేయాలని జలమండలి చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తూ గతేడాది జూలైలో ఈఆర్సీ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. 2019–20, 2020–21 సంవత్సరాల్లో ఈ ప్రత్యేక టారిఫ్‌ను వర్తింపజేయాలని అప్పట్లో ఈఆర్సీ ఆదేశించింది. ప్రత్యేక టారిఫ్ అమలుతో గతేడాది జూన్ నాటికి రూ.538.95 కోట్లు నష్టపోయామని డిస్కంలు తెలిపాయి. జలమండలి ద్వారా తాగునీటి సరఫరాకు అవుతున్న ఖర్చులతో పోలిస్తే అవుతున్న వ్యయం అధికంగా ఉందని, 2016–17లో రూ.232 కోట్లు, 2017–18లో రూ.330 కోట్లు, 2018–19లో రూ.299 కోట్లు, 2019–20లో రూ.577 కోట్లు, 202–21 అక్టోబర్ వరకు రూ.265 కోట్ల నష్టాలు వచ్చాయని జలమండలి ఈఆర్సీకి నివేదించింది. పాత టారిఫ్ ప్రకారం విద్యుత్ చార్జీలు పెంచితే భరించలేమని వాదనలు వినిపించింది. డిస్కంలు, జలమండలి వాదనలు విన్న ఈఆర్సీ.. డిస్కంల మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈఆర్సీ ససేమిరా..!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు జూన్ 30 వరకు మరోసారి గడువు పొడిగించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా తోసిపుచ్చింది. వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను గతే డాది నవంబర్ 30లోగా సమర్పించాల్సి ఉండగా, డిస్కంలు వివిధ కారణాలు చూపుతూ పలు దఫాలుగా గడువు పొడిగింపు కోరుతూ వచ్చాయి. చివరిగా ఈ ఏడాది మార్చి 31 వరకు ఈఆర్సీ గడువు పొడిగించినా, డిస్కంలు ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమయ్యా యి. మరింత కాలం గడువు పొడిగింపు కోరుతూ అప్పట్లో డిస్కంలు ఈఆర్సీకి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయలేకపోయాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మార్చి 24 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి రావడంతో గడువు పొడిగింపు కోరలేకపోయాయి. గడువు ముగిసిన 2 నెలల తర్వాత మళ్లీ జూన్ 30 వరకు మరోసారి గడువు పొడిగించాలని కోరుతూ ఇటీవల డిస్కంలు విజ్ఞప్తి చేయగా, ఈఆర్సీ ససేమిరా నిరాకరించింది. ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించే సమయంలోనే ఇప్పటివరకు జరిగిన జాప్యానికి మన్నించాలని విజ్ఞప్తి చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జూన్ 1న డిస్కంలకు ఈఆర్సీ లేఖ రాసింది. చివరిసారిగా పొడిగించిన గడువు మార్చి 31తో ముగిసిపోగా, ఆ గడువులోపే మళ్లీ గడువు పొడిగింపు కోసం విజ్ఞప్తి చేయాల్సి ఉండగా డిస్కంలు విఫలమయ్యాయి. రెండు నెలల ఉల్లంఘన తర్వాత గడువు కోరడం వల్లే ఈఆర్సీ అంగీకరించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలో చార్జీల పెంపు ప్రతిపాదనలు.. గడువు పొడిగింపునకు ఈఆర్సీ నిరాకరించిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలతో పాటు ఏఆర్ఆర్ నివేదికను డిస్కంలు వెంటనే ఈఆర్సీకి సమర్పించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలు మళ్లీ కసరత్తు ప్రారంభించాయి. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలు విద్యుత్ చార్జీలు పెంచేందుకు గత ఆరు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా, వివిధ రకాల ఎన్నికలు, రాజకీయ కారణాలతో వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను సైతం డిస్కంలు ఈఆర్సీకి సమర్పించలేదు. గత మూడేళ్లకు పైగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదు. దీంతో డిస్కంలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని.. గతంలో ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్ నివేదికలో డిస్కంలు అంచనా వేశాయి. 2019–20 ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల ఆర్థిక లోటు రూ.12 వేల కోట్లకు చేరిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని అర్జించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. విద్యుత్ సంస్థల సీఎండీలు త్వరలో సీఎం కేసీఆర్‌తో సమావేశమై ఈ పరిస్థితులను వివరించి చార్జీల పెంపునకు అనుమతి కోరే అవకాశముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిస్తే జూన్ 30లోగా ప్రతిపాదనలు సమర్పించే అవకాశాలున్నాయి. -
విద్యుత్ చార్జీల పెంపునకు గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుమతించినట్లు సమాచారం. దీంతో వార్షిక బడ్జెట్ అంచనాల నివేదిక (ఏఆర్ఆర్)తో పాటు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు శనివారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి సమర్పించే అవకాశముంది. ఈఆర్సీ అనుమతి లాంఛనమే కాగా, పెరిగిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోఅమల్లోకి రానున్నాయి. 2020–21కి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను గతేడాది నవంబర్ నెలాఖరులోగా డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా, వివిధ కారణాలు చూపి వరుసగా గడువు పొడిగింపును పొందుతూ వస్తున్నాయి. చివరిసారిగా పొడిగించిన గడువు నేటి (శనివారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమై చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను శనివారం ఈఆర్సీకి సమర్పించేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మిషన్ భగీరథ, ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపును ఈ సమావేశంలో సీఎం వ్యతిరేకించినట్లు సమాచారం. కమర్షియల్, పరిశ్రమల కేటగిరీల వినియోగదారులపై చార్జీల పెంపు భారం గతంలో కంటే అధికంగా పడే అవకాశం ఉందని సమాచారం. గృహ వినియోగదారులపై కూడా చార్జీల పెంపు భారం వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన వాయిదా
సాక్షి, హైదరాబాద్: వార్షిక ఆదాయ అవసరాలను (ఏఆర్ఆర్) తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో దాఖలు చేయకపోవడంతో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన ప్రస్తుతానికి వాయిదా పడింది. ఏఆర్‌ఆర్‌ను దాఖలు చేయడానికి ముందే విద్యుత్ చార్జీలు పెంచాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) భావించి, సీఎం ఆమోదం పొందేందుకు ప్రయత్నించాయి. అయితే సీఎం అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ఏఆర్ఆర్ సమర్పణకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావును కోరగా, అందుకు అనుమతిచ్చినట్లు తెలిసింది. 2019–20, 2020–21 సంవత్సరాలకు గాను ఏఆర్ ఆర్‌ను డిస్కమ్‌లు శనివారం ఈఆర్సీకి సమర్పిస్తాయనే ప్రచారం జరిగింది. 2019–20లో రూ.11వేల కోట్లు, 2020–21లో రూ.12వేల కోట్లు ఆదాయ లోటు ఉంటుందని డిస్కమ్‌లు అంచనా వేస్తున్నాయి. మరోవైపు వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రూ.13వేల కోట్ల బకాయిలను డిస్కమ్‌లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీలను సవరించాలని ఈఆర్సీ స్టేట్ అడ్వైజరీ కమిటీలో కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వ శాఖల బకాయిలు విడుదల కాకపోవడం, చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతివ్వక పోవడాన్ని సంఘాలు తప్పు పట్టాయి. ఇదిలా ఉంటే ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మార్చి 1 వరకు సెలవులో ఉండటంతో, ఆయన విధుల్లో చేరిన తర్వాత డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేస్తాయని సమాచారం. -
ఈఆర్సీ చైర్మన్‌గా శ్రీరంగారావు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) చైర్మన్‌గా తన్నీరు శ్రీరంగారావు బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు సభ్యులుగా ఎండీ మనోహర్ రాజు (టెక్నికల్), బండారు కృష్ణయ్య (ఫైనాన్స్) ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని ఫ్యాప్సీ భవన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిస్రా వీరితో ప్రమాణం చేయించారు. హైద్రాబాద్:నాంపల్లిలోని లక్డ్డికాపుల్,ఫ్యాబ్సిలో తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్సిటీ రేగులటోరి కమిషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన టి.శ్రీరంగరావు, టెక్నికల్ మెంబెర్ గా ఎం.డి.మనోహర్ రాజు,ఫైనాన్స్ మెంబెర్‌గా బి.కృష్ణయ్య,హాజరైన ఛీఫ్ సెక్రటరీ ఎస్. కె.జోషి,స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అజయ్ మిస్రా ప్రమాణం చేయించారు. -
కరెంటు బిల్లులు పెరగవ్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ఉండదు. చార్జీల పెంపు లేకుండా ప్రస్తుత టారిఫ్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరం(2019–20)లో యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా సోమవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కార్యదర్శికి రహస్య లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచొద్దని సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ చార్జీలు యథాతథంగా ఏప్రిల్ 1తో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో అమలవుతాయని ఆదేశిస్తూ త్వరలో ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఏఆర్ఆర్ లేనట్టే! :దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)ల యాజమాన్యాలు ఇప్పటి వరకు 2019–20 సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికను ఈఆర్సీకి సమర్పించలేదు. గతేడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో వాయిదాను కోరాయి. ఏటా నవంబర్ చివరిలోగా రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ అంచనాలను ఆర్థిక అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) రూపంలో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఈఆర్సీకి సమర్పించాలని విద్యుత్ చట్టంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పడనున్న ఆర్థిక లోటు అంచనాలు, దీన్ని అధిగమించేందుకు ఎంత మొత్తంలో చార్జీలు పెంచాలన్న అంశాన్ని ఈ నివేదికలో డిస్కంలు ప్రతిపాదించాలి. డిస్కంలు ప్రతిపాదించిన చార్జీల పెంపుపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాల్సిన విద్యుత్ టారిఫ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఏటా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి వారం రోజుల ముందే ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రస్తుత విద్యుత్ చార్జీలను వచ్చే ఏడాది యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీని కోరిన నేపథ్యంలో డిస్కంలు ఈఆర్సీకి 2019–20కు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికను సమర్పించకపోవచ్చని ఇంధన శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈఆర్సీ చైర్మన్ ఎంపిక ఎప్పుడు ? టీఎస్ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్ గత జనవరి 9న పదవీ విరమణ పొందారు. అంతకుముందే సభ్యులిద్దరూ పదవీ విరమణ చేయడంతో గత రెండు నెలలుగా కమిషన్ ఖాళీగా ఉంది. కొత్త చైర్మన్, సభ్యుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఎంపిక కమిటీ.. ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త చైర్మన్, సభ్యుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
విచారణ అధికారం సీఈఆర్‌సీకే ఉంది..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ముందు విద్యుత్ పంపిణీ సంస్థలు, విద్యుత్ ఉత్పాదన సంస్థల మధ్య నెలకొన్న వివాదాలపై విచారణ జరిపే అధికార పరిధి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) లేదా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) లేదా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)లలో ఎవరికి ఉందన్న అంశంపై హైకోర్టు స్పష్టతనిచ్చింది. మూడేళ్లుగా న్యాయస్థానంలో నలుగుతున్న ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టింది. విద్యుత్ పంపిణీ సంస్థలు, విద్యుత్ ఉత్పాదన సంస్థల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం సీఈఆర్‌సీకే ఉందని తేల్చి చెప్పింది. వివాదాలకు సంబంధించి ఏపీఈఆర్సీ, టీఎస్‌ఈఆర్‌సీలు వేర్వేరుగా జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. అలాగే సీఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇదీ వివాదం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల, లోపల ఉన్న పలు విద్యుత్ ఉత్పాదన, పంపిణీ సంస్థలు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్ఈబీ)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నాయి. 2006–13 మధ్య కాలంలో ఉత్పాదన, పంపిణీ సంస్థల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజనకు ముందు ఈ వివాదాలపై ఏపీఈఆర్సీ విచారణ చేపట్టింది. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో తెలంగాణ టీఎస్ఈఆర్సీని ఏర్పాటు చేసింది. ఏపీ కూడా పాత ఈఆర్సీ స్థానంలో కొత్త ఈఆర్సీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పీపీఏ వివాదాలకు సంబంధించిన కేసులను ఎవరు విచారించాలన్న అంశంపై ఏపీఈఆర్సీ, టీఎస్ఈఆర్సీ, విద్యుత్ పంపిణీ, ఉత్పాదన సంస్థల మధ్య వివాదం చెలరేగింది. ఇది సీఈఆర్సీకి చేరింది. ఈ వివాదంపై విచారణ జరిపే పరిధి తమకే ఉందని సీఈఆర్సీ 2015లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఏపీఈఆర్సీ, టీఎస్ఈఆర్సీ జారీ చేసిన పలు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా దాఖలైన మొత్తం 16 పిటిషన్లపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. సీఈఆర్సీ వాదనే సబబు.. ‘ఒకే అంశంపై ఏక కాలంలో విచారణ జరిపే పరిధి విద్యుత్ నియంత్రణ మండళ్లకు లేదు. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి పరిధిలోకి వచ్చే అంశాలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల పరిధిలోకి రావు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విద్యుత్ ఉత్పాదన, అమ్మకం ఉమ్మడి పథకమైంది. రాష్ట్ర విభజనకు ముందు ఆ వివాదాలపై ఏపీఈఆర్సీకి విచారణాధికారం ఉండేది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు ఏపీకి వెళ్లగా, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు తెలంగాణకు వచ్చాయి. దీంతో ఈ వివాదాలన్నీ అంతర్రాష్ట్ర వివాదాలయ్యా యి. కాబట్టి ఈ వివాదాలకు సంబంధించిన ఏపీఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటు కావు. టీఎస్ఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులు కూడా చెల్లుబాటు కావు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను టీఆఎస్ఈఆర్సీ రెండు భాగాలుగా విభజించింది. ఒక భాగం వివాదాలను తాను నిర్ణయిస్తే, మరో భాగం వివాదాలను మరో రాష్ట్రం నిర్ణయిస్తుందని భావించింది. ఏపీఈఆర్సీ ఏపీ పునర్విభజన చట్టం కింద తనకు మిగిలిన అధికారాలను బట్టి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెబుతోంది. టీఎస్ఈఆర్సీ వివాదాన్ని రెండు భాగాలుగా విభజించి, ఆ మేర ఉత్తర్వులు జారీ చేసినట్లు వాదిస్తోంది. వాస్తవానికి ఈ రెండూ వాదనలు తప్పు. ఈ మొత్తం వ్యవహారం రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి వాటిపై విచారణ జరిపే అధికార పరిధి తమకే ఉందన్న సీఈఆర్సీ వాదనే సరైంది. అందువల్ల ఏపీఈఆర్సీ, టీఎస్‌ఈఆర్‌సీలు తమ ముందున్న కేసులన్నింటినీ సీఈఆర్సీకి బదలాయించాలి’అని ధర్మాసనం పేర్కొంది. -
తుది నిర్ణయం తెలంగాణ ఈఆర్సీదే!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి తమ సంస్థలు కొనుగోలు చేసే విద్యుత్ ధరలపై తుది నిర్ణయం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)దేనని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) స్పష్టం చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయం పెరుగుదలపై ఆ రాష్ట్ర ఈఆర్సీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా సవరించే కొనుగో లు ఒప్పందాన్ని మళ్లీ తెలంగాణ ఈఆర్సీ ఆమోదించాల్సి ఉం టుందన్నాయి. మార్వా విద్యుత్ ప్లాంటు పెట్టుబడి వ్యయం పెరగడంతో.. ఆ మేర విద్యుత్ ధర పెంచాలంటూ ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆ రాష్ట్ర ఈఆర్సీ విచారణ నిర్వహించింది. మార్వా ప్లాంటు విద్యుత్ ధరను ఆ రాష్ట్ర ఈఆర్సీ పెంచితే.. దాని నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్న తెలంగాణపై తీవ్ర భారం పడుతుంది. దీంతో తెలంగాణ డిస్కంల అధికారులు.. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ విచారణకు హాజరై రాష్ట్రం తరఫున వాదనలు వినిపించారు. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) నిర్దేశించిన అన్నిరకాల పరిమితులకు మించి మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయం, నిర్మాణ వ్యవధి పెరిగాయని.. దీంతో విద్యుత్ ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ప్లాంటు నిర్మాణానికి మెగావాట్‌కు రూ.6.32 కోట్ల వ్యయంతో అనుమతించారని.. కానీ నిర్మాణంలో జాప్యం, వడ్డీలు పెరగడం తో ఈ వ్యయం మెగావాట్‌కు రూ.9.2 కోట్లకు చేరిందన్నారు. గతంలో అనేక విద్యుత్ కేంద్రాల పెట్టుబడి వ్యయాన్ని.. ఆయా రాష్ట్రాల ఈఆర్సీలు, సీఈఆర్సీ తగ్గించి ఆమోదించాయని ఉదాహరణలతో వివరించారు. అందువల్ల మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయాన్ని పునఃసమీక్షించి.. తగ్గించాకే ఆమోదించాలని కోరారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పెరిగిన వ్యయాన్ని ఆమోదిస్తే మోతే! ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ ప్లాంటు నుంచి 12 ఏళ్లపాటు 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2015లో దీర్ఘకాలిక ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ తాత్కాలికంగా నిర్ణయించిన మేరకు యూనిట్‌కు రూ.3.90 లెక్కన గతేడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా జరుగుతోంది. అయితే రూ.8,999 కోట్ల మేర పెరిగిన ప్లాంటు నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని యూనిట్‌కు రూ.4.47కు ధర పెంచాలని ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర ఈఆర్సీని కోరింది. దీంతోపాటు తొలినుంచి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి ట్రూప్ చార్జీల (ప్రస్తుతం నిర్ణయించనున్న ధరకు, తాత్కాలిక ధరకు మధ్య తేడా సొమ్ము)ను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరింది. దీనిని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదిస్తే.. ట్రూప్ చార్జీల కింద రూ.788 కోట్లు చెల్లించాల్సి రావడంతోపాటు విద్యుత్ ధర కూడా భారంగా మారుతుంది. బలంగా వాదనలు వినిపించాం ‘‘మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయం పెంపును ఆమోదించవద్దని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ముందు బలంగా వాదనలు వినిపించాం. ధరలు పెంచే అవకాశం లేదు. ఒకవేళ ధర పెంచితే అప్పిలేట్ ట్రిబ్యునల్, సీఈఆర్సీల్లో సవాలు చేస్తాం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునః సమీక్షించే ఆలోచన లేదు..’’– డి.ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో సీఎండీ -
అలాంటి సమాచారమే లేదు!
⇒ విద్యుత్ చార్జీలు పెంచవద్దని ప్రభుత్వం నుంచి సూచనల్లేవు ⇒ స్పష్టం చేసిన టీఎస్ఈఆర్సీ అధికార వర్గాలు ⇒ చార్జీల పెంపుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనపై స్పందన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాలని ఈఆర్సీ కోరినా ఒప్పుకోలేదని, చార్జీలు పెంచవద్దని చెప్పానని సీఎం కె.చంద్రశేఖర్‌రావు గత శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. డిస్కంల ఆదా య లోటు అంచనాలు రూ.10 వేల కోట్లు ఉండనుండగా, బడ్జెట్లో రూ.4,200 కోట్లు మాత్రమే కేటాయించారని, విద్యుత్ చార్జీల పెంపు ద్వారా మిగిలిన భారాన్ని ప్రజలపై వేస్తారా అని విపక్ష నేత కె.జానారెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు బదలిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై ఈఆర్సీ, డిస్కంల వర్గాల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది. విద్యుత్ చార్జీలు పెంచవద్దని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకున్నామని పేర్కొన్నాయి. విద్యుత్ చార్జీల పెంపు కసర త్తులో భాగంగా ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2017–18కి సంబంధిం చిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లు సమర్పించాయని, ఈఆర్సీ సుమోటోగా చేపట్టిన టారీఫ్ పెంపు ప్రక్రియ పురోగతిలో ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచవద్దని, డిస్కంల ఆదాయ లోటు భారాన్ని సబ్సిడీగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా తెలిపితేనే ఈఆర్సీ పరిశీలిస్తుందని తెలిపారు. టారీఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించేం దుకు డిస్కంలు కూడా ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగింపు కోరాయని గుర్తు చేశారు. అసెంబ్లీ తర్వాత ప్రతిపాదనలు రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సరఫరాను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచిన నేపథ్యం లో వ్యయ భారం పెరిగిందని, ప్రస్తుత చార్జీలే అమలు చేస్తే వచ్చే ఏడాది రూ.9,824 కోట్ల ఆర్థిక లోటు మూటగట్టుకోవాల్సి వస్తుందని ఇప్పటికే డిస్కంలు అంచనా వేశాయి. రూ.7,150.13 కోట్లను విద్యుత్ సబ్సిడీగా బడ్జెట్లో కేటాయించాలని కోరగా, ప్రభుత్వం రూ.4,200 కోట్లే కేటా యించింది. సబ్సిడీ పోగా రూ.5,600 కోట్ల ఆదాయ లోటు మిగలనుంది. దీంతో చార్జీల పెంపు అనివార్యమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈఆర్సీకి టారీఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పిస్తామని, వచ్చే జూలై నుంచి చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశముందని తెలిపాయి. అప్పటి వరకు పాత చార్జీలు: డిస్కంలు ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్ చార్జీల కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో తదుపరి చార్జీలు పెంచే వరకు ప్రస్తుత చార్జీలనే కొనసాగించాలని తాజాగా డిస్కంలు ఈఆర్సీని కోరాయి. వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రస్తుత చార్జీలు అమలు కానుండగా, జూలై నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. జీహెచ్ఎంసీ, ఇతర పురపాలికలకు ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఏఆర్ఆర్, టారీఫ్ ప్రతి పాదనలు సమర్పించడంలో తీవ్ర జాప్యం చేయడంతో గతేడాది కూడా ఆలస్యంగా జూలై నుంచి చార్జీల పెంపు అమలు చేసిన విషయం తెలిసిందే. -
‘ఛత్తీస్’ విద్యుత్‌తో నష్టమే!
► స్పష్టం చేసిన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ∙ ► బదిలీకి ఓ రోజు ముందు ఈఆర్సీకి లేఖ రాసిన సీనియర్ ఐఏఎస్ ► రాష్ట్రానికి కలిగే నష్టాలపై లెక్కలతో సహా వివరణ ► కాంపిటీటివ్ బిడ్డింగ్‌తో విద్యుత్ కొనుగోళ్లు మేలని సూచన ► స్థిరచార్జీల రూపంలో వందల కోట్ల భారం పడే అవకాశముందని వెల్లడి ► బదిలీకి ఒక రోజు ముందు ఈ లేఖ రాయడంపై చర్చ ► ప్రభుత్వానికి తెలియకుండానే లేఖ? సాక్షి, హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో రాష్ట్రానికి నష్టం జరుగుతుందా? దానివల్ల వేల కోట్ల రూపాయల భారం తప్పదా? ఇన్నాళ్లూ విద్యుత్ రంగ నిపుణులు, విపక్షాలు ఇదే వాదన వినిపించాయి. తాజాగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశముందని, దీనికి బదులు కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియలో విద్యుత్ కొనుగోళ్లు జరిపితే ప్రయోజనకరమంటూ... తన బదిలీకి ఒక రోజు ముందు, గత నెల 30న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ)కి లేఖ రాశారు. ప్రభుత్వానికి సమాచారమివ్వకుండా రాసిన ఈ లేఖ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనితో ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. దీనిపై త్వరలోనే ఈఆర్సీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. వెయ్యి మెగావాట్ల కోసం ఒప్పందం ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2015 సెప్టెంబర్ 22న ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సాధారణంగా టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉన్నా.. దానికి బదులుగా పరస్పర అంగీకార ఒప్పందం (ఎంఓయూ) విధానంలో 12 ఏళ్లకు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది. అయితే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధర ఎక్కువగా ఉందని, అది రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని విద్యుత్ రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారానే విద్యుత్ కొనుగోళ్లు జరపాలని వారు సూచించడంతో.. ఈ ఒప్పందంపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించింది. ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల చొప్పున 12 ఏళ్ల ఒప్పంద కాలంలో రాష్ట్ర ప్రజలపై రూ.10 వేల కోట్ల వరకు భారం పడుతుందని నిపుణులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం మాత్రం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ చౌకగా వచ్చే అవకాశముందంటూ సమర్థించుకుంది. భిన్న వాదనలు రావడంతో ఆ ఒప్పందానికి అనుమతిపై ఈఆర్సీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఛత్తీస్‌గఢ్ ఒత్తిడితో.. విద్యుత్‌కొనుగోలు ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలంటూ ఇటీవల ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ స్వయంగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ ఒప్పందంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఈఆర్సీని కోరేందుకు ఇటీవల ఇంధనశాఖ ఓ లేఖను సిద్ధం చేసి... ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఆమోదం కోసం పంపించింది. అయితే ఆయన ఆ ముసాయిదా లేఖలో కీలక మార్పులు చేసి ఈఆర్సీకి పంపారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అందులో సూచించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తే వివిధ రూపాల్లో రాష్ట్రానికి కలిగే నష్టాలను లెక్కలతో సహా ప్రస్తావించినట్లు తెలిసింది. ఒప్పందంలోని పలు నిబంధనలు పూర్తిగా ఛత్తీస్‌గఢ్‌కు అనుకూలంగా ఉన్నాయని, దాంతో రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం పడే అవకాశముందని కూడా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవిత కాలాన్ని 25 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు తగ్గించడం వల్ల స్థిర చార్జీల రూపంలో రాష్ట్రంపై రూ.వందల కోట్ల భారం పడుతుందని పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉందని, చౌకగా లభిస్తోందని కూడా గుర్తు చేసినట్లు తెలిసింది. అందువల్ల కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ ధరకే విద్యుత్ లభించనుందని సూచించినట్లు సమాచారం. ప్రభుత్వానికి తెలపకుండానే..? వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాన్ని ట్రాన్స్‌కో పర్యవేక్షిస్తోంది. అయితే అరవింద్‌కుమార్ ట్రాన్స్‌కోతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లకుండానే ఈఆర్సీకి ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై ట్రాన్స్‌కో విస్మయం వ్యక్తం చేయడంతో.. ఆ ఫైల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం తెప్పించుకుని పరిశీలించినట్లు సమాచారం. మరోవైపు అరవింద్‌కుమార్ రాసిన లేఖను ధ్రువీకరించినా.. దానిని బహిర్గతం చేసేందుకు ఇటు ఇంధన శాఖ, అటు ఈఆర్సీ వర్గాలు నిరాకరించాయి. అయితే దాదాపు 18 నెలలుగా ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్‌కుమార్ ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఈఆర్సీ అధికారి ఒకరు ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంపై ట్రాన్స్‌కో, డిస్కం, ఇంధన శాఖలు పరస్పర భిన్న వాదనలు వినిపిస్తున్నాయని... ఈ నేపథ్యంలో ఈఆర్సీ ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఇంకా ‘చౌక’ ఆశలు! ఛత్తీస్ విద్యుత్ చౌకగానే లభించనుందని ఇంకా కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ విద్యుత్ లభ్యత ధర ప్రాథమికంగా యూనిట్‌కు రూ.3.90 చొప్పున ఉండనుం దని డిస్కంలు గత నెలాఖరులో ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో పేర్కొనడం గమనార్హం. దక్షిణ–ఉత్తర భారతదేశాన్ని అనుసంధానిస్తూ నిర్మిస్తున్న వార్దా–డిచ్పల్లి విద్యుత్ లైన్ల నిర్మాణం వచ్చే ఏప్రిల్‌లోగా పూర్తి కానుందని... ఆ తర్వాత నుంచి రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వస్తుందని ఇంతకాలం అధికారులు ధీమా వ్యక్తం చేస్తూ రావడం గమనార్హం. -
రూ.1,527 కోట్ల విద్యుత్ ‘చార్జీ’!
7.5 శాతం కరెంట్ చార్జీల పెంపు.. జూలై ఒకటి నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. సగటున 7.5 శాతం చొప్పున చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేదీ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. మొత్తంగా రూ.1,527 కోట్ల మేర చార్జీల పెంపునకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) అనుమతిచ్చింది. కొత్త టారీఫ్ వివరాలను టీఎస్ఈఆర్సీ కార్యదర్శి కె.శ్రీనివాస్‌రెడ్డి గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 100 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే గృహ వినియోగదారులకు చార్జీల పెంపు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన60 లక్షల వినియోగదారులకు ఊరట లభించింది. 100 యూనిట్లు దాటితే మాత్రం ప్రతి యూనిట్‌పై అదనంగా 70 పైసల నుంచి ఒక రూపాయి వరకు బిల్లు పెరగనుంది. దీంతో మధ్య తరగతి, సంపన్నులపై రూ.510 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం గృహ వినియోగ కేటగిరీలో ఉన్న 11 స్లాబులను ఈఆర్సీ 8 స్లాబులకు కుదించింది. స్లాబుల కుదింపుతో గృహ వినియోగదారులపై మరికొంత భారం పడనుంది. హెచ్‌టీ కేటగిరీలోని పరిశ్రమల చార్జీలు రూ.6 నుంచి రూ.6.65కు, ఎల్టీ కేటగిరీలోని పరిశ్రమల చార్జీలు రూ.6.40 నుంచి రూ.6.70కు పెరిగాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించిన టారీఫ్ పట్టికను ఈఆర్సీ స్వల్ప మార్పులతో ఆమోదించింది. రూ.1,958 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు ఈఆర్సీ అనుమతి కోరాయి. విద్యుత్ సరఫరా ఖర్చు సగటున యూనిట్‌కు రూ.6.44 అవుతోందని లెక్కగట్టాయి. అయితే ఈఆర్సీ యూనిట్‌కు రూ.5.9 చొప్పున అంచనా వేసింది. దీంతోపాటు వార్షిక విద్యుత్ అవసరాలను 52,063 మిలియన్ యూనిట్లకు తగ్గించడంతో చార్జీల పెంపు భారం రూ.1,527 కోట్లకు తగ్గింది. విద్యుత్ రాయితీలకు రూ.4,584 కోట్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటు గృహ వినియోగదారులకు రాయితీల కోసం ఈ ఏడాది రూ.4584.50 కోట్ల విద్యుత్ సబ్సిడీని డిస్కంలకు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీకి రూ.4,470.10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 0-50 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు రాయితీల కోసం అదనంగా రూ.114 కోట్ల రాయితీని ఇచ్చేందుకు ఒప్పుకుంది. పరిశ్రమలకు ‘పెనాల్టీ’ పరిశ్రమలకు టైమ్ ఆఫ్ డే(టీఓడీ) పెనాల్టీ సమయాన్ని సైతం డిస్కంలు మార్చాయి. ప్రస్తుతం సాయంత్రం 6-10 గంటల వరకు విద్యుత్ వినియోగంపై టీఓడీ పెనాల్టీ విధిస్తుండగా.. ఇకపై ఉదయం 6-10 గంటల వరకు వినియోగంపై యూనిట్‌కు రూపాయి చొప్పున విధించనున్నారు. దీంతో పరిశ్రమలపై అదనంగా మరో 3 శాతం వరకు చార్జీలు పెరగనున్నాయి. ప్రధానంగా నిరంతరం విద్యుత్ వినియోగించుకునే స్టీల్, సిమెంట్, ప్లాస్టిక్, ఫోర్జ్ తదితర పరిశ్రమలపై ప్రభావం ఉండనుంది. సగటున పరిశ్రమలపై మొత్తంగా 10-13 శాతం పెంపు ఉండనుంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో చాలా తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుండడంతో అనేక పరిశ్రమలు డిస్కంల నుంచి కాకుండా ఓపెన్ యాక్సెస్ నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. టీఓడీ వేళల మార్పుతో మరిన్ని పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ బాట పట్టనున్నాయి. అయితే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పరిశ్రమలు విద్యుత్ వినియోగిస్తే ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూపాయి రాయితీని డిస్కంలు ఇవ్వనున్నాయి. ఇతర ముఖ్యాంశాలు.. * హెయిర్ సెలూన్లకు ఇచ్చిన హామీ మేరకు 200 యూ నిట్ల లోపు వినియోగానికి ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్త కేటగిరీ సృష్టించి రాయితీలను వర్తింపజేసింది. * ఆదాయ పన్ను చెల్లింపుదారులైన రైతులు సైతం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను వినియోగించుకోడానికి అనుమతిచింది. అలాగే పట్టణ ప్రాంతాల్లోని ఉద్యాన నర్సరీలను సైతం ఎల్టీ-5 కేటగిరీలో చేర్చింది. * పార్థన స్థలాలపై 2కేడబ్ల్యూ లోడ్ పరిమితిని ఎత్తివేసింది. అంతకు మించిన లోడ్ కోసం కొత్త స్లాబ్‌ను ఏర్పాటు చేసింది. -
చెరో సగం పంచుకున్నారు..!
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు.. అప్పుల పంపిణీ వివాదం ఒకవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండళ్లు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాయి. విభజన చట్టాలన్నీ పక్కన పెట్టి నీకు సగం.. నాకు సగం అన్నట్లుగా టీఎస్ఈఆర్సీ, ఏపీఈఆర్సీ ఆస్తులను పంచేసుకున్నాయి. అంతటితో ఆగకుండా ఉమ్మడి ఖాతాలో ఉన్న రూ.12 కోట్ల డిపాజిట్లను చెరిసగం పంపిణీ చేసుకునేందుకు తెలంగాణ ఆర్థిక శాఖను అనుమతి కోరాయి. దీంతో ఈ నిర్వాకం బయటపడింది. ఏపీఈఆర్సీ నుంచి అందిన ఈ లేఖను చూసి ఆర్థిక శాఖ అధికారులు బిత్తరపోయారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలి. అందుకు భిన్నంగా ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆస్తులు పంచుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీఈఆర్సీ రెండుగా విడిపోయింది. కొత్తగా తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి ఏర్పడింది. విద్యుత్తు వివాదాలు తారాస్థాయికి చేరిన సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా వీటికి కమిషన్లను నియమించాయి. ప్రస్తుతం ఏపీఈఆర్సీకి జస్టిస్ భవానీప్రసాద్ చైర్మన్‌గా, టీఎస్ఈఆర్సీకి ఇస్మాయిల్ అలీఖాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరికి జ్యుడీషియల్ అధికారాలున్నాయి. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో ఉన్న ఏపీఈఆర్సీ కార్యాలయం విభజన అనంతరం.. చెరో ఫ్లోర్‌ను, చెరి సగం ఫర్నిచర్‌ను, ఉద్యోగులను పంచుకున్నాయి. వివాదాలు, విభేదాలేమీ లేకుండా సామరస్యపూర్వకంగా టీఎస్ఈఆర్సీ, ఏపీఈఆర్‌సీలు ఆస్తులు పంచుకున్నట్లుగా కనిపిస్తోంది. కానీ రాష్ట్ర పునర్విభజన చట్టం పూర్తిగా పక్కదారి పట్టింది. జనాభా ప్రకారం పంచుకుంటే ఆస్తుల్లోనూ.. అప్పుల్లోనూ తెలంగాణకు 42 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం వాటా రావాల్సి ఉంది. ఏపీఈఆర్సీకి అప్పుల భారం లేనందున కేవలం ఆస్తులను చెరి సమానంగా పంచుకున్నట్లు అర్థమవుతోంది. కానీ.. ఎవరి ఇష్టారాజ్యంగా వారు ఆస్తులను పంచుకుంటే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. చట్టాన్ని పక్కనబెట్టి రెండు రాష్ట్రాల ఈఆర్సీలు ఆస్తులు పంచుకున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీఈఆర్సీ ఖాతాలో ప్రస్తుతం రూ.12 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తాము సామరస్యంగా వీటిని చెరిసగం పంచుకున్నామని.. ఆమోదించాలని ఏపీఈఆర్సీ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఈ లెక్కన చెరో రూ.ఆరు కోట్లు పంపిణీ జరగాలి. విభజన చట్టంలోని జనాభా శాతం ప్రకారం పంపిణీ జరిగితే.. తెలంగాణకు రూ. 5.76 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 6.24 కోట్లు దక్కుతాయి. ఈ లెక్కన ఫిప్టీ.. ఫిప్టీ చొప్పున పంచుకుంటేనే తెలంగాణకు లాభమనిపిస్తోంది. కానీ.. ఆ మాత్రం దానికి ఆశ పడితే తెలంగాణ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పసిగట్టారు. ఏపీఈఆర్సీలో ఆస్తులను చెరిసగం పంచుకున్నారనే ఒక్క నిర్ణయాన్ని వేలెత్తి చూపించి.. వేలాది కోట్ల అప్పులను సైతం అదే పద్ధతిన పంచుకోవాలని ఏపీ ప్రభుత్వం తిరకాసు పెట్టే ప్రమాదం ఉందని అప్రమత్తమయ్యారు. ఏపీఈఆర్సీ పంపించిన ఫైలును తిప్పిపంపారు.