చెరో సగం పంచుకున్నారు..!
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు.. అప్పుల పంపిణీ వివాదం ఒకవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండళ్లు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాయి. విభజన చట్టాలన్నీ పక్కన పెట్టి నీకు సగం.. నాకు సగం అన్నట్లుగా టీఎస్‌ఈఆర్‌సీ, ఏపీఈఆర్‌సీ ఆస్తులను పంచేసుకున్నాయి. అంతటితో ఆగకుండా ఉమ్మడి ఖాతాలో ఉన్న రూ.12 కోట్ల డిపాజిట్లను చెరిసగం పంపిణీ చేసుకునేందుకు తెలంగాణ ఆర్థిక శాఖను అనుమతి కోరాయి.
దీంతో ఈ నిర్వాకం బయటపడింది. ఏపీఈఆర్‌సీ నుంచి అందిన ఈ లేఖను చూసి ఆర్థిక శాఖ అధికారులు బిత్తరపోయారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలి. అందుకు భిన్నంగా ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆస్తులు పంచుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీఈఆర్‌సీ రెండుగా విడిపోయింది. కొత్తగా తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి ఏర్పడింది.
విద్యుత్తు వివాదాలు తారాస్థాయికి చేరిన సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా వీటికి కమిషన్లను నియమించాయి. ప్రస్తుతం ఏపీఈఆర్‌సీకి జస్టిస్ భవానీప్రసాద్ చైర్మన్‌గా, టీఎస్‌ఈఆర్‌సీకి ఇస్మాయిల్ అలీఖాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరికి జ్యుడీషియల్ అధికారాలున్నాయి. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఉన్న ఏపీఈఆర్‌సీ కార్యాలయం విభజన అనంతరం.. చెరో ఫ్లోర్‌ను, చెరి సగం ఫర్నిచర్‌ను, ఉద్యోగులను పంచుకున్నాయి. వివాదాలు, విభేదాలేమీ లేకుండా సామరస్యపూర్వకంగా టీఎస్‌ఈఆర్‌సీ, ఏపీఈఆర్‌సీలు ఆస్తులు పంచుకున్నట్లుగా కనిపిస్తోంది.
కానీ రాష్ట్ర పునర్విభజన చట్టం పూర్తిగా పక్కదారి పట్టింది. జనాభా ప్రకారం పంచుకుంటే ఆస్తుల్లోనూ.. అప్పుల్లోనూ తెలంగాణకు 42 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం వాటా రావాల్సి ఉంది. ఏపీఈఆర్‌సీకి అప్పుల భారం లేనందున కేవలం ఆస్తులను చెరి సమానంగా పంచుకున్నట్లు అర్థమవుతోంది. కానీ.. ఎవరి ఇష్టారాజ్యంగా వారు ఆస్తులను పంచుకుంటే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. చట్టాన్ని పక్కనబెట్టి రెండు రాష్ట్రాల ఈఆర్‌సీలు ఆస్తులు పంచుకున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఏపీఈఆర్‌సీ ఖాతాలో ప్రస్తుతం రూ.12 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తాము సామరస్యంగా వీటిని చెరిసగం పంచుకున్నామని.. ఆమోదించాలని ఏపీఈఆర్‌సీ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఈ లెక్కన చెరో రూ.ఆరు కోట్లు పంపిణీ జరగాలి. విభజన చట్టంలోని జనాభా శాతం ప్రకారం పంపిణీ జరిగితే.. తెలంగాణకు రూ. 5.76 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 6.24 కోట్లు దక్కుతాయి.
ఈ లెక్కన ఫిప్టీ.. ఫిప్టీ చొప్పున పంచుకుంటేనే తెలంగాణకు లాభమనిపిస్తోంది. కానీ.. ఆ మాత్రం దానికి ఆశ పడితే తెలంగాణ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పసిగట్టారు. ఏపీఈఆర్‌సీలో ఆస్తులను చెరిసగం పంచుకున్నారనే ఒక్క నిర్ణయాన్ని వేలెత్తి చూపించి.. వేలాది కోట్ల అప్పులను సైతం అదే పద్ధతిన పంచుకోవాలని ఏపీ ప్రభుత్వం తిరకాసు పెట్టే ప్రమాదం ఉందని అప్రమత్తమయ్యారు. ఏపీఈఆర్‌సీ పంపించిన ఫైలును తిప్పిపంపారు.