‘ఛత్తీస్’ విద్యుత్‌తో నష్టమే!
► స్పష్టం చేసిన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ∙
► బదిలీకి ఓ రోజు ముందు ఈఆర్సీకి లేఖ రాసిన సీనియర్ ఐఏఎస్
► రాష్ట్రానికి కలిగే నష్టాలపై లెక్కలతో సహా వివరణ
► కాంపిటీటివ్ బిడ్డింగ్‌తో విద్యుత్ కొనుగోళ్లు మేలని సూచన
► స్థిరచార్జీల రూపంలో వందల కోట్ల భారం పడే అవకాశముందని వెల్లడి
► బదిలీకి ఒక రోజు ముందు ఈ లేఖ రాయడంపై చర్చ
► ప్రభుత్వానికి తెలియకుండానే లేఖ?
సాక్షి, హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో రాష్ట్రానికి నష్టం జరుగుతుందా? దానివల్ల వేల కోట్ల రూపాయల భారం తప్పదా? ఇన్నాళ్లూ విద్యుత్ రంగ నిపుణులు, విపక్షాలు ఇదే వాదన వినిపించాయి. తాజాగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశముందని, దీనికి బదులు కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియలో విద్యుత్ కొనుగోళ్లు జరిపితే ప్రయోజనకరమంటూ... తన బదిలీకి ఒక రోజు ముందు, గత నెల 30న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ)కి లేఖ రాశారు. ప్రభుత్వానికి సమాచారమివ్వకుండా రాసిన ఈ లేఖ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనితో ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. దీనిపై త్వరలోనే ఈఆర్సీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
వెయ్యి మెగావాట్ల కోసం ఒప్పందం
ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2015 సెప్టెంబర్ 22న ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సాధారణంగా టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉన్నా.. దానికి బదులుగా పరస్పర అంగీకార ఒప్పందం (ఎంఓయూ) విధానంలో 12 ఏళ్లకు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది. అయితే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధర ఎక్కువగా ఉందని, అది రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని విద్యుత్ రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారానే విద్యుత్ కొనుగోళ్లు జరపాలని వారు సూచించడంతో.. ఈ ఒప్పందంపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించింది. ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల చొప్పున 12 ఏళ్ల ఒప్పంద కాలంలో రాష్ట్ర ప్రజలపై రూ.10 వేల కోట్ల వరకు భారం పడుతుందని నిపుణులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం మాత్రం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ చౌకగా వచ్చే అవకాశముందంటూ సమర్థించుకుంది. భిన్న వాదనలు రావడంతో ఆ ఒప్పందానికి అనుమతిపై ఈఆర్సీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఛత్తీస్‌గఢ్ ఒత్తిడితో..
విద్యుత్‌కొనుగోలు ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలంటూ ఇటీవల ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ స్వయంగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ ఒప్పందంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఈఆర్సీని కోరేందుకు ఇటీవల ఇంధనశాఖ ఓ లేఖను సిద్ధం చేసి... ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఆమోదం కోసం పంపించింది. అయితే ఆయన ఆ ముసాయిదా లేఖలో కీలక మార్పులు చేసి ఈఆర్సీకి పంపారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అందులో సూచించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తే వివిధ రూపాల్లో రాష్ట్రానికి కలిగే నష్టాలను లెక్కలతో సహా ప్రస్తావించినట్లు తెలిసింది. ఒప్పందంలోని పలు నిబంధనలు పూర్తిగా ఛత్తీస్‌గఢ్‌కు అనుకూలంగా ఉన్నాయని, దాంతో రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం పడే అవకాశముందని కూడా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవిత కాలాన్ని 25 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు తగ్గించడం వల్ల స్థిర చార్జీల రూపంలో రాష్ట్రంపై రూ.వందల కోట్ల భారం పడుతుందని పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉందని, చౌకగా లభిస్తోందని కూడా గుర్తు చేసినట్లు తెలిసింది. అందువల్ల కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ ధరకే విద్యుత్ లభించనుందని సూచించినట్లు సమాచారం.
ప్రభుత్వానికి తెలపకుండానే..?
వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాన్ని ట్రాన్స్‌కో పర్యవేక్షిస్తోంది. అయితే అరవింద్‌కుమార్ ట్రాన్స్‌కోతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లకుండానే ఈఆర్సీకి ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై ట్రాన్స్‌కో విస్మయం వ్యక్తం చేయడంతో.. ఆ ఫైల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం తెప్పించుకుని పరిశీలించినట్లు సమాచారం. మరోవైపు అరవింద్‌కుమార్ రాసిన లేఖను ధ్రువీకరించినా.. దానిని బహిర్గతం చేసేందుకు ఇటు ఇంధన శాఖ, అటు ఈఆర్సీ వర్గాలు నిరాకరించాయి. అయితే దాదాపు 18 నెలలుగా ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్‌కుమార్ ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఈఆర్సీ అధికారి ఒకరు ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంపై ట్రాన్స్‌కో, డిస్కం, ఇంధన శాఖలు పరస్పర భిన్న వాదనలు వినిపిస్తున్నాయని... ఈ నేపథ్యంలో ఈఆర్సీ ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
ఇంకా ‘చౌక’ ఆశలు!
ఛత్తీస్ విద్యుత్ చౌకగానే లభించనుందని ఇంకా కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ విద్యుత్ లభ్యత ధర ప్రాథమికంగా యూనిట్‌కు రూ.3.90 చొప్పున ఉండనుం దని డిస్కంలు గత నెలాఖరులో ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో పేర్కొనడం గమనార్హం. దక్షిణ–ఉత్తర భారతదేశాన్ని అనుసంధానిస్తూ నిర్మిస్తున్న వార్దా–డిచ్‌పల్లి విద్యుత్ లైన్ల నిర్మాణం వచ్చే ఏప్రిల్‌లోగా పూర్తి కానుందని... ఆ తర్వాత నుంచి రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వస్తుందని ఇంతకాలం అధికారులు ధీమా వ్యక్తం చేస్తూ రావడం గమనార్హం.