'కీచక' ఐఏఎస్ అరెస్టు!
రాయగఢ్: తన ఇంట్లో పనిచేస్తున్న 16 ఏండ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఛత్తీస్గఢ్లో ఓ ఐఏఎస్ అధికారి అరెస్టయ్యాడు. ఐఏఎస్ ఏకే ధ్రిత్లారే (56)ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఖర్సియా ప్రాంత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా ఉన్నప్పుడు ధ్రిత్లారే తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న బాలికను పలుసార్లు లైంగికంగా వేధించారని, దీంతో బాధిత బాలిక గత జూన్ 15న రాయ్గఢ్ కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.
ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు నలుగురు అధికారులతో విచారణబృందాన్ని ఏర్పాటుచేశారు. ధ్రిత్లారేను కలెక్టరేట్కు బదిలీ చేశారు. విచారణ బృందం దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల ఆధారంగా పోలీసులు ధ్రిత్లారేను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రూ. 25 వేల పూచీకత్తుపై ఛత్తీస్గఢ్ హైకోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చింది. దీంతో ఆయన బెయిలుపై విడుదలయ్యారు.