ఆ ఐఏఎస్ అధికారికి శిక్ష పడింది!
హైదరాబాద్ : అనుచితంగా ప్రవర్తించిన ఓ ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీల సందర్భంగా ఓ యువ ఐఏఎస్ అధికారి.. రోగి బెడ్‌పై కాలు ఉంచి మాట్లాడుతుండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరికి ప్రభుత్వం ఆ అధికారిపై సస్పెండ్ వేటు వేసింది. అంతేకాదు.. కొత్తగా వచ్చే అధికారులకు దీనిని ఒక పాఠంగా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.... ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జగదీష్ శంకర్ 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన గతవారం బల్‌రాంపూర్‌లోని స్థానిక రామానుజ్‌గంజ్ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవలు, వసతులపై రోగులతో ఆయన మాట్లాడారు. ఒక రోగితో మాట్లాడుతున్న సమయంలో జగదీష్ శంకర్ తన బూటు కాలిని ఆమె బెడ్‌పై ఉంచారు. దీనిని ఓ ఆగంతకుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిని చూసిన వారంతా సదరు ఐఏఎస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఆ అధికారిని సస్పెండ్ చేయటంతోపాటు ప్రజలతో ఎలా మెలగాలో కొత్తగా వచ్చే అధికారులకు నేర్పాలంటూ సాధారణ పరిపాలన విభాగాన్ని ఆదేశించారు.