
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుమతించినట్లు సమాచారం. దీంతో వార్షిక బడ్జెట్ అంచనాల నివేదిక (ఏఆర్‌ఆర్)తో పాటు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు శనివారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)కి సమర్పించే అవకాశముంది. ఈఆర్సీ అనుమతి లాంఛనమే కాగా, పెరిగిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోఅమల్లోకి రానున్నాయి. 2020–21కి సంబంధించిన ఏఆర్‌ఆర్ నివేదిక, విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను గతేడాది నవంబర్ నెలాఖరులోగా డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా, వివిధ కారణాలు చూపి వరుసగా గడువు పొడిగింపును పొందుతూ వస్తున్నాయి. చివరిసారిగా పొడిగించిన గడువు నేటి (శనివారం)తో ముగియనుంది.
ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమై చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను శనివారం ఈఆర్సీకి సమర్పించేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మిషన్ భగీరథ, ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపును ఈ సమావేశంలో సీఎం వ్యతిరేకించినట్లు సమాచారం. కమర్షియల్, పరిశ్రమల కేటగిరీల వినియోగదారులపై చార్జీల పెంపు భారం గతంలో కంటే అధికంగా పడే అవకాశం ఉందని సమాచారం. గృహ వినియోగదారులపై కూడా చార్జీల పెంపు భారం వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment