రూ.1,527 కోట్ల విద్యుత్ ‘చార్జీ’!
7.5 శాతం కరెంట్ చార్జీల పెంపు.. జూలై ఒకటి నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. సగటున 7.5 శాతం చొప్పున చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేదీ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. మొత్తంగా రూ.1,527 కోట్ల మేర చార్జీల పెంపునకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ) అనుమతిచ్చింది. కొత్త టారీఫ్ వివరాలను టీఎస్‌ఈఆర్సీ కార్యదర్శి కె.శ్రీనివాస్‌రెడ్డి గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
100 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే గృహ వినియోగదారులకు చార్జీల పెంపు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన60 లక్షల వినియోగదారులకు ఊరట లభించింది. 100 యూనిట్లు దాటితే మాత్రం ప్రతి యూనిట్‌పై అదనంగా 70 పైసల నుంచి ఒక రూపాయి వరకు బిల్లు పెరగనుంది. దీంతో మధ్య తరగతి, సంపన్నులపై రూ.510 కోట్ల అదనపు భారం పడనుంది.
ప్రస్తుతం గృహ వినియోగ కేటగిరీలో ఉన్న 11 స్లాబులను ఈఆర్‌సీ 8 స్లాబులకు కుదించింది. స్లాబుల కుదింపుతో గృహ వినియోగదారులపై మరికొంత భారం పడనుంది. హెచ్‌టీ కేటగిరీలోని పరిశ్రమల చార్జీలు రూ.6 నుంచి రూ.6.65కు, ఎల్‌టీ కేటగిరీలోని పరిశ్రమల చార్జీలు రూ.6.40 నుంచి రూ.6.70కు పెరిగాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించిన టారీఫ్ పట్టికను ఈఆర్సీ స్వల్ప మార్పులతో ఆమోదించింది.
రూ.1,958 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు ఈఆర్సీ అనుమతి కోరాయి. విద్యుత్ సరఫరా ఖర్చు సగటున యూనిట్‌కు రూ.6.44 అవుతోందని లెక్కగట్టాయి. అయితే ఈఆర్సీ యూనిట్‌కు రూ.5.9 చొప్పున అంచనా వేసింది. దీంతోపాటు వార్షిక విద్యుత్ అవసరాలను 52,063 మిలియన్ యూనిట్లకు తగ్గించడంతో చార్జీల పెంపు భారం రూ.1,527 కోట్లకు తగ్గింది.
విద్యుత్ రాయితీలకు రూ.4,584 కోట్లు
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటు గృహ వినియోగదారులకు రాయితీల కోసం ఈ ఏడాది రూ.4584.50 కోట్ల విద్యుత్ సబ్సిడీని డిస్కంలకు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. బడ్జెట్‌లో విద్యుత్ సబ్సిడీకి రూ.4,470.10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 0-50 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు రాయితీల కోసం అదనంగా రూ.114 కోట్ల రాయితీని ఇచ్చేందుకు ఒప్పుకుంది.
పరిశ్రమలకు ‘పెనాల్టీ’
పరిశ్రమలకు టైమ్ ఆఫ్ డే(టీఓడీ) పెనాల్టీ సమయాన్ని సైతం డిస్కంలు మార్చాయి. ప్రస్తుతం సాయంత్రం 6-10 గంటల వరకు విద్యుత్ వినియోగంపై టీఓడీ పెనాల్టీ విధిస్తుండగా.. ఇకపై ఉదయం 6-10 గంటల వరకు వినియోగంపై యూనిట్‌కు రూపాయి చొప్పున విధించనున్నారు. దీంతో పరిశ్రమలపై అదనంగా మరో 3 శాతం వరకు చార్జీలు పెరగనున్నాయి.
ప్రధానంగా నిరంతరం విద్యుత్ వినియోగించుకునే స్టీల్, సిమెంట్, ప్లాస్టిక్, ఫోర్జ్ తదితర పరిశ్రమలపై ప్రభావం ఉండనుంది. సగటున పరిశ్రమలపై మొత్తంగా 10-13 శాతం పెంపు ఉండనుంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో చాలా తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుండడంతో అనేక పరిశ్రమలు డిస్కంల నుంచి కాకుండా ఓపెన్ యాక్సెస్ నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. టీఓడీ వేళల మార్పుతో మరిన్ని పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ బాట పట్టనున్నాయి. అయితే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పరిశ్రమలు విద్యుత్ వినియోగిస్తే ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూపాయి రాయితీని డిస్కంలు ఇవ్వనున్నాయి.
ఇతర ముఖ్యాంశాలు..
* హెయిర్ సెలూన్లకు ఇచ్చిన హామీ మేరకు 200 యూ నిట్ల లోపు వినియోగానికి ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్త కేటగిరీ సృష్టించి రాయితీలను వర్తింపజేసింది.
* ఆదాయ పన్ను చెల్లింపుదారులైన రైతులు సైతం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను వినియోగించుకోడానికి అనుమతిచింది. అలాగే పట్టణ ప్రాంతాల్లోని ఉద్యాన నర్సరీలను సైతం ఎల్‌టీ-5 కేటగిరీలో చేర్చింది.
* పార్థన స్థలాలపై 2కేడబ్ల్యూ లోడ్ పరిమితిని ఎత్తివేసింది. అంతకు మించిన లోడ్ కోసం కొత్త స్లాబ్‌ను ఏర్పాటు చేసింది.