power price
-
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై విద్యుత్ చార్జీల బాదుడు
-
విద్యుత్ ఛార్జీలు పెంచడంపై చంద్రబాబుకు ఉషశ్రీ చరణ్ దిమ్మతిరిగే కౌంటర్
-
AP: వినియోగదారులకు భారీ ఊరట.. విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్లే..
సాక్షి, అమరావతి విశాఖపట్నం: విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ ఊరట కలిగించాయి! వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ కేటగిరీలోనూ చార్జీలను పెంచాలని డిస్కమ్‌లు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి రావడం ఆనవాయితీ. పేదలు మినహా అన్ని వర్గాల వినియోగదారులపై ఎంతో కొంత పెంపు సాధారణంగా ఉంటుంది. అయితే అనూహ్యంగా ఈదఫా చార్జీలు పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించలేదు. దీంతో విద్యుత్ వినియోగదారులపై వచ్చే ఏడాది విద్యుత్ చార్జీల భారం ఉండదని స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) సమర్పించిన 2023–24 వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరల ప్రతిపాదనపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ గురువారం విశాఖలో మొదలైంది. శనివారం వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు వెబ్ లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు (లైవ్ స్ట్రీమింగ్) చూడవచ్చు. డిస్కమ్‌ల సీఎండీలు తమ టారిఫ్ నివేదికలో గృహ, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక విద్యుత్ వినియోగంపై చార్జీల పెంపునకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. కేవలం ఇంటెన్సివ్ పరిశ్రమల (ఫెర్రో అల్లాయిస్) టారిఫ్‌ను మాత్రమే మార్చాలని ఏపీఈఆర్సీని డిస్కమ్‌లు కోరాయి. హెచ్‌టీ పరిశ్రమలకు వర్తించే టారిఫ్‌నే వాటికీ వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశాయి. ఫెర్రో పరిశ్రమలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. అక్కడ ధరలు పెరిగినప్పుడు, వేసవిలోనూ డిస్కమ్‌ల నుంచి విద్యుత్ తీసుకుంటున్నాయి. దీనివల్ల డిస్కమ్‌లు ఆర్థికంగా నష్టపోతున్నట్లు సీఎండీలు మండలికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయాల స్వీకరణ తొలిరోజు 20 మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభ్యంతరాలు, సూచనలను, తెలియచేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన మునిరత్నంరెడ్డి తిరుపతిలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఆపరేషన్) సర్కిల్ కార్యాలయం నుంచి ఏపీఈఆర్సీ దృష్టికి తెచ్చారు. కుటీర పరిశ్రమలకు విద్యుత్ లోడ్ పరిమితిని 20 హెచ్‌పీ వరకు పెంచాలని కావలికి చెందిన శాంతకుమార్ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా బాగుందని కడప జిల్లా నుంచి రమణారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల తరహాలో బీసీలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని పాకాల నుంచి మునుస్వామి నాయుడు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఎస్ఈ కార్యాలయం నుంచి మాట్లాడిన వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. వ్యవసాయం, గృహాలకు మీటర్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపై భారం లేదు విద్యుత్ వినియోగదారులపై చార్జీల భారం మోపేలా డిస్కమ్‌లు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిస్కమ్‌లన్నీ సామాన్యులపై భారం మోపేందుకు అంగీకరించకపోవడం శుభపరిణామమన్నారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపై 2023–24లో ఎలాంటి భారం ఉండదని చెప్పారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు రాయితీలు కొనసాగిస్తూ డిమాండ్ చార్జీలు, టైమ్ ఆఫ్ ది డే, కనీస చార్జీల పెంపు అంశాల్లో మార్పులు చేయాలని డిస్కమ్‌లు కోరినట్లు తెలిపారు. దీన్ని క్షుణ్నంగా పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం నుంచి రావాలి్సన బకాయిల విషయంలో రాజకీయ ఆరోపణలన్నీ నిరాధారమని, వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలను తెలియచేయవచ్చన్నారు. అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వెలువరిస్తామని తెలిపారు. విద్యుత్ సేవల్లో జాప్యం జరిగితే సంబంధిత డిస్కమ్‌లు వినియోగదారులకు పరిహారం చెల్లించాలి్సందేనని, దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారిపై భారం పడకుండా ప్రభుత్వం, ఏపీఈఆర్సీ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. డిస్కమ్‌లు చేసే ఎన్నో ప్రతిపాదనల్ని తిరస్కరిస్తున్నామని, సహేతుక కారణాలుంటే మినహా ఈఆర్సీ అనుమతులు మంజూరు చేసే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో ఏపీఈఆర్సీ కార్యదర్శి రాజబాపయ్య, ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు, సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డితో పాటు డిస్కమ్‌ల డైరెక్టర్లు ఏవీవీ సూర్యప్రతాప్, డి.చంద్రం, బి.రమేష్‌ప్రసాద్, ఎస్ఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. – ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి -
పట్టుబట్టిన రాష్ట్రం.. చేజిక్కిన 'పవర్'
సాక్షి, అమరావతి: ప్రజలకు ఇబ్బంది కలిగించే కేంద్ర విద్యుత్ సంస్కరణలపై రాష్ట్రం చేసిన ఒత్తిడి ఫలించింది. కీలకమైన విద్యుత్ ధరల నియంత్రణాధికారం తమ గుప్పిట్లోకి తీసుకునే ఆలోచనను విరమించుకుంది. రాష్ట్రాలకే ఈ అధికారం ఉండేలా ముసాయిదాలో మార్పు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలిని కొనసాగించేందుకు వీలుగా కేంద్రం ఓ మెట్టు దిగింది. సవరించిన ముసాయిదాపై బుధవారం కేంద్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులు అన్ని రాష్ట్రాల విద్యుత్ అధికారులతో చర్చించనున్నారు. తాజా నిర్ణయం వల్ల ప్రజలపై ఇష్టానుసారం విద్యుత్ చార్జీల భారం పడకుండా నియంత్రించే వీలుంది. ముందే స్పందించిన ఏపీ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా చట్ట సవరణకు ముసాయిదా ప్రతిని గత ఏడాది రాష్ట్రాలకు పంపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ధరలను నిర్ణయించే అధికారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి ఉంటుంది. దీన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నది సంస్కరణల్లో ఒక అంశం. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. డిస్కమ్‌లు అందించే విద్యుత్ వినియోగదారుడికి చేరడానికి యూనిట్‌కు రూ.6 పైనే అవుతుంది. ఇంత భారం పేద, మధ్య తరగతిపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా 2020–21లో రూ.1700 కోట్లు గృహ విద్యుత్‌కు సబ్సిడీ ఇచ్చింది. రైతన్నకు 9 గంటల పగటి పూట విద్యుత్ ఇవ్వడానికి ఏకంగా దాదాపు రూ.9 వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. ధరల నియంత్రణ కేంద్రం చేతుల్లోకెళ్తే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. ఏపీ స్ఫూర్తితోనే ఇతర రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ముసాయిదాపై నేడు చర్చ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. అయితే, ఏపీఈఆర్సీలోనూ తమూ ఒక సభ్యుడిని నియమించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీనికి తోడు డిస్కమ్‌లు, విద్యుత్ ఉత్పత్తిదారులకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి కేంద్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటును సూచిస్తోంది. ఈ ప్రతిపాదనను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉత్పత్తి ధరను ఖరారు చేసేది రాష్ట్రాలైనప్పుడు ట్రిబ్యునల్ ఢిల్లీలో ఉంటే సమస్యలొస్తాయని రాష్ట్రాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపే చర్చలు కీలకం కాబోతున్నాయి. ఏపీ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా కేంద్రానికి స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చాలని నిర్ణయంచుకున్నట్టు విద్యుత్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
‘పవర్’ దందాకు చెక్
సాక్షి, అమరావతి: అవినీతిని అడ్డుకునే క్రమంలో ఏపీ విద్యుత్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా జరిగిన అక్రమ పవన విద్యుత్ కొనుగోలును నిలిపివేసింది. తాత్కాలిక కనెక్షన్ల పేరుతో కొనసాగుతున్న 404.4 మెగావాట్ల విండ్ పవర్ కొనుగోలు నిబంధనలకు విరుద్ధమని తేల్చారు. గత సర్కార్‌లోని పెద్దలు హద్దులు మీరి అనుయాయుల కోసమే ఈ లబ్ధి చేకూర్చినట్లు స్పష్టమవ్వడంతో తక్షణమే ఈ విద్యుత్ తీసుకోవడాన్ని నిలిపివేయాలని సోమవారం అనంతపురం జిల్లా విద్యుత్ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. విద్యుత్ కొనుగోలును నిలిపివేసిన సంస్థల్లో రెనర్జీ డెవలపర్స్ (99.8 మె.వా), ఎకొరాన్ ఎనర్జీ లిమిటెడ్ (99.8 మె.వా), హెలియన్ ఇన్ఫ్రాటెక్ (100.8 మె.వా), వాయుపుత్ర (20 మె.వా), గుట్టసీమ విండ్ పవర్ (80 మె.వా) ఉన్నాయి. దీంతో రోజుకు రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. కాగా, డిస్కమ్‌లు ఈ విద్యుత్‌ను యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. దీన్నివల్ల థర్మల్ పవర్ ఆపేయడం అనివార్యమవుతుంది. అంతేకాక.. థర్మల్ ప్లాంట్లకు యూనిట్‌కు రూ.1.20 చొప్పున స్థిరఛార్జి చెల్లిస్తున్నారు. అంటే విండ్ పవర్ ఖరీదు యూనిట్‌కు రూ.6.04 వరకూ పడుతోంది. సర్కారు నిర్ణయంతో నెలకు కనీసం రూ.36 కోట్ల వరకు విద్యుత్ సంస్థలపై భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. సంప్రదాయేతర ఇంధన, పునరుత్పత్తి వనరులను ప్రోత్సహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లక్ష్యాలను పెట్టింది. గత ప్రభుత్వం దీన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పవన, సౌర విద్యుత్ కనెక్షన్లకు అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా ఈ విద్యుత్ ధరలు తగ్గుతున్నా అత్యధిక ధరకు 25ఏళ్ల పాటు కొనేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి గ్రీన్ కారిడార్ పరిధిలో 997 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే గ్రిడ్‌కు అనుసంధానం చేసే మౌలిక సదుపాయాలున్నాయి. కానీ, గత ప్రభుత్వంలోని అధికారులు ఏకంగా 1851 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి అనుమతించడంతో అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో వీటిని తాత్కాలిక కనెక్షన్లుగా పరిగణిస్తామని అప్పట్లో అధికారులు చెప్పారు. పేరుకు తాత్కాలికమే అయినా, గ్రిడ్‌పై అధిక లోడ్‌తోనే ఇవి విద్యుదుత్పత్తి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి అధికారులు గత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం దీనిపై నిపుణులతో కమిటీ వేసి, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన తాత్కాలిక కనెక్షన్లను తొలగించింది. -
తుది నిర్ణయం తెలంగాణ ఈఆర్సీదే!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి తమ సంస్థలు కొనుగోలు చేసే విద్యుత్ ధరలపై తుది నిర్ణయం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)దేనని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) స్పష్టం చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయం పెరుగుదలపై ఆ రాష్ట్ర ఈఆర్సీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా సవరించే కొనుగో లు ఒప్పందాన్ని మళ్లీ తెలంగాణ ఈఆర్సీ ఆమోదించాల్సి ఉం టుందన్నాయి. మార్వా విద్యుత్ ప్లాంటు పెట్టుబడి వ్యయం పెరగడంతో.. ఆ మేర విద్యుత్ ధర పెంచాలంటూ ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆ రాష్ట్ర ఈఆర్సీ విచారణ నిర్వహించింది. మార్వా ప్లాంటు విద్యుత్ ధరను ఆ రాష్ట్ర ఈఆర్సీ పెంచితే.. దాని నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్న తెలంగాణపై తీవ్ర భారం పడుతుంది. దీంతో తెలంగాణ డిస్కంల అధికారులు.. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ విచారణకు హాజరై రాష్ట్రం తరఫున వాదనలు వినిపించారు. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) నిర్దేశించిన అన్నిరకాల పరిమితులకు మించి మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయం, నిర్మాణ వ్యవధి పెరిగాయని.. దీంతో విద్యుత్ ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ప్లాంటు నిర్మాణానికి మెగావాట్‌కు రూ.6.32 కోట్ల వ్యయంతో అనుమతించారని.. కానీ నిర్మాణంలో జాప్యం, వడ్డీలు పెరగడం తో ఈ వ్యయం మెగావాట్‌కు రూ.9.2 కోట్లకు చేరిందన్నారు. గతంలో అనేక విద్యుత్ కేంద్రాల పెట్టుబడి వ్యయాన్ని.. ఆయా రాష్ట్రాల ఈఆర్సీలు, సీఈఆర్సీ తగ్గించి ఆమోదించాయని ఉదాహరణలతో వివరించారు. అందువల్ల మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయాన్ని పునఃసమీక్షించి.. తగ్గించాకే ఆమోదించాలని కోరారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పెరిగిన వ్యయాన్ని ఆమోదిస్తే మోతే! ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ ప్లాంటు నుంచి 12 ఏళ్లపాటు 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2015లో దీర్ఘకాలిక ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ తాత్కాలికంగా నిర్ణయించిన మేరకు యూనిట్‌కు రూ.3.90 లెక్కన గతేడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా జరుగుతోంది. అయితే రూ.8,999 కోట్ల మేర పెరిగిన ప్లాంటు నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని యూనిట్‌కు రూ.4.47కు ధర పెంచాలని ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర ఈఆర్సీని కోరింది. దీంతోపాటు తొలినుంచి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి ట్రూప్ చార్జీల (ప్రస్తుతం నిర్ణయించనున్న ధరకు, తాత్కాలిక ధరకు మధ్య తేడా సొమ్ము)ను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరింది. దీనిని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదిస్తే.. ట్రూప్ చార్జీల కింద రూ.788 కోట్లు చెల్లించాల్సి రావడంతోపాటు విద్యుత్ ధర కూడా భారంగా మారుతుంది. బలంగా వాదనలు వినిపించాం ‘‘మార్వా ప్లాంటు పెట్టుబడి వ్యయం పెంపును ఆమోదించవద్దని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ముందు బలంగా వాదనలు వినిపించాం. ధరలు పెంచే అవకాశం లేదు. ఒకవేళ ధర పెంచితే అప్పిలేట్ ట్రిబ్యునల్, సీఈఆర్సీల్లో సవాలు చేస్తాం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునః సమీక్షించే ఆలోచన లేదు..’’– డి.ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో సీఎండీ -
భివండీ బంద్
భివండీ, న్యూస్‌లైన్: మహారాష్ట్ర మాంఛెస్టర్గా పేరున్న భివండీ బుధవారం స్తంభించింది. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్త్రపరిశ్రమల యజమానులు బుధవారం నుంచి ఈ నెల 15 వరకు బంద్ పాటిస్తున్నారు. దీంతో పట్టణంలో ఉన్న సుమారు 10 లక్షల మరమగ్గాలు, ఇతర యంత్రాలు నిలిచిపోయాయి. భివండీ పవర్లూమ్ సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఆరు నుంచి 15 వరకు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది భివండీకి వలస వచ్చారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా వ్యాపారాలు మందకొడిగా సాగుతుండడంతో వేలాది మంది యజమానులు, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరమగ్గాల కార్మికుల కోసం సంక్షేమ పథకాలు, ప్రత్యేక సదుపాయాలు కల్పించకపోవడంతో వీరి జీవితాల్లో సంక్షోభాలు తప్పడం లేదు. సుమారు 12 లక్షలకు పైగా జనాభా ఉన్న భివండీలో 90 శాతం మంది ప్రజలు వస్త్రపరిశ్రమలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ మరమగ్గాల పరిశ్రమలు నడిస్తేనే ఇతర వ్యాపారాలూ నడుస్తాయి. గత మూడు సంవత్సరాల నుంచి నూలు ధరల్లో హెచ్చుతగ్గుల వలన వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో ఇప్పటికే 30 శాతం చిన్నపాటి పరిశ్రమలు మూతబడ్డాయి. మూతబడ్డవాటిలో తెలుగు వారికి చెందిన పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఒకటి నుంచి విద్యుత్ చార్జీలను పెంచి పరిశ్రమల యజమానుల నడ్డి విరుస్తోందని భివండీ పవర్లూమ్ సంఘర్ష్ సమితి సభ్యులు ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరమగ్గాల యంత్రాలను కిలోల చొప్పున చిత్తు మాదిరిగా అమ్ముకోవాల్సి వస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భివండీ పద్మనగర్ పవర్లూమ్ అసోసియేషన్, శాంతినగర్ పవర్లూమ్ అసోసియేషన్, అలాగే షోలాపూర్, ఇచ్చల్కరేంజీ, సాంగ్లీ, మాలేగావ్, విఠా, సతారా ప్రాంతాల్లోని సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, విద్యుత్‌శాఖ మంత్రి అజిత్ పవార్‌ను గత నెల మూడున కలిసి తమ సమస్యలపై చర్చించారు. మరమగ్గాల కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చినా ఇంత వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భివండీ పవర్లూమ్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో పట్టణంలోని అన్ని పరిశ్రమలను మూసివేసి బంద్ పాటిస్తున్నారు. ముత్యాల ఫ్యాక్టరీలు, డయింగ్ ఫ్యాక్టరీలు కూడా బంద్‌లో పాలొన్నాయి. -
మరోసారి వడ్డన
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసే సంస్థలు (డిస్కమ్‌లు) ‘మహానిర్మితి’, ‘మహాపారేషణ్’ 2010 నుంచి విద్యుత్‌శాఖకు (మహావితరణ) చెల్లించాల్సిన బకాయిలు వసూలు చేసేందుకు మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఎంవీఆర్సీ) అనుమతి ఇచ్చింది. దీంతో ఈ రెండు డిస్కమ్‌ల అధీనంలో ప్రాంతాల వినియోగదారులపై అదనపు భారం తప్పకపోవచ్చు. మహానిర్మితి, మహాపారేషణ్ విద్యుత్‌శాఖకు సుమారు రూ.3,686 కోట్లు బకాయి పడ్డాయి. వీటిని వసూలు చేసేందుకు అనుమతి లభించడంతో ఈ మొత్తాన్ని వినియోగదారుల ద్వారా రాబట్టనుంది. ఫలితంగా ఇక నుంచి యూనిట్‌కు 80-90 పైసల చొప్పున అదనంగా వసూలు చేస్తారు. ముంైబె కర్లకు విద్యుత్ సరఫరాచేస్తున్న ‘బెస్ట్’ సంస్థ సెప్టెంబరు నుంచి చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహావితరణ రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులపై చార్జీల భారం మోపుతోంది. ఇందులో దాదాపు 1.20 కోట్ల మందికిపైగా వినియోగదారులు 100-300 యూనిట్లు వాడేవారున్నారు. పెరిగిన చార్జీల వల్ల 100 యూనిట్లు వాడే వారికి నెలకు అదనంగా రూ.90 భారం పడనుంది. మహానిర్మితి, మహాపారేషణ్కు బకాయిలు వసూలు చేసేందుకు మొదట్లోనే అనుమతి ఇచ్చినట్లయితే వినియోగదారులపై ఇప్పుడు ఈ భారం పడేది కాదని అంటున్నారు. సదరు కంపెనీలు ఏళ్ల తరబడి విద్యుత్ చార్జీలు పెంచడం లేదు. ఎంవీఆర్సీ అనుమతివ్వడంతో చార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీంతో వినియోగదారులపై ఒకేసారి పెద్ద ఎత్తున అదనపు భారం పడుతుందని అంటున్నారు. ఎప్పటికప్పుడు విద్యుత్ చార్జీలు పెంచితే యూనిట్‌కు 20-30 పైసల చొప్పున భారం పడేది. కాని ఏకంగా యూనిట్‌కు 90 పైసలు పెంచడంతో 200-300 యూనిట్లు వాడేవారికి ఏకంగా నెలకు అదనంగా రూ.250 వరకు బిల్లు వచ్చే ఆస్కారం ఏర్పడింది. సీఎన్జీ ధరలు కూడా విద్యుత్ చార్జీలకు సీఎన్జీ తోడయింది. ఇటీవలే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫలితంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సీఎన్జీ ధరలు పెరిగాయి. కిలో సీఎన్జీ ధరను రూ.మూడు చొప్పున పెంచుతున్నట్టు సంబంధిత అధికారులు శుక్రవారం ప్రకటించారు. కొత్త ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబై: రూ. 38.95 ఠాణే: రూ. 39.69 నవీముంబై: రూ. 39.44