Current Charges May Not Hike In Andhra Pradesh, Details Inside - Sakshi
Sakshi News home page

వినియోగదారులకు భారీ ఊరట.. విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్లే..

Published Fri, Jan 20 2023 2:13 PM | Last Updated on Fri, Jan 20 2023 6:02 PM

Current Charges May Not Hike In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి విశాఖపట్నం: విద్యుత్‌ వినియోగదారులకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు భారీ ఊరట కలిగించాయి! వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ కేటగిరీలోనూ చార్జీలను పెంచాలని డిస్కమ్‌లు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఏటా ఏప్రిల్‌ 1 నుంచి కొత్త విద్యుత్‌ చార్జీలు అమలులోకి రావడం ఆనవాయితీ. పేదలు మినహా అన్ని వర్గాల వినియోగదారులపై ఎంతో కొంత పెంపు సాధారణంగా ఉంటుంది. అయితే అనూహ్యంగా ఈదఫా చార్జీలు పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించలేదు. దీంతో విద్యుత్‌ వినియోగదారులపై వచ్చే ఏడాది విద్యుత్‌ చార్జీల భారం ఉండదని స్పష్టమైంది.

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) సమర్పించిన 2023–24 వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్‌ ధరల ప్రతిపాదనపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ గురువారం విశాఖలో మొదలైంది. శనివారం వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విద్యుత్‌ వినియోగదారులు వెబ్‌ లింక్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు (లైవ్‌ స్ట్రీమింగ్‌) చూడవచ్చు. డిస్కమ్‌ల సీఎండీలు తమ టారిఫ్‌ నివేదికలో గృహ, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక విద్యుత్‌ వినియోగంపై చార్జీల పెంపునకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. కేవలం ఇంటెన్సివ్‌ పరిశ్రమల (ఫెర్రో అల్లాయిస్‌) టారి­ఫ్‌­ను మాత్రమే మార్చాలని ఏపీఈఆర్‌సీని డిస్కమ్‌లు కోరాయి.

హెచ్‌టీ పరిశ్రమలకు వర్తించే టారి­ఫ్‌­నే వాటికీ వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశాయి. ఫెర్రో పరిశ్రమలు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. అక్కడ ధరలు పెరిగినప్పుడు, వేసవిలోనూ డిస్కమ్‌ల నుంచి విద్యుత్‌ తీసుకుంటున్నాయి. దీనివల్ల డిస్కమ్‌లు ఆర్థికంగా నష్టపోతున్నట్లు సీఎండీలు మండలికి వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయాల స్వీకరణ
తొలిరోజు 20 మంది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమ అభ్యంతరాలు, సూచనలను, తెలియచేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన మునిరత్నంరెడ్డి తిరుపతిలో­ని సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఆపరేషన్‌) సర్కిల్‌ కార్యాలయం నుంచి ఏపీఈఆర్‌సీ దృష్టికి తెచ్చారు. కుటీర పరిశ్రమలకు విద్యుత్‌ లోడ్‌ పరిమి­తిని 20 హెచ్‌పీ వరకు పెంచాలని కావలికి చెందిన శాంతకుమార్‌ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా బాగుందని కడప జిల్లా నుంచి రమణారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల తరహాలో బీసీలకు కూడా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని పాకాల నుంచి మునుస్వామి నాయుడు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఎస్‌ఈ కార్యాలయం నుంచి మాట్లాడిన వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. వ్యవసాయం, గృహాలకు మీటర్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులపై భారం లేదు
విద్యుత్‌ వినియోగదారులపై చార్జీల భారం మోపేలా డిస్కమ్‌లు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిస్కమ్‌లన్నీ సామాన్యులపై భారం మోపేందుకు అంగీకరించకపోవడం శుభపరిణామమన్నారు. గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులపై 2023–24లో ఎలాంటి భారం ఉండదని చెప్పారు. ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలకు రాయితీలు కొనసాగిస్తూ డిమాండ్‌ చార్జీలు, టైమ్‌ ఆఫ్‌ ది డే, కనీస చార్జీల పెంపు అంశాల్లో మార్పులు చేయాలని డిస్కమ్‌లు కోరినట్లు తెలిపారు.

దీన్ని క్షుణ్నంగా పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం నుంచి రావాలి్సన బకాయిల విషయంలో రాజకీయ ఆరోపణలన్నీ నిరాధారమని, వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలను తెలియచేయవచ్చన్నారు. అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వెలువరిస్తామని తెలిపారు. విద్యుత్‌ సేవల్లో జాప్యం జరిగితే సంబంధిత డిస్కమ్‌లు వినియోగదారులకు పరిహా­రం చెల్లించాలి్సందేనని, దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారిపై భారం పడకుండా ప్రభుత్వం, ఏపీఈఆర్‌సీ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. డిస్కమ్‌లు చేసే ఎన్నో ప్రతి­పాదనల్ని తిరస్కరిస్తున్నామని, సహేతుక కారణాలుంటే మినహా ఈఆర్‌సీ అనుమతులు మంజూరు చేసే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో ఏపీఈఆర్‌సీ కార్యదర్శి రాజబాపయ్య, ఏపీఈపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు, సీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డితో పాటు డిస్కమ్‌ల డైరెక్టర్లు ఏవీవీ సూర్యప్రతాప్, డి.చంద్రం, బి.రమేష్‌ప్రసాద్, ఎస్‌ఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
– ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement