సాక్షి, అమరావతి: విద్యుత్ రంగం సుస్థిరతను సాధించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆధునికీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మూడేళ్లలో డిస్కంలను ఆదుకునేందుకు ప్రభుత్వం దాదాపు రూ.48,882 కోట్లు ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు.
విద్యుత్ సంస్థలను బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని మంత్రి అన్నారు. రైతులకు 9 గంటలు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించడంతోపాటు వినియోగదారులకు ప్రపంచ ప్రమాణాలతో నిరంతర సరఫరాను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన స్థాపిత ఇంధన సామర్థ్యంలో 42 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సాధించిందని తెలిపారు. ఇటీవల 6,500 మెగావాట్ల సోలార్, 2,050 మెగావాట్ల పవన, 10,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను ప్రైవేట్ డెవలపర్‌లకు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, జేఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి, డిస్కంల సీఎండీలు జె పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment