సాక్షి, హైదరాబాద్: కొనుగోలు చేయని విద్యుత్‌కు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అక్షరాల రూ.957.45 కోట్ల చార్జీలు చెల్లిం చాయి. రాష్ట్ర అవసరాలకు కావాల్సిన విద్యుత్ సమీకరణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న డిస్కంలు.. అంచనాలు తలకిందులవడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాయి. అంచనాలకు తగ్గట్లు డిమాండ్ లేక 2016–17లో 4,910 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను బ్యాకింగ్ డౌన్ చేయించాయి. ఒక్కో యూనిట్‌కు రూ.1.95 చొప్పున ఆ 4,910 ఎంయూలకు రూ.957.45 కోట్ల స్థిర చార్జీలు విద్యుదుత్పత్తి కంపెనీలకు చెల్లించాయి.
కొనకపోయినా ఎందుకంటే..
రాష్ట్ర విద్యుత్ అవసరాలను అంచనా వేసి ఆ మేరకు విద్యుత్ సమీకరించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలతో డిస్కం లు ముందస్తుగా కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లు చేసుకున్నాయి. దీంతో విద్యుత్ కొనుగోలు చేయకపోయినా ఉత్పత్తి కంపెనీలకు విద్యుత్ స్థిర చార్జీలు లేక జరిమానా డిస్కంలు చెల్లించాలి.
ప్లాంట్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన విద్యుదుత్పత్తి కంపెనీలు.. నిరంతరంగా ఉత్పత్తి చేసి అమ్మకాలు సాగిస్తేనే మనుగడలో ఉంటాయి. డిమాండ్ లేనపుడు ఉత్పత్తి తగ్గించాల్సి వస్తే కంపెనీలు నష్టపోకుండా తగ్గించిన విద్యుత్‌కు స్థిర చార్జీలు లేదా జరిమానా చెల్లించాలని ఒప్పందాల్లో పొందుç ³రుస్తారు. ఇలా డిమాండ్ లేనప్పుడు ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించుకోవడం లేదా నిలుపుదల చేయడాన్ని బ్యాకింగ్ డౌన్ అంటారు.
కొంప ముంచిన ఓపెన్ యాక్సెస్..
రాష్ట్రంలోని భారీ పరిశ్రమలు, రైల్వేలు, వాణిజ్య సంస్థలు, ఇతర వినియోగదారులు 2016–17లో ఓపెన్ యాక్సెస్ ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి 2,134 ఎంయూల విద్యుత్ కొనడం డిస్కంల కొంపముంచింది. విద్యుత్ చట్టం–2003లోని వెసులుబాటును ఉపయోగించుకుని డిస్కంలను కాదని బహిరంగ మార్కెట్ నుంచి తక్కువ ధరకు వినియోగదారులు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు.
బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు పతనమవడంతో 2015–16లో 902 ఎంయూలు ఉన్న ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లు 2016–17 వచ్చేసరికి 2,134 ఎంయూలకు పెరిగాయి. ఓవైపు నిరంతర విద్యుత్ సరఫరాకు డిస్కంలు పెద్ద మొత్తంలో విద్యుత్ సమీకరించగా.. కొందరు వినియోగదారులు ఓపెన్ యాక్సెస్‌కు వెళ్లడం, అంచనాలకు తగ్గట్లు డిమాండ్ లేకపోవడంతో 4,910 ఎంయూల విద్యుత్ బ్యాకింగ్ డౌన్ చేసుకొని నష్టపోవాల్సి వచ్చింది.
నిరంతర విద్యుత్ సరఫరా కోసమే: డిస్కంలు
నిరంతర విద్యుత్ సరఫరా కోసం ముందస్తు ప్రణాళికలతో విద్యుత్ సమీకరించామని ఈఆర్సీకి డిస్కంలు వివరణ ఇచ్చాయి. 2015–16లో రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,849 ఎంయూలు కాగా, 2016–17లో 9,191 ఎంయూలకు పెరిగిందన్నాయి. ముందస్తు ప్రణాళికల వల్లే డిమాండ్ పెరిగినా సరఫరా కొనసాగించామని సమర్థించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment