సాక్షి, అమరావతి: మరో ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. సింహపురి విద్యుత్ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు అనుమతించింది. ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుది కావడం విశేషం. అందుకే మార్కెట్‌లో ఎక్కడా లేని విధంగా యూనిట్‌కు రూ.4.80 చొప్పున చెల్లించేందుకుప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు ఏకంగా 12 ఏళ్ల కాలపరిమితితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్)పై దాదాపు రూ.21 వేల కోట్ల అదనపు భారం పడనుంది.
సింహపురి సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని డిస్కమ్‌లు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రంలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, ఇంకా కొనాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ రంగ నిపుణులు విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ముందు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఏపీఈఆర్‌సీ హడావుడిగా గురువారం హైదరాబాద్‌లో ప్రజాభిప్రాయ సేకరణ తంతు ముగించింది. ఈ నెల 10వ తేదీన పీపీఏకు సంబంధించిన ఆదేశాలు ఇస్తామని ప్రకటించింది.
సింహపురితో లాలూచీ
రాష్ట్రంలో భారీగా పరిశ్రమలొస్తాయని, విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని డిస్కమ్‌లు అతిగా అంచనా వేశాయి. ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. ఇందులో భాగంగానే 2016 జనవరిలో 2,400 మెగావాట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచాయి. 400 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.4.35కు అందించేందుకు సింహపురి ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. అయితే, అప్పటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది.
బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేటు పడిపోయింది. ఈ నేపథ్యంలో సింహపురికి అత్యధికంగా చెల్లించడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా సింహపురి విద్యుత్‌పై అభ్యంతరాలు తెలిపాయి. ఏపీఈఆర్‌సీ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో 2017 నవంబర్‌లో ప్రభుత్వం తరపున ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సింహపురి విద్యుత్‌పై పునరాలోచించుకుంటామని ఏపీఈఆర్‌సీకి లేఖ రాశారు.
అప్పటి నుంచి ఈ వ్యవహారం ముందుకు సాగలేదు. వారం రోజుల క్రితం ఉన్నట్టుండి ఇంధనశాఖ మనసు మార్చుకుంది. బిడ్డింగ్‌లో వచ్చిన సింహపురి విద్యుత్‌ను తీసుకోవాల్సిందేనంటూ కమిషన్‌కు లేఖ రాసింది. బిడ్డింగ్‌లో యూనిట్ రూ.4.35 ఉంటే... ఇప్పుడు యూనిట్ రూ.4.80 చొప్పున కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. దీంతో కమిషన్ గుట్టుచప్పుడు కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ ముగించి, ఆదేశాలివ్వడానికి సిద్ధపడింది.
కొనుగోలు అవసరమా?
రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ లభ్యత ఏడాదికి 67,948 మిలియన్ యూనిట్లుగా ఉంది. కానీ, డిమాండ్ ఏడాదికి 57,018 మిలియన్ యూనిట్లు మాత్రమే. అంటే ప్రస్తుతం 10 వేల మిలియన్ యూనిట్ల మేర మిగులు కరెంటు ఉంది. కాబట్టి 8,700 మిలియన్ యూనిట్ల మేర జెన్‌కో ఉత్పత్తిని నిలిపివేస్తామని, మిగిలిన కరెంటును బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని డిస్కమ్‌లు తెలిపాయి.
కానీ, ఇంతవరకూ ఒక్క యూనిట్ కూడా బయట అమ్మలేదు. తక్కువ ధరకు లభించే ఏపీ జెన్‌కో కరెంటును నిలిపివేసి మరీ ప్రైవేటు విద్యుత్ కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. తాజాగా సింహపురి నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రోజూ 10 మిలియన్ యూనిట్ల మేర జెన్‌కో ఉత్పత్తికి బ్రేక్ పడుతుంది. సింహపురికి అత్యధికంగా చెల్లించడమే కాదు... ఏపీ జెన్‌కో విద్యుత్ ప్లాంట్లు ఉత్పత్తి ఆగిపోయి మరింత అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
లబ్ధి ఇలా..
సింహపురి విద్యుత్ సంస్థతో గతంలో డిస్కమ్‌లకు ఎలాంటి కొనుగోలు ఒప్పందాలు లేవు. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నప్పుడు కూడా ఈ సంస్థ ఎక్కువ ధరలకు బయటి మార్కెట్లో కరెంటును అమ్ముకుంది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు గణనీయంగా పడిపోయాయి. సింహపురి సంస్థ పూర్తిగా విదేశీ బొగ్గుతో నడుస్తుంది కాబట్టి ఉత్పత్తి వ్యయం ఎక్కువ. దీంతో ఆ సంస్థ విద్యుత్‌ను అమ్ముకోలేని పరిస్థితి ఉంది.
సంస్థ యాజమాని రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహి తుడు కావడం వల్ల నేరుగా ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింహపురి సంస్థ నుంచి రోజుకు కనీసం 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుంది. యూనిట్ రూ.4.80 చొప్పున రోజుకు రూ.4.80 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.1,752 కోట్లు అవుతుంది. 12 ఏళ్ల ఒప్పందం కాబట్టి మొత్తం రూ.21,024 కోట్లు చెల్లించక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment