విద్యుత్ వాత
- అన్ని కేటగిరీల వినియోగంపై 3.6 శాతం పెంపు
- వ్యవసాయానికి మినహాయింపు
- 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఊరట
- జిల్లాపై రూ.4.2 కోట్లు భారం
- పరోక్షంగా ప్రజలపై మరికొంత ఆర్థికభారం
- పెరిగిన చార్జీలు నేటి నుంచి అమలు
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు మరోమారు వాతపెట్టింది. వ్యవసాయానికి మినహా మిగతా అన్ని కేటగిరీల వినియోగదారులపై 3.6 శాతం పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడో సారి విద్యుత్ చార్జీలు పెంచింది. విద్యుత్ చార్జీల పెంపుతో జిల్లా ప్రజలపై సగటున రూ.4.2 కోట్ల భారం పడుతుండగా, పరోక్షంగా మరికొంత పడే
అవకాశం ఉంది. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న వారికి మాత్రం ఊరట లభించింది. శనివారం నుంచి పెంచిన చార్జీలు అమలులోకి రానున్నాయి.
నెల్లూరు (టౌన్): జిల్లాలో మొత్తం 12 లక్షల 97 వేల సర్వీసులు ఉన్నాయి. వాటిలో 9,82,234 గృహాలకు, వ్యవసాయానికి 1,67వేలు, వాణిజ్యానికి 89,549 కనెక్షన్లు, పరిశ్రమలకు 42,247 సర్వీసులు.. కాటేజీ, చిన్న పరిశ్రమలకు 661, వీధిలైట్లు, వాటర్ కనెక్షన్లకు 10,562, హెచ్‌టీ సర్వీసులు 515, ఇతర సర్వీసులు 10,562 వరకు ఉన్నాయి. వీటికి సంబంధించి రోజుకు 1.20 లక్షల యూనిట్లు వరకు వినియోగం జరుగుతోంది. లోటెన్షన్ సర్వీసుల ద్వారా రూ.54 కోట్లు, హైటెన్షన్ ద్వారా రూ.61 కోట్లు రెవెన్యూ వస్తుంది.
రూ. 4.2 కోట్ల్లకు పైగా భారం
విద్యుత్ నియంత్రణ మండలి వ్యవసాయ వినియోగాదారులను మినహాయించి మిగిలిన సర్వీసులకు 3.6 శాతం మేర చార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. నెలకు 200 యూనిట్లలోపు వినియోగిస్తున్న వినియోగదారులపై చార్జీలను పెంచలేదు. అయితే మిగిలిన వినియోగదారులపై పెంచిన చార్జీలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. చార్జీల పెంపుతో వినియోగదారులపై ఏడాదికి రూ.48.24 కోట్లు భారం పడనుంది. అయితే గృహ సర్వీసులకు సంబంధించి నెలకు 200 యూనిట్లకుపైగా వినియోగిస్తున్న వారిపై ఎంత పెంచారనేది ఇంకా విడుదల చేయలేదు. దీంతో పాటు వాణిజ్యం, పరిశ్రమలు తదితర వినియోగదారులపై భారం పడనుంది.
ప్రస్తుతం హైటెన్షన్ సర్వీసులకు సంబంధించి కేటగిరి–1 యూనిట్‌కు రూ.6.14, కేటగిరి–2లో రూ.7.40 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం 3.6 శాతం పెంపుతో కేటగిరి–1లో రూ.6.35 , కేటగిరి–2లో రూ.7.68లకు పెరగనుంది. లోటెన్షన్ సెక్షన్‌లో కేటగిరి–2 కింద దుకాణాలు, షాపులు, కేటగిరి–3 కింద దేవాలయాలు, రొయ్యల సర్వీసులు, తాగునీటి, పాఠశాల సర్వీసులు ఉన్నాయి. వీటి మీద ప్రస్తుతం యూనిట్‌కు రూ. 6.38 వసూలు చేస్తున్నారు. పెంచిన చార్జీలు ప్రకారం యూనిట్ ధర రూ. 6.62లకు పెరగనుంది.
ప్రజలపై పరోక్ష భారం
విద్యుత్ చార్జీల పెంపుతో సామాన్య ప్రజలపై భారం పడనుంది. దుకాణాలు, పరిశ్రమలపై విద్యుత్ చార్జీలు ప్రభుత్వం పెంచడంతో ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువులు ధరలు పెరిగే అవకాశం ఉంది. దుకాణాలు, చిన్నషాపులపై చార్జీలు పెంచడంతో వారు కూడా ప్రతి వస్తువుకు ధర పెంచి వసూలు చేసే అవకాశం ఉంది. దీని వల్ల సామన్య ప్రజలపై పరోక్ష భారం పడనుంది. ఇప్పటికే అన్ని రకాల వస్తువులు ధరలు పెరిగి సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, నిత్యావసర సరకులు ధరలు ఆకాశనంటుతున్నాయి. తాజా చార్జీల పెంపుతో అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందులు పడుతారని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇంకా ఉత్తర్వులు అందలేదు
చార్జీల పెంపుపై ఇంకా ఉత్తర్వులు అందలేదు. వ్యవసాయ సర్వీసుల మినహాయించి మిగిలిన వాటిపై 3.6 శాతం పెంచినట్లు తెలిసింది. ఇంకా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.
– వెంకటేశ్వర్లు, సీనియర్ అకౌంట్ ఆఫీసర్