తనిఖీలు తప్పవు
Published Mon, Jan 6 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
న్యూఢిల్లీ:కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తనిఖీలకు ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థలు సహకరించాల్సిందేనని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ నుద్దేశించి మాట్లాడారు. తమ ఆర్థిక లావాదేవీల తనిఖీని చేపట్టేందుకు వచ్చే కాగ్ అధికారులకు ప్రైవేట్ విద్యుత్ సరఫరా సంస్థలు సహకరించాలన్నారు. ‘నగరంలో విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ జరిగినప్పటినుంచి ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీలపై కాగ్ తనిఖీలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియకు సహకరించని కంపెనీల లెసైన్సులు రద్దు చేస్తామ’ని ఆయన హెచ్చరించారు. 2002లో ఢిల్లీ ప్రభుత్వం విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించిన విషయం తెలిసిందే. అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయబోమన్నారు.
నగరంలో విద్యుత్ పంపిణీ చేస్తున్న మూడు ప్రైవేట్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై కాగ్ ఆడిట్‌కు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సర్కారు గత వారం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని ఆయా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో నవాబ్‌జంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కాగా, మీటర్లు వేగంగా తిరుగుతున్నాయన్న ఫిర్యాదులపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, త్వరలోనే దానిపై కూడా చర్యలు తీసుకుంటామని జంగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వాహనాలపై ఎర్రబుగ్గలు వాడరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే వారికి ప్రత్యేక రక్షణను తిరస్కరించింది. ‘ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అంతమొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే ఆందోళనతో వచ్చిన లోక్‌పాల్‌ను అమలుచే సేందుకు అధిక ప్రాధాన్యమిస్తాం..’ అని జంగ్ పేర్కొన్నారు.
పజల దైనందిన జీవితాలను ప్రతిబింబించేలా పథకాల అమలుకు కేజ్రీవాల్ ప్రభుత్వం కృషిచేస్తుందని జంగ్ చెప్పారు. నగర అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల్లో లోపాలను సరిచేసుకోవడానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ నగర ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే, వాటి సత్వర పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తుందని పేర్కొన్నారు. మొహల్లాల స్థాయిలో అభివృద్ధి పనులను ఎంపిక చేసే విషయంలో స్థానికుల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. పనుల నాణ్యత, నిర్వహణలపై మొహల్లా సభల్లో నిర్ణయించిన మేరకే ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు ఏడాదిలోగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. దీంతో ఢిల్లీలో నివసించే 30 శాతానికిపైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మురికివాడల్లో నివసించే వారికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడంలోనూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
మహిళా రక్షణకు ప్రత్యేక కోర్టులు
నగరంలో మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎల్‌జీ నజీబ్ జంగ్ తెలిపారు. దీని నిమిత్తం ఆరు నెలల్లోగా కొత్త కోర్టులను ఏర్పాటుచేయడమేగాక, జడ్జిల నియామకాలను కూడా చేపడతామన్నారు. మహిళలు, బాలికల రక్షణ ప్రస్తుత ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్ అని ఆయన అన్నారు. ‘నగరంలో 50 శాతానికిపైగా ప్రజలు బహిరంగ స్థలాల్లో సంచరించడానికి భయపడుతున్నారు. ఇది ప్రభుత్వానికి చాలా అవమానకరం..’ అని ఆయన చెప్పారు. మహిళలు, బాలికలు ఎటువంటి వేధింపులకు గురికాకుండా ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. మహిళలపై వేధింపుల కేసులను మూడు నెలల కాలంలోనే పరిష్కరించేందుకు కొత్త కోర్టులు కృషిచేస్తాయన్నారు. ఇదిలా ఉండగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పాటుచేస్తామని ఆప్ తన ఎన్నికల హామీల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. దేశ రాజధానిలో 2012 డిసెంబర్ 16న జరిగిన ‘నిర్భయ’ కేసు తర్వాత పోలీసులు, ప్రభుత్వం మహిళా రక్షణకు పలు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా మానభంగ కేసుల్లో 20 రోజుల్లోనే చార్జిషీట్ తయారుచేయాలని నిర్ణయించింది.
జన్‌లోక్‌పాల్‌కు ప్రాధాన్యం
ఢిల్లీ ప్రభుత్వం జన్‌లోక్‌పాల్‌కు ప్రాధాన్యమివ్వాలని నజీబ్ జంగ్ కోరారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలన్నారు. ‘మార్పుకు ఢిల్లీ ప్రజలు ఓటువేశారు..’ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నూతన ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం, ప్రజల మధ్య అవగాహనను పెంపొందించేందుకు జన్‌లోక్‌పాల్‌కు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్రహోదా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలసి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. స్కూళ్లలో డొనేషన్లను రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్ల కన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతామని, మరో 500 కొత్త స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించనుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement