న్యూఢిల్లీ: నమిలే పొగాకు (గుట్కా) ఉత్పత్తి, నిల్వ, క్రయ విక్రయాలపై నిషేధం విధించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నుంచి ఆమోదం కోసం వేచి చూస్తున్నామని నగర ఆరోగ్య విభాగం గురువారం తెలిపింది. గుట్కాపై నిషేధం విధించాలని ఢిల్లీ రాష్ట్ర పొగాకు నియంత్రణ విభాగం గత ఏడాది సెప్టెంబర్‌లోనే ప్రతిపాదించగా, ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దానికి పచ్చజెండా ఊపారు. అంతకుముందు ఈ ప్రతిపాదనను ఆహారభద్రత కమిషనర్, ఇతర ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తమ ఆమోదం తెలిపారు. అంతిమంగా ఈ ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ఫైలు గత ఆరు నెలలుగా ఎల్జీ వద్ద పెండింగ్‌లో ఉందని ఓ అధికారి చెప్పారు. ఢిల్లీలో గుట్కాపై 2012, సెప్టెంబర్‌లోనే నిషేధం విధించారు. కానీ దుకాణదారులు గుట్కా పదార్థాలైన పొగాకు, సుపారీని వేర్వేరుగా అమ్మటం ప్రారంభించారు.
దీంతో గుట్కాపై నిషేధం విధించడం వల్ల కలిగే ప్రయోజనం పూర్తిగా నీరుగారిపోయింది. అందువల్ల నమలటానికి అనుగుణంగా ఉండే అన్ని రకాలైన ముడి పొగాకు ఉత్పత్తులను ఢిల్లీలో నిషేధించాలని నిర్ణయించామని ఆరోగ్య విభాగం అదనపు డెరైక్టర్ ఎస్‌కే అరోరా చెప్పారు. ముడి పొగాకుఉత్పత్తుల్లో జర్దా, ఖైనీ వంటివి ఉన్నాయని అన్నారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాల నుంచి ఢిల్లీకి గుట్కా కూడా సరఫరా అవుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రతి నెల చివరి తేదీని పొగాకు విషయంలో ‘డ్రై డే’గా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. పొగాకు వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు కూడాప్రయత్నిస్తున్నామని ఆ విభాగం తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి ‘టొబాకో అవేర్ సిటిజన్ ఆఫ్ ఢిల్లీ (పొగాకుపై అవగాహన కలిగిన ఢిల్లీపౌరుడు’ పేరిట ఒక మెరిట్ సర్టిఫికెట్ అందచేస్తామని ఆ అధికారి చెప్పారు.
పొగాకుపై నిషేధానికి లభించని ఎల్జీ ఆమోదం
Published Thu, Nov 6 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement