najeeb jung
-
'సీఏఏ దేశాన్ని ఏకాకిని చేయబోతోంది'
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై భారత మాజీ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏని భారత స్వయంకృత అపరాధంగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో సీఏఏపై నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. సీఏఏ భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశ ఆలోచనను మనం మార్చాలనుకుంటే దాని ఫలితంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా 2015కు ముందు దేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్లు, హిందువులు,సిక్కులు, జైనులు, పార్శీ మతస్తులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అయితే ఈ చట్టం వల్ల సంబంధిత దేశాల నుంచి వచ్చే ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని శివశంకర్ మీనన్ తెలిపారు.( ‘సీఏఏకు మద్దతుగా మిస్డ్ కాల్ ఇవ్వండి’) ఇదే సమావేశానికి హాజరైన ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మాట్లాడుతూ.. జామియా మిలీయా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ప్రవేశించడాన్ని తప్పుబట్టారు. సీఏఏపై సరైన సమాచారం ప్రజలకు చేరనందునే పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు సీఏఏపై పూర్తి అవగాహన కల్పిస్తే బాగుంటుందని నజీబ్‌జంగ్ వెల్లడించారు.(ఇక వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే..) -
‘కేజ్రీవాల్ కు సొంత నిఘా సంస్థ’
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాలనకు సంబంధించి షుంగ్లూ కమిటీ కొన్ని అవకతవకలను గుర్తించిందనీ, ఆయన నేరారోపణలు ఎదుర్కోవాల్సి రావొచ్చని ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సభ్యులు ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారని జంగ్ అన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి వ్యతిరేకంగా కేజ్రీవాల్ సొంతంగా మరో నిఘా సంస్థను రహస్యంగా ఏర్పాటు చేశారని జంగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ భార్యకు బంధువైన నికుంజ్ అగర్వాల్‌ను ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఓఎస్డీగా, సత్యేంద్ర కూతురు సౌమ్య జైన్‌ను మొహల్లా క్లినిక్స్ ప్రాజెక్టుకు సలహాదారుగా నియమించడం ఆశ్రిత పక్షపాతాన్ని తెలుపుతోందన్నారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. -
ఢిల్లీ కొత్త గవర్నర్ నియామకం!
-
ఢిల్లీ కొత్త గవర్నర్ నియామకం!
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర కొత్త లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)గా అనిల్ బైజల్ నియామకం కానున్నట్లు సమాచారం అందింది. లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నజీబ్ జంగ్ ఈ నెల 22న పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, బుధవారం జంగ్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జంగ్ స్ధానంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా జమ్మూ కశ్మీర్ గవర్నర్ పదవికి బైజల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో బైజల్ కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. గతంలోనే రెండుసార్లు పదవికి రాజీనామా చేయగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను పదవిలో కొనసాగాలని కోరారని జంగ్ చెప్పిన విషయం తెలిసిందే. సొంత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
నజీబ్ జంగ్ (లెఫ్ట్‌నెంట్ గవర్నర్) రాయని డైరీ
మాధవ్ శింగరాజు మోదీజీని నేనెప్పుడూ అలా చూడలేదు. మోదీజీని అలా చూస్తున్నప్పుడు నేనెలా ఉన్నానో చూసుకునే అవకాశం కూడా నాకు లేదు. నేనున్నది ‘రాజ్ నివాస్’లో కాదు. ప్రధాని నివాసంలో! ఏ సమయంలోనైనా మోదీజీ ఒక్కరే అక్కడ స్వేచ్ఛగా అద్దం చూసుకోగలరు. కానీ ఆయనకు అద్దం చూసుకునే అవసరం ఉంటుందని నేను అనుకోను. తన ముఖం ఎప్పుడు ఎలా ఉండాలో మోదీజీకి క్లారిటీ ఉంటుంది. అద్దంలో చూసుకుని క్లారిటీ తెచ్చుకోవలసిన ముఖం కాదు మోదీజీది. అద్దానికే క్లారిటీ ఇవ్వగల ముఖం. ‘‘చెప్పండి నజీబ్ జీ. నేను హిందువు, మీరు ముస్లిం. అదేనా మీ ప్రాబ్లం?’’ అని అడిగారు మోదీజీ తన కళ్లలోని ఆర్ద్రత స్థాయిని ఏమాత్రం తగ్గనివ్వకుండా. ‘‘మోదీజీ.. అలా మాట్లాడకండి. నా మనసు చివుక్కుమంటుంది. మీరు హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిం’’ అన్నాను. ‘‘మరేంటి చెప్పండి నజీబ్ జీ. నేను ఎన్.డి.ఎ., మీరు యు.పి.ఎ. అదేనా మీ ప్రాబ్లం?’’ అని అడిగారు మోదీజీ అదే స్థాయి ఆర్ద్రతను కంటిన్యూ చేస్తూ! ‘‘అయ్యో మోదీజీ.. మీరలా అనకండి. నేను యు.పి.ఎ.మనిషినని మీరు అనుకుని ఉంటే.. ప్రధానిగా మీ ప్రమాణ స్వీకారం రోజే, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నా పదవీభ్రష్టత కూడా జరిగి ఉండేదని నాకు తెలుసు’’ అన్నాను. ‘‘ఇంకేంటి నజీబ్ జీ.. మీ ప్రాబ్లం! ఎందుకిలా చేశారు? పాత నోట్లేమైనా మీ దగ్గర మిగిలిపోయాయా.. ‘యా అల్లా.. డిసెంబర్ 31 దగ్గరపడుతోంది ఎలా..’ అని మీరు దిగులు చెందడానికి? చెప్పండి నజీబ్ జీ! మన కుర్రాళ్లు ఉన్నారు. క్యాష్ చేసి పెడతారు’’ అన్నారు మోదీజీ. ‘‘అయ్యో! అలాంటిదేమీ లేదు మోదీజీ. రిజర్వు బ్యాంకు గవర్నరే డబ్బుల్లేక ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని తిరుగుతుంటే, ఈ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఎంత మోదీజీ’’ అన్నాను. ‘‘అయినా నాకు అంత డబ్బు అవసరం లేదు మోదీజీ. ఢిల్లీ గవర్నరుకు ఖర్చేముంటుంది చెప్పండి’’ అన్నాను. ‘‘మాణింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా డబ్బులు కావాలి కదా నజీబ్ జీ’’ అన్నారు మోదీజీ! నవ్వాను. ‘‘నేనెంత తింటాను మోదీజీ.. ఒక పరోటా, లైట్‌గా ఆలూ కర్రీ’’ అన్నాను. మోదీజీ నావైపు పరిశీలనగా చూశారు. ‘‘మరి.. పూరీ, సబ్జి?’’ అని అడిగారు! ఆ వెంటనే, ‘‘కేజ్రీవాల్‌కు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ అదే కదా నజీబ్ జీ’’ అని అన్నారు!! నాకు అర్థమైంది! మోదీజీలోని ఆ ఆర్ద్రత.. సడన్‌గా నేను రిజైన్ చేసి వచ్చేసినందుకు కాదన్నమాట! ‘‘కానీ మోదీజీ.. కేజ్రీవాల్ తన బ్రేక్‌ఫాస్ట్ తనే తెచ్చుకుని నాతో కలసి బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు’’ అన్నాను. ఆయన వినలేదు. ఆయన ఆర్ద్రతలోనూ మార్పు లేదు! -
'మోదీ రాజీనామా చేయొద్దన్నారు'
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ శుక్రవారం రాజీనామా చేశారు. గవర్నర్ పదవికి జంగ్ రాజీనామా చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, గతంలోనే రెండుసార్లు పదవికి రాజీనామా చేయగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను పదవిలో కొనసాగాలని కోరారని జంగ్ పేర్కొన్నారు. సొంత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నానని, తన మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని తెలిపారు. తన తల్లికి 95 ఏళ్లని.. ఆమెతో పాటు తనయులు వారి పిల్లలకు సమయం కేటాయించాలని అందుకే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గవర్నర్ పదవిలో ఉంటూ సెలవులు తీసుకోవడం సరికాదని అన్నారు. 2014 మేలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలుత రాజీనామా ప్రపోజల్ ను కేంద్రం ముందు ఉంచానని, ఆ తర్వాత 2016లో రెండో సారి రాజీనామాను ఆమోదించాలని కోరగా మోదీ తనను కొనసాగాలని కోరారని చెప్పారు. మంగళవారం రాజీనామా చేస్తానని మళ్లీ కోరగా మోదీ అందుకు అంగీకరించినట్లు చెప్పారు. -
నజీబ్ జంగ్‌ను కలిసిన కేజ్రీవాల్
-
కేజ్రీవాల్ - జంగ్ భాయీ భాయీ!
అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇంటికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లారు. విషయం ఏమిటని అడిగితే.. తనను ఆయన బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి పిలిచారని చెప్పారు. జంగ్ నివాసమైన రాజ్‌నివాస్‌కు కేజ్రీవాల్ స్వయంగా వెళ్లి.. ఆయనకు శుభాభినందనలు తెలిపారు. తాను ఎందుకు రాజీనామా చేశానన్న విషయాన్ని నజీబ్ జంగ్ చెప్పకపోయినా.. ఆయన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని కేజ్రీవాల్ ఈరోజు అన్నారు. నజీబ్‌జంగ్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆయనకు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఏమాత్రం పడేది కాదు. ఇద్దరి మధ్య పరిస్థితి ఉప్పు-నిప్పు అన్నట్లు ఉండేది. కానీ ఒక్కసారిగా అనూహ్యంగా నజీబ్ జంగ్ రాజీనామా చేయడంతో ఒకింత షాకైనా, ఆ నిర్ణయాన్ని కేజ్రీవాల్ స్వాగతించినట్లే కనిపించింది. ఢిల్లీ దేశ రాజధానే అయినా, దానికి పూర్తి రాష్ట్రహోదా లేదు. కొన్ని అంశాల్లో కేంద్ర హోం మంత్రిత్వశాఖదే అధికారం ఉంటుంది. ప్రధానంగా భూ వ్యవహారాలు, శాంతిభద్రతలలో కేంద్రానిదే పైచేయి. లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ పరిపాలనా బాధ్యతలను చూస్తుంటారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను నజీబ్ జంగ్ తిరస్కరించారు. ప్రభుత్వానికి ఆ అధికారం లేదని చెప్పారు. తన ప్రభుత్వాన్ని ఏపనీ చేయనివ్వకుండా జంగ్ అడ్డుకుంటున్నారని, కేంద్రమే అలా చేయిస్తోందని కేజ్రీవాల్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. కానీ అలాంటిది ఒక్కసారిగా ఆయన రాజీనామా చేసిన తర్వాత మాత్రం ఇప్పుడు ఇంటికి వెళ్లి టీ తాగి టిఫిన్ చేసి మరీ వచ్చారు!! -
కేజ్రీవాల్ -నజీబ్ జంగ్ భాయీ భాయీ!
-
సుప్రీం చురకలతో దిగొచ్చిన ఢిల్లీ సర్కార్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు చురకలతో దిగొచ్చిన ఢిల్లీ సర్కార్ దేశ రాజధానిని పట్టిపీడిస్తున్న డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాధులపై పోరాటానికి సిద్ధమైంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్రజైన్లు అధికారులతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. విజృంభిస్తున్న ఈ వ్యాధుల నిర్మూలనపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. విస్తృతంగా ప్రబలుతున్న డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులను పట్టించుకోకుండా... ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. వ్యాధుల నివారణపై తగిన చర్యలు తీసుకోవాలని ఎల్జీకి, సీఎంకు ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో ఈ వ్యాధుల నిర్మూలనపై ప్రతీవారం ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష నిర్వహించాలని సత్యేంద్ర జైన్‌ను నజీబ్ జంగ్ ఆదేశించారు. మరికొన్ని రోజుల్లో జంగ్ ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు చెప్పారు. ఎల్జీ నజీబ్ జంగ్ ఆదేశాలతో డివిజనల్ కమిషనర్ల చేత కూడా అన్ని ప్రాంతాల్లో సందర్శించి, వ్యాధులను అరికట్టే చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ కమిషనర్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య తగ్గిందని ఆరోగ్య శాఖ అధికారులు ఎల్జీకి తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రతి నాలుగు బెడ్స్‌లో ఒకటి కచ్చితంగా జ్వరంతో బాధపడే వారికి కేటాయించే విధంగా ఆరోగ్య కార్యదర్శి చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా అనారోగ్యం ఉన్నట్టు గుర్తించినవారికి, గర్భవంతులైన మహిళలకు ఈ వ్యాధులను నిరోధించడానికి అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డాక్టర్లు చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ తాజా డేటా ప్రకారం ఇప్పటివరకు 2100 మంది ప్రజలకు డెంగ్యూ పాజిటివ్‌గా నమోదకాగ, చికెన్‌గున్యా కేసులు 6000లు క్రాస్ చేశాయి. -
నజీబ్ జంగ్ 420: స్వామి
న్యూఢిల్లీ: పదునైన విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ స్వామి ఈసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పై విరుచుకుపడ్డారు. జంగ్ వంచకుడని, లెఫ్టినెంట్ గవర్నర్ లాంటి ఉన్నత పదవికి ఆయన సరిపోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నా అభిప్రాయం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి జంగ్ అనర్హుడు. కేజ్రీవాల్ మాదిరిగా ఆయన మరో 420. జంగ్ స్థానంలో సంఘ్ పరివార్ వ్యక్తిని నియమించాల్సిన అవసరముంద’ని సుబ్రహ్మణ స్వామి ట్వీట్ చేశారు. ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన స్వామి ఇంతకుముందు ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని, పార్టీ పెద్దల జోక్యంతో ఆయన వెనక్కు తగ్గారు. In my opinion, this LG of Delhi Mr. Jung is unsuited for this high post. He is another 420 like Kejri. We need a Sangh person in Delhi — Subramanian Swamy (@Swamy39) 30 August 2016 -
ఒక హత్య...అనేక ప్రశ్నలు
అవినీతిని అంతమొందిస్తామంటున్న పాలకుల డొల్లతనాన్ని వెల్లడించే సందర్భమిది. నేరం, రాజకీయం, వ్యాపారం ఎంతగా పెనవేసుకుపోయాయో రుజువు చేసే ఉదంతమిది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎం.ఎం. ఖాన్‌ను గత నెల 16న ‘గుర్తు తెలియని దుండగులు’ కాల్చి చంపారు. ఇప్పుడా ఉదంతం తిరుగుతున్న మలుపులు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎం.ఎం. ఖాన్‌కు నిజాయితీపరుడైన అధికారిగా పేరుప్రతిష్టలు న్నాయి. ముక్కుసూటిగా పోయే వ్యక్తి అన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. అలాంటి అధికారిని ఎవరు పొట్టనబెట్టుకున్నారన్న అంశంపై దర్యాప్తు మొదలై ఆ ఉదంతం జరిగిన అయిదురోజుల తర్వాత నగరంలోని హోటల్ యజమాని రమేష్ కక్కడ్ అరెస్టయ్యాడు. మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగానే వెల్లడవుతున్న అంశాలు మన ప్రభుత్వాల, ప్రజాప్రతినిధుల పనితీరును ప్రశ్నించేవిగా ఉన్నాయి. నిజాయితీపరుడని భావించే ఖాన్‌పై...ఆయన హత్యకు ముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు మూడు ఫిర్యాదులందితే ఆ మూడింటిలో ఒకటి నిందితుడైన హోటల్ యజమాని రాసింది. రెండో ఫిర్యాదు స్థానిక బీజేపీ ఎంపీ మహేష్ గిరినుంచి రాగా మూడోది ఎన్డీఎంసీ వైస్ చైర్మన్, బీజేపీ నేత కరణ్‌సింగ్ తన్వర్ రాశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఖాన్‌పై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోమంటూ నజీబ్ ఎన్డీఎంసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో ఒక లేఖను ఖాన్ హత్యకు అయిదు రోజుల ముందు పంపగా... రెండోది ఖాన్ హత్య జరిగిన మర్నాడు పంపారు. హోటల్ యజమాని ఫిర్యాదు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే రూ. 140 కోట్ల లెసైన్స్ ఫీజు ఎగ్గొట్టిన కారణంగా నిరుడు ఫిబ్రవరిలో మూతబడ్డ హోటల్ విషయంలో జరుపుతున్న విచారణలో ఖాన్ తనకు అనుకూ లమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న నమ్మకం అతనికి లేదు. అందుకే ఆయన ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని జంగ్కు ఫిర్యాదు చేశాడు. చర్య తీసుకోమని కోరాడు. కానీ స్థానిక బీజేపీ ఎంపీ, ఎన్డీఎంసీ వైస్ చైర్మన్లు ఇదే కేసుపై లేఖలు రాయా ల్సిన అవసరమేమిటి? ఈ లేఖలు కూడా ఖాన్ ‘ఏకపక్షంగా... అన్యాయంగా’ వ్యవహరిస్తున్న తీరుపైనే ఫిర్యాదు చేశాయి. హోటల్ యాజమాన్యం ఈ వివాదం గురించి చెబుతున్నదేమిటో విని తుది నిర్ణయం తీసుకోమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖాన్ పట్టించుకోవడం లేదన్నాయి. వారు లేఖలు రాస్తే రాశారు... నిజా నిజాలేమిటో నిర్ధారించుకోకుండానే వాటిపై చర్య తీసుకోవాలని ఎన్డీఎంసీకి జంగ్ ఎలా సిఫార్సు చేస్తారు? సిఫార్సు చేస్తే చేశారు... కనీసం తనకొచ్చిన ఫిర్యాదుకు కేంద్రబిందువైన అధికారి ముందురోజే హత్యకు గురయ్యారన్న కనీస స్పృహ కూడా లేకుండా పోవడమేమిటి? జంగ్ రాసిన లేఖలు రెండూ ఖాన్ హత్యలో ఆయన ప్రమేయంపై అనుమా నాలు రేకెత్తిస్తున్నాయని, కనుక ఆయననూ... హోటల్ యజమానికి వకాల్తా తీసుకుని ఫిర్యాదులిచ్చిన ఇద్దరు నేతలనూ అరెస్టు చేయాలని ఢిల్లీ పాలకపక్షం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కోరుతోంది. జంగ్‌కూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కూ మధ్య సంబంధాలు మొదటినుంచీ అంతంతమాత్రమే గనుక ఆ డిమాండ్‌లోని అంతరార్ధం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ప్రజా ప్రతినిధులుగా ఉంటున్న వారు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? ఖాన్ గురించి ఫిర్యాదు వస్తే దాని ఆధారంగా తన కార్యాలయం ఒక లేఖ రూపొందించి నజీబ్ జంగ్కు పంపిందని, ఇంతకుమించి తనకేమీ తెలియదని ఎంపీ మహేష్ గిరి చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా తమకెన్నో లేఖలు వస్తుంటాయని, స్పందించాల్సిన బాధ్యత తమకున్నదని కూడా అంటున్నారు. ఈ జవాబు వింటే కొన్ని నెలల క్రితం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఉదంతం విషయంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యవహరించిన తీరు గుర్తుకొస్తుంది. విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేకులున్నారని తనకు ఫిర్యాదు అందితే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాశానని ఆయన చేతులు దులుపుకుంటే... ఒక ప్రజా ప్రతినిధి నుంచి వచ్చిన లేఖను పరిశీలించి చర్య తీసుకోమని విశ్వవిద్యాలయాన్ని కోరామని ఆ శాఖ చెప్పింది. వచ్చిన ఫిర్యాదులోని నిజా నిజాలేమిటో ప్రాథమికంగా అయినా నిర్ధారించుకోలేని అశక్తులుగా తాము ఉన్నప్పుడు చర్య కోరుతూ లేఖలు రాసే బాధ్యతను నెత్తినేసుకోవడం సబబు కాదని వారికి ఎందుకు అనిపించడంలేదో ఆశ్చర్యకరం. ఖాన్ హత్య విషయంలో తనపై ఆప్ చేస్తున్న ఆరోపణలను తోసి పుచ్చ డంతోపాటు ఈ విషాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ వాడు కుంటున్నదని నజీబ్ జంగ్ అంటున్నారు. పైగా ఖాన్‌ను అమరుడిగా గుర్తించి, ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్న కేజ్రీవాల్ ప్రభుత్వ సిఫార్సును తాను సత్వరం అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. చనిపోయాక నిర్వహించిన కర్మకాండలనూ, వారసులకు అందజేసిన డబ్బునూ ఏకరువు పెట్టి చిత్తశుద్ధిని చాటుకోవడానికి ప్రయత్నించడం కంటే ఈ ఉదంతంలో తాను వ్యవహరించిన తీరుపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని ఉంటే సబబుగా ఉండేది. ఖాన్ విషయంలో వచ్చిన ఫిర్యాదులకు మూల కారణమైన హోటల్ కేసేమిటో ముందుగా తెలుసుకుని ఉంటే ఆయనకు చాలా విషయాలు అవగాహనకొచ్చేవి. ఇలాంటి కేసులో తన జోక్యం మంచిది కాదన్న సంగతి అర్ధమయ్యేది. నాలుగైదు రోజులు ఆగితే ఖాన్ నివేదిక వచ్చేది. దాన్ని పరిశీలించి లోటుపాట్లుంటే ఆయనను నిలదీయడానికి, అవసరమైతే ఆయనపై చర్య తీసుకోవడానికి ఎటూ నజీబ్ జంగ్కు అధికారం ఉంటుంది. ఆ పని చేయకుండా... తనకొచ్చిన ఫిర్యాదులపై అంత తొందరపాటును ప్రదర్శించడం దేనికి సంకేతం? సామాన్య పౌరులు చేసే ఫిర్యాదుల విషయంలో ఇంత వేగిరం చర్య తీసు కుంటున్నారా? ఇంత యాంత్రికంగానూ వ్యవహరిస్తున్నారా? దీన్ని పాలన అంటారా...అరాచకమంటారా? జంగ్ సంజాయిషీ ఇవ్వాలి. కనీసం ఈ ఉదంతం తర్వాతైనా తమ పోకడల్ని మార్చుకోవలసిన అవసరాన్ని ప్రజా ప్రతినిధులంతా గుర్తించాలి. -
ఆయనను డిస్మిస్ చేయాల్సిందే: స్వామి
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను వెంటనే డిస్మిస్ చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి డిమాండ్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేజ్రీవాల్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే మహేష్ గిరికి మద్దతుగా తాను వచ్చినట్లు చెప్పారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో ఎస్టేట్ అధికారిగా పనిచేసే ఎంఎం ఖాన్ మే 16న హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కాల్చిచంపారు. అయితే, ఈ హత్య వెనుక బీజేపీ ఎంపీ మహేష్ గిరి హస్తం ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆరోపణలను రుజువు చేయాలని, లేకపోతే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ మహేష్ గిరి ఆదివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అవసరమైతే తనను ప్రశ్నించాలని, ఇంకా కావాలనుకుంటే అరెస్టు చేయాలని.. తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఢిల్లీ పోలీసు కమిషనర్ అలోక్ వర్మకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. -
పీఎంఓపై సీఎం విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర పాలన వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ జోక్యంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. జంగ్ మంచి వ్యక్తే కానీ, రాజకీయ పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదేశాల మేరకు జంగ్ వ్యవహరిస్తున్నారని, ఆయన్ను పదవి నుంచి తొలగించినా ఉపయోగం ఉండదని విమర్శించారు. జంగ్‌ను తొలగించినా కొత్త ఎల్జీ కూడా పీఎంఓ ఆదేశాలనే పాటిస్తారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ పాలన వ్యవహారాల్లో పీఎంఓ జోక్యం చేసుకోకుంటే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. ఇదిలావుండగా, జంగ్‌ను తొలగించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. -
ఆయన మంచోడే కానీ..
న్యూఢిల్లీ: రాష్ట్రంపై పెత్తనం విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ నజీబ్ జంగ్ తో ఏడాదిన్నరగా పోరాడుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా మాట మార్చేశారు. నిన్నమొన్నటివరకు ఎల్జేను తీవ్రస్థాయిలో దూషించిన కేజ్రీవాల్.. 'నజీబ్ జంగ్ చాలా మచివారు' అని కితాబిచ్చారు. 'నజీబ్ జంగ్ మంచోడే కానీ అతనికి ఆదేశాలిస్తున్న రాజకీయ గురువులే చెడ్డవాళ్లు. జంగ్ ను లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగా అనిపిస్తుంది. అసలీ విషయంలో నజీబ్ జంగ్ చేసిన తప్పేంటి? కేంద్రం ఆదేశించినట్లు ఆయన నడుచుకుంటున్నారంతే. నజీబ్ ను తొలగించినంత మాత్రానేకాదు.. ప్రధాన మంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం ఆగితేనే ఢిల్లీ సమస్యలు పరిష్కారమవుతాయి' అని కేజ్రీవాల్ శనివారం ఉదయం ట్వీట్ చేశారు. కాగా, కేజ్రీ ట్వీట్ పై బీజేపీ భగ్గుమంది. 'ఢిల్లీ సీఎం గందరగోళం మనిషి. ఏ విషయాన్ని ఎలా చూడాలో ఆయనకు తెలియదు' అంటూ ఆ పార్టీ ఢిల్లీ నేత నళిన్ కోహ్లీ మరో ట్వీట్ లో విమర్శించారు. Congress n BJP both demanding Sh Najeeb Jung's removal? Strange. Is he at fault? No. He is doin what PMO is asking him to do(1/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) September 26, 2015 Removing him will not help. His successor wud also do same if PMO kept interfering. Real solution is PMO shud stop interfering in Delhi(2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) September 26, 2015 Sh Najeeb Jung is a good man with bad political bosses — Arvind Kejriwal (@ArvindKejriwal) September 26, 2015 -
‘ఆమ్ ఆద్మీ’పై జంగ్ వెన్నుపోటు యుద్ధం
సందర్భం ఈ వైచిత్రిని చూడండి. కేజ్రీ వాల్, గృహ హింస బాధితు రాలైన లిపికా భారతి తర ఫున నిలిచి, ఆమెకు రక్షణ కల్పిం చమని పోలీసులకు విజ్ఞప్తి చేసి ఉన్నా, వారు... బాగానే ఉంది గానీ ముందు మాకు లెఫ్టినెం ట్ గవర్నర్ నుండి ఆదేశాలు రానివ్వండి అనేయగలరు. సీఎం కార్యాలయం నుంచి నేరుగా వచ్చే ఏ వినతిని పోలీసులు అంగీకరించినా దాన్ని నజీబ్ జంగ్ తోసిపుచ్చుతారు. కేజ్రీవాల్, జంగ్ల పుణ్యమాని ఢిల్లీలో నేడు నెలకొన్న పరిస్థితి ఇది. తనకు అలాంటి అధికారాలున్నాయన్న పూర్తి స్పృహ లేనిదే ఏ సీఎం ఏమంత చెప్పుకోదగ్గ ఆత్మ విశ్వాసంతో పాలనా బాధ్యతలను నిర్వహించలేరు. పైన ఎల్లప్పుడూ కాపలా కాసే అధిపతి ఒకరు లేకుండానే ప్రభుత్వ యంత్రాంగానికి పర్యవేక్షకునిగా సీఎంకు ఏ పదవీ బాధ్యతలకు ఎవరైతే తగినవారనే విషయం తెలుస్తుంది. ఏదో ఒక కుంటిసాకుతోనో లేదా అసలే కారణమూ లేకుండానో జంగ్ రోజువారీ కార్యక్రమంగా ఆశ్చర్య చకితులను చేస్తున్నారు. కార్పొరేట్ కార్యాల యంలోని చిల్లర రాజకీయాలను ప్రయోగిస్తున్నారు. జంగ్ తనకు సంక్రమించిన అధికారం కాక మరేమై నా కార ణాలతో అలా ప్రవర్తిస్తున్నారేమోగానీ ఆ విష యాన్ని ఆయన ఎన్నడూ వివరించలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా జంగ్ కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేశారు. ఇప్పటిలా అప్పుడు ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో వ్యతిరేకత లేదు. పరిపాలనలోని అన్ని విభాగాలను నియంత్రించలేకపోతున్నందుకు షీలా చిం తించేవారు. సవ్యమైన సమస్యలతోనే ఎవరైనా తన వద్ద కు వచ్చినా, పైన అధిపతినని విశ్వసించే లెఫ్టినెంట్ గవ ర్నర్ ఉండటంతో ఆమె వారిని తిప్పి పంపేసేవారు. రేప్ కేసులతో కఠినంగా వ్యవహరించాలనే దేశ వ్యాప్త చైతన్యాన్ని తగినంతగా రేకెత్తింపజేసిన సామూ హిక బస్సు రేప్ ఘటన తదుపరి షీలా దీక్షిత్ నిస్సహా యత మరింత తీవ్రమైంది, పైకి సైతం అది కనబడేది. ఆగ్రహంతో జంతర్ మంతర్ వద్ద గుమిగూడిన ప్రజల వద్దకుపోయి తాను తగు చర్యలను తీసుకోగలనని, తీసు కుంటానని చెప్పడానికి సైతం ఆమె జంకారు. 1991లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీని శాసనసభ గల రాష్ట్రంగా మార్చినప్పుడు, ఇలాంటి సున్నితమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నట్టు లేదనిపిస్తోంది. ఆ పరిస్థితిని మొట్టమొదటిసారిగా సవా లు చేసినది కేజ్రీవాలే. దీక్షిత్లాగే ఆమెకు ముందటి బీజేపీ సీఎం సాహెబ్‌సింగ్ వర్మ కూడా స్వయంప్రతి పత్తిని వాంఛించారు. సౌత్‌బ్లాక్‌లో ఆయన ధర్నా సైతం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. వర్మ లేదా దీక్షిత్‌ల కు భిన్నంగా కే జ్రీవాల్‌కు స్వార్థ పరశక్తుల ప్రయోజనా లను పరిరక్షించడానికే ఉన్న అధికార యంత్రాంగానికి లేదా వంక రటింకర వ్యవసకు రుణపడి లేరు. ఆయన ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. ఇప్ప టికైతే ఆయన వెనకడుగు వేసే లేదా తన ఖడ్గాన్ని ఒరలో పెట్టే యోచనలో ఉన్నట్టు కనబడదు. జంగ్‌ను ఆయన కేంద్రం తరఫున కయ్యానికి దిగుతున్న బంటుగానే భావిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని ఒక తిరుగుబాటుదారు అపార్థం గా భావించడం పొరపాటు. అదేమైనా ఉంటే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిన పద్ధతికి సంబంధించినదే కావాలి. వాస్తవానికి దానికి పరిష్కారం అధికార నిర్మా ణానికి సంబంధించిన రాజ్యాంగ సంస్కరణే. అయినా కేజ్రీవాల్ దాన్ని సవాలు చేసే తెలివిని ప్రదర్శించారు. ఆయన మునిసిపాలిటీయే లేని మేయర్లాంటి ముఖ్య మంత్రిగా ఉండాలనుకోవడం లేదు. తమతమ రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఢిల్లీ గత సీఎంలంతా నిశ్శబ్దంగా ఆయన్ను ప్రశంసిస్తూ ఉండివుంటారు. దీక్షిత్‌లాంటి వాళ్లు, మరో మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ స్వయంప్రతిపత్తి ఆవశ్య కత గురించి మాత్రమే మాట్లాడారు. కేంద్రం మేలుకునే లా చేయలేదు. అయితే, కేజ్రీవాల్ తప్పుదోవపట్టి ఉంటే ఉండొచ్చే మో గానీ మామూలు రాజకీయవేత్తేమీ కాదు. అది తెలిసి కూడా ఆయనకు చిర్రెత్తించకుండానే జంగ్ తన విధులను నిర్వర్తింగలిగినా చేయలేదు. గత 49 రోజుల పాలనలో పోలీసుశాఖ కేజ్రీవాల్ నియంత్రణలో లేకు న్నా పోలీసులు లంచాల వసూలు మానేశారని ఢిల్లీ ప్రజలకు తెలుసు. కాబట్టే ఆయనకు తిరిగి అధికారం కట్టబెట్టారు. ఆయనను రెచ్చగొట్టాల్సిన అవసరం జంగ్కేమీ లేదు. చట్టంలో రాసి ఉన్నది, రాసి ఉన్న దాని స్ఫూర్తి అనే రెండు అంశాలున్నాయి. బదిలీల విషయాన్ని ఆయన కెమెరా వెలుగుల ముందుగాక కేజ్రీవాల్‌తో విడిగా మాట్లాడకుండా నిరో ధించిందేమిటి? ఇప్పుడు కేజ్రీవాల్‌పైకి విసురుతున్న నిబంధనలు వేటిలోనూ వారు కోరుకుంటున్న మార్పుల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడకుండా అడ్డుకునేదేదీ లేదు. జంగ్ దెబ్బతీస్తున్నది తాను పరిరక్షించాల్సిన రాజ్యాంగాన్ని కాదు. వాస్తవానికి ఆయన సక్రమంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. గవ ర్నర్ అంటే విశ్వసనీయమైన పర్యవేక్షకుడేగానీ సీఈఓ కాదు. ముఖ్యమంత్రి ఆయన కంటే కిందివాడు కాడు. బీజేపీ ప్రభుత్వం తరపున పోరాడే బంటులా అనిపించేలా ఆయన ఒక్కసారైనా కనిపించలేదు. కానీ ఆయన సరిగ్గా ఆపార్టీ పాటకు అనుగుణంగా నాట్యం చేస్తున్నారు. ఢిల్లీలోని నాలుగు మునిసిపల్ కార్పొరేషన్ల కు 2017లో జరగనున్న ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ అనుకుంటోంది. జంగ్, కేజ్రీవాల్ రోజువారీ పరిపాలనా విధులను సైతం నిర్వహించలేని విధంగా నిత్యమూ ఏదో ఒక సంఘర్షణలో తలమునకలై ఉండేట్టు చేస్తున్నారు. ఆయన ప్రవర్తనలోని ప్రతికూలా త్మక స్వభావమే చెప్పాల్సినదంతా చెబుతోంది. శుక్రవారం రాత్రి దాదాపు అన్ని ప్రధాన టీవీ చానళ్లు హఠాత్తుగా మేల్కొని బీజేపీ అధికారంలో ఉన్న తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో గత 12 రోజు లుగా చెత్తను ఎత్తిపారేయడం లేదని గుర్తించడం కాకతా ళీయమేమీ కాదు. ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందనే సాధారణ సందేశాన్ని అవి పంపాల నుకున్నాయి. కేజ్రీవాల్ పనిచేయడం అసాధ్యం చే యాల నే ఉద్దేశంతో అత్యంత శక్తివంతులైన ఒకరెవరో గానీ అద్భుతమైన ప్రజాసంబంధాలను స్వరపరచడమే ఏక కంఠంతో సాగిన ఆ బృందగానానికి అర్థం. - మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు. ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
'జీతాలు ఈరోజే చెల్లించండి'
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఢిల్లీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలకు విముక్తి లభించింది. వారి ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జతకట్టి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శల దాడికి దిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చింది. గత రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించకుండా ఉన్న జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలన్న వారి డిమాండ్ కు ప్రభుత్వం స్పందించి రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఆలోపే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం రోజే వారికి మొత్తం రూ.493 కోట్లు విడుదల చేయాల్సిందిగా నగర మేయర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే వారికి జీత భత్యాలు చెల్లించాలని కోరారు. ఈ నెల జూన్ 2 నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగడంతో ఢిల్లీలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. -
కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురు
ఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ నియామక అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కే చెందుతాయని హైకోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీ ప్రభుత్వం సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని పేర్కొంది. అయితే ఆ సూచనలు అమలు చేయాలా?వద్దా?అనేది లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయంపైనే ఆధారపడుతుందని తెలిపింది.ప్రభుత్వం చేసే సూచనలు తప్పకుండా లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షించిన తరువాతే అమలు చేయాలని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించాలని కేంద్రం భావిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించడంతో ఆ వివాదం ముదిరిపాకాన పడి హైకోర్టు వరకూ వెళ్లింది. -
కేజ్రీవాల్ కు మమత మద్దతు?
కోల్ కతా: ఢిల్లీ ఏసీబీ విభాగం అంశానికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి పరోక్ష మద్దతు లభిస్తుందా? అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం పదేపదే జోక్యం చేసుకోవడం తగదన్న మమత వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఎలాగైతే కేబినెట్ ఉంటుందో.. అలానే ప్రతీ రాష్ట్రానికి కూడా కొంతమంది సభ్యులతో కూడిన కేబినెట్ ఉంటుందని కేంద్రాన్ని విమర్శించారు. రాష్ట్ర కేబినెట్ కు కూడా అధికారాలు ఉంటాయన్న విషయాన్ని కేంద్రం గ్రహించాలని మమత ట్వీట్టర్లో హితబోధ చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏసీబీ అధికారులు విచారించడానికి వీల్లేదని, భూమికి సంబంధించిన అంశాలు, ఢిల్లీ పోలీసులు, కీలక అధికారుల నియామకం లాంటి అంశాల్లో వేలుపెట్టే అధికారం ఢిల్లీ సర్కారుకు లేదని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ ఏసీబీ విభాగం తప్పనిసరిగా కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచే ఆదేశాలు తీసుకుని, వాటిని పాటించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ మంత్రివర్గం సలహా, సహాయాలతోనే పనిచేయాలని జడ్జి స్సష్టం చేశారు. ఈ నేపథ్యంలో మమత చేసిన ట్వీట్స్ ఆసక్తికరంగా మారాయి. కాగా, ఆమె చేసిన ట్వీట్స్ ఢిల్లీ హైకోర్టు తీర్పుకు ముందు చేశారా? లేక తరువాత చేశారా?అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
ప్రభుత్వ సలహాతోనే వ్యవహరించండి: హైకోర్టు
ఇటు కేంద్ర ప్రభుత్వంతోను.. అటు కేంద్ర ప్రతినిధి లెఫ్టినెంట్ గవర్నర్‌తోను గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు పెద్ద ఊరట లభించింది. ఢిల్లీ ఏసీబీ విభాగం తప్పనిసరిగా కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచే ఆదేశాలు తీసుకుని, వాటిని పాటించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ మంత్రివర్గం సలహా, సహాయాలతోనే పనిచేయాలని జడ్జి వ్యాఖ్యానించారు. దీంతో కేజ్రీవాల్ కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏసీబీ అధికారులు విచారించడానికి వీల్లేదని, భూమికి సంబంధించిన అంశాలు, ఢిల్లీ పోలీసులు, కీలక అధికారుల నియామకం లాంటి అంశాల్లో వేలుపెట్టే అధికారం ఢిల్లీ సర్కారుకు లేదని గతవారం కేంద్రం చెప్పింది. ఈ అంశాల్లో ఢిల్లీ ప్రభుత్వం సలహాలను తీసుకోవాల్సిన అవసరం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదని కూడా కేంద్రం తెలిపింది. అయితే.. అవినీతిపరులైన అధికారులను కాపాడేందుకే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. -
'ఎల్జీ' నచ్చకుంటే సామ్ సంగ్ ఉందిగా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) హస్తిన సీఎం, ఎల్జీ మధ్య 'పవర్ పోరు' రోజురోజుకు ముదురుతోంది. 'తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా' తరహాలో సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్ 'అధికారాల' యుద్ధం చేస్తున్నారు. నాది పైచేయి అంటే నాదే పైచేయి అనుకుంటూ కత్తులు నూరుకుంటున్నారు. నాకు ఎక్కువ అధికారం ఉందని సీఎం అంటే, నీకంటే నాకే అధికారం ఉందని ఎల్జీ వాదిస్తున్నారు. దీంతో 'పంచాయతి' దేశప్రథమ పౌరుడి దగ్గరికి వెళ్లింది. కూర్చుని మాట్లాడుకునే దానికి కారాలు-మిరియాలు నూరడం ఎందుకని కేంద్ర సర్కారు సన్నాయి నొక్కులు నొక్కింది. 'ఎల్జీ' బ్రాండ్ 'లైఫ్ ఈజ్ గుడ్'గా పాపులర్. కాని పాపం కేజ్రీవాల్ కు 'ఎల్జీ' అంటే లైఫ్ ఈజ్ బ్యాడ్ గా అయిపోయింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శకుంతలా గామ్లిన్‌ను జంగ్ నియమించటంతో ఆధిపత్య పోరుకు అంకురార్పణ జరిగింది. విద్యుత్ కంపెనీలకు లాబీయిస్టుగా ముద్రపడిన గామ్లిన్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడాన్ని 'ఆప్' సర్కారు తీవ్రంగా వ్యతిరేకించింది. సీఎం ఆదేశాలను పట్టించుకోకుండా ఆమె బాధ్యతలు చేపట్టడంతో కేజ్రీవాల్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గవర్నర్ ఆదేశాలపై గామ్లిన్ నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరిందమ్ మజుందార్‌పై బదిలీ వేటు వేశారు. ఆయన ఆఫీసుకు తాళం వేసి సాగనంపారు. 'గామ్లిన్' వివాదంపై కేజ్రీవాల్, నజీబ్ లు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకున్నారు. ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దంటూ ఎల్జీకి సీఎం లేఖ రాయగా, తన అధికారాల గురించి కేజ్రీవాల్ చెప్పాల్సిన పనిలేదంటూ జంగ్ ప్రతిస్పందించారు. ఇద్దరూ విడివిడిగా రాష్ట్రపతి ప్రణబ ముఖర్జీ దర్శనం చేసుకుని వివాదానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఏకరువు పెట్టారు. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో వ్యవహరించినట్లుగా ఎల్జీ వ్యవహరిస్తున్నారని 'సామాన్య' సీఎం ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమ పని తమను చేసుకోనివ్వాలని, జంగ్ ను అడ్డం పెట్టుకుని ఆప్ సర్కారుకు 'జర్క్' ఇవ్వొద్దని సూచించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సీఎం, ఎల్జీలకు కేంద్రం ఉచిత సలహా ఇచ్చింది. ఢిల్లీ సీఎం, ఎల్జీ ఆధిపత్య పోరుతో అధికారులు తల్లడిల్లుతున్నారు. హస్తినలో పనిచేయాలంటే హడలిపోతున్నారు. ఎవరి ఆదేశాలను పాటించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఢిల్లీ నుంచి మరెక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖకు మొరపెట్టుకుంటున్నారు. ఎంతకాలం ఈ బాధ మహాప్రభో అంటూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముందు అధికారులు వాపోయారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అధికారులను ఉపముఖ్యమంత్రి ఊరడించారు. కేజ్రీవాల్, జంగ్ పోరు ఎంతవరకు వెళుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కేజ్రీవాల్ కు 'ఎల్జీ'తో ఇబ్బంది ఉంటే ఏ 'సామ్ సంగ్'నో, 'సోని'నో చూసుకోవచ్చు కదా అనే కామెంట్ ఇంటర్నెట్ లో బాగా పాపులర్ అయింది. -
కేజ్రీవాల్ తో జంగ్ అమీతుమీ
న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో అమీతుమీ తేల్చుకునేందుకు లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సిద్దమయ్యారు. అధికారుల నియామకం, బదిలీల విషయంలో తనకున్న రాజ్యాంగపరమైన హక్కుల గురించి తెలుపుతూ బుధవారం కేజ్రీవాల్ కు ఆయన లేఖ రాశారు. తాను జారీచేసిన ఆదేశాలను పాటించొద్దని అధికారులకు చెప్పగలరా అంటూ ఆప్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గత నాలుగు రోజులుగా కేజ్రీవాల్ సర్కారు చేసిన అధికారుల నియామకాలు, బదిలీలను లెప్టినెంట్ గవర్నర్ రద్దుచేశారు. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. మరోవైపు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని స్వతంత్రంగా పనిచేసుకోనివ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి అంతకుముందు కేజ్రీవాల్ లేఖ రాశారు. -
రాష్ట్రపతి దగ్గరకు చేరిన పంచాయితీ
రాష్ట్రపతితో నజీబ్‌జంగ్, కేజ్రీవాల్ భేటీ ఒకరిపై ఒకరు ఆరోపణలు; రాజ్‌నాథ్‌తోనూ జంగ్ మంతనాలు అటార్నీ జనరల్ అభిప్రాయం కోరిన హోంశాఖ న్యూఢిల్లీ: ఢిల్లీ ‘లొల్లి’ రాష్ట్రపతి దగ్గరకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వాధినేతలు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్‌జంగ్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ల మధ్య ఐదు రోజులుగా సాగుతున్న ప్రత్యక్ష పోరు.. పరిష్కారం కోసం రాష్ట్రపతి కోర్టుకు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం నజీబ్ జంగ్.. సాయంత్రం కేజ్రీవాల్ ఒకరి తరువాత ఒకరుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఎవరి వాదనలు వారు వినిపించారు. కేజ్రీవాల్ రాష్ట్రపతిని కలవటానికి కొద్ది గంటలు ముందుగా ఎల్జీ.. ప్రణబ్‌ను కలసి జరుగుతున్న ఘర్షణ నేపథ్యాన్ని వివరించారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శకుంతలా గామ్లిన్‌ను నియమించటం, తదనంతర పరిణామాలను చర్చించారు. అంతకుముందు ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ 15 నిమిషాలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని బేఖాతరు చేసి తాను తీసుకున్న నిర్ణయాలను జంగ్ సమర్థించుకున్నట్లు సమాచారం. సాయంత్రం కేజ్రీవాల్.. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో కలసి రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎల్జీ బేఖాతరు చేస్తున్నారని ప్రణబ్‌కు ఫిర్యాదు చేశామని సమావేశం తర్వాత సిసోడియా విలేకరులకు తెలిపారు. తనను సంప్రదించకుండానే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని నియమించారని అన్నారు. కార్యదర్శుల నియామకాల్లోనూ ఎల్జీ జోక్యం మితిమీరిందని ఆయన ఆరోపించారు. ఎల్జీ తీసుకున్న ఏ నిర్ణయం కూడా రాజ్యాంగబద్ధం కాదని రాష్ట్రపతికి తెలిపినట్లు చెప్పారు. తన ఆదేశాలు వినకుంటే బదిలీ చేస్తానంటూ ఎల్జీ బెదిరిస్తున్నారని సీఎం కేజ్రీవాల్ తెలిపారన్నారు. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో వ్యవహరించినట్లుగా ఎల్జీ వ్యవహరిస్తున్నారన్నారు. ఆప్ ఎజెండాలో పరిపాలన లేదు: జైట్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆప్ సర్కారు ఘర్షణతో ఢిల్లీలో పరిపాలన స్తంభించిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆప్ రాజకీయ ఎజెండాలో పరిపాలన అన్నది లేదని విమర్శించారు. కొత్త పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజలు ప్రయోగం చేశారని.. కానీ అది భారీ మూల్యానికి దారి తీస్తోందని అన్నారు. గవర్నర్‌తో సంబంధం లేకుండానే నిర్ణయాలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ నుంచి కానీ, ఆయన కార్యాలయం నుంచి కానీ మౌఖికంగా, రాత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలు వచ్చినా, వాటిని వెంటనే అమలు చేయవద్దని ఆప్ సర్కారు ఉన్నతాధికారులందరికీ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ వైపు నుంచి వచ్చే ప్రతీ ఆదేశాన్నీ, తప్పనిసరిగా ముఖ్యమంత్రికి కానీ, సంబంధిత శాఖ మంత్రికి కానీ తెలియజేశాకే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. జంగ్‌తో కేజ్రీవాల్ లడాయీ ఇంతటితో ఆగలేదు. సర్వీసుల ముఖ్య కార్యదర్శిగా తాను నియమించిన రాజేంద్రకుమార్ ద్వారా మరో ముఖ్యకార్యదర్శి నియామకపు ఉత్తర్వులను కేజ్రీవాల్ జారీ చేయించారు. సాధారణ పరిపాలనా విభాగపు ముఖ్యకార్యదర్శిగా అరవింద్ రేను నియమిస్తూ జీవో విడుదల చేశారు. అసలు రాజేంద్ర కుమార్ నియామకమే చెల్లదని ఎల్జీ వాదిస్తుంటే ఆయనతోనే మరో కార్యదర్శిని నియమింపజేయటం గమనార్హం. నేడు రాష్ట్రపతితో రాజ్‌నాథ్ భేటీ! ప్రతిష్టంభనను తొలగించటానికి బుధవారం రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రపతితో భేటీ కానున్నట్లు సమాచారం. ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖ పరిపాలనా నియంత్రణలో ఉండటంతో సమస్యకు పరిష్కారాన్ని చూపాల్సిన బాధ్యత హోంమంత్రిపైనే ఉంది. కాగా, ఎల్జీ-నగర ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు, విధులపై అభిప్రాయం చెప్పాలని అటార్నీ జనరల్‌ను హోం శాఖ కోరింది. అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వంలో తనకున్న అధికారాలపై న్యాయనిపుణులతో జంగ్ సంప్రదింపులు జరిపారు. గత శుక్రవారం శకుంతలా గామ్లిన్‌ను తాత్కాలిక ప్రధానకార్యదర్శిగా నియమించటంతో కేజ్రీవాల్‌కు, ఎల్జీకీ మధ్య ఘర్షణ నెలకొనడం తెలిసిందే. బెంబేలెత్తుతున్న ఐఏఎస్‌లు కేజ్రీవాల్, జంగ్ల ఘర్షణతో ఐఏఎస్‌లు బెంబేలెత్తుతున్నారు. దాదాపు 20 మంది కేంద్రపాలిత ప్రాంత కేడర్ ఐఏఎస్ అధికారులు తమను ఢిల్లీ నుంచి మరెక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖను సంప్రదించినట్లు సమాచారం. అధికారికంగా ఎవరూ వెల్లడించకపోయినప్పటికీ, తాత్కాలిక ప్రధానకార్యదర్శిగా గామ్లిన్‌ను నియమించినప్పటి నుంచీ ఐఏఎస్‌లు ఇద్దరు రాజ్యాంగాధిపతుల మధ్య నలిగిపోతున్నారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో ఆప్ ప్రభుత్వం బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆప్ సర్కారుకు లాయర్ల సమర్థన ఎల్జీ నజీబ్ జంగ్, సీఎం కేజ్రీవాల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై సుప్రీం కోర్టు సీనియర్ లాయర్లు స్పందించారు. ప్రముఖ న్యాయవాదులు రాజీవ్ ధావన్, ఇందిరా జైసింగ్‌లు ఈ విషయంపై మాట్లాడుతూ ఉన్నతాధికారుల నియామకాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వతంత్ర అధికారాలు లేవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరుండాలో ఎంచుకునే సంపూర్ణ హక్కులు ముఖ్యమంత్రికి ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని లెఫ్టినెంట్ గవర్నరే సృష్టించారని ఆయన విమర్శించారు. ప్రధాన కార్యదర్శి సెలవుపై వెళ్లి 40 గంటలైనా తాత్కాలిక ప్రధానకార్యదర్శిని నియమించలేదన్న కారణంతో లెఫ్టినెంట్ గవర్నర్ తానే నియామకానికి పూనుకోవటం సరి కాదని అన్నారు. -
రాజుకున్న ఆధిపత్య వివాదం
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు, ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సిఫారస్కు విరుద్ధంగా సీనియర్ బ్యూరోక్రాట్ శకుంతలా గామ్లిన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని కేజ్రీవాల్ ఆరోపించారు. చీఫ్ సెక్రటరీ కేకే శర్మ వ్యక్తిగత పనిమీద సెలవులో అమెరికా వెళ్లడంతో వేరొకరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. తన పేరు ప్రకటించాన కొద్ది గంటలలోనే పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయంలోని సీనియర్ అధికారి ఒత్తిడి చేస్తున్నట్లు ఆమె లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశారు. గామ్లిన్ ప్రస్తుతం విద్యుత్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇది బిజినెస్ రూల్స్‌కు విరుద్ధం ఎన్నికైన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పరిగణనలోకి తీసుకోకుండా లెఫ్టినెంట్ గవర్నర్ బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను నజీబ్ జంగ్ ఖండించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ ప్రాకారం లెఫ్టినెంట్ గవర్నరే ఢిల్లీ సర్వోన్నత అధికారి అని పేర్కొన్నరు. ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన ఫైల్ మే 13 సాయంత్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేరింది. ఆయన వెంటనే దాన్ని క్లియర్ చేశారు. సీనియారిటీ, పనితీరు ప్రాతిపదికగా గామ్లిన్‌ను ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేసినట్లు గవర్నర్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన వ్యక్తి పేరు సర్వీసెస్ డిపార్ట్మెంట్ పంపిన లిస్టులో లేదని, ఆ అధికారి ఇంతకు ముందెన్నడూ ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేయలేదని లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా ఆదేశాల జారీచేసే విశేష అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజ్యాంగం కల్పించలేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తి రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం ఆరోపించింది. -
నేడే ‘ఆమ్ ఆద్మీ’ ప్రమాణం
ఢిల్లీ 8వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రిగా సిసోడియా, మంత్రులుగా మరో ఐదుగురు! రాంలీలా మైదానంలో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారోత్సవం న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(46) ఢిల్లీ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా నేడు(శనివారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. చారిత్రక రామ్‌లీలా మైదానంలో ఉదయం 11 గంటలకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేజ్రీవాల్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన సన్నిహితుడు మనీశ్ సిసోడియా, మంత్రులుగా సత్యేంద్ర జైన్, జితేంద్ర తోమర్, గోపాల్ రాయ్, సందీప్ కుమార్, ఆసిమ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. వీరిలో చివరి నలుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. అలాగే, రామ్ నివాస్ గోయెల్‌ను స్పీకర్‌గా, వందన కుమారిని ఉపసభాపతిగా నియమించనున్నారని సమాచారం. 2013 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్.. జనలోక్‌పాల్ బిల్లును బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుకోవడానికి నిరసనగా సరిగ్గా సంవత్సరం క్రితం 2014, ఫిబ్రవరి 14న సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం.. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం తెలిసిందే. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన ప్రమాణానికి రావాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ ఇప్పటికే రేడియో ద్వారా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పలువురు వీఐపీలతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావచ్చని భావిస్తున్నారు. దాంతో దాదాపు 1200 మందితో ఢిల్లీ పోలీసులు వేదిక వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణం తన ప్రభుత్వ ప్రాథమ్యాలను కేజ్రీవాల్ తన ప్రసంగంలో వివరించనున్నారు. ఆప్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుకు సంబంధించి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాల్సిందిగా కేజ్రీవాల్ ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియాను ఆదేశించారు. విద్యుత్ చార్జీల్లో 50% తగ్గింపు, ఢిల్లీ నగరమంతటా ఉచిత వైఫై సదుపాయం, 10-15 లక్షల సీసీ టీవీల ఏర్పాటు, 2 లక్షల పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, 20 కొత్త కాలేజీల ఏర్పాటు, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు క్రమబద్ధీకరణ, ఢిల్లీ ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 30 వేల బెడ్స్, రానున్న ఐదేళ్లలో 8 లక్షల ఉద్యోగాల కల్పన.. మొదలైన హామీలను ఆప్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని కేజ్రీవాల్ ఆహ్వానించగా, ఇతర కార్యక్రమాలను ముందే ఒప్పుకున్నందువల్ల హాజరు కాలేనని మోదీ చెప్పిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్(హోం), వెంకయ్యనాయుడు(పట్టణాభివృద్ధి), ఢిల్లీలోని 7గురు ఎంపీలను కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేజ్రీవాల్ ఆహ్వానించారు. కాగా, గత నాలుగు రోజులుగా జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న కేజ్రీవాల్ ఇంకా పూర్తిగా తేరుకోలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నీరసంతో కనీసం కూర్చోవడానికి కూడా కేజ్రీవాల్ ఇబ్బంది పడుతుండటంతో శుక్రవారం నాటి కొన్ని కార్యక్రమాలను పార్టీ రద్దు చేసింది. డయాబెటిస్ పేషెంట్ కూడా అయిన కేజ్రీవాల్ చలికాలంలో తరచూ గొంతు ఇన్ఫెక్షన్కు గురవుతుంటారు. కీలక శాఖలు తన వద్దే.. ఆప్ వర్గాల సమాచారం మేరకు.. కీలకమైన హోం, విద్యుత్, ఆర్థిక శాఖలను కేజ్రీవాల్ తనవద్దే అట్టిపెట్టుకోనున్నారు. తన సన్నిహితుడు, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మనీశ్ సిసోడియాకు విద్య, పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖలను అప్పగించనున్నారు. వీరిద్దరు నిర్వహించనున్న శాఖలకు కేంద్రం ప్రత్యక్ష సహకారం అవసరం. గత ఆప్ ప్రభుత్వంలో ఆరోగ్యం, పరిశ్రమల శాఖను నిర్వహించిన సత్యేంద్ర జైన్‌కు ఈ సారీ అవే శాఖలు అప్పగించనున్నారు. ఆప్ సీనియర్ నేత గోపాల్రాయ్కి రవాణా, కార్మిక శాఖల బాధ్యతలు అప్పగించనున్నారు. సందీప్ కుమార్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ.. జితేంద్ర తోమర్‌కు న్యాయ శాఖ.. ఆసిమ్ అహ్మద్ ఖాన్‌కు ఆహార, పౌర సరఫరా, మైనారిటీ వ్యవహారాల శాఖ ఇవ్వనున్నారు. ఆప్ మీడియా కార్యదర్శి నాగేంద్ర శర్మను సీఎంకు మీడియా కార్యదర్శిగా నియమించనున్నారు. కేజ్రీవాల్‌ను సీఎంగా నియమించిన రాష్ట్రపతి ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమించారు. అలాగే మరో ఆరుగురిని మంత్రులుగా నియమించినట్లు పేర్కొంటూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుంచి కేజ్రీవాల్ సీఎంగా ఉంటారని అందులో తెలిపారు. సాధారణంగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రులను గవర్నర్ ఆహ్వానిస్తారు. అయితే ఢిల్లీకి పాక్షిక రాష్ట్ర హోదా ఉన్నందున సీఎంను రాష్ట్రపతే నియమిస్తారు. మరోవైపు కేజ్రీవాల్ శనివారం సీఎంగా ప్రమాణం చేయగానే ఢిల్లీ రాష్ట్రపతి పాలన ముగియనుంది. ఈ మేరకు 2014 ఫిబ్రవరి 16న రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్రపతి పేరుతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. షీలా, అంబానీల కేసులను విచారిస్తాం కాంగ్రెస్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ తదితరులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తమ ప్రభుత్వం విచారణ జరుపుతుందని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా చెప్పారు. వారిపై గతంలో 49 రోజుల పాటు ఆప్ అధికారంలో ఉన్న సమయంలో నమోదైన కేసులన్నింటిపై విచారణ జరుపుతామన్నారు. కేజీ బేసిన్లో ఉత్పత్తవుతున్న సహజవాయువు ధరను భారీగా పెంచే విషయంలో కుమ్మక్కయ్యారంటూ ముకేశ్, వీరప్ప మొయిలీలపై.. కామన్వెల్త్ క్రీడల సందర్భంగా వీధి దీపాల కొనుగోలు కుంభకోణంలో షీలా దీక్షిత్‌పై నాటి కేజ్రీవాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాగే, ఢిల్లీలోని విద్యుత్ సరఫరా కంపెనీల అకౌంట్లను కాగ్‌తో ఆడిట్ చేయిస్తామని సిసోడియా వెల్లడించారు. ప్రతీ ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ముఖ్యమంత్రి సహా తమ మంత్రులెవరూ ఎర్ర బుగ్గ కార్లను ఉపయోగించబోరన్నారు. బిహార్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
గవర్నర్‌ను కలుసుకున్న కేజ్రీవాల్
-
పొగాకుపై నిషేధానికి లభించని ఎల్జీ ఆమోదం
న్యూఢిల్లీ: నమిలే పొగాకు (గుట్కా) ఉత్పత్తి, నిల్వ, క్రయ విక్రయాలపై నిషేధం విధించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నుంచి ఆమోదం కోసం వేచి చూస్తున్నామని నగర ఆరోగ్య విభాగం గురువారం తెలిపింది. గుట్కాపై నిషేధం విధించాలని ఢిల్లీ రాష్ట్ర పొగాకు నియంత్రణ విభాగం గత ఏడాది సెప్టెంబర్‌లోనే ప్రతిపాదించగా, ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దానికి పచ్చజెండా ఊపారు. అంతకుముందు ఈ ప్రతిపాదనను ఆహారభద్రత కమిషనర్, ఇతర ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తమ ఆమోదం తెలిపారు. అంతిమంగా ఈ ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ఫైలు గత ఆరు నెలలుగా ఎల్జీ వద్ద పెండింగ్‌లో ఉందని ఓ అధికారి చెప్పారు. ఢిల్లీలో గుట్కాపై 2012, సెప్టెంబర్‌లోనే నిషేధం విధించారు. కానీ దుకాణదారులు గుట్కా పదార్థాలైన పొగాకు, సుపారీని వేర్వేరుగా అమ్మటం ప్రారంభించారు. దీంతో గుట్కాపై నిషేధం విధించడం వల్ల కలిగే ప్రయోజనం పూర్తిగా నీరుగారిపోయింది. అందువల్ల నమలటానికి అనుగుణంగా ఉండే అన్ని రకాలైన ముడి పొగాకు ఉత్పత్తులను ఢిల్లీలో నిషేధించాలని నిర్ణయించామని ఆరోగ్య విభాగం అదనపు డెరైక్టర్ ఎస్కే అరోరా చెప్పారు. ముడి పొగాకుఉత్పత్తుల్లో జర్దా, ఖైనీ వంటివి ఉన్నాయని అన్నారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాల నుంచి ఢిల్లీకి గుట్కా కూడా సరఫరా అవుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రతి నెల చివరి తేదీని పొగాకు విషయంలో ‘డ్రై డే’గా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. పొగాకు వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు కూడాప్రయత్నిస్తున్నామని ఆ విభాగం తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి ‘టొబాకో అవేర్ సిటిజన్ ఆఫ్ ఢిల్లీ (పొగాకుపై అవగాహన కలిగిన ఢిల్లీపౌరుడు’ పేరిట ఒక మెరిట్ సర్టిఫికెట్ అందచేస్తామని ఆ అధికారి చెప్పారు. -
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
-
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఆమోదం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మంగళవారం ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. దాంతో ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతి ఆమోదం లాంఛనమైంది. ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో చర్చించిన అనంతరం మూడు పార్టీలు విముఖత వ్యక్తం చేయటంతో అసెంబ్లీని రద్దు చేయాలని నజీబ్‌జంగ్ సిఫారసు చేశారు. మైనార్టీ సర్కారు ఏర్పాటుపై విముఖంగా ఉన్న కమలనాథులు ఎన్నికలను ఎదుర్కొనేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ రద్దుతో మూడు స్థానాల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకుంది. -
ఢిల్లీ అసెంబ్లీ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన రాజకీయాలపై ఎనిమిది నెలల నిరీక్షణకు తెరపడింది. ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మంగళవారం ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకు ఇక లాంఛనంగా రాష్ట్రపతి ఆమోదించటమే మిగిలింది. నివేదికను కేంద్రానికి పంపిన రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో సోమవారం చర్చించిన అనంతరం మూడు పార్టీలు విముఖత వ్యక్తం చేయటంతో అసెంబ్లీని రద్దు చేయాలని నజీబ్‌జంగ్ సిఫారసు చేశారు. మైనార్టీ సర్కారు ఏర్పాటుపై విముఖంగా ఉన్న కమలనాథులు ఎన్నికలను ఎదుర్కొనేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. తగినంత సంఖ్యా బలం లేనందువల్ల ప్రభుతాన్ని ఏర్పాటు చేయలేమని మూడు పార్టీలు తెలిపాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను రాష్ట్రపతి వెంటనే కేంద్రానికి పంపారు. దీని ఆధారంగా ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలనే ప్రతిపాదనను హోంశాఖ కేబినెట్ ముందుంచింది. సాధారణంగా బుధవారం సమావేశమయ్యే కేబినెట్ తాజా పరిణామాలతో మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమై అసెంబ్లీ రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సంపూర్ణ మెజార్టీ సాధిస్తాం: కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు తలొగ్గి బీజేపీ ముందుగానే ఓడిపోయిందని ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నాలుగు నెలల నుంచి అవినీతి, అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో బీజేపీ దిగి వచ్చిందన్నారు. 49 రోజుల తమ పాలనలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రపంచంలో ఉత్తమ నగరంగా తీర్చిదిద్దడం, అవినీతి నుంచి విముక్తి కల్పించడం ప్రచార అంశాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళతామన్నారు. తాను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పిన కేజ్రీవాల్ తుది నిర్ణయం పార్టీదేనన్నారు. ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్‌కు సంపూర్ణ మెజార్టీ కట్టబెడతారని విశ్వాసం వెలిబుచ్చారు. కాగా, అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకున్నారని కాంగ్రెస్ పేర్కొంది. డిసెంబర్లోనా వచ్చే ఏడాదా? ఢిల్లీలో తిరిగి ఎప్పుడు ఎన్నికలు జరిపించాలన్న విషయంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఢిల్లీలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను కూడా రద్దు చేయనున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున డిసెంబర్ నెలాఖరులో ఆఖరి దశలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని కొందరు అంటుండగా, జనవరిలో లేదా ఫిబ్రవరిలో హస్తిన ఎన్నికలు ఉంటాయని మరికొందరు భావిస్తున్నారు. ఢిల్లీలో గత ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 49 రోజుల పాలన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేయటంతో రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు. -
ఢిల్లీకి మళ్లీ ఎన్నికల కళ!
ఢిల్లీకి ఎనిమిది నెలల రాజకీయ అనిశ్చితి నుండి ఎట్టకేలకు విముక్తి లభించింది. ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు రెండూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అశక్తతను వ్యక్తం చేయడంతో అసెంబ్లీ రద్దుకు లెఫ్టినెంట్ గవర్నర్ నవాబ్ జంగ్ మంగళవారం సిఫార్సుచేశారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి నిరుడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షమైన అకాలీదళ్‌కు వచ్చిన ఒక స్థానాన్ని కలుపుకొని బీజేపీ 32 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆప్‌కు 28 స్థానాలు రాగా కాంగ్రెస్‌కు 8 లభించాయి. కొంత ఊగిసలాట తర్వాత అదే నెలలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైనా అది రెండు నెలలుకూడా మనుగడ సాధించలేకపోయింది. పదవినుంచి వైదొలగుతూ కేజ్రీవాల్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించదల్చుకుంటే ఆ సిఫార్సును పట్టించుకుని ఉండేవారు. ఎందుకంటే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేమని బీజేపీ ఆదిలోనే చెప్పింది. కేజ్రీవాల్ రాజీనామా అనంతరం మరోసారి దాన్నే పునరుద్ఘాటించింది. కనుక మళ్లీ ఎన్నికలు నిర్వహించడం తప్ప అక్కడ ప్రత్యామ్నాయం లేదు. మేలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలతోపాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయని అందరూ అంచనావేసిన సమయంలో రాష్ట్రపతి పాలన వచ్చిపడింది. ఆనాటి యూపీఏ సర్కారు అభీష్టార్థం నడుచుకున్న లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ సిఫార్సును పక్కనబెట్టారు. కనుకనే కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. రాజ్యాంగ నిబంధనలను పాటించడంలో అటు కార్యనిర్వాహకవర్గమూ, ఇటు రాజకీయ పక్షాలూ విఫలమవుతున్నాయి. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంనుంచి ఆలోచించడంతప్ప నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్న స్పృహ కరువవుతున్నది. ఢిల్లీలో ఏర్పడ్డ రాజకీయ ప్రతిష్టంభనను తొలగించడానికి ఏం చేయదల్చుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు లెఫ్టినెంట్ గవర్నర్‌నూ, కేంద్ర ప్రభుత్వాన్నీ ఏడు నెలలక్రితం కోరినప్పుడు కొందరు నొచ్చుకున్నారు. ఇది కార్యానిర్వాహక వర్గం అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడ్డారు. కానీ, సుప్రీంకోర్టు వెంటపడింది గనుకే ఇంత ఆలస్యంగానైనా అసెంబ్లీ రద్దు విషయం తేలింది. ఈ కాలమంతా రాజకీయ పార్టీల పిల్లిమొగ్గల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి, దాన్ని నవాబ్‌జంగ్ అంగీకరించలేదని అలిగి సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లిన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల అనంతరం కొంతకాలంపాటు వైఖరి మార్చుకున్నారు. రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని ప్రయత్నాలు చేశారు. అది సాధ్యపడేలా లేదని గ్రహించాక మళ్లీ అసెంబ్లీ రద్దు పాటపాడారు. బీజేపీ సైతం ఇలాంటి ఊగిసలాటనే ప్రదర్శించింది. ఈ ఊగిసలాట ఉద్దేశపూర్వకం కూడా కావొచ్చు. ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదు గనుక ప్రతిపక్షంలోనే కూర్చుంటామని అసెంబ్లీ ఎన్నికలైన వెంటనే స్పష్టంగా చెప్పిన ఆ పార్టీ కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడగానే కొత్త ఆలోచనలు చేసింది. అధికారికంగా ఏమీ చెప్పకపోయినా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై కొంత ప్రయత్నంచేసినట్టు కనబడింది. తమ పార్టీకున్న 31 మంది సభ్యుల్లో ముగ్గురు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికై బలం 29కి తగ్గడంతో ఈ విషయంలో చురుగ్గా కదల్లేకపోయింది. అందువల్లే ఖాళీ ఏర్పడిన మూడు అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆ మూడు స్థానాలూ గెల్చుకున్నా ఫిరాయింపుల ద్వారా తప్ప ప్రభుత్వం ఏర్పాటుచేయడం అసాధ్యమని, అది పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుందని చివరకు భావించింది. దాని పర్యవసానమే అసెంబ్లీ రద్దు నిర్ణయం. అయితే, ఈ ఎన్నికలు మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలతోగానీ...ఈ నెలలో జరగబోయే జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలతోగానీ రాకుండా చూడటంలో విజయం సాధించింది. ఢిల్లీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేంద్రీకరించడం కోసమే ఈ ఎత్తుగడవేసింది. వాస్తవానికి ఢిల్లీలో బీజేపీకి నాయకత్వ సమస్య ఉంది. కనుకనే నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నా కాంగ్రెస్‌పై ఏర్పడిన అసంతృప్తిని తనకు అనుకూలంగా మలచుకోవడంలో విఫలమైంది. మోదీ రాకతో ఆ పరిస్థితి మారి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలనూ గెల్చుకోగలిగింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ఇచ్చిన ఊపుతో ఢిల్లీ అసెంబ్లీని కూడా చేజిక్కించుకోగలమన్న విశ్వాసం ఆ పార్టీలో ఉన్నా రాష్ట్ర స్థాయిలో అందరి విశ్వాసాన్నీ పొందగలిగిన ఒక నాయకుణ్ణి ముందుకు తీసుకురావడంలో బీజేపీ ఇంతవరకూ సఫలం కాలేదు. అయితే, కాంగ్రెస్ వరస అపజయాలతో కుదేలై ఉండటమూ, నిరుడు ఎన్నికల నాటికి అవినీతిని ప్రధానాస్త్రంగా చేసుకుని నైతికంగా దృఢంగా కనబడిన ఆప్ ఇప్పుడు మిగిలిన పార్టీల్లో ఒకటిగా మిగిలిపోవడమూ బీజేపీకి పనికొచ్చే అంశాలు. అయితే, ఢిల్లీలో ఇటీ వల జరిగిన కొన్ని పరిణామాలు ఆందోళన కలిగించేవి. రాజధాని నగరంలోని త్రిలోక్‌పురిలో మత ఘర్షణలు నెలకొనడమూ, తమ కాలనీల్లో మతపరమైన ఊరేగింపు జరపరాదంటూ నంద్నగ్రి, బవానాల్లో కొందరు తీర్మానాలు చేయడమూ పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. సామాన్య పౌరుల్లో భయాందోళనలు రేకెత్తించే ఇలాంటి ఉదంతాలను మొగ్గలోనే తుంచి, కారకులపై చర్య తీసుకోకపోతే ఎన్నికల వాతావరణం కలుషితమవుతుంది. అనవసర వైషమ్యాలు, ఉద్రిక్తతలు పెరుగుతాయి. రాజధాని నగరంగా ఉన్న ఢిల్లీలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం దేశ ప్రతిష్టను పెంచదు. కనుక అన్ని రాజకీయ పక్షాలూ ఎన్నికలు ఆగమిస్తున్న ఈ దశలో బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో మెలగాలి. ప్రతి కాలనీలోనూ శాంతి కమిటీలు ఏర్పాటు చేసి సామాన్య పౌరులకు అండగా నిలిచి, శాంతియుత వాతావరణం ఏర్పడటానికి దోహదపడాలి. -
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ సిఫారసు!
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభను రద్దుకు కేంద్రమంత్రి వర్గం సిఫారసు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమావేశం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్- ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు లెప్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఈ ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేశారు. ప్రధాన పార్టీలు ఎన్నికలకే మొగ్గుచూపడంతో అసెంబ్లీ రద్దు అనివార్యమైంది. -
'ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాలేదు'
-
'ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాలేదు'
ఢిల్లీ: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగుమం కానుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననక తప్పదు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ పార్టీ కూడా ఆసక్తి కనబరచకపోవడంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను సోమవారం కలిసిన పలు పార్టీ ల నేతలు ప్రభుత్వ ఏర్పాటు కంటే ఎన్నికల వైపే ఆసక్తి చూపారు. ఢిల్లీలో ఏ పార్టీ కూడా అధికారాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని నజీబ్ జంగ్ తాజాగా స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లు తనకు తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఓ నివేదికను రాష్ట్రపతికి నజీబ్ జంగ్ పంపనున్నారు. రాష్ట్రపతి పాలనలో ఉన్నఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రాజకీయ అనిశ్చితిని తొలగించాలని సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని నజీబ్ కు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలని నజీబ్ జంగ్ ను కోరారు. మైనార్టీ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు సూచించడంతో అందరూ బీజేపీకి అవకాశం లభిస్తుందని అనుకున్నారు. ఆ దిశగా కమలదళం కూడా ప్రయత్నించింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఎన్నికలకే మొగ్గు పుతున్నట్లు తాజా పరిణామాల్ని బట్టి తెలుస్తోంది. -
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి సాయం
న్యూఢిల్లీ: దోపిడీ దొంగల చేతిలో హత్యకు గురైన ఒక కానిస్టేబుల్ కుటుంబానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఢిల్లీ శివారులోని విజయ విహార్ ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జగ్బీర్ సింగ్(42)ను రెండు రోజుల క్రితం అయిదుగురు దోపిడీ దొంగలు హత్య చేశారు. కానిస్టేబుల్ జగ్బీర్ సింగ్ విధి నిర్వహణలో ప్రాణాలు వదిలినందుకు, అతని కుటుంబానికి ఈ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నజీబ్ జంగ్ తెలిపారు. 15 సంవత్సరాలు ఆర్మీలో పని చేసిన జగ్బీర్ సింగ్ 2008లో ఢిల్లీ పోలీస్ శాఖలో చేరారు. ఆయన రెండుసార్లు బెస్ట్ బీట్ కానిస్టేబుల్‌గా అవార్డు కూడా అందుకున్నారు. ** -
ఎల్జీదే తుది నిర్ణయం
ప్రభుత్వ ఏర్పాటుపై రాజ్‌నాథ్‌సింగ్ న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘నజీబ్ జంగ్ నిర్ణయిస్తారు. దీంతో కేంద్ర హోం శాఖతో ఎటువంటి సంబంధమూ లేదు’ అని అన్నారు. ఎల్జీకి హోం శాఖ ఏయే సలహాలు ఇచ్చిందని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. ప్రభుత్వ ఏర్పాటు అనేది ఎల్జీ విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
బీజేపీ అత్యవసర సమావేశం
న్యూఢిల్లీ:ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాటు అంశానికి సంబంధించి బీజేపీ నేతలు అత్యవసర సమావేశమైయ్యారు. తాజాగా బీజేపీని నూతన ప్రభుత్వ ఏర్పాటు అంశంతో పాటు, ఆప్ నేతలు విడుదల చేసిన వీడియో కూడా కలవరం పెడుతోంది. దీంతో బీజేపీ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఒకవేళ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై ఆహ్వానం అందిందే ఏం చేయాలన్న దానిపై ఆ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ జిల్లాల అధ్యక్షులతో సమావేశమై పార్టీ పటిష్టతపై చర్చించారు. అంతకుముందు ఢిల్లీలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశంపై కూడా చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ అవకాశం ఉన్నా.. ఒకవేళ ఎన్నికలు వస్తే ఏరకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై జిల్లా అధ్యక్షులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 28 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. ముగ్గురు బీజేపీ సభ్యులు పార్లమెంట్ కు వెళ్లడంతో 31 సీట్లతో ఉన్న పార్టీ 28కు పరిమితమైంది. అయితే ఆప్ నుంచి ఒక నేత బహిష్కరణ గురైన అనంతరం ఆ పార్టీ 27 సభ్యులతో తర్వాతి స్థానంలో ఉంది. -
ఆ అర్హత కేజ్రీవాల్ కు లేదు!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిపై బీజేపీ మండిపడింది. ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీని విమర్శిస్తున్న కేజ్రీవాల్ ఆ నైతిక హక్కును ఎప్పుడో కోల్పోయాడని బీజేపీ సెక్రటరీ శ్రీకాంత్ శర్మ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 49 రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన కేజ్రీవాల్.. ఇప్పుడు తమ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రజలు ఇచ్చిన ఒక అవకాశాన్ని కాలదన్నుకున్న ఆప్ నాయకుడు.. తాజాగా ప్రభుత్వ ఏర్పాటుపై కల్లిబొల్లి మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను విమర్శించిన కేజ్రీవాల్ తీరును శ్రీకాంత్ తప్పుబట్టారు. నజీబ్ జంగ్ పై కేజ్రీవాల్ వ్యాఖ్యలను దురదృష్టకర, బాధ్యతారాహిత్యమైనవిగా ఆయన అభివర్ణించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించిన కేజ్రీవాల్.. తరువాత అదే పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మిగతా పార్టీల గురించి మాట్లాడే ముందు పార్టీలోని అవినీతి అంశాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. -
బీజేపీ, ఆప్ పై అభియోగపత్రం
పక్షం రోజుల్లో చర్య తీసుకోవాలని ఎల్జీకి కాంగ్రెస్ విన్నపం న్యూఢిల్లీ: బీజేపీ, ఆప్ పై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కి కాంగ్రెస్ పార్టీ శుక్రవారం 25 పేజీల అభియోగపత్రం సమర్పించింది. పక్షం రోజుల్లోగా ఈ రెండు పార్టీలపై చర్య తీసుకోవాలని విన్నవించింది. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ నేతృత్వంలోని ఆ పార్టీకి చెందిన సభ్యుల బృందం అభియోగపత్రం సమర్పించింది. అనంతరం డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ మీడియాతో మాట్లాడుతూ ‘లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కి 25 పేజీల అభియోగపత్రం సమర్పించాం. 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని విన్నవించాం’ అని అన్నారు. ఒకవే ళ చర్యలు తీసుకోకపోతే మేము ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని లవ్లీ హెచ్చరించారు. కాగా ఢిల్లీవాసుల దుస్థితికి ఈ రెండు పార్టీలే కారణమని సదరు అభియోగపత్రంలో కాంగ్రెస్ ఆరోపించింది. విద్యుత్ చార్జీలను ఆయా పంపిణీ సంస్థలు బలవంతంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించింది. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
నిరీక్షణకు తెర
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 2014 హౌసింగ్ పథకాన్ని (డీడీఏ) శుక్రవారం ప్రకటించింది. ఈ పథకం కింద ఇరవైఐదువేల మందికిపైగా అర్హులైన దరఖాస్తుదారులకు ఫ్లాట్లను కేటాయించనుంది. అయితే వీటిలో 80 శాతం ఫ్లాట్లను ఢిల్లీవాసుల కేటాయించాలనే ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తోసిపుచ్చారు. దీంతో ఈ ఫ్లాట్లకోసం ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు వీలుకలిగింది. వచ్చే నెల ఒకటో తేదీనుంచి దరఖాస్తు ఫారాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) 2014 శుక్రవారం హౌసింగ్ పథకాన్ని ప్రకటించింది. మొత్తం 25,034 ఫ్లాట్లను ఈ పథకం కింద కేటాయించనుంది. ఈ పథకానికి సంబంధించిన ఫారాలు వచ్చే నెల ఒకటి నుంచి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత 15 లేదా 20 రోజుల్లోగా డ్రా తీస్తారు. న్యాయమూర్తి సమక్షంలో ఓ స్వతంత్య్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ డ్రా జరుగుతుంది. దీనిద్వారా కేటాయించిన ఫ్లాట్లను వచ్చే ఏడాది మార్చిలోగా కేటాయిస్తారు. ఏడాది లోపల కేటాయించిన ఫ్లాట్ తాళం చెవి ఫ్లాటు యజమానుల చేతికి అందుతుంది. జనరల్ కేటగిరీకి చెందినవారు రూ. లక్ష, ఈడబ్ల్య్యూఎస్ కేటగిరీకి చెందిన వారు రూ. పదివేలను రిజిస్ట్రేషన్ రుసుము కింద చెల్లించాల్సిఉంటుంది. కాగా పథకం కోసం డీడీఏ 13 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. పాన్ కార్డు కలిగిన 18 సంవత్సరాలకు పైబడినవారు ఈ పథకం కింద ఫ్లాట్ పొందేందుకు దరఖాస్తు చే యవచ్చు.ద్వారకా,నరేలా, రోహిణీ వంటి ప్రాంతాల్లో ఉన్న 25,034 వేలకు ఫ్లాట్లను డీడీఏ.. ఈ పథకం ద్వారా కేటాయించనుంది. వీటిలో 22,627 ఫ్లాట్లు సింగిల్ బెడ్ రూము ఫ్లాట్లు. అందులోఓ పడకగది , డ్రాయింగ్ రూం, వంటగది ఉంటాయి. గతంలో ప్రకటించిన స్కీంల కింద కేటాయించినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ సొంతం చేసుకోని 811 ఫ్లాట్లను కూడా ఈ పథకంలో చేర్చారు. ఇవి జసోలా, వసంత్కుంజ్లలో ఉన్నాయి. ఈ పథకంలో భాగంగా 700 ఫ్లాట్లను ఈడబ్యూఎస్ కేటగిరీ కింద కేటాయిస్తారు. వీటిని ప్రయివేట్ డెవలపర్ నిర్మించారు. ఈడబ్ల్యూఎస్ కింద దరఖాస్తు చేసేవారు సంవత్సరానికి రూ. లక్షన్నర ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని చూపవలసిఉంటుంది. ఇవికాక వివిధ కేటగిరీల కింద 896 ఫ్లాట్లను రిజర్వ్ చేశారు. ఈ పథకం కింద కేటాయించే ఫ్లాట్లలో అత్యధికంగా 10,875 రోహిణీ సెక్టర్ 34 ,సెక్టర్- 35లో ఉన్నాయి. నరేలాలో 6,422 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ు ధర రూ.6.6లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉండగా, ఏక పడక గది ఫ్లాట్ ధర రూ. 14.9 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు ఉంది. మోతియాఖాన్ ప్రాంతంలోని కొన్ని ఎంఐజీ ఫ్లాట్ల ధర రూ.1.2 కోట్లవరకు ఉంది. ఈ పథకం కింద కేటాయించిన ఫ్లాట్లను ఐదు సంవత్సరాల తరువాత రిజిస్ట్రేషన్ చేస్తారు. ఫ్లాట్‌ను దక్కించుకున్నవారు వాటినిఐదేళ్ల పాటు అమ్మకుండా చేయడంకోసం డీడీఏ... సంబంధిత ఫ్లాట్ యజమానితో రిజీస్ట్రీ ఒప్పందం చేసుకుంటుంది. ఈ షరతును మొదటిసారిగా డీడీఏ విధించింది. రానున్న 30 సంవత్సరాల పాటు ఫ్లాట్ల నిర్వహణ కోసం రూ.300 కోట్ల నిధిని ఏర్పాటుచేసింది. ఈ పథకం కింద చేర్చిన ఇళ్లన్నీ గ్రీన్ టెక్నాలజీ నిర్మించిన ఫ్లాట్లేనని డీడీఏ చెబుతోంది. ఈ పథకం కోసం డీడీఏ పది లక్షల బ్రోచర్లను ముద్రించింది. ఈ పథకం కింద 80 శాతం ఢిల్లీవాసులకు కేటాయించాలనే ప్రతిపాదనను గురువారం జరిగిన సమావేశంలో లెప్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చారు. -
భిన్నత్వంలో ఏకత్వమే మన బలం
68వ స్వాతంత్ర దినోత్సవంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సాక్షి, న్యూఢిల్లీ: భిన్నత్వంలో ఏకత్వమే మన బలమని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. ఐకమత్యంతో ఉన్నందువల్లనే స్వాతంత్య్రం సాధించామని ఆయన చెప్పారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్జీ...స్థానిక ఛత్రసాల్ స్టేడియంలో శుక్రవారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకితభావం, చిత్తశుద్ధి, నిజాయితీతో సమాజ సంక్షేమానికి, దేశాభివృద్ధికి కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా నగర పౌరులకు ఆయన విజ్ఞప్తిచేశారు. అంతకుముందు ఏసీపీ దీపక్ గౌరి, కంపెనీ కమాండర్ అభిషేక్ వర్మ నేతృత్వంలో ఢిల్లీ పోలీస్ పరేడ్‌ను వీక్షించారు. ఢిల్లీ పోలీసు, ఢిల్లీ హోం గార్డు, ఎన్సీసీ, సివిల్ డిఫెన్స్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, స్కూలు విద్యార్ధుల బృందాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మురికినీటి గుంటలో మునిగిపోతున్న ముగ్గురిని కాపాడిన మాస్టర్ ఆశీశ్‌కు ఎల్జీ ఈ సందర్భంగా జీవన్ రక్షక్ పతకం బహుకరించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిపిత మహాత్మాగాంధీకి లెఫ్టినెంట్ గవర్నర్ నివాళులర్పించారు. గాంధీజీ స్వాతంత్య్రోద్యమానికికొత్త దిశ నిచ్చి దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించారని చెప్పారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడినభారతదేశం గురించి గాంధీ ఆయన కలగన్నారన్నారు. గడిచిన 67 సంవత్సరాల కఠోర పరిశ్రమ ద్వారా ఈ కల చాలావరకు నెరవేరిందని, అయితే వేగంగా మారుతున్న ప్రపంచం కొత్త కొత్త సవాళ్లను మన ముందుంచుతోందని చెప్పారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ మనం ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కీలకపాత్ర పోషించాలి దేశ స్వాతంత్య్రోద్యోమంలో నగరంకీలక పాత్ర పోషించిందని, నేడుకూడా ఢిల్లీవాసులకు నగర, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఎల్జీ సూచించారు. ఢిల్లీని మరింత అందంగా, సవృద్ధిమయంగా తీర్చిదిద్దుతామన్నారు. నగరవాసుల సంక్షేమం, అభివృద్ధికి ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందని జంగ్ చెప్పారు. తలసరి ఆదాయంలో ఢిల్లీ దేశంలోనే అగ్రస్థానంలోనే ఉందని, ఢిల్లీ రాష్ట్ర ఆదాయం జాతీయ ఆదాయానికి రెట్టింపని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ముఖ్యంగా బలహీన వర్గాల ప్రగతిని కాంక్షిస్తోందని ఢిల్లీ బడ్జెట్లో 67 శాతాన్ని సాంఘిక సంక్షేమం కోసమే కేటాయించామని జంగ్ తెలిపారు. పరిశుభ్రంగా ఢిల్లీ ఢిల్లీని పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. నగరంలో అటవీప్రాంతం 3.61 శాతంమేర పెరిగినట్టుఓ సర్వే వెల్లడించిందని తెలిపారు. ఢిల్లీలో 2,000 ఉద్యానవనాలు ఉన్నాయని చెప్పారు. 11 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన చెప్పారు. నగరాన్ని కాలుష్య ర హితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, ప్రత్యామ్నాయ ఇంధనాన్ని వాడడాన్ని ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. నగరంలోని విభిన్న ప్రాంతాలలో ఈ సంవత్సరంలో 9 సోలార్ యూనిట్లను ఏర్పాటు చేశామని, మరో 10 ప్లాంట్లను త్వరలో ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు. భద్రతతో కూడిన రవాణా సదుపాయం ప్రజలకు చౌక, సౌఖ్యం, భద్రతతో కూడిన రవాణా సదుపాయాల్ని కల్పించడానికి ఢిల్లీ సర్కారు పనిచేస్తున్నదని ఎల్జీ పేర్కొన్నారు. కొత్తగా 1,380 శీతలేతర డీటీసీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. మహిళల కోసం 26 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నామని తెలిపారు. ఢిల్లీలో 190 కి.మీ మెట్రో నెట్వర్క్ ఉందని, 103 కి.మీ మేర విస్తరిస్తున్న మూడవ దశలో 35 శాతం మేర పని పూర్తయిందని ఆయన చెప్పారు. బాలికలు, ఎస్సీఎస్టీలు, ఓబీసీలకు గ్రామాల్లో నివసించే యువతకు అనియత శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం పని చేస్తుందని, ఇందుకోసం నాలుగు ఐటీఐలను కొత్తగా ఏర్పాటు చేశామని జంగ్ చెప్పారు. నాలుగు చోట్ల జలశుద్ధీకరణ కేంద్రాలు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులు జనన ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా అందజేస్తున్నాయని చెప్పారు. యమునా నదికి మళ్లీ ప్రాణం పోయడానికి ప్రపంచం నలుమూలల్లోని నిపుణుల నుంచి సాంకేతిక సహాయం పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. పప్పన్కలాన్, నిలోఠి, యమునా విహార్ , ఢిల్లీ గేట్ల వద్ద జలశుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సింగ పూర్ ప్రభుత్వ సహాయంతో 40 ఎంజీడీల జలశుద్ధీకరణ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక ఉందన్నారు. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని జంగ్ తెలిపారు. లైంగిక వేధింపు బాధితులకు వైద్య, న్యాయపరమైన సహాయం అందించడం కోసం ప్రతి జిల్లాలో వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. బిందాపుర్, లాంపుర్లలో వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసినట్ల్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఏడు నైట్ షెల్టర్లు మురికివాడల్లో నివసించేవారికి మరుగుదొడ్లు, పేదలకు గృహ వసతి కల్పనకు ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నిస్తోందని జంగ్ తెలిపారు. వచ్చే సంవత్సరం ఏడు నైట్ షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద 36 లక్షల మంది ప్రయోజనం పొందారని, వృద్ధాప్య పింఛను లబ్ధిదారుల సంఖ్యను 3.90 లక్షల నుంచి 4.30 లక్షలకు పెంచారని ఆయన చెప్పారు. నగరానికి తాగునీరు అందించడం కోసం రేణుకా డ్యాం నిర్మాణాన్ని వేగిరపరిచామని తెలిపారు. అవినీతిని అంతమొందించి, వ్యవస్థలను పారదర్శకంగా, జవాబుదారీగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉల్లిపాయలు,బంగాళాదుంపలను సరసమైన ధరలకు వినియోగదారులకు అందించడం కోసం ప్రభుత్వం వాటిని సేకరించి విక్రయిస్తోందని, వాటిని అక్రమంగా నిల్వ చేయడాన్ని నిరోధించడం కోసం తనిఖీలు నిర్వహిస్తోందని, అక్రమ నిల్వలకు పాల్పడిన 300 మంది దుకాణదారులపై చర్య తీసుకుందని నజీబ్ జంగ్ వివరించారు. భద్రతా విధుల్లో భారీగా బలగాలు 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీసంఖ్యలో భద్రతా బలగాలు విధుల్లో పాల్గొన్నాయి. ఢిల్లీ పోలీసు విభాగంతోపాటు పారామిలిటరీకి చెందిన 15 వేల మంది సిబ్బంది ఇందులో పాలుపంచుకున్నారు. ఎర్రకోట బురుజులపై అత్యధిక రిజల్యూషన్ కలిగిన సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ముంబై నుంచి నగరానికి వీటిని తెప్పించారు. వీటికి ఒకరోజు కిరాయి రూ. 50 వేలు. జెండాను ఉల్టా ఎగురవేసిన మనీష్ సాక్షి, న్యూఢిల్లీ: పడ్పట్‌గంజ్ ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా జెండాను ఉల్టా ఎగురవేశారు. వెస్ట్ వినోద్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఎగరువేసిన జెండా తలకిందులైంది.ఆకుపచ్చ రంగు పైన, కాషాయ వర్ణం కిందకు ఉన్న జెండాను ఆయన ఎగురవేశారు. అయితే జెండా ఎగురవేసేంతవరకు తనకు దానిని తలకిందులుగా కట్టిన విషయం తెలియదని, జెండా ఆవిష్కరణ తరువాత ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినవెంటనే పొరపాటును చక్కదిద్దానని మనీష్ సిసోడియా చెప్పారు. ఇది తెలియకచేసిన పొరపాటేనని ఆయన చెప్పారు.అయితే అన్నీతెలిసి కూడా ఆయన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి మరో పొరపాటు చేశారని పడ్పట్‌గంజ్ వాసులు అంటున్నారు. శుక్రవారం ఉదయం ఆయన తన నియోజకవర్గంలోని పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిసోడియాతో పలువురు ఆప్ కార్యకర్తలు హెల్మెట్ ధరించలేదని వారు అంటున్నారు. ఒకరిద్దరు కార్యకర్తల మోటారు సైకిళ్లపై హెల్మెట్లు కనిపించినా వారు వాటిని ధరించకుండా ఆమ్ ఆద్మీ టోపీలను ధరించారని ఫిర్యాదులొచ్చాయి. ఈ ర్యాలీ వల్ల ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురయ్యాయని కూడా వారు ఆరోపించారు. -
త్వరగా అసెంబ్లీని రద్దు చేయండి!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రివాల్ కోరారు. అసెంబ్లీ రద్దు ఆలస్యం కావడం వల్ల శాసన సభ్యులను ప్రలోభాలకు గురిచేయడమే కాకుండా డబ్బు ఎరగా వేస్తున్నారని, తమ శాసన సభ్యులకు బీజేపీ భారీ ఎత్తున డబ్బు ముట్టచెప్పేందుకు ప్రయత్నిస్తోందనే విషయాన్ని జంగ్ దృష్టికి కేజ్రివాల్ తీసుకువచ్చారు. జంగ్ తో భేటి తర్వాత.. శాసన సభ్యులను లొంగ దీసుకునేందుకు రాజకీయ బేరసారాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ రద్దు ఆలస్యం చేయవద్దని జంగ్ కు తెలిపానని కేజ్రివాల్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. అయితే తన ప్రశ్నకు జంగ్ వద్ద సరియైన సమాధానం లభించలేదని కేజ్రివాల్ తెలిపారు. గత ఎన్నికల్లో 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. -
స్మార్ట్ ఐడియా..!పూచ్-ఓ..!
న్యూఢిల్లీ: ఆటో... ఆటో... అంటూ రోడ్డెక్కి ఇకపై అరవాల్సిన అవసరం లేదు. ఆటోలో ఎక్కిన తర్వాత ఆటోడ్రైవర్ తనను ఎక్కడికి తీసుకెళ్తున్నాడోననే బెంగ అసలే అక్కరలేదు. మీకు ఎప్పుడు, ఎక్కడికి వెళ్లేందుకు ఆటో కావాలో నిర్ణయించుకొని, స్మార్ట్‌ఫోన్‌లో ఓ మాట చెబితే చాలు.. మీరనుకున్న సమయానికి మీ ఇంటిముందుకు ఆటో వచ్చి వాలుతుంది. పైగా అతను మిమ్మల్ని ఏ మార్గం ద్వారా గమ్యస్థానానికి తీసుకెళ్తున్నాడు..? ఆ క్షణంలో మీరు ఎక్కడున్నారనే విషయం కూడా మీ ఇంట్లో వారికి స్మార్ట్‌ఫోన్ చెప్పేస్తుంది. ఇదంతా ఎలా సాధ్యం? అనే ప్రశ్న అడిగేముందు ఇది చదవండి... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ‘పూచ్-ఓ’ పేరుతో ఓ అప్లికేషన్(యాప్)ను శుక్రవారం ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే.. కావాల్సినప్పుడు ఆటోను బుక్ చేసుకోవచ్చు. ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్(డీఐఎంటీఎస్) ఈ అప్లికేషన్‌ను అభివృద్ధిపర్చింది. జీపీఎస్ సదుపాయం ఉన్న ఆటోలను ఈ అప్లికేషన్ ద్వారా బుక్‌చేసుకునే సౌకర్యముంది. మనకు సమీపంలో ఉన్న ఆటో ఏది? దాని డ్రైవర్ ఎవరు? అతని ఫోన్ నెంబర్ వంటి వివరాలు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. వెంటనే ఆ డ్రైవర్‌కు కాల్ చేసి మనముంటున్న ప్రాంతానికి రమ్మని చెప్పవచ్చు. అయితే ఇందుకోసం డ్రైవ ర్లు డీఐఎంటీస్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆండ్రాయిడ్ సదుపాయం ఉన్న అన్ని ఫోన్లలో ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. గూగుల్ ప్లే స్టోర్లోకెళ్లి సెర్చ్ బాక్స్ లో పీఓఓసీహెచ్-ఓ అని టైప్ చేస్తేచాలు అప్లికేషన్ ప్రత్యక్షమవుతుంది. ఇన్స్టాల్ బాక్స్‌పై క్లిచ్ చేస్తే అప్లికేషన్ డౌన్లోడ్ అయినట్లే. భద్రం.. సౌకర్యవంతం: జంగ్ పూచ్-ఓ అప్లికేషన్ నగరవాసులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండడమేగాకుండా మహిళలకు భద్రతపై భరోసా కల్పించేదిగా ఉంటుందని గవర్నర్ నజీబ్ జంగ్ అన్నారు. రాత్రి సమయాల్లో ఆటో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తాము ప్రయాణిస్తున్న ఆటో వివరాలను ఫేస్బుక్, ట్విటర్ వంటి వెబ్సైట్లలో షేర్ చేసుకునే సదుపాయం కూడా ఉందన్నారు. దీనిద్వారా ప్రయాణిస్తున్నవారు ఎక్కడ ఉన్నారనే విషయం స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలుస్తుందన్నారు. ప్రయాణిస్తున్న దూరం, ఆటోవాలాలు వసూలు చేస్తున్న చార్జీల వివరాలు కూడా ప్రయాణికులకు తెలిసిపోతాయని, తద్వారా ఎటువంటి అవకతవకలకు అవకాశముండదని చెప్పారు. త్వరలో ఐఫోన్లో కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేలా మార్పులు చేయనున్నట్లు చెప్పారు. -
'మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించండి'
న్యూఢిల్లీ: కారు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మన్నా రామ్ ను కారు ఢీకొట్టిన ఘటనలో మరణించారు. ప్రమాదవశాత్తు మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు కేజ్రీవాల్ సూచించారు. దక్షిణ ఢిల్లీలో డ్యూటి నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మన్నారామ్ 'అనుమతి లేని ప్రదేశంలో ప్రవేశిస్తున్న కారును ఆపడానికి ప్రయత్నించగా.. వాహనదారుడు దురుసుగా కానిస్టేబుల్ పైకి ఎక్కించారు. ఈఘటనలో కానిస్టేబుల్ చనిపోయారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. ఆప్ ప్రభుత్వ హయంలో డ్యూటిలో ఉన్న కానిస్టేబుల్ ను వాటర్ మాఫియా హత్య చేసిన ఘటనలో మృతుడికి కోటి రూపాయలు చెల్పించిన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి కేజ్రీవాల్ దృష్టికి తీసుకువచ్చారు. -
గుజరాత్లో ఢిల్లీ ‘మకాం’..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు ప్రభావం ఢిల్లీపై పడింది. నిన్నటివరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోడీ, నేడు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించగానే ఢిల్లీ సర్కార్ గుజరాత్ బాటలో పయనించేందుకు సన్నద్ధమైంది. ఇటీవల పీఎం మోడీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య జరిగిన భేటీలో ఢిల్లీ నగరం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో గుజరాత్ తరహా అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ చర్చల ఫలితం.. గుజరాత్లో విజయవంతమైన ప్రాజెక్టుల అధ్యయనం కోసం ఢిల్లీ సర్కారుకు చెందిన పలు విభాగాల అధికారులతో కూడిన మూడు బృందాలు గురు, శుక్రవారాల్లో గుజరాత్లో పర్యటించాయి. ఇవి ముఖ్యంగా సౌరశక్తి ద్వారా విద్యుత్తు ఉత్పాదన , సీసీటీవీ కెమెరాలతో నగర నిఘా వ్యవస్థ, సబర్మతీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులను సందర్శించాయి. గాంధీనగర్‌లో సౌరశశక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే రెంట్ ఏ రూఫ్ ప్రాజెక్టును అధ్యయనం చేయడం కోసం ఢిల్లీ అధికారుల బృందం గాంధీనగర్‌లో రెండు రోజులు గడిపింది. విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పర్యావరణం అడవులు విభాగం కార్యదర్శి, ఐఅండ్ ఎఫ్‌సీ కార్యదర్శి, డీఈఆర్సీ, ఢిల్లీ ట్రాన్స్‌కో, ఎన్‌డీఎంసీతో పాటు ఎనర్జీ ఎఫీషియెన్సీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్‌కు చెందిన అధికారులతో కూడిన బృందం పలు కోణాల్లో అధ్యయనం జరిపింది. రెంట్ ఏ రూఫ్ ప్రాజెక్టు కింద గాంధీనగర్ వాసులు తమ ఇంటి కప్పులను ప్రైవేటు విద్యుత్తు కంపెనీలకు అద్దెకు ఇస్తున్నారు. ఇంటికప్పులపై సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ కంపెనీలు తాము ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ విద్యుత్తుకు రూ. 3 ఇంటికప్పును అద్దెకిచ్చిన వారికి చెల్లిస్తున్నాయి. స్కూళ్లు, ఆస్పత్రుల వంటి ప్రభుత్వ భవనాలను కూడా ఈ ప్రాజెక్టు కోసం వినియోగించుకుంటున్నారు. సీసీటీవీ కెమెరాలతో సూరత్ నగరంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసిన తీరును అధ్యయనం చేయడం కోసం ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులతో కూడిన బృందం సూరత్‌ను సందర్శించింది. సూరత్‌లోని కీలక ప్రదేశాల్లో అమర్చిన 104 సీసీటీవీ కెమెరాలతో ఆ నగరంలో నిఘావ్యవస్థను రూపొందించారు. రాత్రి వేళ కూడా పనిచేసే ఈ కెమెరాల నిర్వహణను అధ్యయనం చేసిన బృందంలో స్పెషల్ కమిషనర్ (ఆపరేషన్స్) సుందరీ నందా, ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ అనిల్ శుక్లా, డిప్యూటీ కమిషనర్ ( కమ్యూనికేషన్స్) నావేద్ ముంతాజ్ ఉన్నారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమలుచేస్తోన్న సబర్మతీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును అధ్యయనం చేయడం కోసం 13 మందితో కూడిన బృందం అహ్మదాబాద్‌లో పర్యటించింది. సబర్మతీ నది తరహాలో యుమనా నదీ తీరాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ బృందం అధ్యయనం చేసింది. పర్యావరణం, అడవుల శాఖ కార్యదర్శి సంజీవ్‌కుమార్ ఈ అధ్యయనంపై నివేదిక సమర్పిస్తారు. అయితే, గుజరాత్ ప్రాజెక్టులను అధ్యయనం చేయడం కోసం లెప్టినెంట్ గవర్నర్ అధికారుల బృందాలను పంపడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. విద్యుత్తు కోతలు, నీటి సరఫరా సమస్యలతో నగరవాసులు సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో ముఖ్య అధికారులను పర్యటనలకు పంపించడం సమంజసం కాదని ఆప్ అభిప్రాయపడింది. ఈ అధ్యయనాలవల్ల గుజరాత్ ప్రభుత్వానికి ప్రచారం కల్పించినట్లవుతుందే తప్ప ఢిల్లీవాసులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని ఆప్ విమర్శించింది. -
అంతరాయం లేకుండా చూడండి
న్యూఢిల్లీ: పెనుదుమారం ప్రభావం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న ప్రాంతాలకు నీరు, విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు కాంగ్రెస్ పార్టీ విన్నవించింది. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. నగరంలోని అనేక ప్రాంతాలు నీటి కొరత, విద్యుత్ సరఫరాలో కోత సమస్యను ఎదుర్కొంటున్నాయని ఈ బృందం ఎల్జీకి తెలియజేసింది. బాధిత ప్రజలను ఆదుకునేందుకు సత్వరమే తగు చర్యలు తీసుకోవాలని కోరింది. ఎల్జీతో సమావేశం అనంతరం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ మీడియాతో మాట్లాడుతూ నగరానికి విద్యుత్ సరిగా సరఫరా కావడం లేదని, నగరానికి విద్యుత్‌ను సరఫరా చేస్తున్న సంస్థలను ఈ విషయమై నిలదీయాలని కోరినట్టు చెప్పారు. ఒకవేళ ఆయా విద్యుత్ సరఫరా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోయినట్టయితే వాటిపై తప్పనిసరిగా చర్యలకు ఉపక్రమించాల్సిందిగా కోరామని చెప్పారు. ఈ విషయమై ఆయా డిస్కంలతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవసరమైతే వీధుల్లోకి వస్తామన్నారు. పెనుగాలి దుమారం తర్వాత నగరంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్ర నీటికొరత, విద్యుత్ కోత సమస్య తలెత్తిందన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు నీటి సరఫరాను నిలిపివేయాల్సిందిగా ఎల్జీని కోరామన్నారు. అనంతరం డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మాట్లాడుతూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే నీటి చార్జీలను 50 శాతం త గ్గిస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను పెడతారి పట్టిస్తోందన్నారు. నెలసరి 400 యూనిట్ల కంటే ఎక్కువ వాడని వారికే ఆప్ సబ్సిడీ ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. నగరవాసుల సమస్యలపై మాట్లాడుతూ ఒకవేళ విద్యుత్, నీటి సరఫరా నగరంలో ఇంకా మెరుగుపడకపోతే తమ పార్టీ ఆందోళనకు దిగుతుందని ఆయన హెచ్చరించారు. -
ఆదర్శ ఆరోగ్య కేంద్రంగా ‘లోక్‌నాయక్’
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలోని లోక్‌నాయక్ ఆస్పత్రి త్వరలో ఆదర్శ ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఇందుకోసం చేపట్టిన పనుల పురోగతిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సోమవారం సమీక్షించారు. ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, లోక్‌నాయక్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, డీజేబీ సీఈఓ, ట్రాఫిక్ విభాగం స్పెషల్ కమిషనర్ తదితర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ ఆస్పత్రిలో పనుల ప్రగతిపై రూపొందించిన ప్రజెంటేషన్‌ను నజీబ్ జంగ్ ఈ సందర్భంగా వీక్షించారు. ఆస్పత్రి సిబ్బందిని రోగులు గుర్తించేందుకు వీలుగా వారికి నేమ్ ట్యాగ్‌లతో కూడిన డ్రస్ కోడ్‌ను ప్రవేశపెట్టాలని నజీబ్‌జంగ్ చేసిన సూచనను ఆస్పత్రి అధికారులు అమల్లోకి తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే రోగులకు తగిన మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం కోసం పేషంట్ వెల్ఫేర్ అధికారులను నియమించాలన్న ఎల్జీ ఆదేశాలనుకూడా పాటించినట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఢిల్లీ హెల్త్ సర్వీసెస్‌కు చెందిన ఐదుగురు అధికారులను ఇందుకోసం నియమించారు. ఆస్పత్రి సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు పద్ధతిని దశల వారీగా ప్రవేశపెడుతున్నామని, వచ్చే నెల ఒకటో తేదీనాటికి మొత్తం 4,000 సిబ్బందికి ఈ పద్ధతిని వర్తింపజేస్తామని మెడికల్ సూపరింటెండెంట్ చెప్పారు. ఈ పనిని వేగంగా పూర్తిచేయాలంటూ ఎల్జీ ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణ ం ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందని ప్రజాపనుల శాఖ కార్యదర్శి లె ఫ్టినెంట్ గవర్నర్‌కు హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో వంటశాల, కేటరింగ్ సదుపాయాల పట్ల ఎల్జీ తన పర్యటన సమయంలో అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సదుపాయాలను మెరుగుపరచడం కోసం డైటీషియన్లకు శిక్షణ ఇప్పించామని,వంటశాలను మెరుగుపరిచామని తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో అక్రమంగా దుకాణాలు నడుపుతున్నవారిని తొల గించా లని, అక్రమ పార్కింగ్‌లను నిర్మూలించాలని నజీబ్ జంగ్ దృష్టికి మెడికల్ సూపరింటెండెంట్ తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అనధికార వాహనాల పార్కింగ్‌లను తొలగించాలని, ప్రతి రోజూ తనిఖీలు జరపాలని నజీబ్‌జంగ్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఆస్పత్రిలో కొత్త పార్కిం గ్ సదుపాయాన్ని కల్పించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ తెలి పారు. డయాలిసిస్ సౌకర్యం అత్యంత కీలకమని, దానికి నీటిసరఫరా చేయడానికి డీజేబీ తొలి ప్రాధాన్యమివ్వాలని నజీబ్‌జంగ్ ఆదేశించారు. -
మరోసారి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు!
న్యూఢిల్లీ: మరోసారి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెరలేవనుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించడమే ఉత్తమమని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను కొనసాగించాలా వద్దా అనేదానిపై లోక్‌సభ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పిన నజీబ్ జంగ్ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత రెండు నెలలుగా రాజధానిలో రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తోన్న ఆయన ఒకటి రెండు రోజులలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి నగరంలో తాజా రాజకీయ పరిస్థితిపై నివేదిక అందజేసే అవకాశముంది. ఈ మేరకు రాష్ట్రపతిని నజీబ్ జంగ్ కలుస్తారని ప్రాధమిక సమాచారం. ఢిల్లీలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సంసిద్ధంగా లేకపోవడంతో ఎన్నికలు జరిపించడమొక్కటే మార్గమని ఎల్జీ నిర్ణయించారని, గత వారం రాష్ట్రపతితో ఆయన మాట్లాడారని రాజ్‌నివాస్ వర్గాలు తెలిపాయి. ఆప్ మాటమార్చే వైఖరి పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారని , బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే జంగ్కు తెలిపాయని వెల్లడించాయి. ఎన్నికలపై అభిప్రాయమేమిటో తెలుసుకోవడం కోసం ఆయన బీజేపీ నేతలతోనూ మాట్లాడారు. నజీబ్ జంగ్ నవంబర్‌లో ఎన్నికలు జరిపించాలని కోరవచ్చని తెలిపాయి. కాగా, మొదట అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని కోరిన ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాటమార్చింది. ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ గతవారం నజీబ్ జంగ్ని కలిసి అసెంబ్లీని వెంటనే రద్దు చేయరాదని, ప్రభుత్వం ఏర్పాటుచేయడంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం తాము జనసభలు జరుపుతామని చెప్పారు. కానీ ఆ మరుసటి రోజే విలేకరుల సమావేశం నిర్వహించి తాము ప్రజాభిప్రాయాన్ని సేకరించబోవడం లేదని, ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు మద్ధతివ్వమని ప్రకటించిన కాంగ్రెస్ ఎల్జీని కలిసి ఎన్నికలు నిర్వహించాలని కోరింది. -
అసెంబ్లీని రద్దు చేయవద్దు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని వెంటనే రద్దు చేయవద్దని మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. తమ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా వద్దా అనే అంశంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు బహిరంగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశమై తమ పార్టీ చర్చలు సాగిస్తోందని చెప్పారు. తొలుత తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని చెప్పిన ‘ఆప్’, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత వైఖరిని మార్చుకోవడం గమనార్హం. -
ఆరోగ్య రంగంపై నజీబ్ నజర్
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగం పనితీరు క్రమబద్ధీకరణపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దృష్టి సారించారు. ఆపరేషన్ థియేటర్ల వంటి కీలక విభాగాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చేసేందుకుగాను ప్రజాపనుల విభాగంతో సంప్రదింపులు జరిపి తగు వ్యవస్థను రూపొందించాలంటూ ఆరోగ్య శాఖ అధికారులను శుక్రవారం ఆదేశించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పలు అంశాలను సమీక్షించారు. అధికారులు ఆస్పత్రుల నవీకరణ, పరిశీలన విషయంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) వ్యవహరిస్తున్న తీరును పరిశీలించాలని కోరారు. దీంతోపాటు రోగులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు వీలుగా తగినన్ని అంబులెన్సు సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆస్పత్రికి చేరిన రోగికి సకల సదుపాయాలు ఉండేవిధంగా చూడడంతోపాటు వారికి తక్షణమే అవసరమైన సేవలు అందేవిధంగా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యవసర విభాగంలో వైద్యులతోపాటు సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అత్యసవర సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పందిస్తూ నగరంలోని 36 ఆస్పత్రులు ఎంతో బాగా సేవలందిస్తున్నాయన్నారు. తరచూ వీటిని తనిఖీ చేసేందుకుగాను ఎనిమిది బృందాలను నియమించామన్నారు. డిస్పెన్సరీలను సైతం తరచూ తాము తనిఖీ చేస్తున్నామన్నారు. ఔట్ పేషంట్ విభాగాల (ఓపీడీ) వద్ద రోగులు బారులు తీరే పరిస్థితి రాకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా మందుల కొరత సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. -
న‘గరం’
ప్రతాపం చూపిస్తున్న సూర్యుడు రాజధానిలో పెరిగిన ఉష్ణోగ్రతలు బుధవారానికి 43 డిగ్రీలకు చేరుకున్న గరిష్ట ఉష్ణోగ్రత జాగ్రత్తలు తప్పనిసరని హెచ్చరిస్తున్న వైద్యులు సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో భానుడి భగభగలు మొదలయ్యాయి. రోజురోజుకి సూర్యుడు తన ప్రతాపాన్ని పెంచుతున్నాడు. ఉదయం పది గం టలకే ఎండ తీవ్రత అధికమవుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో నగరవాసులు సతమతమవుతున్నారు. ఈ వారాంతానికి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరుకోగా, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. కాగా బుధవారం నమోదైన 43 డిగ్రీలు ఈ సీజన్లోనే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతగా వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఎండవేడిమికి తోడు వడగాలులు వీస్తుండడంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ ఏడాది కాస్త ఆల స్యం గా మొదలైన వేసవి, కొద్ది రోజుల్లోనే తీవ్రరూపం దాల్చింది. అత్యవసర పనులు ఉన్నవారు మినహా మధ్యాహ్న సమయంలో బయటికి వచ్చేందుకు జనం ఇష్టపపడడం లేదు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రత్యేకించి వస్త్రధారణ, ఆహారపు అల వాట్లలో మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచి స్తున్నారు. ద్విచక్రవాహనాలను వాడేవారు మధ్యా హ్న సమయంలో వీలైనంత తక్కువగా ప్రయాణించేలా చూసుకోవాలంటున్నారు. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా వెంట ఒక మంచి నీళ్ల సీసా పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు. వేసవితాపం తాళలేక... వేసవి తాపం నుంచి బయటపడేందుకు నగరవాసులు చల్లని పళ్లరసాలు, ఐస్‌క్రీమ్‌లు తింటూ గడుపుతున్నారు. పుచ్చకాయలు, చలవనిచ్చే పళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాల్లో పళ్లరసాలు, ఐస్‌క్రీమ్‌లు విక్రయించే చిన్నచిన్న వ్యాపారులకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. ఎండ వేడిమి తట్టుకునేందుకు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. వచ్చే వారం రోజులు సన్‌స్ట్రోక్ తప్పదు: వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేడిగాలుల తీవ్రత అధికమైంది. రాత్రి వేళల్లోనూ వేడిగాలులు వీస్తుండడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంకో వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికం అవుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే వారం రోజుల్లో ఎండల తీవ్రత ఇలా ఉండవచ్చని వారు పేర్కొన్నారు. నీటి, విద్యుత్ సమస్యలపై దృష్టి సారించండి: ఎల్జీ న్యూఢిల్లీ: వేసవికాలంలో ప్రజల ఇబ్బందులు కలగకుండా వివిధ ప్రభుత్వ సంస్థలను డిప్యూటీ కమిషనర్లు సమన్వయం చేయాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు. నగరంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ప్రజలకు అవసరమైన తాగునీటి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని పౌర సమస్యలపై రోజువారీ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కిందిస్థాయి ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ఎల్జీ కార్యాలయానికి పంపాలన్నారు. వీటిపై రాజ్ నివాస్‌లో సమావేశాలు ఉంటాయని తెలిపారు. అలాగే నగరవాసులకు ఇబ్బంది కలిగిస్తున్న ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమావేశం తర్వాత జంగ్ ముందు ఢిల్లీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజంటేషన్ ఇచ్చింది. -
జీటీబీ ఆస్పత్రిని సందర్శించిన జంగ్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడాల్సిన అవసరముందని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన గురు తేజ్ బహదూర్(జీటీబీ) ఆస్పత్రిని సందర్శించారు. దాదాపు రెండు గంటలకుపైగా ఆస్పత్రిలోనే గడిపిన జంగ్ అక్కడి వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడారు. అనారోగ్యంతో కుంగిపోయిన రోగులకు వైద్యుడి స్పర్శ ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుందని, కొన్నిసార్లు ఆ స్పర్శ అద్భుతాలు కూడా చేస్తుందన్నారు. ఆస్పత్రికి రోగి వచ్చిననాటి నుంచి నయమై అడుగు బయటపెట్టేవరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపైనే ఉందన్నారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ ఔట్ పేషెంట్ విభాగాలను, డయాబెటిక్, మెటబాలిక్ కేర్ బ్లాక్, మాతాశిశు విభాగం, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిని ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దే ఓ ప్రణాళికకు సంబంధించిన ప్రెజెంటేషన్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ జంగ్కు చూపారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గవర్నర్‌కు వివరించారు. సీనియర్ వైద్యులు, సర్జన్లు, ఇతర సిబ్బంది కూడా తమ అవసరాలను జంగ్ ముందు ఏకరువు పెట్టుకున్నారు. రోగుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిందని, అయితే అందుకు సరిపడా వైద్య సదుపాయాలు, కిచెన్, లాండ్రీ, పార్కింగ్ సదుపాయాలను కూడా విస్తరించాలన్నారు. జంగ్ స్పందిస్తూ... రోగుల సంఖ్య పెరిగినప్పుడు దాని భారం ఆస్పత్రిలోని ప్రతి విభాగంపై పడుతుందని, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను చేసుకుంటూ పోవడమే పరి ష్కారమన్నారు. ఓపీడీలో సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత సులభతరం చేయాలన్నారు. ఫార్మసీ వద్ద కూడా రోగులు మందుల కోసం బారులుతీరుతున్న దృశ్యా లు కనిపించాయని, అవసరమైతే కౌంటర్ల సంఖ్య ను పెంచి ఈ సమస్యను పరిష్కరించాలని సూచిం చారు. ఆస్పత్రి పరిసరాల్లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విషయమై అక్కడికక్కడే అదనపు పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
అబ్బా.. హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనా..
న్యూఢిల్లీ: నగర మహిళలకు ఇకపై తమ హెయిర్ స్టైల్, చెవిరింగులు, లిప్‌స్టిక్ ఇలా ముఖారవిందాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నా రోడ్లపైకి తన భర్తతోనో, సోదరుడితోనో బైక్‌పై రోడ్డుపైకి వచ్చేటప్పుడు వాటిని ప్రదర్శించే అవకాశం లేదు.. ఎందుకంటే ద్విచక్రవాహనాలపై వెనుక కూర్చుని వెళ్లే మహిళలు సైతం కచ్చితంగా ెహ ల్మెట్ ధరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ హుకుం జారీచేశారు. రోడ్డుప్రమాదాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇందుకు మహిళలు అంత ఉత్సాహం చూపడం లేదు. ఈ ఏడాదిలోనే ద్విచక్రవాహన ప్రమాదాల్లో 105 మంది చనిపోయారు. అందులో 80 శాతం మంది బైక్ వెనుక సీట్లో కూర్చున్నవారే. హెల్మెట్ ధరించని కారణంగానే వారు చనిపోయారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్న దాదాపు లక్షమంది ద్విచక్రవాహన చోదకులపై ఈ సంవత్సరం విచారణ జరిపామని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ శుక్లా తెలిపారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. గత ఏడాది దాదాపు 63 మంది మహిళలు ద్విచక్రవాహన ప్రమాదాల్లో చనిపోయారు. అంతకుముందు ఏడాది 42 మంది ప్రాణాలొదిలారు. ‘ఇన్నాళ్లూ హెల్మెట్ ధరించకుండా బైక్ వెనుక సీట్లో ప్రయాణించే మహిళలను విచారించే హక్కు మాకు లేకపోవడం వల్ల... సలహాలు మాత్రమే ఇచ్చేవాళ్లం..’ అని అన్నారు సీనియర్ ట్రాఫిక్ అధికారి ఒకరు. అయితే ద్విచక్రవాహన ప్రమాదాల్లో చనిపోయేవాళ్లలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారని, మహిళలు వాహనంపై ఒకే వైపు కూర్చోవడంతో బ్యాలెన్స్ అవ్వక... ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. హెల్మెట్స్ పెట్టుకోవడం లేదెందుకని మహిళలను ప్రశ్నిస్తే ‘ఎంతో ఖర్చు చేసి జుట్టు అందంగా చేసుకుంటాం. హెల్మెట్ వల్ల అదంతా చెదిరిపోతుంది. అంతేనా... చెవి రింగులు కూడా కనబడవు. చూడటానికి అంత బాగుండదు’ అంటోంది స్కూటీ మీద వెళ్లే కాలేజీ విద్యార్థిని పల్లవి చంద్ర. ఒకవేళ చట్టం అమల్లోకి వస్తే ఓ మంచి హెల్మెట్ కొంటానంటోంది. ‘‘నా భర్త హెల్మెట్ నా తలకు సరిగ్గా ఉండదు. అందుకే అప్పుడప్పుడు తన బైక్ మీద వెళ్లినా నేను ధరించను’ అని అంటోంది గృహిణి అయిన ఇందిరా మాథుర్. అయితే మహిళలు తప్పకుండా హెల్మెట్ ధరించాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. మహిళలు ఇలా అశ్రద్ధగా ఉంటే.. పురుషులు మరో రకంగా స్పందిస్తున్నారు. ద్విచక్రవాహనాన్ని నడుపుతున్నవారైనా, వెనుక కూర్చున్నవారైనా ఆరుగురిలో ఒకరు మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారు. హెల్మెట్ ధరించిన వారు సైతం గడ్డం కింద ఉన్న బట న్ను వదిలేస్తున్నారు. ‘హెల్మెట్ నా తలకు సరిగ్గా సరిపోతుంది. ఇంకా బటన్ పెట్టడం ఎందుకు’ అంటున్నాడు నోయిడాలో పనిచేసే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జతిన్ శర్మ. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఎగిరిపోయి ప్రాణాలొదిలిన ఘటనలు 80 శాతం ఉన్నాయంటున్నారు ట్రాఫిక్ అధికారులు. -
మా మార్గదర్శకాలు మంచివే!
సాక్షి, న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి తాను జారీ చేసిన మార్గదర్శకాలను లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్‌జంగ్ సమర్థించుకున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. నర్సరీ అడ్మిషన్లలో మేనేజ్మెంట్ కోటాను రద్దు చేయడం సరైందేనని స్పష్టీకరిం చారు. విద్యను వాణిజ్యపరం చేయడాన్ని అనుమతించదరాదని పేర్కొన్నారు. నర్సరీ అడ్మిషన్లపై లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన మార్గదర్శకాలను రద్దు చేయాలని కోరుతూ యాక్షన్ కమిటీ ఆఫ్ అన్ఎయిడెడ్ రికగ్నైజ్డ్ పబ్లిక్ స్కూల్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై హైకోర్టు జారీచేసిన నోటీసుకు లెఫ్టినెంట్ గవర్నర్ సమాధానమిచ్చారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చ్ 25న నిర్వహిస్తామని ఉన్నతన్యాయస్థానం తెలిపింది. తాను జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ న్యాయస్థానాన్ని కోరారు. ‘విద్యను వ్యాపారంగా మార్చడం నిషిద్ధం. విద్యాసంస్థలను బోధన దుకాణాలుగా కొనసాగనివ్వరాదు. అది పిల్లలకు సమాన అవకాశాలను అందించకుండా చేస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిలో నర్సరీ అడ్మిషన్ల జారీకి డిసెంబర్ 18న లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాలను జారీ చేశారు. మేనేజ్మెంట్ కోటాను రద్దు చేయడంతోపాటు పాయింట్ల విధానానికి మార్గదర్శకాలు ప్రాధాన్యం ఇచ్చాయి. స్థానిక బాలలకు (నేబర్హుడ్) అడ్మిషన్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాయి. నేబర్హుడ్ కేటగిరీ కింద పాఠశాలకు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో నివసించేవారికి అత్యధిక పాయింట్లను కేటాయించారు. వాటిని రద్దు చేయాలని ప్రైవేటు పాఠశాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు మార్గదర్శకాల ప్రకారమే జరగాలని హైకోర్టు ఆదేశించింది. కేసుపై తరువాత విచారణ జరుపుతానని పేర్కొంది. -
ఆప్ సర్కారుకు గండం!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది! స్వతంత్ర ఎమ్మెల్యే రాంబీర్ షోకీన్ .. కేజ్రీవాల్ సర్కారుకు సోమవారం మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో 70 స్థానాలున్న అసెంబ్లీలో ఆప్ బలం కాంగ్రెస్, జేడీయూల మద్దతులో కలిపి 35కు పడిపోయింది. ఎన్నికల్లో 28 సీట్లు గెల్చుకున్న ఆప్ బలం వినోద్ కుమార్ బిన్నీ బహిష్కరణ, మరో సభ్యుడు స్పీకర్‌గా ఎన్నికవడంతో 26కు చేరింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైనందుకే మద్దతు వాపసు తీసుకున్నట్లు షోకీన్ తెలిపారు. దీని గురించి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు తెలిపేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లగా ఆయన బిజీగా ఉండడంతో కలవలేకపోయానని, మంగళవారం అపాయింట్మెంట్ కోరానని చెప్పారు. విద్యుత్, నీటి సమస్య, కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ వంటి వాటిపై ఎన్నో హామీలిచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారన్నారు. -
రాజ్యాంగాన్ని కాపాడండి: అరవింద్ కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంతో కయ్యానికి మరోసారి కాలుదువ్వారు. కాంగ్రెస్, కేంద్ర హోంశాఖ ప్రయోజనాలు కాపాడుతున్నారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఘాటైన పదజాలంతో లేఖ రాశారు. అంతకుముందు కేంద్రం అనుమతి లేకుండా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందేమో తెలపాలంటూ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ సలహా కోరారని, అది రాజ్యాంగ విరుద్ధమేనంటూ పరాశరన్ చెప్పారంటూ వార్తలు వచ్చాయి. అసలు ఆ విషయం ఎలా బయటకు పొక్కిందంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు. బిల్లును పంపకమునుపే దాని రాజ్యంగబద్ధతపై న్యాయసలహా ఎందుకు తీసుకోవలసివచ్చిందంటూ తన మూడు పేజీల బహిరంగ లేఖలో నజీబ్ జంగ్‌ను నిలదీశారు. బిల్లు ఆమోదం పొందితే కాంగ్రెస్ నేతలు జైలుకు పోతారు కాబట్టి తనను, తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ద్వారా ఆ నేతలు మీడియాకు లీకులిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. పార్టీలను కాకుండా రాజ్యాంగాన్ని రక్షించాలని లేఖలో నజీబ్‌జంగ్‌ను కోరారు. రాజ్యాంగపరంగా అనుమతులు పొందకపోతే బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటామని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్ లవ్లీ చెప్పారు. సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, ప్రశాంత్‌భూషణ్, షాజియా ఇల్మిలకు సుప్రీంకోర్టు పరువునష్టం నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ కుమారుడు అమిత్ వేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం కోర్టు ఈ చర్య తీసుకుంది. -
‘క్రేజీ’ ధర్నా ముగిసింది!
కేంద్రంతో రాజీ కుదరడంతో హైడ్రామాకు తెర ఇద్దరు పోలీసులను సెలవులో పంపడానికి కేంద్రం అంగీకారం భారీగా పోలీసుల మోహరింపు; లాఠీచార్జ్; పదిమందికి గాయాలు సాక్షి, న్యూఢిల్లీ: స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ధర్నాకు దిగిన అరుదైన ఆందోళనకు మంగళవారం సామరస్య పూర్వక ముగింపు లభించింది. ఢిల్లీ పోలీసులను ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తేవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని నడిబొడ్డున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించిన ఆందోళన.. కేంద్ర ప్రభుత్వంతో రాజీ కుదరడంతో మంగళవారం రాత్రి ముగిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్లో ఇద్దరిని సెలవులో పంపిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో కేజ్రీవాల్ తన పట్టు వీడి ధర్నాను విరమించారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సంప్రదింపులు ఫలించి జనవరి 26, గణతంత్ర దినోత్సవాలకు ముందు జరిగిన ఈ హై డ్రామాకు తెరపడింది. రాజీ ఫార్ములా - డ్రగ్స్, వ్యభిచార మాఫియాపై దాడులకు నిరాకరించిన మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, డెన్మార్క్ మహిళ అత్యాచారానికి గురైన ప్రాంతం పహర్‌గంజ్ పీసీఆర్ వ్యాన్ ఇన్చార్జ్.. ఈ ఇద్దరినీ సెలవులో పంపేందుకు అంగీకారం. - పోలీసుల ఉదాసీనతపై న్యాయవిచారణను వేగవంతం చేయడం. - ఈ రెండు హామీలతో పాటు పవిత్రమైన రిపబ్లిక్ డే ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ధర్నాను విరమించాలని కోరుతూ నజీబ్‌జంగ్ పంపిన లేఖను ధర్నా ముగింపు సందర్భంగా కేజ్రీవాల్ ప్రజలకు చూపారు. ఇది ఢిల్లీ ప్రజలు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. మహిళల రక్షణకు సంబంధించిన విషయాలను లేవనెత్తేందుకు ఆప్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇబ్బందుల్లో ‘ఆమ్ ఆద్మీ’ కేజ్రీవాల్ ధర్నాతో మంగళవారం కూడా నాలుగు మెట్రోస్టేషన్లను మూసే ఉంచారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సైతం గుర్తింపు కార్డులు చూపినా పోలీసులు గంటల తరబడి లోనికి వెళ్లనివ్వలేదు. ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు కేజ్రీవాల్‌ను విమర్శించడం కనిపించింది. రాష్ర్టపతితో పీఎం భేటీ: కేజ్రీవాల్ ధర్నా నేపథ్యంలో ప్రధాని మన్మోహన్సింగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమై, పరిస్థితిని వివరించారు. రానున్న పార్లమెంటు సమావేశాలపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. కేజ్రీ మంతనాలు మంగళవారం ఉదయం నుంచి వర్షం ఉండడంతో కేజ్రీవాల్ తన కారులోనే ధర్నా కొనసాగించారు. తర్వాత పక్కనే ఉన్న రైల్‌భవన్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని భార్య తెచ్చిన ఆహారాన్ని తిన్నారు. ధర్నాపై ఏం చేయాలన్నదానిపై మంత్రివర్గ సహచరులు, నాయకులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. జంతర్‌మంతర్‌లో ఆందోళన కొనసాగించాలంటూ కేంద్ర హోంమంత్రి చేసిన సూచనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ధర్నా చేయాలో చెప్పేందుకు షిండే ఎవరని, తాను ఢిల్లీ సీఎంనని ఎక్కడైనా ధర్నా చేసే హక్కు తనకు ఉందన్నారు. వేలాదిగా తరలివెళ్లి గణతంత్ర వేడుకలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాత్రంతా చలిలో ఉండటంతో కేజ్రీవాల్‌కు జ్వరం వచ్చినట్లు సమాచారం. స్వల్ప ఉద్రిక్తత సోమవారం రైల్ భవన్ బయట ధర్నాకి దిగిన కేజ్రీవాల్ రాత్రి అక్కడే నిద్రించారు. పెద్ద సంఖ్యలో తరలిరావాలంటూ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుతో వందలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు మంగళవారం ైరె ల్భవన్కి చేరుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే కూర్చుని నినాదాలతో హోరెత్తించారు. హైసెక్యూరిటీ జోన్ అయి న ప్రధాని కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ, మంత్రుల కార్యాలయాలు ఉన్నచోట నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ధర్నా చేపట్టడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఆప్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు రావడంతో పోలీసులు లాఠీచార్జికి దిగారు. దీంతో పోలీసులపై ఆప్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఇద్దరు పోలీసులు గాయపడగా, పోలీసుల లాఠీచార్జిలో పదిమంది ఆప్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. -
తనిఖీలు తప్పవు
న్యూఢిల్లీ:కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తనిఖీలకు ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థలు సహకరించాల్సిందేనని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ నుద్దేశించి మాట్లాడారు. తమ ఆర్థిక లావాదేవీల తనిఖీని చేపట్టేందుకు వచ్చే కాగ్ అధికారులకు ప్రైవేట్ విద్యుత్ సరఫరా సంస్థలు సహకరించాలన్నారు. ‘నగరంలో విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ జరిగినప్పటినుంచి ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీలపై కాగ్ తనిఖీలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియకు సహకరించని కంపెనీల లెసైన్సులు రద్దు చేస్తామ’ని ఆయన హెచ్చరించారు. 2002లో ఢిల్లీ ప్రభుత్వం విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించిన విషయం తెలిసిందే. అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయబోమన్నారు. నగరంలో విద్యుత్ పంపిణీ చేస్తున్న మూడు ప్రైవేట్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై కాగ్ ఆడిట్‌కు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సర్కారు గత వారం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని ఆయా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో నవాబ్‌జంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కాగా, మీటర్లు వేగంగా తిరుగుతున్నాయన్న ఫిర్యాదులపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, త్వరలోనే దానిపై కూడా చర్యలు తీసుకుంటామని జంగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వాహనాలపై ఎర్రబుగ్గలు వాడరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే వారికి ప్రత్యేక రక్షణను తిరస్కరించింది. ‘ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అంతమొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే ఆందోళనతో వచ్చిన లోక్‌పాల్‌ను అమలుచే సేందుకు అధిక ప్రాధాన్యమిస్తాం..’ అని జంగ్ పేర్కొన్నారు. పజల దైనందిన జీవితాలను ప్రతిబింబించేలా పథకాల అమలుకు కేజ్రీవాల్ ప్రభుత్వం కృషిచేస్తుందని జంగ్ చెప్పారు. నగర అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల్లో లోపాలను సరిచేసుకోవడానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ నగర ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే, వాటి సత్వర పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తుందని పేర్కొన్నారు. మొహల్లాల స్థాయిలో అభివృద్ధి పనులను ఎంపిక చేసే విషయంలో స్థానికుల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. పనుల నాణ్యత, నిర్వహణలపై మొహల్లా సభల్లో నిర్ణయించిన మేరకే ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు ఏడాదిలోగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. దీంతో ఢిల్లీలో నివసించే 30 శాతానికిపైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మురికివాడల్లో నివసించే వారికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడంలోనూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా రక్షణకు ప్రత్యేక కోర్టులు నగరంలో మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎల్జీ నజీబ్ జంగ్ తెలిపారు. దీని నిమిత్తం ఆరు నెలల్లోగా కొత్త కోర్టులను ఏర్పాటుచేయడమేగాక, జడ్జిల నియామకాలను కూడా చేపడతామన్నారు. మహిళలు, బాలికల రక్షణ ప్రస్తుత ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్ అని ఆయన అన్నారు. ‘నగరంలో 50 శాతానికిపైగా ప్రజలు బహిరంగ స్థలాల్లో సంచరించడానికి భయపడుతున్నారు. ఇది ప్రభుత్వానికి చాలా అవమానకరం..’ అని ఆయన చెప్పారు. మహిళలు, బాలికలు ఎటువంటి వేధింపులకు గురికాకుండా ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. మహిళలపై వేధింపుల కేసులను మూడు నెలల కాలంలోనే పరిష్కరించేందుకు కొత్త కోర్టులు కృషిచేస్తాయన్నారు. ఇదిలా ఉండగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పాటుచేస్తామని ఆప్ తన ఎన్నికల హామీల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. దేశ రాజధానిలో 2012 డిసెంబర్ 16న జరిగిన ‘నిర్భయ’ కేసు తర్వాత పోలీసులు, ప్రభుత్వం మహిళా రక్షణకు పలు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా మానభంగ కేసుల్లో 20 రోజుల్లోనే చార్జిషీట్ తయారుచేయాలని నిర్ణయించింది. జన్‌లోక్‌పాల్‌కు ప్రాధాన్యం ఢిల్లీ ప్రభుత్వం జన్‌లోక్‌పాల్‌కు ప్రాధాన్యమివ్వాలని నజీబ్ జంగ్ కోరారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలన్నారు. ‘మార్పుకు ఢిల్లీ ప్రజలు ఓటువేశారు..’ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నూతన ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం, ప్రజల మధ్య అవగాహనను పెంపొందించేందుకు జన్‌లోక్‌పాల్‌కు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్రహోదా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలసి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. స్కూళ్లలో డొనేషన్లను రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్ల కన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతామని, మరో 500 కొత్త స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించనుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. -
కొలువుదీరిన కొత్త మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తోసహా కేబినెట్ మంత్రులుగా ఆరుగురు ఎమ్మెల్యేలతో శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో ఇద్దరు మాజీ జర్నలిస్టులు, ఒక చట్టపరమైన ప్రచారకర్త, ఒక ఆర్కిటెక్ట్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు సా మాజిక సేవకులు ఉన్నారు. శనివారం మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వీరి శాఖలు గతంలో వీరి వృత్తికి దగ్గర సంబంధం ఉండడం గమనార్హం. వీరి వ్యక్తిగత వివరాలుపరిశీలిస్తే.. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, హోం, ఆర్థిక, విజిలెన్స్, సర్వీసెస్, ప్లానింగ్, విద్యుత్తు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్(45)అతి పిన్న వయస్సులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన కేజ్రీవాల్ కొంతకాలం టాటాస్టీల్‌లో ఉద్యోగం చేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌లో చేరారు. అటు నుంచి సమాజ సేవకోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశారు. సమాచార హక్కుచట్టం తీసుకువచ్చేలా ప్రభుత్వంపై తన ఉద్యమాలతో ఒత్తిడి తెచ్చారు. ఇందుకుగాను రామన్ మెగసేసే అవార్డు పొందారు. అన్నాహజారే నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యహరించారు. ఏడాది క్రితం ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. హర్యానాలోని భివని జిల్లా, సివానీ గ్రామానికి చెందిన కేజ్రీవాల్ ఢిల్లీలో 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన షీలాదీక్షిత్‌ను 26 వేల ఓట్ల తేడాతో ఓడించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. మనీష్ సిసోడియా విద్య, ఉన్నత విద్య, ిపీడబ్ల్యూడీ, పట్టణాభివృద్ధి, స్థానిక సంస్థలు, భూమి-భవనాలు, రెవెన్యూ శాఖలు మాజీ జర్నలిస్టు అయిన మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్‌కి కుడి భుజంగా పనిచేస్తున్నారు. పత్పర్గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నకుల్ భరద్వాజ్‌పై 11,478 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జర్నలిజంలో డిప్లొమా చేసిన సిసోడియా జీ టీవీలో జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం సామాజిక ఉద్యమాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని కీలక నేతల్లో సిసోడియా ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని హపుర్ జిల్లాలో రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో ప్రజాపనులు, పట్టణాభివృద్ధి, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా కొనసాగనున్నారు. సౌరభ్ భరద్వాజ్, రవాణా, ఆహారం-పౌరసరఫరాలు, పర్యావర ణం, ఎన్నికలు వృత్తిపరంగా కంప్యూటర్ ఇంజనీర్ అయిన సౌరభ్ భరద్వాజ్ బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా కుమారుడు అజయ్‌కుమార్ మల్హోత్రపై గ్రేటర్‌కైలాశ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన సౌరభ్.. కే జ్రీవాల్ మంత్రివర్గంలో ట్రాన్స్‌పోర్టు, ఫుడ్ సఫ్లై మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నుంచి బీటెక్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలోనూ పట్టభద్రుడయ్యాడు. ఢిల్లీలోనే పుట్టిపెరిగిన భరద్వాజ్ అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. సోమ్‌నాథ్ భారతి పాలనా సంస్కరణలు, పర్యాటక, న్యాయ, ఆర్ట్ అండ్ కల్చర్ శాఖలు బీహార్‌కి చెందిన సోమ్‌నాథ్ భారతి అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగానే ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యనభ్యసించారు. అనంతరం ఢిల్లీలో స్థిరపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీని సైతం పొందారు. ఐఐటీ ఢిల్లీ అల్యుమినీ అసోసియేషన్‌కి అధ్యక్షునిగా పనిచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాలవీయ్‌నగర్ నుంచి పోటీ చేసి మంత్రి కిరణ్ వాలియాను ఓడించారు. కేజ్రీవాల్ కేబినెట్లో లా, టూరిజం, ఆర్ట్‌అండ్ కల్చర్, పాలనా సంస్కరణల మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. రాఖీ బిర్లా మహిళా శిశు అభివృద్ధి, సామాజిక సంక్షేమం, మహిళా భద్రత, భాషలు మాజీ జర్నలిస్టు అయిన రాఖీ బిర్లా కేజ్రీవాల్ బృందంలో అత్యంత పిన్న వయస్కురాలు. నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అకాడమీ నుంచి జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేశారు. దళితురాలైన రాఖీ తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. బిర్లా 12వ తరగతి వరకు చదివారు. జర్నలిస్టుగా ఉద్యోగాన్ని వదిలేసిన రాఖీ హజారే ఉద్యమంలో ప్రారంభం నుంచి ఉన్నారు. కేజ్రీవాల్ చేపట్టిన కార్యక్రమాలను ముందుండి నడిపించారు. ప్రస్తుతం ఆమె మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా, ఢిల్లీలో మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. సత్యేంద్ర జైన్ ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వార ఎన్నికలు అర్కిటె క్ట్గా జీవితాన్ని ప్రారంభించిన సత్యేంద్రజైన్ తర్వాత సామాజిక కార్యకర్తగా అటు నుంచి రాజకీయవేత్తగా మారారు. ఆర్కిటెక్ట్‌గా ఉన్నప్పుడు ఎక్కువగా కేంద్ర ప్రజాపనుల శాఖలో పనులు చేసేవారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు అన్నా హజారే ఉద్యమంలో పాలు పంచుకున్నారు. కేజ్రీవాల్ చేపట్టే కార్యక్రమాలు నచ్చి ఆయనతో చేయికలిపారు. షాకూర్ బస్తీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శ్యామ్‌లాల్ గార్గ్‌పై 7వేల ఓట్ల తేడాతో గెలిచారు. కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వార ఎన్నికల మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గిరీష్ సోనీ ఎస్సీ, ఎస్టీ, ఉపాధి, కార్మికశాఖలు వ్యాపారవేత్త అయిన గిరీష్ సోనీ తర్వాత మాదీపూర్‌లో తోలు ఉత్పత్తుల దుకాణాన్ని నిర్వహించారు. మాదీపూర్‌లో 12వ తరగతి వరకు విద్యనభ్యసించారు. ఆ తర్వాత పూసారోడ్డులోని ఐటీఐలో ఏసీ, రిఫ్రిజిరేటర్లను బాగు చేయడంలో డిప్లొమా చేశారు. ఉద్యమంలో కే జ్రీవాల్తో కలిసి పనిచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కైలాస్ సంక్లాపై 1,103 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎస్సీ, ఎస్టీ, ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్, లేబర్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. -
ప్రభుత్వ ఏర్పాటుకు గడువు ఇవ్వండి : కేజ్రీవాల్
తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వం, తీసుకోబోమని ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం పునరుద్ఘాటించారు. తాను ముఖ్యమంత్రి కావడానికో లేక అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ విముఖత వ్యక్తం చేయడంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అరవింద్ శనివారం ఉదయం లెప్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ.... ప్రభుత్వ ఏర్పాటుపై 10 రోజుల గడువు కావాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను గడువు కోరినట్లు ఆయన తెలిపారు. అయితే ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇస్తామని ప్రకటించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆ పార్టీలు ఎందుకు మద్దుతు ఇస్తానంటున్నాయో అర్థం కావడం లేదని అరవింద్ వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీకి బేషరత్తుగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గవర్నర్‌కు లేఖ ఇచ్చిందని తెలిపారు. తమకు ఎందుకు మద్దతు ఇస్తామన్నారో కాంగ్రెస్, బీజేపీలు వెంటనే స్సష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తమకు మద్దతు ఇస్తే 15 ఏళ్ల పాటు షీలా ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ చేయిస్తామని, అందుకు సిద్ధమేనా అని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. దేశ రాజధాని ప్రజలను పట్టి పీడిస్తున్న విద్యుత్, తాగు నీటి సమస్యలు పరిష్కరించేందు తమతో కలసి నడుస్తాయా అంటూ కాంగ్రెస్,బీజేపీలకు అరవింద్ కేజ్రీవాల్ చురకులు అంటించారు. -
రాష్ట్రపతి పాలన తప్పదా?
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అది సాధ్యం కాని పక్షంలో వచ్చే రాష్ట్రపతి పాలన వల్ల ఎదురయ్యే పరిస్థితులను కూడా సమీక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలి, రెండు స్థానాల్లో నిలిచిన బీజేపీ, ఆప్‌లు ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా లేకపోవడంతో ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నజీబ్ జంగ్ గురువారం ఉదయం రాజ్‌నివాస్‌లో విభిన్న ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి పాలన వస్తే అధికారులదే ప్రధానపాత్ర ఉండనుండటంతో వారికి మార్గదర్శనం చేసేందుకే ఈ భేటీలు జరుగుతున్నాయని సమాచారం. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి దీపక్ మోహన్ స్పోలియా నేతత్వంలో అధికారుల బృందాలే వివిధ ప్రభుత్వ విభాగాలను నడుపుతూ ప్రజాహిత పథకాల అమలును కొనసాగిస్తారు. అలాగే గత రెండు నెలలుగా ఢిల్లీలో ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచి పోయిన పనులపై కూడా దృష్టి సారించనున్నారు. నజీబ్ ఆధ్వర్యంలో బడ్జెట్ రూపొం దిస్తారు. పార్లమెంటు దానిని ఆమోదిస్తుంది. ఢిల్లీలో రాష్ట్రపతిపాలన విధిస్తే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఇంటికే పరిమితం కానున్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఫిబ్రవరి నుంచి మరోసారి ఎన్నికల ప్రవర్తనా నియమాళి అమలులోకి వచ్చే అవకాశముందని రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి. -
రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయలేదు: షిండే
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నుంచి తనకు సిఫారసు అందలేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఏ పార్టీకి స్సష్టమైన మెజారిటీ లభించని సంగతి తెలిసిందే. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 8 స్తానాలకే పరిమితం కావడంతో తాము పోషించే పాత్ర ఏమి లేదు అని షిండే వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పాలనకు జంగ్ ఎలాంటి సిఫారసులు చేయలేదు అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. బీజేపీ 31 స్థానాల్లో గెలుపొందగా, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో విజయం సాధించింది. అయితే బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రతిపక్ష పాత్ర వహించడానికి మొగ్గు చూపడంతో ఢిల్లీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.