
ఎల్జీదే తుది నిర్ణయం
ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుపై రాజ్‌నాథ్‌సింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘నజీబ్ జంగ్ నిర్ణయిస్తారు. దీంతో కేంద్ర హోం శాఖతో ఎటువంటి సంబంధమూ లేదు’ అని అన్నారు. ఎల్జీకి హోం శాఖ ఏయే సలహాలు ఇచ్చిందని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. ప్రభుత్వ ఏర్పాటు అనేది ఎల్జీ విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు.
అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు.
ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.