పారికర్ దారిలో మరో కేంద్ర మంత్రి..?
లక్నో: మరో కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోహర్ పారికర్ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి రేసులో ముందున్నారు. యూపీ ముఖ్యమంత్రిగా రాజ్‌నాథ్‌ను పంపాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
40 సీట్లున్న గోవాలో బీజేపీ 13 సీట్లే గెలిచినా ఇతర పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా పారికర్ ముఖ్యమంత్రి కావాలని కోరడంతో బీజేపీ అధిష్టానం అంగీకరించింది. గోవాతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 403 సీట్లున్న యూపీలో కమలం పార్టీ ఏకంగా 312 సీట్లు గెలిచింది. యూపీకి ఎంతో ప్రాధాన్యమిస్తున్న బీజేపీ సరైన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హామీలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడి, అభివృద్ది దిశగా నడిపించగల నాయకుడి కోసం అన్వేషిస్తోంది. రాజ్‌నాథ్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనైతే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడటంతో పాటు పార్టీ నేతలను కలుపుకొని వెళ్లగలరని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు.
యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంపై అమిత్ షా ఆ రాష్ట్ర నాయకులతో చర్చిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులను సంప్రదించారు. సీఎం అభ్యర్థి ఎంపిక విషయంపై రాజ్‌నాథ్ సింగ్‌తోనూ షా చర్చించారు. సీఎం పదవికి యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా రాజ్‌నాథ్ అందరికంటే ముందున్నారు. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని బుధవారం ప్రకటించనున్నారు.