బుల్లెట్ల లెక్కకూడా ఉండదు! | Rajnath to visit forward areas along Pak, China borders | Sakshi
Sakshi News home page

బుల్లెట్ల లెక్కకూడా ఉండదు!

Published Mon, Sep 14 2015 1:22 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

బుల్లెట్ల లెక్కకూడా ఉండదు! - Sakshi

బుల్లెట్ల లెక్కకూడా ఉండదు!

రెచ్చగొడ్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది
* పాకిస్తాన్‌కు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
న్యూఢిల్లీ/భోపాల్: పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో తొలి తూటా భారత్ పేల్చబోదంటూ రెండు రోజుల క్రితం స్పష్టం చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ‘ఒకవేళ శత్రుపక్షం మొదట కాల్పులు ప్రారంభిస్తే మాత్రం మా ప్రతిస్పందన మామూలుగా ఉండదు. బుల్లెట్ల లెక్క కూడా ఉండదు’ అని తేల్చిచెప్పారు.

‘మేం ఎవరినీ రెచ్చగొట్టం. మమ్మల్ని రెచ్చగొడ్తే మాత్రం ఎవరినీ వదలం’ అని హెచ్చరించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజ్‌నాథ్ పై వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశాలతో భారత్ ఎల్లప్పుడూ మంచి సంబంధాలనే కోరుకుంటుందని పునరుద్ఘాటించారు. కశ్మీర్ అంశాన్ని పాక్ పదేపదే లేవనెత్తడంపై స్పందిస్తూ.. ‘పాక్ రేంజర్స్ బృందంతో ఇటీవల నేను సమావేశమైనపుడు ఒక విషయాన్ని వారికి స్పష్టం చేశాను.

కశ్మీర్ ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌దేనని.. ఒకవేళ చర్చించాలనుకుంటే కశ్మీర్‌పై కాదు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై చర్చిద్దాం అని వారికి తేల్చి చెప్పాన’ని రాజ్‌నాథ్ వివరించారు. సరిహద్దుల్లో కాల్పులకు అంతం పలుకుదామని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించానన్నారు. ‘మొదట మీరు మా సైనికులపై కాల్పులు జరుపుతారు. ప్రతిగా మా వారు మీపై తూటాలు పేలుస్తారు. దీని బదులు, మనిద్దరం కలసి ఉగ్రవాదులపై కాల్పులు జరిపి, ఉగ్రభూతాన్ని అంతం చేద్దాం అని వారికి సూచించాన’న్నారు.

23 వేల కి.మీ. పొడవైన దేశ సరిహద్దును కాపాడటం భద్రతాదళాలకు పెద్ద సవాలుగా మారిందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన ఫలితంగా.. బంగ్లాదేశ్‌కు అక్రమంగా రవాణా అవుతున్న ఆవుల సంఖ్య 22 లక్షల నుంచి గత సంవత్సరం రెండున్నర లక్షలకు తగ్గిందన్నారు. దేశ వ్యాప్తంగా 26 జిల్లాల్లో నక్సలిజం తీవ్రంగా ఉందని, కేంద్రం మద్దతుతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
 
పాక్, చైనా సరిహద్దు పర్యటన వాయిదా
పాకిస్తాన్ సరిహద్దుల్లోని సాంబ, చైనా సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ ప్రాంతంలోని చుమర్‌లలో రాజ్‌నాథ్ రేపటినుంచి మూడు రోజుల పాటు పర్యటించాల్సి ఉండగా, ప్రస్తుతానికి ఆ పర్యటనను కేంద్ర హోం మంత్రి వాయిదా వేసుకున్నారు. బిహార్ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ మంగళవారం జరగనుండటంతో, రాజ్‌నాథ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారని ఆదివారం హోంశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

కాగా, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆదివారం రాజ్‌నాథ్ సింగ్‌తో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. లడఖ్‌లో చైనా సరిహద్దులో భారత్, చైనా బలగాలు మోహరించడంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి సహా దేశ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని ‘కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ’లో వీరిద్దరూ సభ్యులు.
 
పక్షంలో అమల్లోకి భారత్-పాక్ విశ్వాస కల్పన చర్యలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో శాంతి కోసం భారత్, పాక్  తాజాగా అంగీకరించిన విశ్వాస కల్పన చర్యలు 15 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనకు అంతం పలికేందుకు బీఎస్‌ఎఫ్, పాక్ రేంజర్స్ డీజీల మధ్య తాజాగా జరిగిన చర్చల్లో పలు అంశాల్లో అంగీకారం కుదరడం తెలిసిందే.  
 
గౌరవిస్తామంటూనే ఉల్లంఘన
* నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ అధికారి మృతి
జమ్మూ: ఇరువైపుల నుంచీ ఇక మోర్టారు షెల్లింగ్ ఉండబోదని పాకిస్తాన్ అంగీకరించి 24 గంటలు గడవకముందే.. నియంత్రణరేఖ వద్ద పాక్ మోర్టారు బాంబుల కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఒకరు చనిపోయారు. ఆదివారం సాయంత్రం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా మంజాకోటె ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

పాకిస్తాన్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంగనకు పాల్పడుతూ నియంత్రణ రేఖ వెంట బీఎస్‌ఎఫ్ శిబిరాలపై మోర్టారు షెల్లింగ్‌కు పాల్పడ్డాయని సరిహద్దు భద్రతా దళం ఉననతాధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీలో డెరైక్టర్ జనరళ్ల స్థాయి చర్చల్లో.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని బీఎస్‌ఎఫ్ - పాకిస్తాన్ రేంజర్స్ శనివారం నాడే అంగీకరించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement