సరిహద్దు వెంట రాజ్నాథ్ సాహసయాత్ర!
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ భారత భూభాగ సరిహద్దు వెంట తిరగనున్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా సాహస యాత్ర చేయనున్నారు. పాకిస్థాన్, చైనా, చుమార్ ప్రాంతాలతో భారత భూసరిహద్దు వెంట ఉన్న గ్రామాల్లో పర్యటించనున్నారు. మొత్తం మూడు రోజులపాటు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా ఆయన సాంబా సెక్టార్లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) క్యాంపు వద్ద కొత్త మెస్ను ప్రారంభించనున్నారు. సాధారణంగా ఈ సెక్టార్లో నిత్యం కాల్పులు చోటుచేసుకుంటుంటాయి.
మరోపక్క దేశంలోనే అత్యంత ఎత్తైన నివాస ప్రాంతమైన తూర్పు లడఖ్లోని చుమార్ సరిహద్దు వెంట కూడా ఆయన పర్యటిస్తారు. గతంలో ఈ ప్రాంతంలో చైనా సేనలకు భారత సేనలకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చైనాతో సరిహద్దు భాగస్వామ్యం ఉన్న ప్రాంతాల్లో ఇదే అత్యంత కీలకమైనది కూడా. ఇక్కడ వాతావరణం కూడా మైనస్ జీరోలో ఉంటుంది. దీని ప్రకారం ఇదొక రకమైన సాహసయాత్ర లాంటిదే. అయితే. సైనికుల్లో ఉత్తేజం నింపే దిశగా ఈ పర్యటన యాత్ర కొనసాగనున్నట్లు అధికార వర్గాల సమాచారం.