నాలుగు యుద్ధాల్లో మట్టికరిచినా బుద్ధి రాలేదు | Rajnath Singh Warns Pakistan And China At Dundigal Air Force | Sakshi
Sakshi News home page

సరిహద్దు దాటేందుకూ వెనుకాడం

Published Sun, Dec 20 2020 1:40 AM | Last Updated on Sun, Dec 20 2020 2:15 PM

Rajnath Singh Warns Pakistan And China At Dundigal Air Force - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ‘భారత్‌ స్వభావ రీత్యా శాంతి కాముకదేశం. ఏ విషయాన్నైనా చర్చ ల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే మా విధానం. అలాగని మా జోలికొస్తే.. ఊరుకోం. ముఖం పగిలేలా దీటుగా సమాధా నం చెబుతాం’అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనా, పాకిస్తాన్‌లను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు. శనివారం దుం డిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో జరిగిన పైలట్ల పాసింగ్‌ ఔట్‌పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కే సింగ్‌ బదౌరి యా, డీఆర్‌డీవో చీఫ్‌ సతీశ్‌రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఈ రోజు వాయు సేనలో పైలట్లుగా చేరబోతున్న మీ అంద రికీ శుభాకాంక్షలు. దేశంలోని అత్యున్నత వైమానిక శిక్షణ కేంద్రంగా పేరొందిన దుండిగల్‌ ఎయిర్‌పోర్స్‌లో మీరు శిక్షణ పూర్తి చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. మీ సీనియర్లు ఎందరో విధి నిర్వహణలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించారు.

ప్రాణాలు అర్పించి పరాక్రమ వీరులయ్యారు. వారి సేవలే మీకు ఆదర్శం. శిక్షణలో నేర్చుకున్న పాఠాలతో ధైర్యంగా ముందడుగు వేయండి. శిక్షణ వేరు.. విధి నిర్వహణ వేరు.. కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందు కు సాగండి. త్వరలోనే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సేవలందించేందుకు వెళ్తున్న మీరు.. మీ గురువులు, తల్లిదండ్రులు, దేశం గర్వించేలా చేయండి. దేశ గౌరవం, భద్రత మీ చేతుల్లో ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. మీ ప్రదర్శన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎక్స్‌లెంట్‌’అని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

1971 యుద్ధవీరులను సత్కరించుకుంటాం.. 
‘1971 యుద్ధంలో వేలాది మంది భారత సైనికులు ప్రాణాలు అర్పించారు. ఆ యుద్ధం ముగిసి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా త్వరలోనే స్వర్ణోత్సవాలను నిర్వహిస్తాం. అమరుల కుటుంబాలను సత్కరించుకుంటాం. వాయుసేనకు బడ్జెట్‌లో పెద్దపీట వేశాం. దేశీయంగా రక్షణ ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తున్నాం. క్షిపణులు, రక్షణ పరికరాల తయారీలో స్వయం సమృద్ధి సాధించాం. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ నుంచి రఫేల్‌ వరకు మన వాయుసేన బలంగా ఉంది. ఆత్మ విశ్వాసంతో ముం దడుగు వేయండి. మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కేంద్రం నుం చి శిక్షణ పొందిన వియత్నాం, శ్రీలంక, నైజీరియా పైలట్లకు కూడా శుభాకాంక్షలు’అంటూ రాజ్‌నాథ్‌సింగ్‌ తన ప్రసంగాన్ని 
ముగించారు.

అవసరమైతే సరిహద్దు దాటుతాం.. 
‘ఇప్పటికీ నాలుగు యుద్ధాల్లో భారత్‌ చేతిలో మట్టి కరిచినా.. పాకిస్తాన్‌కు బుద్ధి రావడం లేదు. మనల్ని నేరుగా ఎదుర్కోలేక సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది. అయినా భారత్‌ అన్ని ఆటంకాలకు చక్కగా సమాధానం ఇస్తోంది. బాలాకోట్‌ దాడి అనంతరం పాకిస్తాన్‌ సరిహద్దు దాటి చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ మన సైనికుల పరాక్రమానికి మచ్చు తునక. ఇది ఒకప్పటి ఇండియా కాదు. ఇది నవభారతం. యుద్ధక్షేత్రంలోనే కాదు, అవసరమైతే సరిహద్దు దాటేందుకు వెనుకాడం. యుద్ధరీతులు మారుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది సైబర్‌ వార్‌ కీలక పాత్ర పోషిస్తోంది. పైలట్లు నిత్యం టెక్నాలజీపై అప్‌డేట్‌గా ఉండండి ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌పై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి’అని రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. 

వాయుసేన సేవలు చిరస్మరణీయం
‘భారత్‌ ఎదుర్కొన్న యుద్ధాల్లో భారత వాయుసేన సేవలు చిరస్మరణీయం. ముఖ్యంగా 1961, 1965, 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి, 1999 కార్గిల్‌ యుద్ధాల్లో భారత వాయుసేన చూపిన ప్రతిభ స్వర్ణాక్షరాలతో లిఖించదగింది. పదాతి, నేవీ దళాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ తన వంతు పాత్ర పోషించింది. ఇండో–చైనా సరిహద్దులో లద్దాఖ్‌లో సైనికులకు సామగ్రి చేరవేయడంలో, నిఘా విధుల్లో, కోవిడ్‌ సమయంలో దేశంలో పలు ప్రాంతాలకు సాయం అందించడంలో అత్యున్నత సేవలందించింది. భారత వాయుసేన సేవలు కేవలం దేశానికే పరిమితం కాలేదు. ఐరాస పీస్‌ కీపింగ్‌ మిషన్‌లోనూ భారత వాయుసేన ప్రపంచదేశాల నుంచి ప్రశంసలందుకుంటోంది’అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. 

అలరించిన కవాతు.. 
ఈ కార్యక్రమంలో పైలట్లు చేసిన కవాతు ఎంతగానో అలరించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కే సింగ్‌ బదౌరియా.. కేడెట్లకు పైలట్‌ బ్యాడ్జీలు అలంకరించారు. ట్రైనీ కేడెట్లలో అత్యుత్తమ ప్రదర్శన ట్రోఫీని ఆశీష్‌ కత్రి అందుకున్నారు. చివరలో భారత వైమానికదళంలోని తేలికపాటి విమానం నుంచి సుఖోయ్‌ 30 యుద్ధ విమానాల వరకు ఆకాశంలో చేసిన యుద్ధ విన్యాసాలు ఆహూతులను కట్టిపడేశాయి. మొత్తం 114 మంది కేడెట్లు దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో తమ శిక్షణ పూర్తి చేసుకున్నారు. తమ వారిని పైలట్లుగా చూసుకుని తల్లిదండ్రులు, సోదరులు మురిసిపోయారు.  

అమరుల స్తూపం చూసి చలించిపోయా 
సాక్షి, హైదరాబాద్‌: దుండిగల్‌ ఎయిర్‌పోర్స్‌ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న పైలట్లలో తెలుగుతేజం అక్షయ్‌ కూడా ఒకరు. శనివారం పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ వేడుక ముగిసిన అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. లద్దాఖ్‌కు సరదాగా చేసిన యాత్ర తన జీవితాన్ని మార్చిందని గుర్తు చేసుకున్నారు. ఆర్మీ త్యాగాలు చూసి చలించిన తానూ దేశసేవ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఎందుకు పైలట్‌ అయ్యారో అక్షయ్‌ మాటల్లోనే.. 

ఆ యాత్ర నన్ను మార్చింది.. మాది వికారాబాద్‌ జిల్లా పరిగి. పుట్టి పెరిగింది అంతా అక్కడే. తర్వాత హైదరాబాద్‌కు మా రాం. మా నాన్న ఆక్యుపంక్చర్‌ వైద్యుడు. ఇంట్లో అమ్మా నాన్న, నేను, చెల్లి ఉంటాం. 2015లో ఘట్‌కేసర్‌లోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి బీటెక్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేరాను. ఒకసారి లద్దాఖ్‌కు ఒంటరిగా బైక్‌పై యాత్ర చేశాను. అక్కడ యుద్ధంలో మరణించిన వారి స్మారక చిహ్నాన్ని చూశాను. ఆర్మీ వారితో మాట్లాడాను.

‘దేశం రేపటి కోసం మేం ఈ రోజు మరణిస్తాం’అని మీ వాళ్లకు చెప్పమని ఆర్మీ అధికారులు అన్న మాటలు నన్ను కదిలించాయి. అంతే దేశానికి ఏదైనా చేయాలని ఆ క్షణాన్నే అనిపించింది. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ నా లక్ష్యం కాదని నాకు అర్థమైంది. పైలట్‌ కావాలని నిర్ణయించుకున్నాను. కుటుంబసభ్యులు కూడా భుజం తట్టి నన్ను ప్రోత్సహించారు. వారి సహకారంతోనే ఎయిర్‌ఫోర్స్‌ ఎగ్జామ్‌ రాసి 2019లో పైలట్‌గా శిక్షణలో చేరాను. ఏడాది కఠోర శిక్షణ తర్వాత విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నాను. దేశం కోసం పనిచేయబోతున్నానన్న మాట తలుచుకుంటేనే గర్వం గా ఉంది. ఎయిర్‌ఫోర్స్‌లోకి రావాలనుకునేందుకు చాలామంది గ్రామీణ యువత వెనుకడుగు వేస్తుం టారు. అలాంటి సంశయాలు ఏమీ పెట్టుకోవద్దు. అందుకు నేనే పెద్ద ఉదాహరణ. దేశానికి సేవ చేయాలన్న కోరిక, విద్యార్హతలు, శారీరక దారుఢ్యం ఉంటే చాలు’అని అక్షయ్‌ వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement