సాక్షి, హైదరాబాద్: నటాషారావు అనే యువతి హనీట్రాప్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అధీనంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కాంప్లెక్స్ (ఆర్సీఐ) ఇంజనీర్ డి.మల్లికార్జున్‌రెడ్డి అత్యంత కీలకమైన క్షిపణుల డేటాను దేశం దాటించినట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవే అభియోగాలపై మల్లికార్జున్‌రెడ్డిని రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు గత నెల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతని విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ నష్టనివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్టు సమాచారం.
జర్నలిస్టుగా పరిచయం చేసుకుని..
మల్లికార్జున్‌రెడ్డి ఆర్సీఐలోని అడ్వాన్స్డ్ నావెల్ సిస్టం ప్రోగ్రామ్‌లో 2018 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నాడు. ఇతడికి 2019లో ఫేస్‌బుక్ ద్వారా నటాషారావు అనే యువతితో పరిచయమైంది. హనీట్రాప్ కోసం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ షేర్నీలో ఈమె పని చేస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లండన్ కేంద్రంగా పని చేస్తున్న డిఫెన్స్ జర్నలిస్ట్‌గా మల్లికార్జున్‌తో పరిచయం పెంచుకున్న నటాషా తన పని ప్రారంభించింది. తాను రాస్తున్న ఆర్టికల్స్‌లో వినియోగించడానికంటూ ఇతడి నుంచి న్యూక్లియర్ డిటరెన్స్ ప్రోగ్రామ్ (అణ్వస్త్ర కార్యక్రమం)కు సంబంధించిన వివరాలను ముందు సేకరించింది. ఆపై ఇతడి బ్యాంకు ఖాతా నంబర్ తీసుకున్న నటాషా ఇందుకోసం కొంత మొత్తం చెల్లిస్తానంటూ నమ్మబలికినట్లు నిఘా వర్గాల విచారణలో తేలినట్లు తెలిసింది.
వలపు వలతో ముగ్గులోకి దింపి..
ఓ దశలో మల్లికార్జున్‌రెడ్డి దగ్గర ప్రేమ, పెళ్లి ప్రస్తావనలు తెచ్చి, వాట్సాప్ ద్వారా గంటల తరబడి చాటింగ్ చేసి పూర్తిగా ముగ్గులోకి దింపింది. అత్యంత కీలక సమాచారం సంగ్రహించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అగ్ని క్షిపణులతో పాటు దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం తయారవుతున్న కె–సిరీస్ క్షిపణులకు సంబంధించిన సాంకేతిక అంశాలు కూడా ఇతడి నుంచి రాబట్టింది. నావికాదళం వినియోగించే అణు ఇంధన ఆధారిత జలాంతర్గామి అయిన అరిహంత్ కోసం డీఆర్‌డీఓ కె–సిరీస్ మిస్సైల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. కాగా తాను పని చేస్తున్న మాసపత్రికలో ఆర్టికల్స్ రాయాల్సి ఉందని, దానికి నిర్ణీత గడువు ఉందని చెప్తూ మల్లికార్జున్ నుంచి కీలక సమాచారం సేకరించింది. 2020–21 మధ్య డీఆర్‌డీఓ, ఆర్సీఐల్లో అభివృద్ధి చేసిన మిస్సైల్స్‌కు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. న్యూక్లియర్ క్యాపబుల్ సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌గా (ఎస్‌ఎల్‌బీఎం) పిలిచే 3,500 కి.మీల రేంజ్‌తో కూడిన కె–4, 6 వేల కి.మీల రేంజ్ కె–5, 1,500 కి.మీల రేంజ్ కె–15 సిరీస్‌లతో పాటు సాగరిక సిరీస్‌కు చెందిన బీ–05 సిరీస్ మిస్సైల్ డేటా సైతం నటాషాకు చేరింది.
సిమ్రన్, ఓమీషా పేర్లతో..
ఈమె ఫేస్‌బుక్‌లో సిమ్రన్ చోప్రా, ఓమీషా హడ్డీ పేర్లతోనూ ప్రొఫైల్స్ నిర్వహించింది. మల్లికార్జున్‌రెడ్డితో ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా చాటింగ్, కాల్స్, వాయిస్ మెసేజ్‌లు చేసిన నటాషా ఒక్కసారి కూడా వీడియో కాల్ చేయలేదు. ఇతడు కోరినప్పటికీ ఆమె దాటవేస్తూ వచ్చింది. అనేక అంశాలను పరిశీలించిన నిఘా వర్గాలు ఈ సమాచారం పాక్ నుంచి చైనాకు చేరి ఉంటుందని అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఆర్‌డీవో, ఆర్సీఐలో భద్రతా లోపాలపై నిఘా వర్గాలు ఇప్పటికే అధ్యయనం చేసినట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
హనీట్రాప్: దేశం దాటిన క్షిపణుల డేటా! సమాచారం పాకిస్థాన్, చైనాలకు అందిందా?
Published Wed, Jul 13 2022 2:09 AM | Last Updated on Wed, Jul 13 2022 1:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment