DRDO Scientist Pradeep Kurulkar Arrested In Honey Trapping Case - Sakshi
Sakshi News home page

వలపు వలకు చిక్కిన డీఆర్‌డీఓ టాప్ శాస్త్రవేత్త.. దేశ రహస్యాలు పాక్‌కు లీక్.. నిఘా వైఫల్యమేనా?

Published Sun, May 21 2023 2:36 PM | Last Updated on Sun, May 21 2023 3:33 PM

Drdo Top Scientist Pradeep Kurulkar Arrested In Honey Trapping Case - Sakshi

న్యూఢిల్లీ: కొన్ని సార్లు.. అంతా సవ్యంగానే ఉంటుందనుకుంటాం. దేశం సురక్షితంగా ఉందని భావిస్తాం. అనుభవజ్ఞులైన అధికారులు, సరిహద్దుల్లో సైన్యం కంటికి రెప్పలా ఉంటుందని భావిస్తాం. నిజమే.. మనం అనుకుంటున్న దాంట్లో 99% నిజమే. అయితే ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు నమ్మక ద్రోహానికి సిద్ధంగా ఉంటారు. మదర్‌ ఇండియాకు వెన్నుపోటు పొడిచేందుకు వెనక్కు రారు. అలాంటి వారిలో అత్యున్నత అధికారులు ఉండడమే ఆశ్చర్యకరం. పైగా పాకిస్తాన్‌, చైనాలాంటి దేశాలు విసిరే హానీ ట్రాప్‌లో చిక్కడం మరింత విస్మయకరం.

మహిళ అందాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే జాబితా పెరిగిపోతోంది. గత నెల రోజులుగా భారత రక్షణ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న వ్యక్తి ప్రదీప్‌ కురుల్కర్‌. భారత రక్షణ వ్యవస్థలోని కీలక వింగ్‌ DRDOలో అత్యున్నత అధికారిగా ఉన్న ప్రదీప్‌.. ఇప్పుడు దేశ రహస్యాలను లీక్‌ చేసిన మాయగాడిగా మిగిలిపోయాడు.

వలపు వలలో చిక్కి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు లీక్ చేశాడు డీఆర్‌డీవో టాప్‌ శాస్త్రవేత్త ప్రదీప్‌ కురుల్కర్. ఓ అజ్ఞాత మహిళ మాయలో పడి అడిగిన వివరాలన్నీ అందించాడు. భారత ఆయుధ సంపత్తిలో కీలకంగా ఉన్న బ్రహ్మోస్, అగ్ని, యాంటి శాటిలైట్ క్షిపణులకు సంబంధించిన రహస్యాలను శత్రు దేశానికి చేరవేశాడు.

ప్రదీప్‌కు వలపు వల విసిరి రహస్యాలు రాబట్టుకున్న మహిళ తనను తాను జర్దాస్ గుప్తా. లండన్‌ లో నివసిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. పక్కా స్కెచ్ వేసి ఈయన్ను ట్రాప్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రదీప్‌ను పరిచయం చేసుకుంది. మొదట ఆకట్టుకునే మెసెజ్‌లు, ఆ తర్వాత అందాలు ఆరబోసే వీడియో కాల్స్‌, రాత్రుళ్లు కవ్వించే మాటలు.. తనను ట్రాప్ చేస్తోందని తెలుసుకోలేక పోయిన ప్రదీప్ ఆమె మాయలో పడ్డాడు.  వేరే దేశానికి రమ్మని పిలిస్తే క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లిపోయాడు. భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను కూడా తిలకించారు. ఇద్దరూ కొన్నాళ్లు ఎంజాయ్ చేశారు.

ఈ మహిళ అందానికి దాసోహమైన ప్రదీప్.. ఆమె ఏం అడిగినా కాదనకుండా అన్ని వివరాలు వెల్లడించాడు. దేశభద్రత గురించి పట్టించుకోకుండా తెలిసిన రహస్యాలన్నీ లీక్ చేశాడు. ఈ మత్తులో జరుగుతున్న ద్రోహం గురించి ప్రదీప్‌ కనిపెట్టలేకపోయాడా అన్నది ఓ మిలియన్‌ డాలర్‌ క్వొశ్చన్‌. ఇలాంటి ఆపరేషన్స్‌పై సైన్యంలో ఎందరికో అవగాహన కల్పించిన ప్రదీప్‌.. తానే ఆ గోతిలో పడ్డాడు. బ్యాడ్‌ ఎగ్జాంపుల్‌ గా మిగిలిపోయాడు.

1988 నుంచి

డీఆర్‌డీఓలో 1988 నుంచి పనిచేస్తున్నారు ప్రదీప్.  గ్రేడ్‌-హెచ్ ఔట్ స్టాండింగ్ కేటగిరీ సైంటిస్ట్‌గా ఉన్నారు. ఇది అత్యంత కీలకమైన హోదా. కేంద్రంలో అదనపు కార్యదర్శి హోదాతో సమానం. ఇంతటి కీలక హోదాలో ఉన్న వ్యక్తి దేశ సమాచారాన్ని లీక్ చేయడం ఒకింత విస్మయం కలిగించే విషయం. దీన్ని ఆరంభంలోనే నిఘావర్గాలు కనిపెట్టలేకపోడవంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  సెక్యూరిటీ వైఫల్యంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దేశభద్రతలో డీఆర్‌డీఓ అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా 50 ల్యాబొరేటరీలు ఉన్నాయి. 5వేల మందికిపైగా శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పడు ప్రదీప్ వలపు వ్యవహారం బహిర్గతం కావడంతో  వీరిపైనా విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది.

ప్రదీప్‌ విషయం తెలిసిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌(ఏటీఎస్‌)పుణెలో రెండు వారాల క్రితం అతడ్ని అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరు పరచి కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన కస్టడీలోనే ఉన్నారు.

ఇప్పుడు ప్రదీప్‌ ఏ ఏ రహస్యాలు చేరవేశాడన్నది లెక్క తేలాల్సిన అంశం. భారత రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా ఆయుధ వ్యవస్థలో అంతర్గత లోపాలను బయటకు రానివ్వరు. సైన్యంలో టాప్‌ అధికారులకు మాత్రమే కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రదీప్‌ ఎంతవరకు ఉప్పందించాడు, ఎక్కడెక్కడ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి? వేటిని మార్చుకోవాలి? ఇవీ ఇప్పుడు సైన్యంలోని టాప్‌ అధికారుల ముందున్న పెద్ద ఛాలెంజ్‌.

చదవండి: చైనా చాట్‌జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement