
ముంబై: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లో పనిచేసే శాస్త్రవేత్త శరీరంలో ఇప్పుడు ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఐదు కిడ్నీలున్నాయి. పనిచేసేది మాత్రం ఒకే ఒక్కటి..! జనవరి 8వ తేదీన ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రి (Amrita Hospital) వైద్య బృందం ఆయనకు అరుదైన ఆపరేషన్ చేపట్టి ఐదో మూత్రపిండాన్ని అమర్చింది. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ సర్జరీ ఎంతో సంక్లిష్టమైందని వైద్యులు తెలిపారు. మూడోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (Kidney Transplant) చేయడం ఎంతో అరుదైన విషయమన్నారు. దేశంలో అవయవ ట్రాన్స్‌ప్లాంటేషన్ సాంకేతికతలో ఇది కీలక మలుపని చెప్పారు.
డీఆర్‌డీవో శాస్త్రవేత్త (DRDO Scientist) దేవేంద్ర బర్లేవర్(45) తీవ్రమైన కిడ్నీ వ్యాధితో 15 ఏళ్లపాటు ఇబ్బందిపడ్డారు. హైపర్‌టెన్షన్‌తో 2008లో రెండు మూత్రపిండాలు పనిచేయకుండా పోయాయి. దీంతో, ఆయనకు 2010లో, తిరిగి 2012లో సర్జరీ చేసి కిడ్నీలను మార్చారు. అవి ఫెయిలయ్యాయి. పుట్టుకతో ఉన్న రెండు కిడ్నీలు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో అమర్చిన రెండు కలిపి మొత్తం నాలుగు మూత్రపిండాలున్నా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ఇదే సమయంలో 2022లో బర్లేవర్ కోవిడ్–19 బారినపడి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో, ఆయనకు డయాలసిస్ (dialysis) తప్పనిసరయ్యింది.
ఈయన్ను పరీక్షించిన ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రి వైద్యులు మరోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంసిద్ధత తెలిపారు. అదే సమయంలో, బ్రెయిన్‌డెడ్ అయిన ఓ రైతు కుటుంబం కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అనుకోని ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వైద్య బృందం సిద్ధపడింది. అయితే, పనిచేయని నాలుగు కిడ్నీల వద్దే మరో కిడ్నీని అమర్చడం వారికి సవాల్‌గా మారింది. వ్యాధి నిరోధకతకు సంబంధించిన ప్రత్యేక సంక్లిష్టతలను వారు ముందుగా దాటాల్సి వచ్చింది.
ఇందులో భాగంగా, కొత్త కిడ్నీని రోగి శరీరం తిరస్కరించకుండా చేసేందుకు ముందుగా ఇమ్యునో సప్రెషన్ అనే ప్రత్యేక ప్రక్రియ చేపట్టామని బృందంలో ఒకరైన డాక్టర్ అహ్మద్ కమాల్ చెప్పారు. రోగికి ఇప్పటికే హెర్నియా శస్త్రచికిత్స చేసినందున స్థల పరిమితి కారణంగా ఐదో మూత్రపిండాన్ని శరీరంలో అమర్చడమనే ప్రధాన సవాల్‌ను కూడా ఎదుర్కొన్నామని మరో వైద్యుడు అనిల్ శర్మ తెలిపారు.
చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?
ఎట్టకేలకు నాలుగు గంటల అనంతరం ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా ముగించారు. కొత్త కిడ్నీ చక్కటి పనితీరు కనబరచడంతో పది రోజుల అనంతరం బర్లేవర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రెండు వారాల్లో ఆయన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. డయాలసిస్ అవసరం కూడా లేకుండా పోయింది. తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడైనందుకు దేవేంద్ర బర్లేవర్ సంతోషం వ్యక్తం చేశారు. రోజువారీ దినచర్యను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే సొంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నట్లు చెప్పారు.